ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇకరాజీనామాచేయాల్సిందే. ఎందుకంటే కెసిఆర్ కుటుంబ ఆధిపత్యంలో ఉన్న టి.న్యూస్ ఆయనను భూకబ్జా దారుని చేసింది వందల కోట్ల విలువయిన అసైన్డు భూములను, ఆరోగ్య మంత్రి, ఆయన బంధువులు కాజేశారని టిన్యూస్ ఆరోపించింది. టిఆర్ ఎస్ కు అధికార చానెల్ అయిన టిన్యూస్ లో ఈ వార్త వచ్చిందంటే ఫామ్ హౌస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లే.ఈ సమాచారాన్ని కొన్ని చానెళ్లకు మాత్రమే ఇచ్చారు.
“ఒకటి కాదు, రెండు కాదు, వందలకోట్ల విలువయిన భూమి, బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన భూమి. దీనిని పదవి అడ్డంపెట్టుకుని, అధికారుల మీద వత్తిడి తెచ్చి గుంజుకోవాలని చూశారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ” టి న్యూస్ యాంకర్ ప్రకటిస్తున్నారు.
మెదక్ జిల్లా మూసాయిపేటమండలం అచ్చంపేటలో తన పౌల్ట్రీ ఫామ్ జమునా హ్యాచరీస్ చుట్టూర ఉన్న విలువయిన భూములను మంత్రి లబ్దిదారులనుంచి లాక్కున్నాడని టిన్యూస్ ఆరోపించింది. బాధితులను ఇంటర్వ్యూ చేసి వారి గోడు వినిపించి, పకడ్బందీగా కుంభకోణం రట్టు చేసింది. దీనికి సమాధానం, వివరణ చెప్పడం చాలా కష్టం. చెప్పినా ఎవరూ వినరు.
ఇపుడు ఈటల ఎవ్వరికీ కూడా సంజాయిషీ ఇచ్చుకోలేడు. ఎందుకంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లెో ఉన్నారు. ఆయన ఎవరినీ కలిసే అవకాశం లేదు. ఇదేపరిస్థితి సెకండ్ ఇన్ కమాండ్ కెటిఆర్ ది కూడా. ఆయన కూడా అప్పాయంట్ మెంట్ ఇవ్వకపోవచ్చు.
నిజానికి , కెసిఆర్ కు ఈటలకు మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఈ మధ్య అసుల కెసిఆర్ ను ఆయన కలవడం మానేశారని కూడా చెబుతున్నారు. వ్యక్తి పూజ తారాస్థాయిలో ఉన్న పార్టీలో కెసిఆర్ ని కలవకపోవడం చాలా పెద్ద నేరంగా చూస్తారు. ఇదే జరిగిందని చాలా మందిచెబుతున్నారు. సాధారణంగా మంత్రులు ఎమ్మెల్యేలు గంటలతరబడి ప్రగతి భవన్ లో ఎదరుచూసి, ఎపుడో అప్పాయంట్ మెంట్ దొరికినపుడు అదే మహాభాగ్యమని నమస్కారం పెట్టి వస్తుంటారు. ఈ అలవాటును ఈటల మానేశారని తెలిసింది.
ఇలాంటి వాతావరణంలో ఈటల భూ కుంభకోణంలో దొరికిపోయాడు.
ఈటల కుంభకోణానికి ఒక మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేశ్ సాక్ష్యులు. వారే ఈ విషయాన్ని భయపెట్టారు. ఆన్ రికార్డు వారు తమ మీద మంత్రి వత్తిడి తీసుకువచ్చారని కూడా చెప్పారు. ఈ అసైన్డు భూములను రెగ్యులరైజ్ చేసేందుకు తాను డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటాని ఈటల అన్నట్లు వారు చెబుతున్నారు.
ఈటల కుంభకోణం కరోనా సంక్షోభం సమయంలో వచ్చింది కాబట్టి, దీని గురించి చర్చ జరిగే అవకాశం తక్కువే. అంతా కరోనా నివారణ చర్యల్లో ఉన్నారు. ఇది చాలా అవమానకరమయిన దాడి.
ఈటలకు ఒకటే మార్గం రాజీనామా లేఖ ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించి వెళ్లిపోవడమే మిగిలింది.
పోనీ తనను క్యాబినెట్ నుంచి తప్పించే దాకా తిరుగుబాటు చేయగలరా? ఇపుడున్న కోవిడ్ పరిస్థితిలో ఇలా రచ్చ చేసినా హైలెట్ కాదు.
టిన్యూస్ కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆరోగ్య మంత్రికి కబ్జాల రోగం పట్టుకుంది అనేందుకు మెదక్ నాటి కలెక్టర్ ధర్మారెడ్డి వ్యాఖ్యలే సాక్ష్యం అని టిన్యూస్ తీర్పు చెప్పింది.
ఇపుడు కుంభకోణం మీద బాధితులు కేసుపెడితే, ఈటల ఏకంగా అరెస్టు కావచ్చు. కేసు పెట్టాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి లబ్ది దారులు ఫిర్యాదు చేశారని టి న్యూస్ చెప్పింది. వాటిని పోలీసులకు ఫార్వర్డ్ చేస్తే చాలు, అరెస్టు చేస్తారు. అందువల్ల ఈటల రచ్చ చేస్తే… ఆ ప్రమాదం ఉంది. ఈటెలను ఆరెస్టు చేయడం ఏమంత పెద్ద పని కాదు. అందువల్ల చడీ చప్పుడు చేయకుండా రాజీనామా చేసిన పోవడమే మంచిదేమో.