(రాఘవ శర్మ)
కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది.
ఆస్పత్రులన్నీకిటకిట లాడుతున్నాయి. బెడ్ దొరికినా ఆక్సీజన్ దొరకడం లేదు.
ప్రాణవాయువు అందక అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.ప్రపంచ దేశాలన్నీ మన దేశ నిస్సహాయత ను చూసి జాలిపడుతున్నాయి.
ఆక్సీజన్ కొరతపై హనుమాన్ మాల్ బెంగానీ అసలు ఏమంటారు?
ఆయనేమీ సామాన్యుడు కాదు.నలభై అయిదు సంవత్సరాల పాటు ఆక్సీజన్ పరిశ్రమలో పనిచేసిన వారు. దేశంలో ఉన్న సగం ఆక్సీజన్ ఉత్పత్తి సంస్థల స్థాపనలో కీలక భాగస్వామి. ఆక్సీజన్ ఉత్పత్తి చేసే లిండే ఇండియాకు మాజీ సీఈవో.
దేశంలో ఆక్సీజన్ కొరత అస్సలు లేనే లేదని హనుమాన్ మాల్ బెంగానీ అంటారు. మొత్తం ఆక్సీజన్ ఉత్పత్తిలో ఒక్క శాతం మాత్రమే వైద్యఅవసరాలకు వాడతారు.
కరోనా సమయంలో కూడా అది 3 నుంచి 5 శాతానికి పెరగవచ్చు అంతే. దేశంలో ఆక్సీజన్ పరిస్థితిపై ఆయన విశ్లేషణ సారాంశం ఇలా ఉంది. పరిశ్రమలకు, వైద్యానికి ఉపయోగించే ఆక్సీజన్ ఒకటే.
రెంటికీ ఒకే ప్లాంట్ లో, ఒకే విధంగా ఆక్సీజన్ తయారు చేస్తారు.దానిని ఒకే రకమైన ట్యాంకులలో, సిలిండర్లలో నింపుతారు. వైద్యానికి ఉపయోగించే ఆక్సీజన్‌ను గ్యాస్ కంపెనీ విశ్లేషించి సర్టిపై చేస్తుంది.
అంతకు మించి తేడాలేదు.
పరిశ్రమలకు 99.5 శాతం స్వచ్ఛమైన ఆక్సీజన్ అవసరమవుతుంది. అదే వైద్య అవసరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆక్సీజన్ 93+-3శాతం స్వచ్ఛమైనది అయి తే చాలు.
దానిలో ప్రమాదకరం కాని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్‌డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్పర్ ఆక్సైడ్ వంటి కాలుష్య కార కాలు ఉంటాయి.
భారత దేశంలో రోజుకు లక్ష టన్నుల ఆక్సీజన్ ఉత్పత్తి జరుగుతుంది. ఉక్కు పరిశ్రమల్లో ఇనుము, ఉక్కు ఉత్పత్తికి ఆక్సీజన్ వాడతారు. కాబట్టి దేశంలో ఉత్పత్తి జరిగే ఆక్సీజన్లో 80 శాతం ఉక్కు పరిశ్రమల్లోనే ఉత్పత్తి జరుగుతుంది.
రిలయన్స్, జామ్‌నగర్ లలో రోజుకు 22 వేల టన్నులను ఇంధనంగా మార్చడానికి ఆక్సీజన్‌ను ఉపయోగిస్తారు.తమ అవసరాల కోసం ఆక్సీజన్ ఉత్పత్తి చేసే విద్యుదుత్పత్తి పరిశ్రమలు ఎక్కవగా దేశంలో తూర్పు ప్రాంతంలో, కొన్ని పశ్చిమాన ముంబయి, గుజరాత్‌లలో, కొన్ని కర్ణాటకలో ఉన్నాయి.
ఈ పరిశ్రమలు కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే తమ అవసరాల కోసం ఉత్పత్తిచేసి , పెద్ద పెద్ద ట్యాంకులలో నిలువ చేస్తాయి.
లిండె, ఇన్నోక్స్ వంటి స్వతంత్ర కంపెనీలు ద్రవ ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేసి ట్యాంకుల ద్వారా అమ్ముతుంటాయి. దేశంలో చాలా కంపెనీలు ద్రవ ఆక్సీజన్‌ను కొని, దానిని భాష్పీకరణ చేస్తాయి. ఆక్సీజన్‌ను 80 శాతం పైపు లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.ద్రవ రూపంలో ఉన్న ఆక్సీజన్‌ను 15 శాతం ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తారు.
అయినా మనం ఆక్సీజన్ కొరతను ఎందుకు ఎదుర్కొంటున్నాం!?
ఆక్సీజన్‌ను సరఫరా చేసే రోడ్డు ట్యాంకర్లు, నిలువచేసే ట్యాంకర్లు, సిలిండర్ల కొరత వల్ల ఈ సమస్య ఏర్పడుతోంది.ఇవ్వన్నీ ఖరీదైనవి.ఒక్కొక్క రోడ్డు ట్యాంకర్ ఖరీదు 45 లక్షలు ఉంటుంది. ఒక సిలిండర్ ధర 10 వేల రూపాయలుంటుంది.
అందులో నింపే ఆక్సీజన్ ఖరీదు మూడు వందల రూపాయలు మాత్రమే. సాధారణ సమయంలో వీటన్నిటినీ గ్యాస్ కంపెనీలే తయారు చేస్తాయి.
ఈ ప్లాంట్లు భౌగోళికంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. పంపిణీసంస్థలు రెండు వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి వాటిని సరఫరా చేసి రావడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది.
గరిష్ట లాభాలార్ఝనే ధ్యేయంగా గ్యాస్ కంపెనీల పనిచేస్తున్నాయి. ప్రభుత్వమే ఆక్సీజన్ తయారీని, పంపిణీ విధానాన్ని చేపట్టినట్టయితే ఈ సంక్షోభాన్ని నివారించవచ్చు.
మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇది చాలా కష్టం. ఆక్సీజన్ ఉత్పత్తి, సరఫరా గురించి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తోంది.
ఇప్పుడు ఆక్సీజన్ ఉత్పత్తినంతా వైద్యానికే ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ధాన్యానికి ఇచ్చినట్టుగానే ఆక్సీజన్ కంపెనీలకు కూడా మద్దతు ధర ఇవ్వాలి.
విద్యుదుత్పత్తి పరిశ్రమలు ఆక్సీజన్‌ను పూర్తిగా నిలువ చేస్తే తప్ప ఒక్క చుక్క కూడా ఉపయోగించకూడదు. ఆక్సీజన్‌ను రైలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. ఆస్పత్రులన్నీ ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్సాలి.
అన్ని జిల్లాల ఆస్పత్రులలో ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం రెండు వందల కోట్ల రూపాయలను ప్రధాని ప్రకటించారు. వీటితో 500 ప్లాంట్లను నెలకొల్పవచ్చు.
వీటి కోసం టెండర్ల వ్యవహారాన్ని 15 శాతం కూడా ఉపయోగించు కోలేకపోతున్నాయి. ఈ ఆక్సీజన్ కొరతకు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల సీఈవోలు కూడా బాధ్యులే. రోగుల నుంచి పెద్ద మొత్తంలో పిండుకుంటున్నారు. అలాంటప్పుడు వారికి తగిన సదుపాయాలు కూడా కల్పించాలి కదా!