కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకోవడం పిల్లల భవిష్యత్తు కోసమే నని ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి చెప్పారు. పరీక్షలు నిర్వహించడంమీద వస్తున్న విమర్శలకు ఆయన ఈరోజు జగనన్న వసతి దీవెన సందర్భంగా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం పెద్ద పనికాదు, కాని వాళ్లకు పేరున్న కాలేజీలలోసీట్లు ఎలావస్తాయని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు రాయని విద్యార్థులు, పరీక్షలు రాసి మంచి మార్కులు తో వచ్చే విద్యార్థులతో ఎలా పోటీపడతారని కూడా ఆయన ప్రశ్నించారు. తల్లితండ్రులతో పాటు ప్రభుత్వవిధానాన్ని విమర్శస్తున్న వాళ్లు కూడా ఒక సారి ఈ విషయం ఆలోచించాలని ఆయన కోరారు.
ఆయనేం చెప్పారంటే…
‘పిల్లలు, తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయాలు చెబుతాను. అలాగే పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై బాధ్యతా రహితంగా విమర్శలు చేస్తున్న వారికి కూడా చెబుతున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం నా కన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని చెబుతున్నాను. అంతగా మన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నాను. వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాను. ఇవాళ మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్న విషయం, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు రాజకీయ ప్రయోజనం కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్క విషయం ఆలోచించండి’.
రాష్ట్రాలదే ఆ నిర్ణయం:
‘ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన పాలసీ లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి’.
కేవలం పాస్ సర్టిఫికెట్లు:
‘ఇలాంటి పరిస్థితుల్లో పదవ తరగతి నుంచి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయట పడితే.. లేదా కేవలం పాస్ మార్కులతో ఒక విద్యార్థి బయటకు వస్తే, ఇదే విద్యార్థి మరో 50 ఏళ్లలో భవిష్యత్తు ఏమిటి?
పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల విద్యార్థుల మార్కులు గొప్పగా ఉంటే, పరీక్షలు నిర్వహించకుండా కేవలం పాస్ మార్కులతో వెళ్లే పిల్లలకు గొప్ప కాలేజీలలో ఏ విధంగా సీట్లు ఎలా వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి’.
‘పరీక్షలు నిర్వహించకపోతే, పాస్ అయినట్లు కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో ఈ విద్యార్థులు ఎలా పోటీ పడతారు?. ఈ పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి?’
రద్దు చాలా సులభం. అయినా..:
‘పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. కానీ ప్రతి అడుగులో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం. అయినా సరే, పిల్లల కోసం కష్టతరమైన మార్గం అయినా కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం. పిల్లలకు మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మరోసారి తెలియజేస్తున్నాను’.