జలుబు దగ్గు జ్వరం ఉంటే తిరుమల రావద్దు: టిటిడి సూచన

 ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు తిరుమ‌ల యాత్ర‌ను వాయిదా వేసుకోవాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి కోరారు.

ఇదే విధంగా తిరుమల వచ్చిన భక్తులు ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సుబ్బారెడ్డి కోరారు.

కోవిడ్ నేప‌థ్యంలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం అధికారుల‌తో ఛైర్మ‌న్ స‌మీక్షించారు.

అనంత‌రం వారిని క‌లిసిన మీడియా ప్ర‌తినిధులతో ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి వ‌స్తున్న వారి సంఖ్య బాగా త‌గ్గింద‌న్నారు.

మే నెల‌లో రోజుకు 15 వేల చొప్పున ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశామ‌ని, చాలా త‌క్కువ మంది మాత్ర‌మే బుక్ చేసుకున్నార‌ని చెప్పారు.

ద‌ర్శ‌న టికెట్లు ర‌ద్దు చేసుకునే వారు ఈ ఏడాది ఆఖ‌రు వ‌ర‌కు తిరిగి ద‌ర్శ‌నం పొందే అవ‌కాశం క‌ల్పించామ‌ని చెప్పారు.

2 వారాల్లో ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్

రానున్న 2 వారాల్లో టిటిడి ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

క‌రోనా రెండో విడ‌త‌లో ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది ఉద్యోగులు కోవిడ్‌తో మృతి చెందార‌ని చెబుతూ  మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌న్నారు.

క‌రోనా వ్యాధితో ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగుల‌కు అయ్యే వైద్యఖ‌ర్చులు చెల్లించేందుకు చ‌ర్య‌లు చేప‌డతామని ఆయన భరోసా ఇచ్చారు.

తిరుమ‌ల‌లో ఇప్ప‌టికే 50ః50 నిష్ప‌త్తిలో ఉద్యోగుల‌ను విధులకు అనుమ‌తిస్తున్నామ‌ని, తిరుప‌తిలోనూ ఇదే విధానాన్ని పాటిస్తారని చెప్పారు.

టిటిడి ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా బ‌ర్డ్ ఆసుప‌త్రిలో బెడ్లు ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, తిరుమ‌ల‌లో విధుల‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగుల‌కు ఒత్తిడి లేకుండా ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచనలిచ్చారు.

 శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం

పూర్వ‌పు రోజుల త‌ర‌హాలో తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన బియ్యం ఇత‌ర ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం పెట్ట‌డాన్ని శ‌నివారం నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభిస్తామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు.

కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు  విజ‌య‌రామ్ స‌హ‌కారంతో ఈ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో శ్రీ‌వారి నైవేద్యానికి ఉప‌యోగించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీ, రెండో ద‌శ‌లో శ్రీ‌వారి ల‌డ్డూ, వ‌డ ప్ర‌సాదాల త‌యారీ, మూడో ద‌శ‌లో వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీ చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని ఆయన చెప్పారు.

ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని రైతులను భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా దేశీయ బియ్యం ర‌కాల‌ను పండించ‌డంలో శిక్ష‌ణ ఇస్తామ‌ని తెలిపారు.

శ్రీ‌వారికి భ‌క్తులు కానుక‌గా అందించిన వ్య‌వ‌సాయ భూముల్లోనూ రైతుల స‌హ‌కారంతో ప్ర‌కృతి వ్య‌యసాయం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు.

భ‌క్తుల క్యూలైన్లలో కోవిడ్ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు ప‌రిశీల‌న‌

అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మావేశం అనంత‌రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యంలోని క్యూలైన్ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం చేప‌ట్టిన కోవిడ్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న కాంప్లెక్స్, కంపార్ట్‌మెంట్లలో సోప్ లిక్విడ్‌, చేతి శానిటైజ‌ర్ల వినియోగం, స్కానింగ్ పాయింట్‌, మ‌హ‌ద్వారం వ‌ద్ద ట్రై ఓజోన్ శానిటైజ‌ర్ ప‌నితీరు, భ‌క్తులు భౌతిక‌దూరం పాటిస్తూ ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌డం, ప‌డికావ‌లి వ‌ద్ద క్యూలైన్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను ప‌రిశీలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *