వ్యాక్సిన్ కోసం వెళితే క‌రోనా కాటేసింది…

మా బావ‌తో నా స్నేహం ఈనాటిది కాదు.యాభైఅయిదేళ్ళ నుంచి కొన‌సాగుతోంది. ప‌ద‌మూడు రోజుల క్రితం ఆ బంధాన్ని క‌రోనా పుటుక్కున తెంచేసింది.

హైద‌రాబాదులో వాక్సిన్ కోసం ఆస్ప‌త్రుల‌కు తిరిగితే, వాక్సిన్ దొరక లేదు కానీ క‌రోనా సోకింది. మా అక్క ఆక్సిజ‌న్‌తో కోలుకుంది. అస్ప‌త్రిలో ఉన్న మా బావ‌కు ఆ అర్ధ‌రాత్రి వెంటిలేట‌ర్ అవ‌స‌రం అన్నారు.

ఒక ఆస్ప‌త్రి నుంచి మ‌రో ఆస్ప‌త్రికి.. అక్క‌డి నుంచి ఇంకొక‌ ఆస్ప‌త్రికి .. ఆ చీక‌ట్లో దిక్కులేని ప‌క్షుల్లాగా మా అక్క, బావ అంబులెన్స్‌లో తిరిగారు. హైద‌రాబాదు న‌గ‌ర‌ వీధుల‌లో  కొన‌ప్రాణంతో మా బావ కొట్టుమిట్టాడాడు. గుండెలు బిగ‌బ‌ట్టి, గెండెల‌విసేలా మా అక్క ఏడుస్తూనే ఉంది.

ఊపిరాడ‌క‌ మా బావ నిస్స‌హాయంగా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నాడు. ఏప్రిల్ 29 తెల్ల‌వారు జామున ఆ చీక‌ట్లో..నిర్మానుష్య‌మైన న‌గ‌ర‌ వీధుల‌లో..శ‌బ్దం చేస్తూ ప‌రుగులు తీస్తున్న అంబులెన్స్‌లో.. మా బావ చివ‌రి శ్వాస విడిచాడు.

మా బావ‌ ఆగస్య‌రాజుల స‌త్య‌నారాయ‌ణ‌రావు. ప‌ద‌హారేళ్ల క్రితం జెన్‌కోలో అద‌న‌పు డీఈగా చేస్తూ రిటైర‌య్యాడు. ఆయ‌నొక‌ స‌గ‌టు మ‌నిషి. మ‌ధ్య‌ త‌ర‌గ‌తి మామూలు మ‌నిషి. జీవితాన్ని అమితంగా ప్రేమించాడు. త‌న చుట్టూ ఉన్న మ‌నుషుల‌నూ ప్రేమించాడు. ఎన్ని ఆటంకాలొచ్చినా నిల‌దొక్కుకున్నాడు. తృప్తిగా జీవితాన్ని గ‌డుపుతున్న స‌మ‌యంలో క‌రోనా దెబ్బ‌కొట్టింది.

చేతిలో డ‌బ్బున్నా వైద్యం అంద‌క ప్రాణాలు వ‌దిలాడు.రేప‌టిపై ఆశ‌లు పెంచుకుని జీవిస్తున్న నిత్య చైత‌న్య జీవి.ఏ క‌ష్ట‌మొచ్చినా, న‌ష్ట‌మొచ్చినా నాతోనే పాలుపంచుకునే వాడు.

ఒక్క సారి వెన‌క్కి తిరిగి చూస్తే ఎన్ని జ్ఞాప‌కాలో!

అది 1966 వ సంవ‌త్స‌రం. వ‌న‌ప‌ర్తిలో నేను ఆర‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. మా అక్క‌కు ప‌ద్నాలుగేళ్ళు. తొమ్మిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

కృష్ణాజిల్లా క‌పిలేశ్వ‌ర‌పురానికి చెందిన రాఘ‌వ‌య్య గారు, పాటూరి రామారావు గారు మా ప‌క్కింట్లో ఉండే ప‌ట్టాభిరామ‌య్య గారింటికి వ‌చ్చారు.వారితో మాట‌ల సంద‌ర్భంగా, “మా ఊరి క‌ర‌ణం గార‌బ్బాయి పీయూసీ పాస‌య్యాడు. చాలా మంచి సంబంధం. మీ అమ్మాయికి చూస్తే బాగుంటుంది” అని మా నాన్న‌తో చెప్పారు.

క‌పిలేశ్వ‌ర‌పురం అంటే పాడితో, ప‌చ్చ‌ని పంట పొలాల‌తో క‌ళ‌క‌ళ‌లాడే గ్రామం. ఊళ్ళో ఎక్కువ‌గా క‌మ్మారు.ఆర్థికంగా బ‌ల‌మైన గ్రామం.ఆ గ్రామం నుంచి అనేక మంది వ‌న‌ప‌ర్తి వ‌చ్చి పాలిటెక్నిక్ చ‌దువుకుంటున్నారు. గుడివాడ‌లో పెళ్ళి చూపుల‌వ‌గానే, ఇద్ద‌రికీ న‌చ్చి క‌ట్న‌కానుక‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

“మూడు వేల రూపాయ‌ల క‌ట్నం కావాలా? పాలిటెక్నిక్‌లో సీటిప్పించి మూడేళ్ళ చ‌దువు కావాలా? ఏది కావాలో మీ ఇష్టం ” అ న్నాడు మానాన్న‌. క‌పిలేశ్వ‌రపురం క‌ర‌ణం గారి పేరు అగ‌స్య‌రాజుల‌ రాఘ‌వ‌రావు.

అయిదుగురు కొడుకులు, న‌లుగురు కూతుర్లు, కాస్త పొలం, ఇంట్లో పాడి, పెద్ద పెంకుటిల్లు, ఊళ్ళో గౌర‌వం. క‌మ్మారి పిల్ల‌ల్లాగా నా (నాల్గ‌వ) కొడుకు కూడా వ‌న‌ప‌ర్తి వెళ్ళి చ‌దువుకుంటే బాగుంటుంద‌నుకున్నారాయ‌న‌.

“డ‌బ్బులిస్తే అయిపోతాయి. చ‌దువే చెప్పించండి బావగారు” అన్నారాయ‌న‌. సంబంధం ఖాయ‌మైంది.వ‌న‌ప‌ర్తి సంస్థానాదీశుడు రాజా రామేశ్వ‌ర‌రావు ప్యాలెస్‌లో పెట్టిన పాలిటెక్నిక్ అది.

త‌న తండ్రి కృష్ణ‌దేవ‌రాయ‌లు పేరుతో 1959లో పాలిటెక్నిక్‌ను స్థాపించాడు. భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైన తొలి సంస్థానం అది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రైవేటు రంగంలో పెట్టిన తొలి పాలిటెక్నిక్ అది.

ప్ర‌భుత్వం స్వ‌ధీనం చేసుకున్న తొలి ప్రైవేటు పాలిటెక్నిక్ కూడా అదే. చిత్తూరు జిల్లాకు చెందిన కె.రామి రెడ్డి ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌.త‌రువాత ఆయ‌న ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా రిటైర‌య్యారు.మా నాన్న ఆ కాలేజిలో వర్క్ షాప్ సీనియ‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌గా చేస్తున్నాడు. ఆ కాలేజిలో సీటు దొర‌క‌డం అంత తేలిక కాదు. తీవ్ర‌మైన పోటీ ఉండేది.పూర్తిగా మెరిట్‌పైనే అడ్మిష‌న్లు.

కాలేజీ చైర్మ‌న్‌గా ఉన్న రాజా రామేశ్వ‌ర‌రావే స్వయంగా అడ్మిష‌న్లు ప‌ర్య‌వేక్షించే వారు. అడ్మిషన్ లప్పుడు దాదాపు 50 ఎక‌రాల ఆ కాలేజీ ఆవ‌ర‌ణంతా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో నిండిపోయేది.

విద్యార్థుల్లో ఎక్కువగా కోస్తాజిల్లాల‌ వారే, అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల వారే ఎక్కువ‌. మెరిట్ ప్ర‌కారం ఎవ‌రికి సీటొచ్చిందో మైక్‌లో ప్ర‌క‌టించేవారు. త‌మ పేరు మైకులో విన‌ప‌డ‌గానే ఆనందంతో బ్యాగు లు పుచ్చుకొని ఫీజు క‌ట్ట‌డానికి లేచే వారు. ఎక్క‌డా అవ‌క‌త‌వ‌క‌ల‌కు అవ‌కాశం ఉండేది కాదు.

అందులో ప‌నిచేసే ఒక్కొక్క బోధ‌నా సిబ్బంది కుటుంబీకుల కోసం ఏడాదికొక సీటు కేటాయించేవారు.మా బందువుల్లో ఏడాదికొక‌రికి సీటిప్పించే వాడు మా నాన్న.

ఆ ఏడాది మా బావ‌కు ఇప్పించాడు.హైద‌రాబాదులో ప‌బ్లిక్ రంగ సంస్థ‌లు, అనేక ప‌రిశ్ర‌మ‌లు ఒక‌టొక‌టిగా వెలుస్తున్న కాలం అది. ఉద్యోగాలు కోకొల్ల‌లు.


రాఘ‌వ శ‌ర్మ‌ :  తిరుప‌తి జ్ఞాప‌కాలు-33


పాలిటెక్నిక్ పాసైతే చాలు ఉద్యోగం వ‌చ్చేది.కాస్త ప్రయత్నం చేస్తే ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా దొరికేది. తొలి ప్రాధాన్య‌త ఉన్న మెకానిక‌ల్ బ్రాంచిలో మా బావ‌కు సీటిప్పించాడు మా నాన్న‌. మా అక్క, బావ కు 1966వ సంవ‌త్స‌రం ఆగ‌స్టులోపెళ్ళి.

1966 నాటి పెళ్ళి ఫోటో

 

ఆ ప్యాలెస్ ఎడ‌మ వైపు ద‌గ్గ‌ర‌గా వేణుగోపాల స్వామి గుడి ఉండేది. రాజ‌కుటుంబీకుల కోసం క‌ట్టిన గుడి. ప్ర‌తి ద‌స‌రాకు రాజా రామేశ్వ‌ర‌రావు గుడికి వ‌చ్చేవారు. గుడిలో పూజ‌లు జ‌రిగేవి. ఆ ప్యాలెస్ ఆవ‌ర‌ణ‌లోనే మా క్వార్ట‌ర్స్ ఉండేవి.

ద‌స‌రా వ‌చ్చిందంటే చాలు ఆ సంస్థానాదీశుడిని చూడ‌డానికి మేమంతా గుడికి వెళ్ళే వాళ్ళం. నిజానికి అది గుడిలా ఉండేదికాదు.దానికి గోపురాలుండ‌వు.ఒక పెద్ద భవనం లా, గుడి ముందు వ‌రండాలా పెద్ద మండ‌పం ఉండేది. ఆ గుడిలోనే పెళ్ళి.

పెళ్లి ముందు రోజు సాయంత్రం క‌పిలేశ్వ‌ర‌పురం నుంచి మూడు అంబాసిడ‌ర్ కార్ల‌లో మ‌గ పెళ్ళి వా రు వచ్చారు. ఆ ఆవ‌ర‌ణ‌లోనే పాలిటెక్నిక్ స్టాఫ్ కోసం ఒక పాత భ‌వ‌నంలో క్ల‌బ్ నిర్వ‌హించేవారు. దాంట్లో మ‌గ పెళ్ళి వారికి విడిది.

భోజ‌నాలు చేసి అంతా ఆద మ‌ర‌చి నిద్ర‌పోయారు. ఆ రోజుల్లో అలారాలు మోగే సెల్ ఫోన్లు లేవు. చేతికి వాచీ ఉంటే మ‌హాగొప్ప‌.తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు పెళ్ళి ముహూర్తం. నాలుగున్న‌ర‌కు అంద‌రికీ మెల‌కువ వ‌చ్చింది. అంతా హ‌డావుడి…ఏం చేయాలి!? ఏం చేయాలి!?

ముహూర్తం దాటిపోయినా పెళ్ళి జ‌రిపించేశారు.మా అక్క‌కు ప‌ద్నాలుగేళ్లు, మా బావ‌కు ప‌దిహేడేళ్ళు. అదో బొమ్మ‌ల పెళ్ళి లా ఉంది.మ‌ర్నాడు అప్ప‌గింత‌లు.

మా అక్క‌ను మ‌గ పెళ్ళి వారికి అప్ప‌గిస్తున్నందుకు మా అమ్మా నాన్న వెక్కి వెక్కి ఏడ్చారు. “మీ రెందుకు ఏడుస్తారు బావ‌గారు!? మా స‌త్యం ఈ మూడేళ్లు మీ ద‌గ్గ‌రే ఉంటాడు క‌దా! నిజానికి మేమే బాధ‌ప‌డాలి. మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. ” అన్నారు మా అక్క మామ గారు .

ఆ మాట‌లు శాశ్వత మన్న ట్టు నిజ మై నాయి. అప్ప‌టి నుంచి చివ‌రి శ్వాస విడిచేవార‌కు మా బావ మాతోనే ఉన్నాడు. జైతెలంగాణా ఉద్య‌మం వ‌ల్ల‌ మూడేళ్ల చ‌దువు నాలుగేళ్ళ‌య్యింది.

ఆ నాలుగేళ్ళూ మా అక్క‌, బావ‌ మా ఇంట్లోనే ఉన్నారు.కొత్త పెళ్ళి కొడుకు క‌దా మా బావ! మా ఇంటికి వ‌చ్చిన కొత్త‌ల్లో మా బావ కాస్త టెక్కు చూపించేవాడు. ఎప్పుడైనా కూర న‌చ్చ‌క‌పోతే అన్నంలోనే చేయిక‌డిగేసుకునే వాడు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఫిల్ట‌ర్‌ కాఫీ లేదు.

తెల్ల‌టి పంచ గుడ్డ‌లో డికాక్ష‌న్ వ‌డ‌గ‌ట్టి కాఫీ తయారు చేసి ఇచ్చేవారు. ఒక సారి మా బావ కు ఇచ్చిన కాఫీలో న‌ల్ల‌గా ఒకే ఒక్క కాఫీ పొడి ర‌వ్వ క‌నిపించింది. అంతే.. చిక్క‌టి కాఫీని తెల్ల‌టి గోడ‌కేసి కొట్టాడు.

అల్లుడు క‌దామ‌రి! బెట్టుస‌రి చూపించాలి! అందులో కృష్ణా జిల్లా వారు! ఆ దెబ్బ‌తో మా నాన్న పెద్ద ఇత్త‌టి కాఫీ ఫిల్ట‌ర్ కొనుకొచ్చాడు.మా బావ కోసం మా ఇంటి ద‌గ్గ‌ర ఒక గ‌ది అద్దెకు తీసుకుని, చ‌దువుకోవ‌డానికి ఏర్పాటు చేశాడు.

మా బావ దూరంనుంచి వ‌స్తుంటే ‘అగ‌స్య‌రాజుల స‌త్య‌న్నారాయ‌ణ తైత‌క్క తైత‌క్క తై ‘ అనే వాణ్ణి. అలా ఎగ‌తాళి చేసే వాణ్ణి. అంతా న‌వ్వే వాళ్ళు. మా బావ ముంద‌ర అనే ధైర్యం లేదు మ‌రి. ఆ రోజుల్లో అదొక స‌ర‌దా!

మా బావ బాగా చ‌దువుకునే వాడు. మంచి ధైర్య‌వంతుడు.విద్యార్థుల చేత వ‌ర్క‌షాప్‌లో ప్రాక్టిక‌ల్స్ చేయించేవారు. స్మితి (క‌మ్మ‌రి కొలిమి) సెక్ష‌న్‌లో ఇనుమును కాల్చి సుత్తుల‌తో కొట్టిం చి సాగ తీయించేవారు. ఆ క్లాసును మా నాన్నే తీసుకునే వాడు.

విద్యార్థుల చేత నిర్ధాక్షిణ్యంగా ప్రాక్టికల్స్ చేయించేవాడు. మా బావ‌కు చేతులు బొబ్బ‌లెక్కేవి. ఇంటికొచ్చి “చూడండి అత్త‌య్య‌గారు” అంటూ మా అమ్మ‌కు బొబ్బి లెక్కిన చేతులు చూపించేవాడు. ‘ ఎక్కడైనా మావా అంటే ఒప్పు కుంటా ను. కాలేజీ లో మాత్రం తప్పు కుం టా ను ‘ అన్నట్టు ఉండే వాడు మా నాన్న.

ఇంట్లోనే అల్లుడు. కాలేజీలో విద్యార్థే. కార్పెంట‌ర్ ప‌నిచేయించేవారు. చాలా సెక్ష‌న్లు ఉండేవి. స‌రిగా చేయ‌క‌పోతే మార్కులు ప‌డేవి కాదు. వ‌ర్క్‌షాప్ సూప‌రింటెండెంట్ హ‌జ‌ర‌త్త‌య్య‌గారు. ఆయ‌న‌తో మాట్లాడాలంటే నే విద్యార్థులకు భయం. ఆయ‌న‌కు ఎదురుప‌డాల‌న్నా భ‌య‌మే!ఆయ‌న‌ను చూస్తే విద్యార్థులంతా పారిపోయేవారు.

పొడుగ్గా, బ‌లంగా, ట‌క్‌చేసుకుని, గంభీరంగా ఉండేవారు. మా బావ ఒక సారి ధైర్యం చేసి ఆయ‌న‌ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాడు. “సార్‌..నేను గోపాల‌రావు గారి అల్లుడిని. కాస్త మార్కులు ఎక్కువ‌ వెయ్యండి సార్” అని అడిగాడు. న‌న్న‌డ‌గ‌డానికి నీకెంత ధైర్యం అన్న‌ట్టుగా కింద నుంచి పై వ‌ర‌కు చూసి ఊ..అని గ‌ట్టిగా అన్నారు. ఆ దెబ్బ‌కు మా బావ భ‌య‌ప‌డిపోయి వ‌చ్చేశాడు.

ఎంత సాహ‌సం చేశావ్ స‌త్యం అన్నారు స్నేహితులంతా. మా బావ పొంగిపోయాడు.ఇలాంటి చిరు సాహ‌సాలు చేసి పొంగిపోయే అల్ప‌సంతోషి మా బావ‌.

ఎన్ సీ సీ లో సత్యనారాయణ

కాలేజీలో క్రీడ‌లు కానీ, ఎన్‌సీసీ కానీ ఏదో ఒక‌టి త‌ప్ప‌నిస‌రి. ఎన్‌సీసీ మానితే అటెండెన్స్ పోతుంది.ప‌రీక్ష‌కు కూర్చోనివ్వ‌రు. మా బావ టైం అంటే టైమే. ఎన్‌సిసికి ఎప్ప‌డూ గైర్హాజ‌రు అయ్యేవాడు కాదు.

ఫైన‌లియ‌ర్ చ‌దువుతుండ‌గా 1969లో జై తెలంగాణా ఉద్య‌మం వ‌చ్చింది. కాలేజీ ఉద్యోగుల్లో 90 శాతం కోస్తా , రాయ‌ల‌సీమ జిల్లాల వారే.ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు కోస్తా జిల్లాల నుంచి వ‌చ్చిన వారే.జై తెలంగాణా ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చింది.

వ‌న‌ప‌ర్తిలో ఉన్న కోస్తా జిల్లాల‌కు చెందిన ఒక‌టి రెండు కుటుంబాల వారిని ఉద్య‌మ కారులు ఊ రి నుంచి వెళ్ళ‌గొట్టారు.వెళ్ళ‌మ‌న్న వారిపైన దాడులు చేశారు.మా బావ ఫైన‌లియ‌ర్ క్లాసులు స‌రిగా జ‌ర‌గ‌లేదు.పాలిటెక్నిక్ ఉన్న ప్యాలెస్ చుట్టూ ఎత్తైన ముళ్ళ కంచె. ఫ్యాలెస్ చుట్టూ ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ బ‌లంగా కాపలా.

మూడు పెద్ద పెద్ద హాస్ట‌ల్ భ‌వ‌నాల‌ను ఖాళీచేయించారు.ఆ హ‌స్ట‌ళ్ళ‌లో పోలీసుల‌కు బ‌స. అనుమ‌తి లేనిదే ఎవ‌రినీ లోప‌ల‌కు రానిచ్చే వారు కాదు. ఉద్యోగులంద‌రికీ ప్యాలెస్ ఆవ‌ర‌ణ‌లోనే క్వార్ట‌ర్స్‌.

కోస్తా జిల్లాల‌కు చెందిన ఉద్యోగులు బైటికి వెళ్ళాలంటే భ‌యంభ‌యంగా ఉండేది.పిల్ల‌ల జోలికి, స్త్రీల జోలికి ఉద్య‌మ కారులు వెళ్ళేవారు కాదు. త‌మ‌కు అన్యాయం చేశార‌ని వాద‌న‌కు దిగేవారు. జై తెలంగాణా ఉద్య‌మాన్ని మా బావ తీవ్రంగా వ్య‌తిరేకించాడు. దానికి వ్య‌తిరేకంగా గ‌ట్టిగా వాదించేవాడు.  సెలూన్ వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్లాలి. మా బావ‌కు ఒత్తైన గిర‌జాల జుట్టు. జుట్టు పెరిగి పుట్ట‌ప‌ర్తి సాయిబాబా లా తయారయ్యా డు.

ఒక రోజు సాహ‌సం చేసి సెలూన్ కు వెళ్లాడు. జై తెలంగాణాకు వ్య‌తిరేకంగా అక్క‌డ ఎవ‌రితోనో వాద‌న‌కు దిగాడు. మా బావ‌ను కొట్టినంత ప‌నిచేశారు. మంచివ‌య‌సులో ఉన్నాడు. ఆవేశం ఎక్కువ‌.

ఆయ‌న ఉద్యోగమంతా హైద‌రాబాదు ప‌రిస‌రాల‌లోనే జ‌రిగింది.ఆనాడు జై తెలంగాణా ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించిన మా బావే, ఈ మ‌ధ్య వ‌చ్చిన ప్ర‌త్యేక తెలంగాణా ఉద్య‌మాన్ని బలంగా  స‌మ‌ర్థించాడు.జీవితానుభ‌వం నేర్పిన పాఠం.

“తెలంగాణా విష‌యంలో మ‌న వాళ్లు (కోస్తా జిల్లా వారు) త‌ప్పు చేశారు శ‌ర్మా ” అనే వాడు. జై తెలంగాణా ఉద్య‌మం వ‌ల్ల ఒక ఏడాది చ‌దువులు చ‌ట్టుబండ‌ల‌య్యాయి. మా బావ ఫైన‌లియ‌ర్ క్లాసుల కోసం మూడు నెల‌లు అనంత‌పురంలో చేరాడు. అక్క‌డే ప‌రీక్ష‌లు రాసి పాస‌య్యాడు.జై తెలంగాణా ఉద్య‌మం వ‌ల్ల ఒక ఏడాది చ‌ద‌వువులు పోయాయి.మూడేళ్ళ ఎల్ ఎం ఈ పూర్తి చేయ‌డానికి నాలుగేళ్ళు ప‌ట్టింది.

శెలవ‌లు వ‌స్తే చుట్ట పు చూపుగా క‌పిలేశ్వ‌ర‌పురం వెళ్ళి వ‌చ్చేవాడు.ఒక సారి మా నాన్న హైద‌రాబాదు వెళ్ళాడు. రోడ్లో వెళుతుండ‌గా హైస్కూలులో మా నాన్న క్లాస్ మేటు రాధాకృష్ణ ఎదురుప‌డ్డారు. విద్యుత్ శాఖ (ఏపీయ‌స్ఈబీ) లో డీఈగా చేస్తున్నారు.

“ఏరా రాధా ” అంటూ మానాన్న అంటే , “ఒరేయ్ గోపీ ” అనే వారాయ‌న‌.కుశ‌ల ప్ర‌శ్న‌ల‌య్యాక‌, క‌టుంబాల గురించి మాట్లాడుకున్నారు. ” మా అల్లుడు పాలిటెక్నిక్ ప‌రీక్ష‌లు రాశాడు. రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం” అన్నాడు మా నాన్న‌. “నా ద‌గ్గ‌ర‌కు పంపించు రా ” అన్నారు రాధాకృష్ణ‌.

మానాన్న వ‌న‌ప‌ర్తి వ‌చ్చి చెప్పాడో లేదో, మా బావ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌య్యాడు. వెంట‌నే హైద‌రాబాదు వెళ్ళిపోయి రాధాకృష్ణ‌గారి ద‌గ్గ‌ర వాలిపోయాడు. ఆయ‌న కూర్చోబెట్టి ఏపీయ‌స్ఈబీలో వైర్‌మెన్‌గా అపాయింట్ మెంట్ ఆర్డ‌ర్ టైప్ చేయించి చేతికిచ్చాడు.

“ముందు చేరు, త‌రువాత చూద్దాం” అన్నారు డీఈ రాధాకృష్ణ.మా బావ‌కు రిజ‌ల్ట్స్ రాకుండానే ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చేసింది.విద్యార్హ‌త‌కు త‌గిన ఉద్యోగం కాదు.

చ‌దివింది మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, ఉద్యోగం వ‌చ్చింది ఎల‌క్ట్రిక‌ల్‌లో . మా బావ సైదాబాదులో కాపురం పెట్టాడు.చిన్న ఇల్లు తీసుకున్నాడు. పాలిటెక్నిక్ అర్హ‌త‌కు మ‌రో రెండంచ‌ల పెద్ద ఉద్యోగం వ‌చ్చి ఉండాలి. చిన్న ఉద్యోగం అని వెన‌కాడ లేదు. చాలా ఇష్టంగా చేశాడు.రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. హెల్ప‌ర్ ఎక్కాల్సిన క‌రెంటు స్తంభాల‌ను తాను కూడా ఎక్కాడు.అంద‌రికీ త‌ల‌లో నాలుక‌య్యాడు.అంతులేని జీవితేచ్ఛ‌.

లైన్‌మెన్‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది.ఉద్యోగ‌ జీవితమంతా హైద‌రాబాదు ప‌రిస‌రా ల్లోనే. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళ‌కు ర్యాలీ సైకిల్ కొన్నాడు.

బాటా చెప్పులు, ర్యాలీ సైకిలు, హిందూ పేప‌రు ; ఆరోజుల్లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంద‌హాసానికి, ఔన్న‌త్యానికి చిహ్నాలుగా ఉండేవి. మా నాన్న‌కు హెర్క్య్‌లెస్ సైకిల్ ఉండేది.ఎంత బండ‌గా పోయేదో! ఆరోజుల్లో ర్యాలీ సైకిల్ తొక్కాల‌ని నా కు బ‌లే కోరిక‌గా ఉండేది.

అదంటే చాలా గొప్ప‌. ఎంత అందంగా ఉండేదో! ఎంత చ‌క్క‌గా వెళ్లేదో!ర్యాలీ త‌రువాతే హంబ‌ర్ సైకిల్‌. మా బావ డ్యూటీకి ఎక్కువ‌గా సైకిల్ పైనే వెళ్లేవాడు.

ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి 1970లో నేను హైద‌రాబాదు వెళ్ళాను ; ద‌స‌రాబుల్లోడు సినిమా చూడాల‌ని. వన‌ప‌ర్తిలో రిలీజ్ సినిమాలు రావు.

ఆ ర్యాలీ సైకిల్ చూసి ముచ్చట ప‌డిపోయాను. కొత్త బిచ్చ‌గాడు పొద్దెరగ‌డ‌న్న‌ట్టు ఆ సైకిల్ వేసుకుని హైద‌రాబాదంతా తిరిగే వాణ్ణి.ట్రాఫిక్‌లో ఎలా తొక్కాలో తెలియ‌క‌, ఒక రిక్షా వెన‌కే వెళ్ళే వాడిని.శాంతి థియేట‌ర్‌లో ద‌స‌రాబుల్లోడు సినిమా చూశాను.

మా బాబాయి నాట‌కాలు వేస్తుంటే ర‌వీంద్ర‌భార‌తి వెళ్లేవాడిని.ఓ హ్.. ఆ వైభ‌వ‌మే వేరు.అదంతా మా బావ ర్యాలీ సైకిల్ మ‌హ‌త్యం. మా బావ జీవితం హైద‌రాబాదుతో పెన‌వేసుకుపోయింది. ఒక‌టా రెండా! యాభైఏళ్లు హైద‌రాబాదులోనే ఉన్నాడు.

లైన్‌మెన్‌గా చేస్తున్న‌ప్పుడే 1977లో ఆర్అండ్‌బీలో మెకానిక‌ల్ సూప‌ర్ వైజ‌ర్ ఉద్యోగం గూడూరులో వ‌చ్చింది. మేం అప్పుడు నెల్లూరులో ఉన్నాం. ఇప్పుడు సూప‌ర్ వైజ‌ర్‌ను ఏఈ అంటున్నారు. లైన్‌మెన్ ఉద్యోగానికి రాజీనామా చేసి గూడూరులో చేరాడు. ఆఫీసు లేదు. ఇంట్లోనే ఉండాలి. త‌డ ద‌గ్గ‌ర ఒకే ఒక్క‌ బుల్ డ్రోజ‌ర్ ఉండేది.దానికొక డ్రైవ‌ర్‌.

ఆ బుల్‌డ్రోజ‌ర్‌కు ఏదైనా రిపేరు వ‌స్తే, డ్రైవ‌ర్ వ‌చ్చి మా బావ‌కు చెప్పాలి.అది నిజ‌మ‌ని మా బావ స‌ర్టిఫై చేయాలి. ఆ బుల్‌డ్రోజ‌ర్‌కు ప‌ని లేదు.త‌డ‌లో ఖాళీగా ఉంటుంది. మా బావ‌కూ ప‌నిలేదు.గూడూరులో ఇంట్లో ఉంటాడు. దానికొక డ్రైవ‌ర్‌,సూప‌ర్ వైజ‌ర్‌!

గ‌జం మిథ్య ప‌లాయ‌నం మిథ్య. ప‌నిచేయ‌ని బుల్‌డ్రోజ‌ర్‌కు రిపేరేమిటి!?దానికొక డ్రైవ‌రేమిటి? సూప‌ర్ వైజ‌ర్ ఏమిటి!? ప‌ని చేయ‌డానికి అల‌వాటుప‌డిన మా బావ‌కు పిచ్చెక్కింది.ప‌నిలేక‌పోవ‌డంతో నిజంగానే పిచ్చెక్కింది.త‌న‌లో తానే ఏదో మాట్లాడుకునే వాడు.త‌న‌లో తానే ఏడ్చే వాడు.ముభావంగా ఉండేవాడు.ప‌నీ పాటా లేని ఉద్యోగం చేయ‌లేన‌న్నాడు. రాజీనామా చేస్తాన‌న్నాడు. అప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లు.మాకు భ‌య‌మేసింది.మ‌ళ్ళీ హైద‌రాబాదు వెళ్ళాడు.

లైన్‌మెన్ ఉద్యోగానికి చేసిన రాజీనామాను ఉప‌సంహ‌రించుకున్నాడు. ఎపీఎస్ఈబీ యూనియ‌న్‌లో మా బావ‌కు మంచిప‌ట్టుంది. కార్మిక యూనియ‌న్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. గూడూరు వ‌చ్చి సూప‌ర్‌వైజ‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి హైద‌రాబాదు వెళ్ళిపోయాడు.

హైద‌రాబాదు గొప్ప‌త‌నం ఏమో కానీ, అంద‌రినీ అక్కున చేర్చుకుంటుంది. అలవాటు పడితే వదలడం కష్టం. మా బావ‌ను యాభై ఏళ్లు క‌డుపులో పెట్టుకుని కాపాడింది.ఎపీఎస్ఈబీని ట్రాన్స్‌కో,జెన్‌కో గా విభ‌జించారు.మా బావది మెకినిక‌ల్ స‌బ్జ‌క్టు క‌నుక జెన్‌కోకు మార్చారు. లైన్‌మెన్ నుంచి లైన్ ఇనస్పెక్టర్ కాకుండానే ఏఈగా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది.కొన్ని ప్రాజెక్టుల‌లో ప‌నిచేశాడు.

మూల‌ప‌డిన యంత్రాల‌ను బాగు చేయించి ప‌నిచేయించాడు. మా బావ గురించి ప‌లు ప‌త్రిక‌లు బాగా రాశాయి. ఏడీఈగా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది.ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం వ‌న‌స్థ‌లీపురంలో ఇల్లు క‌ట్టుకున్నాడు.ప‌ద‌హారేళ్ళ క్రితం రిటైర‌య్యాడు.ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్ళిళ్ళు చేశాడు.

కొడుకును బీటెక్ చ‌దివించాడు. హైద‌రాబాదును చాలాఇష్ట‌ప‌డ్డాడు.చ‌దువుకునే రోజుల్లో జై తెలంగాణాను వ్య‌తిరేకించాడు.ప్ర‌త్యేక తెలంగాణా ఉద్య‌మం వ‌చ్చిన‌ప్పుడు దాన్ని స‌మ‌ర్థించాడు.

“మ‌న వాళ్లు త‌ప్పు చేస్తున్నారు శ‌ర్మా. తెలంగాణా ఇచ్చేస్తే పోతుంది క‌దా! ఎందుకీ ప‌ట్టుద‌ల‌?” అనే వాడు.

” నా కొడుకుకు కూడా హైద‌రాబులోనే ఉద్యోగం. పెన్ష‌న్ వ‌స్తోంది. పిల్ల‌లు స్థిర‌ప‌డిపోయారు. ఈ జీవితానికి నాకింకేవాలి చెప్పు శ‌ర్మా! ” అనే వాడు.

మా బావ మ‌హాభ‌క్తుడు.తిరుప‌తి అంటే చాలా ఇష్టం.రిటైర‌య్యాక మంగ‌లి షాపు కు వెళ్ళిక్రాఫు చేయించుకున్న పాపాన పోలేదు. మూడు నాలుగు నెల‌ల కొక‌సారి తిరుప‌తి వ‌చ్చి గుండుకొట్టించుకునే వాడు.వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వారం ప‌ది రోజులు మా ఇంట్లో ఉండేవాడు.

“మీ ఇంట్లో తృప్తిగా భోజ‌నం చేస్తున్నాశ‌ర్మా! ఎక్క‌డా తిన్నా ఇంత తృప్తి గా ఉండ‌దు” అనేవాడు. పొంగ‌లి, పొంగ‌ణాలు అంటే చాలా ఇష్టం.అడిగి మ‌రీ చేయించుకునే వాడు.

ఇంటి అల్లుడ‌న్న‌బెట్టుస‌రికి పోయేవాడు కాదు.మా కుటుంబంలో ఒక‌డిగా క‌లిసిపో యాడు. మా బావ ఇంత తృప్తిగా ఉన్నా, ఏదో ఒక మూల ఒక బాధ వెంటాడేది. కొడుకు లండ‌న్ వెళ్ళిపోయాడు. అక్క‌డే ఇల్లుక‌ట్టుకుని స్థిర‌ప‌డ్డాడు. ఆరు నెల‌లు ఉందామ‌ని మా అక్కా, బావ లండ‌న్ వెళ్ళారు.రెండు నెల‌లు లండ‌న్ అంతా తిరిగారు. “లండ‌న్‌లో ఉండ‌లేమురా” అని హైద‌రాబాదు తిరిగొచ్చేశారు.

మొన్న‌టికి మొన్న ఉగాది పండ‌గ ముంద‌ర తిరుప‌తి వ‌చ్చారు.క‌రోనా వ‌ల్ల తిరుప‌తికి త‌ర‌చూ రాలేక పోయారు. ఆరునెల‌ల క్రితం వ‌చ్చినా కొండ‌కు వెళ్ళ‌లేక‌పోయారు.ఉగాది పండ‌గ ముందు మా ఇంటికి వ‌చ్చి ప‌దిరోజులు ఉన్నారు.

మా అక్క కానీ, బావ కానీ ఎప్పుడూ ఒంట‌రిగా రారు.ఇద్ద‌రూ క‌లిసే వ‌చ్చేవారు.కొండ‌కు వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు. “పెరిగిన డీఏతో క‌లిపి నెల‌కు ల‌క్ష‌రూపాయ‌ల పెన్ష‌న్‌ వ‌స్తుంది” అని సంతోషంగా చెప్పాడు.

” డ‌బ్బులు ఏం చేసుకుంటాం? కావాల్సినంత ఉన్నాయి ” అన్నాడు.” నీకు అవ‌స‌ర‌మైతే అడుగు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపుతా ” అన్నాడు.అవ‌స‌రం లేద‌న్నాను. “మొహ‌మాట‌ప‌డ‌కు ” అన్నాడు.

మా బావ ఒత్తిడి త‌ట్టుకోలేక “అవ‌స‌ర‌మైతే అడుగుతాలెండి” అన్నా. ఉగాది ముందు చిన్న కూతురుద‌గ్గ‌ర‌కు బెంగ‌ళూరు వెళ్ళారు. అక్క‌డొక ప‌దిరోజులు ఉండి హైద‌రాబాదు చేరారు. తిరుప‌తిలో ఉండ‌గా వాక్సిన్ వేయించుకోమ‌న్నాం.

“ఇక్క‌డ వేయించుకుంటే రెండ‌వ సారి కూడా అదే వేయించుకోవాలి.
అది హైద‌రాబాదులో దొక‌రుకుతుందో లేదో! హైద‌రాబాదులోనే వాక్సిన్ వేయించుకుంటాం” అన్నారు. ఏప్రిల్ మూడ‌వ వారం ఆటో ఎక్కి వాక్సిన్ కోసం నాలుగైదు ఆస్ప‌త్రులు తిరిగారు.

ఎక్క‌డా వాక్సిన్ దొర‌క‌లేదు. తిర‌గొచ్చిన వారానికి ద‌గ్గు, జ‌లుబు.టెస్ట్ చేయించుకుంటే క‌రోనా పాజిటివ్ అని తేలింది.

ఒక డాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తే ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేదు.ఇంట్లోనే ఉండి మందులు వాడండి అని చెప్పారు. సంతోషంగా తిరిగొచ్చారు. సాయంత్రానికి మా అక్క‌కు ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గుతున్నాయి. ఇద్ద‌రూ క‌లిసి డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళితే మ‌రొక ఆస్పత్రిలో చేర్పించారు.

నాగోలు నుంచి యాద‌గిరి గుట్ట‌ వెళ్లే దారిలో ఉన్న ఆస్పత్రి అది. నిజానికి మా బావ ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేదు. మా అక్క కోసం చేరాడు.నేను త‌ప్ప ఎవ‌రికీ ఫోన్ చేయ‌ద్ద‌న్నాడు. చివ‌రికి కొడుకును, కూతుర్ల‌ను కూడా.

మూడు పూట‌లా నేను ఫోన్ చేస్తే అక్క‌డి విష‌యాలు చెప్పేవాడు.నేను అంద‌రికీ చెప్పేవాడిని.ఆస్ప‌త్రిలో మా అక్క‌కు ఆక్సీజ‌న్ పెట్టారు.మూడ‌వ రోజు కోలుకుంది. ఇద్ద‌రినీ రూముకుమార్చారు. సంతోష‌ప‌డ్డాం.

ఏప్రిల్ 28వ తేదీ బుధ‌వారం ఉద‌యం మా బావ నాతో మాట్లాడాడు.”రేపు డిశ్చార్జి చేస్తారు, శ‌ర్మా ” అన్నాడు.డిశ్చార్జి అయ్యాక తిరుప‌తి వ‌చ్చేయండి అన్నాను. ఇల్లుచూడు వ‌చ్చేస్తాం అన్నాడు.

భాను(మా చెల్లెలు) ఇల్లు ర‌డీగా ఉంద‌న్నాను.అస్ప‌త్రిలో ఉండ‌గానే తిరుప‌తి వ‌చ్చేయాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆనంద‌ప‌డిపోయారు.

ఎందుకంటే, ఎంత సుఖంగా ఉన్నా, మా బావ‌ను ఒక బాధ వెంటాడుతోంది. కొడుకు లండ‌న్‌లో ఉండిపోయాడు. నాకు త‌ల కొరివి పెట్ట‌డానికైనా వ‌స్తాడో లేడో అని బాధ‌ప‌డేవాడు.మ‌ధ్యాహ్నం ఫోన్‌చేశాను. మా అక్క ఎత్తుకుంది.ఆయ‌న‌కు ఆక్సీజ‌న్ పెట్టారు అన్న‌ది.డిశ్చార్జి చేసే స‌మ‌యానికి ఇదేంటి అని ఒకింత ఇబ్బంది ప‌డ్డాం.

త‌గ్గుతుందిలే అన్నాను.

రాత్రి ఒంటి గంట‌కు ఫోన్ వ‌స్తే లేచాను.ఆక్సీజ‌న్ పెట్టినా పెద్ద‌గా ఉప‌యోగం లేదు.వెంటిలేట‌ర్ పెట్టాలి అని డాక్ట‌ర్లు చెప్పారు. ఆ ఆస్ప‌త్రిలో ఒకే ఒక్క వెంటిలేట‌ర్ ఉంద‌ట‌.అది కూడా ఒక పేషెంట్‌కు పెట్టారు.వేరే ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి. ఆక్సీజ‌న్ ఉన్న అంబులెన్స్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెల్ల‌వారు జామున ఎప్పుడో మూడు గంట‌ల‌కు అంబెలెన్స్‌ వ‌చ్చింది.మా బావ‌ను గ‌బ‌గ‌బా అంబెలెన్స్ ఎక్కించారు.చూస్తూనే ఉన్నాడు.
ఇబ్బందిప‌డుతు నే ఉన్నాడు.ఆంబెలెన్స్‌లో మా బావ‌తో పాటు మా అక్క‌, పెద్ద కూతురు, అల్లుడు, మా చెల్లెలు కొడుకు కూడా ఎక్కారు.

మా అక్క ఏడుస్తోంది. అంద‌రూ ప్రాణాలు బిగ‌బ‌ట్టుకుని చూస్తున్నారు.రొద  చేసుకుంటూ అంబెలెన్స్ నాగోలు వేపు వెళుతోంది. ఆస్ప త్రికి వ‌చ్చారు.

అంబులెన్స్ నుంచి మా బావ‌ను దింప‌ బోతుంటే, వ‌స్తున్న‌ట్టు స‌మాచార‌మేదీ మాకు లేదే అన్నారు ఆస్ప‌త్రి వాళ్లు. మా ద‌గ్గ‌ర వెంటిలేట‌ర్ లేదు అని చెప్పేశారు. కిమ్స్‌లో క‌న్స‌ల్టెంట్‌గా చేస్తున్న మాకు తెలిసిన డాక్ట‌రు సుష్మాకు ఫోన్ చేస్తే కిమ్స్‌కు తీసుకు వెళ్లండి అన్నారు.

మ‌ళ్ళీ శ‌బ్దం చేసుకుంటూ అంబులెన్స్ న‌గ‌రంలోకి బ‌య‌లు దేరింది.మాబావ ఊపిరాడ‌క అవ‌స్థ‌ప‌డుతున్నాడు. మా అక్క ఏడుస్తోంది.

కిమ్స్‌కు చేరేలోపే, అంబెలెన్స్‌లో, న‌గ‌రం న‌డిరోడ్లో, మా బావ ఊపిరాగిపోయింది. అయినా ఎక్క‌డో బ‌తికి ఉంటాడ‌న్న ఆశ‌. కిమ్స్‌లో డాక్ట‌ర్లు ప‌రీక్షించి ప్రాణం లేద‌ని చెప్పేశారు.మా బావ‌ను చివ‌రి సారిగా చూసి, మా అక్క ఘోల్లుమంది.

బ‌ల‌వంతంగా మా అక్క‌ను ఆస్ప త్రిలోకి తీసుకెళ్ళి చేర్పించారు. మా అక్క మాన‌సికంగా కుంగిపోయింది. కోవిడ్ క‌నుక, శ‌వాన్ని అప్ప‌గించ‌మ‌ని చెప్పేశారు. ప‌ది గంట‌ల‌పైన కార్పొరేష‌న్ వారు వచ్చిశ‌వాన్నిస్వాధీనంచేసుకున్నారు.

ఇంత చైత‌న్యంగా బ‌తికిన మా బావ‌ చివ‌రికి ఇలా .. కొడుకు లండ‌న్ నుంచిరాలేక‌పోయాడు. మా బావ భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రిగింది. వ‌న‌స్థ‌లీపురంలో ఆ వీధి వీధి అంతా బాధ‌ పడింది. ఇంత బాగా బ‌తికిన మా బావ ఎందుకిలా!?కోవిడ్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వ రూపం ఇది. మ‌న పాల‌కుల చేత‌కాని త‌నం. అందుబాటులో లేని అత్య‌వ‌స‌ర‌వైద్య స‌దుపాయాలు. కొన్ని ఆస్ప‌త్రుల‌లో బెడ్‌లు దొర‌క‌వు. బెడ్లు దొరికినా ఆక్సీజ‌న్ ఉండ‌దు.ఆక్సీజ‌న్ ఉన్నా స‌మ‌యానికి తగినంత ఉండదు. ఇక వెంటిలేట‌ర్ల కొర‌త చెప్ప‌న‌ల‌వి కాదు.

ఇవి లేవ‌న్న విష‌యాన్నిప్రైవేటుఆస్ప‌త్రులు పైకి చెప్ప‌వు. వేరే ఆస్ప‌త్రితో మాట్ల‌డాం. అక్క‌డ‌ వెంటిలేట‌ర్ పెడ‌తార‌ని చెప్పారు. తెల్ల‌వారు జామున కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మా బావ‌ను అంబులెన్స్ ఎక్కించి చేతులు దులుపుకున్నారు.

ఆ ఆస్పత్రికి వెళితే మాతో ఎవ‌రూ మాట్లాడ‌లేద‌న్నారు. మా బావ ఏ ప్రాంతాన్నైతే అమితంగా ప్రేమించాడో, ఎక్క‌డైతే అర్ధ‌శ‌తాబ్ద‌పు జీవితాన్ని గ‌డిపాడో, ఆ హైద‌రాబాదు న‌గ‌ర వీధుల‌లోనే చివ‌రి శ్వాస విడిచాడు.

ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి స‌గ‌టు మ‌నిషి ప్రాణ స్పంద‌న ఇది.

(అలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *