లేబర్ లీడర్ గా నేటికి 40 ఏళ్ళు!

( 40 సంవత్సరాల రాజకీయోద్యం, ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో తన అనుబంధం గురించి ఇఫ్టూ ప్రసాద్  చెబుతున్నారు.

 

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

 

సర్వ సంపదలకు కారణం శ్రమశక్తి! సర్వ దుఃఖాలకు కారణం పెట్టుబడి! దోపిడీ, పీడన, కష్టాలు, కన్నీళ్లు లేని సమాజ స్థాపనకై పెట్టుబడిపై శ్రమశక్తి ఓ యుద్ధం చేయాలి. అట్టి శ్రామికవర్గం తరపున నేను కార్మికరంగ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 40 ఏళ్ళు!

ఖమ్మం కేంద్రంగా అప్పటికే PDSUనేతగా విద్యార్థి రంగంలో పని చేస్తున్నా. 1981మార్చి1,2 విశాఖ 5వ రాష్ట్ర మహాసభల్లో PDSU నుండి రిలీవ్ అయ్యా. కార్మిక రంగంలో ఆర్గనైజర్ కోసం అమరజీవి నెక్కలపూడి రామారావు గారి కోరికపై పార్టీ నన్ను ఏలూరుకు పంపాలని నిర్ణయించింది. పూర్వాపరాలు కొన్ని ప్రస్తావించాల్సి వుంది.

ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికలలో PDSU బ్యానర్ పై 77-78లో ప్రధాన కార్యదర్శిగా, 78-79లో అధ్యక్షునిగా ఎన్నికయ్యా. 78 ఫిబ్రవరి హైదరాబాద్ PDSU రెండో రాష్ట్ర మహాసభలలో ఉపాధ్యక్షునిగా, 79 జనవరి గుంటూరులో మూడో రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శి గా, 80 మార్చి వరంగల్ నాల్గో రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షుని గా ఎన్నికయ్యా. ఖమ్మం సహా వరంగల్, నల్గొండ, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ఇంచార్జిగా విస్తృతంగా పర్యటించా. కావలి కేంద్రంగా నెల్లూరు జిల్లా 17 సార్లు, కందుకూరు కేంద్రం గా ప్రకాశం జిల్లా 14 సార్లు, తిరుపతి 4సార్లు, అనంతపురం 2సార్లు పర్యటించా. వరంగల్, నల్గొండ లెక్కలేదు. ఖమ్మంలో హైస్కూళ్లతో సహా! పై జిల్లాల ఇంచార్జిగా కాక, వక్తగా మిగిలిన జిల్లాలు పర్యటించా. ఉమ్మడి AP లో నాడు నేను తిరగనివి మెదక్, ప.గో., విజయనగరం, కడప జిల్లాలే! వాటిలో ఒకటైన ప.గో. జిల్లా ఏలూరుకి పార్టీ కేటాయించడం గమనార్హం!

పదుల వేల విద్యార్థులతో ఆత్మీయ అనుబంధం గల ఖమ్మం జిల్లాను వదిలిపెట్టడం బాధే! అశేష విద్యార్థి ఉద్యమ మిత్రులకి గుడ్ బై చెప్పడం మానసిక క్షోభతో కూడిందే! తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఇల్లూ వాకిలీ, అస్తిపాస్తులూ త్యజించిన విప్లవ నిబద్ధత ఎదుట ఇవేవీ అడ్డు రాలేదు. అట్టి విప్లవోత్సాహంతో ఏలూరు కి 9-5-1981న బయలుదేరా. మార్క్సిస్టు సాహిత్యం పేర్చిన నాలుగు అట్టపెట్టెలు& చిన్న చేతిసంచితో ఆరోజు బస్ లో ఖమ్మం నుండి ఏలూరు చేరా. ఈరోజుకు సరిగ్గా 40 ఏళ్లు!

అప్పటికి ఏలూరులో ఎవరూ తెలియదు. (నెక్కలపూడిగారిని ఒక సభలో చూసా) సరస్సుల్లో ఈది, ఎడారిలో పడ్డట్లు ఖమ్మం నుండి ఏలూరు చేరా. ఐదేళ్లు తిరక్కముందే శ్రామికవర్గం ఓ నదిలా పొంగింది. మరో పదేళ్లకి నెల్లిమర్లతో బంధం ఏర్పడింది. ముక్కూమొఖం తెలియని ఆ జిల్లాకి పార్టీ మార్చింది. ఏడాది లో ఏలూరుని తలదన్నే శ్రామిక జనసముద్రం నెల్లిమర్లలో కూడా పోటెత్తింది. బయటకు ఎడారి వలె కనిపించే చోట్లు సైతం అంతర్గతంగా ప్రళయ కాలపు సముద్రాలే! వాటిని మార్క్సిజం మేల్కొల్పింది. ఏలూరు, నెల్లిమర్లలలో మార్క్సిజం నిగ్గుతేల్చింది.

శ్రామికవర్గం నాకు బడిగా, తల్లిఒడిగా మారింది. ఓనమాల నుండి కొత్త అక్షరాలు దిద్దింది. కొత్తపాఠాలు నేర్పింది. కొత్తభాష నేర్పింది. శ్రమసంస్కృతి ఏంటో నేర్పింది. కొత్తచూపునిచ్చింది. భౌతికంగా ముక్కూమొఖం తెలియని చోట్ల వేలాది శ్రామిక కుటుంబాలతో మానసికబంధం ఏర్పడింది. మార్క్సిజం ఘనత! మార్క్సిజానికి జేజేలు! శ్రామిక వర్గమా, జయజయహో!

“పెట్టుబడి” ఏలూరులో వీధి గుండా గ్యాంగుల్ని నా హత్యకి ఉసిగొలిపిన వేళ; “రాజ్యం” నెల్లిమర్లలో మట్టుబెట్టే కుట్ర పన్నినవేళ వేలాది శ్రామిక కుటుంబాలు ప్రదర్శించిన ప్రాణత్యాగ చైతన్యానికి జోడించిన చేతులతో వినమ్ర జేజేలు!

సామాన్య ప్రజలవి ఆశలు. విప్లవకారులవి ఆశయాలు. ఆశలు బ్రతుకు కోసం. చావుకు సిద్ధపడేవి విప్లవాశయాలు. విప్లవపథంలో ఆశయబద్ధుల ప్రాణత్యాగ చైతన్యం గొప్ప కాదు. బ్రతుకు కై ఉద్యమంలోకి దిగి, ప్రాణార్పణకి సిద్ధపడటం ఎన్నో రేట్లు ఉన్నతం. ఏలూరు, నెల్లిమర్ల (ముఖ్యంగా నెల్లిమర్ల) కార్మికవర్గం “ప్రాణత్యాగం” అనే రాజకీయ కానుకని “చరిత్ర”కు బహుకరించింది.

PDSU రాష్ట్ర నేతగా అండ్ కళాశాల విద్యార్థి సంఘం నేత గా ఉర్రూతలూగే ప్రసంగాలు చేసిన నేపధ్యం నాది. చప్పట్లు మోగేవి. తెలియని అహానికి దారితీస్తుంది. కొన్ని మార్క్సిస్టు గ్రంధాలు చదివి వున్నా. చాలా పరిజ్ఞానాన్ని పొందాననే గర్వం లోలోన ఉంది. కార్మికరంగంలో ఉద్యమ నిర్మాణంకై ఏలూరు వెళ్లే నాటికి నా అంతరంగం ఎలా వుందో గుర్తు చేస్తాను.

“నేను నేర్చుకోవడం పూర్తి అయ్యుంది. నేర్పే పనికోసం ఏలూరు వెళ్తున్నా. చదవడం పూర్తి అయ్యుంది. చదివించడం కోసం వెళ్తున్నా. నా జ్ఞానార్జన పూర్తి అయ్యుంది. జ్ఞానబోధకై వెళ్తున్నా. శ్రోతగా నా విధి పూర్తి అయ్యుంది. వక్తగా వెళ్తున్నా. శ్రీశ్రీ కవితోక్తులతో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసి విద్యార్థుల్ని ఉర్రూతలూగించా. కార్మికుల్ని ఊగించాలి” నాటి అంతరంగ ఆలోచన యిది! ఈ అహాన్ని నా నుండి శ్రామికవర్గం ఆవిరి చేసింది. పుస్తకాల మార్క్సిజం వేరు. (అకడమిక్ మార్క్సిజం) శ్రామికరణక్షేత్రపు మార్క్సిజం వేరు. కార్మికక్షేత్రoలో ఓనమాల అభ్యాసన సాగింది. తమకోసం పార్టీ పంపిన కార్మికనేతని తమ ఆయుధంగా శ్రామికవర్గం గుర్తించింది. ఐతే దాన్ని తామ ఊపిరితిత్తులతో మండించిన ఉద్యమ కొలిమిలో సానబెట్టి తనిఖీ చేసుకుంది. కొలిమిలో కాకలుదీరిన తర్వాతే, దానిపై వారికి గట్టి నమ్మకం కుదిరింది. అప్పుడే శ్రామికవర్గం త్యాగాలకి సిద్ధపడింది. శ్రామికవర్గంలో కొండంత బలం దాగి ఉంటుంది. ఇది స్వానుభవంలో ఏలూరు, నెల్లిమర్ల నిరూపించిన నిజం.

కుహనా నాగరిక సమాజానికి కార్మికులు వ్యసనపరులుగా, త్రాగుబోతులుగా, స్వార్ధపరులు గా, సోమరులుగా, అవకాశ వాదులుగా, అసమర్థులుగా, పనిదొంగలుగా కనిపిస్తారు. ఈ కుహనా నాగరిక కళ్లద్దాల్ని ఒకవేళ కార్మికనేతలు ధరిస్తే, వారికళ్ళకు కూడా కార్మికులు అలాగే కనిపిస్తారు. కొత్తచూపు తో దర్శిస్తే కార్మికవర్గ వాస్తవ బలం అర్ధమవుతుంది. దాన్ని సానబెడితే, ఇటు “పెట్టుబడి” తో, అటు “రాజ్యం” తో ఢీకొట్టే శక్తిని శ్రామికవర్గంలో సృష్టించ వచ్చు. 40 ఏళ్ల కార్మికరంగ జీవితం నేర్పిన పాఠం ఇది.

నూరేళ్ళ క్రితంతో పోల్చితే సంఖ్యారీత్యా నేడు భారతదేశ కార్మికవర్గం ఎన్నోరేట్లు ఉంది. అది సృష్టిస్తున్న భౌతిక వస్తు సంపద అంతకన్న ఎక్కువ రెట్లే! కార్మికవర్గం సృష్టించే సరుకులు లేకుండా నాడు సమాజం కొన్ని నెలలైనా బ్రతకగలిగి వుండేది. నేడు కొన్ని వారాలైనా బ్రతక లేదు. సంపదలు సృష్టించే శ్రమ (లేబర్)ని కుహనా నాగరిక సమాజం అవహేళన చేస్తోంది. లేబరోళ్ళు, లేబరోడు, లేబరుది అని చులకన చేసి దూషణ భాషలో శ్రమజీవుల్ని నేడు దూషించడం చూస్తున్నదే! లేబర్ (శ్రమ) లేనిదే సమాజం ఒక్కరోజు నడవదు. సమస్త సంపదలు, సరుకులు, సేవల సృష్టికై తమ చెమట, నెత్తురు చిమ్మే శ్రామికవర్గం “లేబర్” అవహేళన చేయబడుతోంది. (మా కార్మికనేతలం సైతం లేబర్ లీడర్లు కన్న ట్రేడ్ యూనియన్ నేతలని పిలుచుకోవడమే ఇష్టపడతాం. అదీ లేబర్ స్థితి!

భారత కార్మికవర్గం విప్లవ కర్తవ్యాన్ని చేపట్టలేదనే వికృత వాదనలు నేడు మార్క్సిస్టు సిద్ధాంత స్రవంతుల్లోనూ నేడు అరుదుగా వినిపిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడన్నట్లు, శ్రామికవర్గ సంస్థల కొందరు నేతలు సైతం శ్రామికవర్గంలో దాగిన అణుశక్తిని వెలికి తీసే ప్రక్రియని చేపట్టలేక, భారత కార్మికవర్గానికి విప్లవకర గుణం లేదనే వరకూ వెళ్తోన్న తప్పుడు ధోరణి తలెత్తుతోంది.

ఇప్పుడున్న కార్మికవర్గంలో పదోవంతు లేని కాలంలోనే బ్రిటీష్ రాజ్యాన్ని నాటి భారత కార్మికవర్గం గజగజలాడించింది. తిలక్ అరెస్ట్ సమయంలో బొంబాయి కార్మికవర్గ విప్లవకర పాత్ర లెనిన్ దృష్టిలో పడింది. బొంబాయి, కలకత్తా, లాహోర్, కాన్పూర్, కోయంబత్తూరు, మద్రాసు, షోలపూర్ వంటి కార్మికోద్యమ కేంద్రాల్ని చూసి బ్రిటీష్ సామ్రాజ్యవాద సర్కారు భీతిల్లింది. నేడు కార్మికవర్గం ఎందుకు చల్లబడింది? ఎవరు కారకులు? కారణాలు ఏంటి?

నూరేళ్ళ క్రితం పరిస్థితి ఇప్పుడు లేదనే మరో వాదన వినిపిస్తోంది. మారుతి కార్ల ఫ్యాక్టరీ కార్మికవర్గం ఎంతటి సమరశీలంగా పోరాడింది? తేయాకు కార్మికవర్గం ఎలా పోరాడింది? కోయంబత్తూరు అనుభవాలేమిటి? బ్రాoడిక్స్ అనుభవం ఏoటి? అంతెందుకు అంతరించిపోయే దశలోని జూట్ పరిశ్రమలో వెనకబడ్డ గ్రామీణ శ్రామికవర్గం ఏలూరు, నెల్లిమర్లలలో పోషించిన పాత్ర ఏమిటి? నిజానికి కార్మికవర్గం బలహీనురాలు కాదు. దానిలో దాగిన అణుశక్తిని గుర్తించక పోవడమే వాస్తవ బలహీనత!

భారతదేశంలో నేడు “ట్రేడ్ యూనియనిజం” ప్రధానంగా “ట్రేడ్” గా మారింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సేవాసంస్థలకి చెందిన కార్మిక, ఉద్యోగనేతల్లో వందకోట్లకి పైగా గడించిన అవినీతిపరులున్నారు. రైల్వే, నౌకా, కోల్, టెలికామ్ రంగాల్లో కార్మికనేతలే పెట్టుబడిదార్లుగా మారిన దౌర్భాగ్యస్థితి ఉంది. స్టీల్, భీమా,బ్యాంకింగ్, రవాణా రంగాల కార్మిక నేతల్లో పదుల కోట్లకి పడగెత్తిన వాళ్ళున్నారు. ప్రయివేటు బడా పరిశ్రమల్లో కొందరు కార్మికనేతలు ఏకంగా జూనియర్ పెట్టుబడిదారులుగా మారుతోన్నారు. పారిశ్రామిక వేత్తలకు కమీషన్ ఎజెంట్లుగా, సలహదార్లు, స్లీపింగ్ పార్థనర్లు గా, ముడుపుల గ్రహీతలుగా మారే కార్మిక నేతలున్నారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శలు కాదు. బయటకి అంగీకరించినా అంగీకరించక పోయినా, ఇదో నిప్పులాంటి నిజం. కార్మికవర్గం వారిని అందుకు నమ్ముతుంది? ఎందుకు అనుసరిస్తుంది?

పై అవినీతి ధోరణులకి దూరంగా నీతి, నిజాయితీ, నిస్వార్ధత, నిరడంబరతలతో కార్మికరంగంలో ఉద్యమ కృషి చేపట్టే శక్తులు లేవనికాదు. ఐతే వాటికి కార్మికవర్గ వాస్తవ బలం పై నమ్మకం లేదు. మార్క్సిజం, హ్యూమనిజం, ప్రజాస్వామ్యం వంటి సిద్ధాంత నిబద్ధతలతో కార్మికవర్గ సేవ చేస్తున్న విభిన్న రాజకీయ స్రవంతుల కార్మిక నేతలు వీళ్ళు! కార్మికుల వరకే వీరి సంబంధం. వీరు కార్మిక కుటుంబాలతో మమేకం కారు. వీరి పని కేంద్రీకరణ ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, గనులు, మిల్లుల వరకే పరిమితం. కార్మికనివాస బస్తీలు, పేటలు, వాడలతో తమకు పనిలేదని భావిస్తారు. కార్మికుల భార్యాబిడ్డలతో మమేకమయ్యే ప్రయత్నం చేయరు. ఐతే కార్మికుల బిడ్డల పెళ్లిళ్లు లేదా ఇళ్లల్లో చావుల సందర్భాల్లో హాజరౌతారు. అది డీక్లాసిఫై కావడం కాదు. సోషల్ రిలేషన్స్ అంటారు. అది కూడా మెరుగైనదే. ఐతే కార్మికవర్గంలో దాగిన అణుశక్తి వంటి బలాల్ని మేల్కొలపడానికి సరిపోదు. భూమిలోకి వేరును దింపుకునే మొక్కలా, నీటిలో ఈదేచేపల్లా కార్మిక జనాల్లో కార్మికనేతలు మమేకం కావాలి. అట్టి లోటుని భర్తీచేస్తే కార్మికవర్గం ఓవుద్యమ శక్తిగా అవతరిస్తుంది. తర్వాత తనకు అవసరమైన సైద్దాంతిక, రాజకీయ పంథాల్ని అదేఎంపిక చేసుకుంటుంది. వాటిలో ఏదేని లోపాలు, కొరతలుంటే, అదే దిద్దుబాట్లు చేసుకుంటుంది.

ఏలూరు, నెల్లిమర్ల కార్మికవర్గం తరపున ప్రతినిధిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మాపార్టీ సీపీఐ ఎం.ఎల్. న్యూ డేమక్రసీకి, ఆ కార్మికోద్యమ నిర్మాణ కృషిని పర్యవేక్షణ చేసిన ఇఫ్టూకీ రాజకీయంగా రుణపడివుంటా. ముఖ్యంగా కార్మికరంగంలో కేటాయించడం నుండి, తొలికాలంలో నా పనిని పర్యవేక్షణ చేసిన అమరజీవి రాయల సుభాష్ చంద్రబోస్ @ రవన్నను స్మరించుకుంటున్నా.

సంపదకూ, దారిద్ర్యానికీ మధ్య నేడు తేడా పెరుగుతూ ఉంది. దానిని కరోనా మరింత పెంచుతోంది. శ్రామికవర్గంలో కరోనా కేసులు సాపేక్షికంగా తక్కువ. మరణాల శాతమూ తక్కువే! ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆధారపడతారు. బెడ్స్ దొరక్కపోతే, స్తోమతు లేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరకుండా ఇళ్ళల్లో వుంటారు. మధ్యతరగతి వర్గాల్లో కేసులు ఎక్కువ. దిగువ మధ్యతరగతి రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి, లక్షలు వెచ్చిస్తున్నారు. సరళీకరణ కాలంలో సాఫ్ట్ వేర్ వంటి అధికాదాయ ఉద్యోగుల తో “భద్రలోకం” ఉంది. వాళ్ళలో కరోనా కేసుల సంఖ్య, శాతాలు ఎక్కువే. పైగా వాళ్ళు మెగా కార్పొరేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్నారు. మిలియన్ల సొమ్ము కరోనా వైద్య చికిత్సకు ఖర్చు చేస్తున్నారు. ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు నేడు ఖర్చై పోతోంది. కరోనాతో శ్రామికవర్గం నష్టపోతున్న మాట నిజమే. ఐతే సరళీకరణ యుగఫలాల్ని అనుభవించిన భద్రలోకం సహా మధ్యతరగతి సాపేక్షికంగా మరింత నష్టపోతుంది. కరోనా ఇటు శ్రామికవర్గానికీ, అటు మధ్యతరగతికీ మధ్య గత దూరాన్ని తగ్గిస్తోంది. దీనికి ఉపాధి కోల్పోవడమో, జీతాల కోతలో కారణంకాదు. మధ్యలో వచ్చిన మాయదారి కరోనా కారణం. కార్మికవర్గం ఉపాధి కోల్పోయి నష్టపోతోంది. కానీ భద్రలోకం సహా మధ్యతరగతి ఇన్నాళ్లు మిగిల్చిన సొమ్ము ఆసుపత్రుల పాలై పోతోంది. శ్రామికవర్గం కంటే ఎత్తైన స్థానం లో వున్నాననే మధ్యతరగతి బేషజం ఒక్క కరోనా దెబ్బకు మంటగలిసింది. ఇప్పుడు దాని కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? దానికి ఎవరు స్ఫూర్తిదాతలు?

తాజా రైతాంగ ప్రతిఘటన గొప్పదే. అపూర్వ పోరాటమే. ఐతే అది వర్గపోరాటం కాదు. దానికి పరిమితులు ఉన్నాయి. మధ్యతరగతికి అది స్ఫూర్తిని ఇవ్వలేదు. ఇతర పీడిత వర్గాల ప్రజలకు నాయకత్వం వహించ లేదు. దాని ప్రతిఘటన ఇతర బాధితవర్గాలకి మేలు చేస్తుంది. ఐతే వాటి తరపున రైతాంగం చైతన్యయుత కృషిని చేపట్టడం వల్ల కాదు. తనదారిన తాను వెళ్తుంటే, ఇతర వర్గాలకి మేలు చేకూరుతుంది. కార్మికవర్గం భిన్నమైనది. తన విముక్తితో మిగిలిన పీడితుల్ని విముక్తి చేసే భౌతిక ప్రాతిపదిక దానికి ఉంటుంది. మధ్యతరగతిని కార్మికవర్గం లీడ్ చేస్తుంది. ఆ భౌతిక ప్రాతిపదికని కరోనా తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా బడా కార్పొరేట్ వ్యవస్థ ఫాసిస్టు పాలనను తెచ్చి, శ్రామికవర్గాన్ని మరింత లూటీ చేసేదిశలో నేడు అడుగులేస్తోంది. గాన రానున్న కాలంలో వర్గవైరుధ్యాలు ఇంకా తీవ్రతరమవుతాయి. కావున కార్మికవర్గం వర్గపోరాటాలను తీవ్రతరం చేసితీరాల్సిన కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడుతుంది. పై వెలుగులో కార్మికవర్గం మీద శ్రామికవిప్లవ సంస్థలు మరింత రాజకీయ కేంద్రీకరణ చేపట్టే చారిత్రిక అవసరముంది. దానికై ప్రత్యేక కేంద్రీకరణచేద్దాం. కార్మిక రంగంలో 40 ఏళ్ళు నిండిన సందర్భంగా ఓ లేబర్ లీడర్ గా ఇదే నా రాజకీయ సందేశం!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *