రాష్ట్రంలోని మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ఇళ్ళస్థలాలను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ‘వైఎస్సార్ జగనన్న మోడల్ కాలనీ’ లను నిర్మిస్తున్నారు. ఒకే ప్రాంతంలో నాలుగైదు వందల ఎకరాల భూమిని కొనుగోలుచేసి ఈ కాలనీలను నిర్మిస్తారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు పార్క్ లు, మౌలిక సదుపాయాల కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఈ విషయాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ రోజు వెల్లడించారు.
కాలనీలలో కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, మార్కెట్ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి కూడా కల్పిస్తామని ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారని ఆయన చెప్పారు. రూ. 3 లక్షల నుండి రూ.18 లక్షల లోపు సంవత్సర ఆదాయం కల్గిన వారంతా అర్పులేనని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లాలో మొదటి విడతలో మచిలీపట్నంతో పాటు గుడివాడ మున్సిపాలిటీని కూడా ఎంపిక చేశారని అన్నారు. గుడివాడలో ఇప్పటి వరకు ఇళ్ళస్థలాల కోసం దాదాపు 4 వేల మంది మధ్యతరగతి కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు. వీరికి దాదాపు 400 ఎకరాల భూమి అవసరం అవుతుందని దీనికోసం నాలుగైదు ప్రాంతాల్లో భూములను పరిశీలించడం జరిగిందని ఆయన చెప్పారు.
ఈ రోజు ఆయన స్థలాలనుపరిశీలించారు.