వారణాసి, అయోధ్య పంచాయత్ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ

వారణాసి, అయోధ్య అనేవి భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్యమయిన పేర్లు. రాజకీయంగా చాలా కీలకమయిన  ప్రదేశాలు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభకు రెండుసార్లు ఎంపికయ్యారు. అయోధ్య గురించి చెప్సాలిన పనేలేదు. అదొక మంత్రం. అయోధ్య పేరు వల్లే భారతీయ జనతా పార్టీ రెండు లోక్ సభ స్థానాలనుంచి ఈ రోజు దేశంలో తిరుగులేని శక్తి పరిపాలించే స్థాయికి ఎదిగింది.

అయితే,  ఈ రెండు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బతగిలింది. ఇక్కడి ఫలితాలు ఈ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి.

వారణాసిలో  40 జిల్లా పంచాయత్ స్థానాలున్నాయి. వీటికి జరిగిన ఎన్నికల్లో  సమాజ్ వాది పార్టీ  15 స్థానాలను గెల్చుకుంటే బిజెపికి దక్కినవి కేవలం 8 స్థానాలు మాత్రమే. మిగతా వాటిలో  బహుజన్ సమాజ్ పార్టీకి 5, అప్నాదల్ కు మూడు, సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీకీ ఒకటి దక్కాయి. మూడు  సీట్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్లాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి ఇపుడు వివిఐపి నియోజకవర్గం. విపరీతంగా ఇక్కడ గత ఏడు సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.అయితే, ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి.

ఇక అయోధ్య విషయానికి వస్తే అక్కడ ఉన్న 40 జిల్లా పంచాయతీ స్థానాల్లో  సమాజ్ వాది పార్టీకి 24 స్థానాలు వచ్చాయి.  బిజెపి గెల్చుకున్నది  ఆరు మాత్రమే. మిగతా పది సీట్లలో బిఎస్ పికి అయిదు,  ఇండిపెండెంట్లకు అయిదు వెళ్లాయి.

వారణాసి , అయోధ్య పంచాయతీ ఎన్నికల్లో కూడా  కమలం జండాను ఎగరేసేందుకు ముఖ్యమంత్రి యోగి అదిథ్యనాథ్ చాలా చెమటోడ్చారు.ఈ రెండు నగరాలమీదే ఆశల భవిష్యత్తు ఆశల సౌధాలు కట్టుకున్నారు. అలాంటపుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి పరాభవం ఎదురుకావడం మంచి సూచనకాదేమో. దానికి తోడు అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ దూసుకువస్తున్నది.

వచ్చే ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకే యుపి పంచాతీయ ఎన్నికలను ట్రెండ్ ను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు, 2018 నుంచి ఇప్పటివరకు  జరిగిన 23 రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి సొంతంగా గెలిచిన మూడు రాష్ట్రాలే.  ఇవన్నీ కూడా ఈశాన్యభారతంలోని చిన్న రాష్ట్రాలే. వచ్చే ఫిబ్రవరి ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని సొంతంగా గెల్చుకోవడం ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి యోగికి చాలా అవసరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *