ఆంధ్రప్రదేశ్ లో మే 5 , జూన్ 7న జరగబోవు ఇంటర్మీడియట్ 10 వ తరగతి పరీక్షలను వాయిదా వేయండని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల,ఉపాధ్యాయుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్క చిత్తూరు జిల్లాలో ఇటీవల 10 మందికి పైగా ఉపాధ్యాయులు వైరస్ కారణంగా చనిపోవడం జరిగిందని చెబుతూ ఇలాంటి పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడంసబబుకాదని ఆయన పేర్కొన్నారు.
పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. కోవిడ్ బారినపడి అనేకమంది ఉపాధ్యాయులు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో విద్యార్థుల,ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు వెంటనే వాయిదా వేయకుండా ప్రతిపక్ష పార్టీలు అడిగితే ప్రభుత్వం ఎందుకు వాయిదా వెయ్యాలి అన్న మొండి వైఖరితో వ్యవహరించడం బాధ్యతారాహిత్యమవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులతో సహా వేలాది మంది ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులతో పాటు పరీక్ష కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు సైతం వస్తారు వారిలో ఏ ఒక్కరికి కరోనా వైరస్ వున్నా ఇతరులకు సోకినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదముంది అందుకు”ప్రభుత్వమే బాధ్యత” వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించగా తీర్పు 3వ తేదీకి వాయిదా వేయడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో వారి తల్లిదండ్రులలో అసలు పరీక్షలు జరుగుతాయా జరగవా ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే తమ పిల్లలను పంపాలా వద్దా అన్న ఆందోళన మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారని నవీన్ పేర్కొన్నారు.
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. ఇప్పటికే నగరంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నారుు. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత,ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రిలో “అడ్మిషన్ల కొరకు సిఫార్సులు” చేయించుకునే దుస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడం తొందరపాటు చర్య అవుతుందని ఆయన విమర్శించారు.
శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో త్వరగా ఈ విపత్తు నుంచి బయటపడి అన్నీ సవ్యంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించేలా ఏపీ సీఎం కు సద్బుద్ధిని ప్రసాదించాలని, హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.