రెమిడిసివర్ వంటి కోవిడ్ మందులు బ్లాక్ మార్కెట్ ఎందుకవుతున్నాయి ?

     కోవిడ్ చికిత్సలో రెమిడిసివర్, ఫాబీఫ్లూ మందులు అత్యవసరమా ?

(డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్)

 

కోవిడ్ వ్యాధి అంతకు ముందు లేని ఒక నూతన వైరస్ వల్ల ప్రకోపిస్తున్న వ్యాధి అని అందరూ ఎరిగినదే. ఈ నూతన వైరస్  ను అరికట్టే, వ్యాధిని సమూలంగా నిర్మూలించే మందులు సహజం గానే మన దగ్గర ఇంతకు ముందే ఉండవు కదా!మరి వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతుంటే వైద్య రంగం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. శాస్త్రీయ పరిశోధనలు జరిగి శాస్త్రీ  యమైన , కచ్చితమైన చికిత్సా ఔషధాలు, చికిత్సా పద్ధతులు నిర్ధారించ బడే  వరకూ,  వైద్యులు వ్యాధి లక్షణాలను బట్టి, వాటికి కారణమైన రోగ కారక క్రిములకు అతి దగ్గర పోలికలు గల క్రిములను ఎదుర్కొన్న తమ అనుభవం నుండి, గతం లో వాడిన మందులను నూతన వ్యాధికి  కూడా వాడి ఉపశమనం కలిగించే ప్రయత్నం  చేస్తారు

ఈ ప్రక్రియలో అనేక మంది అనేక రకాల మందులను ప్రయోగించి, ఈ నూతన పరిస్థితిని ఏవి సమర్ధవంతం గా ఎదుర్కొన గ లుగుతున్నవని అధ్యయనం చేస్తారు, పరిశోధిస్తారు. ఈ అనుభవాలన్నీ కలబోసుకుని, మందులలో తగిన మార్పులు చేసుకుని, తగిన మోతాదులను నిర్ధారించుకుని ఒక నూతన విధానం నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, విశ్వ వ్యాప్తంగా వస్తున్న సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలను విడుదల చేస్తుంది,  మన దేశం లో ICMR, డ్రగ్ కంట్రోలర్  ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ఇలాంటి సూచనలను నిర్ణయిస్తాయి. ఇక దేశం లోని డాక్టర్లందరూ ఈ సూచనలకు లోబడి వాటిని అమలు చేసి చికిత్సలను అందిస్తారు.

ఈ క్రమంలో పరిశోధించబడుతున్న అనేక మందులలో కొన్ని విఫలం కావచ్చు. మరికొన్ని మొదట్లో ఆశాజనకం గా లేకున్నా, ఆ తరువాత అవి చాలా ఉపయుక్తంగా తేలవచ్చు. అలాగే ముందు చాలా బాగా పనిచేస్తున్నా యనుకొన్నవి కొన్ని అంత ఉపయోగకరమైనవి కావని కూడా తేలవచ్చు. మన దేశంలో ఐ. సి . ఎం. ఆర్  లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు ఈ క్రమాన్నంతా సమన్వయం చేసి, అత్యంత శాస్త్రీయమైన సూచనలు చేయాలి. ఇది కేవలం శాస్త్రజ్ఞులే కాదు, వారిని నిర్దేశించే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకత్వమూ కూడా సమానంగా పంచుకోవాల్సిన బాధ్యత. మరి మనదేశంలో ఇది సక్రమంగా జరుగుతోందా ?

ప్రపంచంలో అనేక చోట్ల తిరస్కరించిన, ఉపయోగం లేదని తొలగించిన మందులనే ఇప్పటికీ ICMR సిఫారసు చేస్తోంది. ఏప్రియల్ 22 వ తేదీన ICMR, AIIMS విడుదల చేసిన మార్గదర్శక పత్రం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

మార్చి 2020 లో, అంటే ఈ వ్యాధి గురించి చాలా పరిమితమైన అనుభవమూ, సమాచారమూ వున్న దశలో చేసిన సూచనలే తీరిగీ ఏప్రియల్ 2121 లో కూడా చేశారు. ఈ సంవత్సర కాలంలో వచ్చిన అనుభవసారం అందులో పూర్తిగా  క్రోడీకరించినట్లు కనపడదు. ఈ సంవత్సరకాలంగా డాక్టర్లు వారి  సూచనలు పాటిస్తూ, ఏ మందులు  వాడుతున్నారో వాటిలో కొన్ని  అంతగా ఉపయోగం లేనివని అనుభవంలో తేలింది. క్లోరోక్వీన్, ఐవరమేకటిన్, ఫాబీ ఫ్లూ తదితర మందులు గతంలో కొంత సానుకూల ఫలితం కనపరిచినా,  క్రమంగా విస్తృత వాడకం తరువాత  అవి అంత ప్రభావ శీలమైనవి  కావని తేలింది. అయినప్పటికీ మన ప్రభుత్వ సిపారసులలో వాటిలో కొన్ని ఇప్పుడూ చోటుచేసుకున్నాయి.  అంటే డాక్టర్లు నిరుపయోగం అని తెలిసి కూడా  ఆ మందులు వాడవలసి వస్తున్నది.

బహుశా మొదటి విజృంభణ నుండి ఈ రెండవ విజృంభణ వరకు, మధ్య ఏర్పడిన కొంత విరామ కాలంలో (సెప్టెంబర్ 2020 నుండి మార్చి 2021 వరకు) ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదా ? “కరోనా మీద విజయ ఢంకా మోగించాము” అని నాటకీయంగా, ప్రధానమంత్రి చేసిన రాజకీయ ప్రకటనలను శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు సైతం విశ్వసించి సెకండ్ వేవ్ ను విస్మరించారా అనిపిస్తోంది. సంసిద్ధత లేకపోవటం, మౌలిక వనరులను అభివృద్ధి చేసుకోకపోవటం వల్లనే రెండవ సారి సునామి లాగా వైరస్ విరుచుకు పడుతున్నది.

మళ్ళీ హడావుడిగా పాత ఫైళ్ళు దులిపి పాత మార్గ దర్శకాలే విడుదల చేశారా అని సంశయం కలుగుతోంది. ఈ నిర్ణయాలు చేసే అత్యున్నత కమిటీ (India’s scientific task force on covid 19) 11 జనవరి 2021 తరువాత, కేసులు పెరుగుతున్నప్పటికీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనీసం సమావేశం అయిన దాఖలాలు లేవు. వారు ఏప్రియల్ 15 న  సమావేశమై  22 న మార్గదర్శక పత్రం  విడుదల చేశారు. అందువల్ల ఇది పూర్తి శాస్త్రీయమైన దేనా అన్న అనుమానం కలుగుతోంది, కొన్ని ఉదాహరణలు చూద్దాము.

హోమ్  క్వారంటైన్ లో  ఉన్నవాళ్లు, ఇన్ఫెక్షన్ ను నివారించుకోవటానికి  క్లోరోక్వీన్ (hcqs ) వాడమని  సలహా ఇచ్చారు. ఈ మందు అలా ఉపయోగపడదని అనేక దేశాలు మానివేశాయి. యూరప్ దేశాలు కోవిడ్ వ్యాధిలో hcq వాడటం వల్ల గుండె జబ్బులు కొన్ని తీవ్రమవుతాయని భావించి దాన్ని నిషేధించాయి. వైరస్ ను అరికట్టటానికని చెప్పి భారత ప్రభుత్వం జనవరి వరకు సుమారు 10 కోట్ల క్లోరోక్వీన్ టాబ్లెట్లు పంపిణీ చేసింది, తామేదో చేస్తున్నామన్న  కీర్తి కోసం తప్ప దీనివల్ల నిజంగా ప్రయోజనం లేదు.

అలాగే ఐవరమేకటీన్  అనే మందు, జబ్బు తొలిదశలో, వైరల్ లోడు తగ్గించటానికి వాడవచ్చని (may use, must use కాదు) అని చెప్పారు. ఇది కూడా వ్యాధి తీవ్రతను తగ్గించటంలో కాని, ఇతరులకు వ్యాపించకుండా చేయటంలోగాని, ప్రభావం చూపటం లేదని అనేక మంది భారతీయ వైద్యుల పరిశీలన. అయినా దీన్ని సిఫారసు చేస్తున్నారు.

గతంలో అత్యంత ఆవశ్యకంగా వాడిన ఫావిపిరావీర్ (fabiflu) అనే మందును గురించి చూద్దాము. 2014 లో వచ్చిన ఫ్లూ  జ్వరాలను అరికట్టడానికి ఈ మందును జపాన్ లో అనుమతించారు. ఇది చాలా నిరాపాయకరమైన మందుగా అప్పుడు గుర్తించారు. కరోనా కూడా ఫ్లూ జ్వరం వంటిదే కనుక ఇప్పుడు ఆ మందును కోవిడ్ కు కూడా వాడటం జరిగినది , అయితే దాని మోతాదు పెంచవలసి వచ్చింది. మొదటి రోజు 1200 మి.గ్రా ఇచ్చిన ఆ మందు కోవిడ్ కు 3600 మి. గ్రా. ఇవ్వవలసి వచ్చింది.ఈ ప్రయోగాలలో లోపినావిర్ , రితోనావిర్  వంటి మందుల కన్నా ఇది  మెరుగుగా పనిచేసింది. వైరస్ లోడు తగ్గించ కలిగింది. కానీ  వాస్తవ   చికిత్సలో  మాత్రం  ఆశించిన ఫలితం రాలేదు. అందువల్ల  ఇప్పుడు ICMR,AIIMS  దాన్ని తమ జాబితా నుంచి తొలగించారు. అయితే అది ఎంతగా ప్రచారం పొందిన మందు అంటే వ్యాధిగ్రస్తులు తమంతట తామే దాన్ని కొని వాడుతున్నారు. అందువల్ల డాక్టర్లు కూడా దాన్ని విపరీతంగా రాస్తున్నారు.

అలాంటిదే  రెమెడిసివేర్  ఇంజెక్షన్. మే 2020 లో,అమెరికాలో FDA సంస్థ  అత్యవసర పరిస్థితులలో వాడ కానికి ఈ మందుకు అనుమతి ఇచ్చింది. అప్పుడు రోగులు  పిట్టల్లా  రాలిపోతున్నదశలో ,ICUలలో ఆక్సిజన్ మీద వున్నవారికి  అధిక ప్రాధాన్యమిచ్చి వాడవలసిన మందుగా దీన్ని  సిఫారస్  చేశారు. కానీ అనుభవం లో దీనివల్ల చాలా దుష్ప్రభావాలు కనిపించాయి. ముఖ్యంగా లివరు, రక్తం గడ్డకట్టే విధానము, జీర్ణవ్యవస్థకు చెందిన అనేక ఎంజైములు వంటి అంశాలను నిత్యం జాగ్రత్తగా పరీక్షించ వలసి వుంటుంది. వ్యాధి తీవ్రతతో సంబంధము లేకుండా, ఏ దశలోనూ ఈ మందు స్పష్టమయిన మెరుగుదలను సాధించలేకపోయింది అని వ్యాఖ్యానించి ఈ మందు వాడ నవసరం లేదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వ్యాధి తీవ్రతను  గానీ, మరణాలను గానీ  ఈ మందు తగ్గించ లేకపోయింది.    పై పెచ్చు ఇది చాలా ఖరీదైన మందు. నరాలకు ఇంజెక్షను రూపం లో  ఇవ్వాలి అంటే ఈ పాండ్యమిక్ స్థితిలో పనిభారం మరింత పెరుగుతుంది. కనుక ఈ మందు వాడకానికి పరిమితులు ఏర్పడ్డాయి. (Siemieniuk RC, Bartoszko JJ, అధ్యయనం )  వైరస్ సోకిన 5 నుంచి 10 రోజులలోపు  మధ్యస్థ స్థాయిలో అంటే కొద్దిగా ఆక్సిజన్ స్థాయి పడిపోతున్న దశలో  ఈ మందు ఇస్తే కొంత ఉపయోగపడవచ్చు కానీ ఆ తరువాత ప్రయోజనం లేదని దాదాపు అన్నీ పరిశోధనలు తేల్చి చెప్పాయి. కానీ మనదేశంలో దానికి ఎంత ప్రచారం జరిగిందంటే రెమెడిసివేర్ అంటే కరోనా పీచమడిచే బ్రహ్మాస్త్రామని ,అది ప్రాణం పోసే సంజీవని అని ప్రజలు నమ్ముతున్నారు, అది కాదన్న డాక్టర్లను అనుమానంగా చూస్తున్నారు. ఆ  మందు కోసం ఒత్తిడి చేస్తున్నారు, లక్ష రూపాయలు పెట్టి బ్లాకు లో కొనటానికి సిద్ధపడుతున్నారు. ఈ వ్యాపార కోణం తీసి వేసి కేవలం దాని శాస్త్రీయత ఆధారంగా, ఆ మందును వాడితే ఈ కృత్రిమ కొరత ఏర్పడదు. ఇప్పుడు ఇచ్చిన మార్గదర్శకాలలో సరిగ్గానే ఈ మందును పరిమిత సందర్భాలలో వాడవలసిన ఔషధంగా పేర్కొన్నారు.  కానీ ఆచరణలో మాత్రం హాస్పిటల్ కు వెళ్ళిన (ప్రయివేటు, ప్రభుత్వ హాస్పిటల్ అనే తేడా లేకుండా) దాదాపు అందరికీ ఈ ఇంజక్షను రాస్తున్నారు.

అలాగే ప్లాస్మా గురించి చెప్పుకోవాలి. మొదటి వేవ్  దశలో ఇది అత్యంత అధునాతన, అతి కచ్చితమైన చికిత్స గా ప్రచారం పొందింది. స్వయం సేవక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ప్లాస్మా దానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహించాయి. కానీ  తరువాత ఈ చికిత్స ఫలితం కూడా ఆశించినంత  ఫలప్రదంగ లేదని తెలిసింది. రోగనిరోధక శక్తి తగినంతగా లేని వ్యక్తులలో, అదీ వైరల్ లోడు తక్కువగా ఉన్న దశలోనే కొంత ఉపయోగం వుంటుందని కనుక ప్లాస్మా చికిత్సకు అనవసర ప్రాధాన్యం ఇవ్వరాదని అంటున్నారు. ICMR 17-11-2020 నాటికే  తన అధ్యయనాలలో కూడా వైరస్ సోకిన 7-8 రోజులలో కన్వలసెంట్ ప్లాస్మా ఇస్తే కొంత ఉపయోగమే కానీ ఆ తరువాత ఇస్తే ఉపయోగం లేదని తేల్చింది. అంటే రోగి హాస్పిటల్ లో చేరి, ఐసియూ లో వుండి  వెంటీలేటర్ వాడుతున్న దశలో ప్లాస్మా ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందువల్ల నూతన మార్గదర్శకాలలో ఈ సిఫారసును అడుగుకు నెట్టి వేశారు. కానీ పేషెంట్  స్థితి దిగజారుతుంటే ప్లాస్మా ఇవ్వమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని చికిత్సా కేంద్రాలు కూడా, తాము అన్నీ ప్రయత్నాలు చేసినట్లు చూపించుకోటానికి కుటుంబ సభ్యులను సంతృప్తి పరచటానికి, ఖరీదైన మందులు, ప్లాస్మా అంటూ అనవసరపు హడావుడి చేస్తున్నాయి.

అయితే ICMR ఇచ్చిన మార్గదర్శకాలలో ‘ఉపయోగపడతాయని నిరూపించబడని మందుల వాడకం’ పై ఎలాంటి నిషేధము లేదు. ఎలాంటి హెచ్చరిక లేదు. పై పెచ్చు ‘వాడితే వాడవచ్చు’ అన్నరీతిలో సూచనలు వుండటంతో నిరుపయోగమైన మందులు వాడుతున్నారు. అంతేకాదు, వివిధ కారణాలతో ఒక రోగికి ఒకే సమయంలో అనేక రకాల మందులు (మల్టిపుల్ డ్రగ్స) వాడుతున్నారు. దొరికిన మందులన్నీ గుప్పిస్తున్నారు. దీన్ని గురించి కూడా ఎలాంటి అదుపు లేదు. గతంలో సిఫారసు చేసి, నేడు తొలగించిన  మందుల గురించి ప్రచారం లేకపోవటం వల్ల, ఎవరూ చెప్పకపోవటం వల్ల, డాక్సిసైక్లిన్ , అజితరోమైసిన్, ఫాయి పిరావిర్, యిటోలీజుమాబ్, వంటి మందులు అధికంగా వాడుతూనే వున్నారు. వీటి పేర్లు నేటి సూచనలలో ఇవ్వలేదు, కానీ మొదటి నుంచీ జరిగిన ప్రచారం వల్ల, దాదాపు 80% వైద్యులు వీటిని విస్తారంగా వాడుతున్నారు. దీనివల్ల కోరోనా రోగులకు ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ అనవసరపు మందుల వాడకం వల్ల హాని జరుగుతుందని గుర్తించాలి.

తెలిసిన మందులన్ని పనికి రావంటే, మరి ఏమి చేయాలి?

ఇది వైరస్ వ్యాధి అని గుర్తించాలి. లక్షణాలకే గాని వైరస్ ను చంపివేసే మందు లేదని తెలుసుకోవాలి. మొదటి దశలో (వారం) దగ్గు, జలుబు, జ్వరం లాంటి బాధలను తగ్గించే మందులు వాడాలి. రెండవ వారంలో ప్రవేశిస్తే  ఊపిరితిత్తుల పనిని మెరుగు పరిచే మందులు, స్టీరియిడ్ ఇనహాలేషన్లు, ఆక్సిజను వాడాలి. పరిస్థితి మరీ తీవ్ర మయితే స్టీరాయిడ్ ఇంజక్షనులు, రక్తం గడ్డ కట్టకుండా, రక్త సరఫరాను సులభం చేసే మందులు వాడాలి. వెంటీలేటర్ సహాయం అవసరం కావొచ్చు.

అన్నీ దశలలోనూ, రోగనిరోధక శక్తిని పెంచే బలవర్ధక ఆహారం, శ్వాసక్రియను మెరుగు పరిచే ప్రాణాయామం వంటి వ్యాయామాలు అవసరం. పాజిటివ్ అని తేలిన వాళ్ళు, నెగెటివ్ అయినా లక్షణాలు వున్న వాళ్ళు  కనీసం మూడు వారాలు ఐసలేషన్ లో వుండాలి.  అన్నిటినీ మించి మాస్కులు ధరించటం, పరిసరాల, శరీరాల శుభ్రతను పాటించడం, భౌతిక దూరాన్ని పాటించడం అనే త్రిశూలంతో వైరస్ ను అడ్డుకోవాలి. వాక్సినేషన్ అనే కవచం ధరించాలి. వ్యాధికి గురి అయి చికిత్స కోసం ఆందోళన చెందటం కాక వ్యాధిని నిరోధించటంలోనే పరిష్కారం చూసుకోవాలి. భయాందోళనలు విడిచి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నివారిం చటం  అసాధ్యమేమీ కాదు. ఒకవేళ వ్యాధికి గురి అయితే మానసిక స్థైర్యంతో, లక్షణాలను పరిశీలిస్తూ, (ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి, జ్వరం ,శ్వాసక్రియ వేగం) ఇంటిలోనే చికిత్స పొందాలి. ఏ మార్పులు వచ్చినా, నిర్లక్ష్యం చేయక, సత్వరమే హాస్పిటల్ కు వెళ్ళి ప్రత్యేక సేవలు, సలహాలు, చికిత్సలు పొందాలి. ఇప్పటికీ ఈ వ్యాధివల్ల మరణాలు సంభవించేది 1 లేక 2 శాతం గానే వున్నది కనుక, కరొన అంటే ప్రాణాంతకం అనే భయం వీడి నివారణపై దృష్టి పెట్టి దీన్ని సామూహికంగా ఎదుర్కోవాలి . మనకున్న వనరులను న్యాయ బద్ధంగా వాడుతూ, అసలే కుప్పకూలిపోయి ఉన్న వైద్య వ్యవస్థపై అనవసరపు భారం పడని రీతిలో వైద్యం జరుపుకోవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కాక కనీసం ఇప్పటికైనా- ప్రతి రోజు ఐదు లక్షల మంది రోగగ్రస్తు లవుతున్నారన్న నిజాన్ని గుర్తించి , పాలకులు బాధ్యతాయుతంగా సరయిన ప్రణాళికలు రూపొందించి సక్రమంగా వ్యవహరించితే ,కరొన నుండి బయట పడటం అసాధ్యమేమీ కాదు .

                                                                                   

Dr Suryadevara Jatin Kumar

(డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్, హైదరాబాద్ లో ఆర్డోపెడిక్ సర్జన్.  ఆయన ప్రజారోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుడు)         

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *