తిరుమల సమీపాన బయల్పడ్డ పురాతన తీర్థం, పున‌రుద్ధ‌ర‌ణ మొదలు‌

(రాఘవ శర్మ)

పురాత‌న‌మైన‌ ఆళ్వారు తీర్థాన్ని పున‌రుద్ధ‌రించే కార్య‌క్ర‌మం ఎప్రిల్ 18 న మొద‌లైంది.

తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి మార్గంలో, గాలిగోపురానికి అలిపిరికి మ‌ధ్య‌లో ఈ తీర్థం ఉంది.

తిరుపతిలో ఉన్న కపిల తీర్థం అసలు పేరు ఆళ్వార్ తీర్తమే.అలాగే తిరుమలలో కూడా ఆళ్వార్ చెరువు ఉంది. అలిపిరి, గాలిగోపురం మధ్యలో ఉండే ఈ చిన్న నీటి చెలమ పేరు కూడా ఆళ్వార్ తీర్థమే.

చెన్నైకి చెందిన‌ ఐబీఎం ఉద్యోగి శ్రీ‌రాం తిరుమ‌ల‌లో ఉన్న తీర్థాల‌ను సంద‌ర్శిస్తూ, ప్రాచీన గ్రంథాల ఆధారంగా 2004లో ఇక్క‌డ ఒక తీర్థం ఉంద‌ని క‌నుగొన్నారు.

పూడిపోయిన ఆళ్వారు తీర్థం

టీటీడీ అట‌వీశాఖ స‌హ‌కారంతో రామానుజాచార్యుడి 1005వ జ‌యంతి సంద‌ర్భంగా ఆదివారం ఉద‌యం ఈ తీర్థాన్ని పున‌రుద్ధ‌రించ‌డానికి న‌డుం బిగించారు.

పురాతన కాలంలో అలిపిరి నుంచి గాలిగోపురం మ‌ధ్య ఈ ఒక్క ఆళ్వారు తీర్థంలో త‌ప్ప ఎక్క‌డా స‌హ‌జ‌సిద్ధ‌మైన నీటి స‌దుపాయం లేదు.

ఈ తీర్థం ఎంత పురాత‌న‌మైన‌దంటే, క్రీస్తు శ‌కం 4,5 శ‌తాబ్దాల మ‌ధ్య జీవించిన నాల్గ‌వ ఆళ్వారు తిరుమ‌ళీశై ఆళ్వార్ ఈ తీర్థాన్ని సంద‌ర్శించిన‌ట్టు పురాత‌న గ్రంథాల ద్వారా శ్రీ‌రాం క‌నుగొన్నారు. రామానుజాచార్యుడు కూడా ఈ తీర్థాన్ని సంద‌ర్శించి, ఇక్కడ ధ్యానం చేసిన‌ట్టు భావిస్తున్నారు.

ప‌దిహేను శ‌తాబ్దాల క్రితం నుంచే ఈ తీర్థం ఉనికిలోకి వ‌చ్చింది.విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజా చార్యులు ఈ తీర్థంలో ధ్యానం చేసినట్టు కూడా ప్రశస్తి.

ఈ తీర్థం చిన్న‌దే కావ‌చ్చు కానీ, స‌హ‌జ‌సిద్ధ‌మైంది, చ‌రిత్రాత్మ‌క‌మైంది.

ఈ మెట్ల మార్గంలో 950వ మెట్టు నుంచి ప‌డ‌మ‌ర వైపుగా ఈ తీర్థానికి వెళ్ళే మార్గం రాళ్ళు ర‌ప్ప‌ల‌తో, ముళ్ళ చెట్ల‌తో వెళ్ళ‌డానికి వీలులేని విధంగా త‌యారైంది.

టీటీడీ అట‌వీశాఖ అధికారి(డీఎఫ్ఓ) చంద్ర‌శేఖర్ యాద‌వ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, రేంజ‌ర్ ఆఫీస‌ర్లు ప్ర‌భాక‌ర్ రెడ్డి, శ్రీ‌నివాసులు స్వ‌యంగా త‌మ సిబ్బందితో ముళ్ళ‌చెట్ల‌ను తొల‌గించి ఆళ్వారు తీర్థానికి దారి ఏర్పాటు చేశారు.

వీరి కృషి వ‌ల్ల కొండ రాళ్ళ‌తో ఏర్పాటు చేసిన పురాత‌న‌మైన దారి బ‌య‌ల్పడింది.

దట్టమైన అడవిలో పూడిపోయిన దారి

అతిక‌ష్టంపైన శ్వేత మాజీ డైరెక్ట‌ర్‌ భూమ‌న్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు రాఘ‌వ శ‌ర్మ‌, శ్రీ‌రాం బృందం, శేషాచ‌లం కొండ‌ల‌ను ట్రెక్కింగ్ ద్వారా జ‌ల్లెడ‌బ‌ట్టిన కుక్క‌ల‌దొడ్డి సుబ్బ‌రాయుడు, ట్రెక్కర్ శ్రీ‌నివాస్‌, అట‌వీ అధికారులు, సిబ్బంది రాము త‌దిత‌రులు ఆళ్వారు తీర్థం వ‌ద్ద‌కు చేరుకోగ‌లిగారు.

ద‌ట్ట‌మైన అడ‌విలో పెద్ద పెద్ద వృక్షాల మ‌ధ్య ఈ తీర్థానికి చుట్టూ శిథిల‌మై, పురాత‌న‌మైన‌రాతి క‌ట్ట‌డం ఉంది.చాలా భాగం పూడిపోవ‌డం వ‌ల్ల నీళ్లు కొద్దిగానే ఉన్నాయి.

ఈ తీర్థం పున‌రుద్ధ‌రించే ప‌నుల‌ను రాఘ‌వ‌శ‌ర్మ కొబ్బ‌రికాయ కొట్టి ప్రారంభించ‌గా, భూమ‌న్ ఇక్క‌డ మామిడి చెట్టును నాటి, సుబ్బ‌రాయుడును స‌న్మానించి ఈ తీర్థ ప్రాశ‌స్త్యాన్ని వివ‌రించారు.

నాలుగు, అయిదు శ‌తాబ్దాల మ‌ధ్య జీవించిన నాల్గ‌వ ఆళ్వారు తిరుమ‌ళీశై ఆళ్వార్ తాను రాసిన పాశురాలలో తాను జీవించిన కాలంలో తిరుమ‌లలో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి విగ్ర‌హం త‌ప్ప ఆల‌యం లేద‌ని తొలిసారిగా చెప్పాడు.

ఆయ‌న రాసిన పాశురంలో ఈ విషయం చూడండి:

పురిందు మ‌ల‌రిట్టుప్పండ‌రీక పాదం
ప‌రిందు ప‌డుకాడు నిర్ప- తెరిందెంగుం
తానొంగి నిన్రాన్ త‌ణ్ణ‌రువి వేంగ‌డ‌మే
నారోర్కుం మ‌ణ్ణోర్కుం వెప్పు
-తిరుమ‌ళీ శై ఆళ్వార్ పాశురం( డాక్ట‌ర్ దేవిరెడ్డి సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి రాసిన ‘గాడ్స్ ఆన్ ఎర్త్’ నుంచి)

ఈ పాశురం అర్థం ఇలా ఉంది.

“దేవుని చుట్టూ దట్టమైన అడవి ఉంది. దేవుడు ఉన్న చోట చుట్టూ చెట్లు నరికేశారు. దేవుని వద్దకు వెళ్ళడానికి చెట్లు నరికి దారి ఏర్పాటు చేశారు. దైవ ప్రతిమ అన్ని దిక్కుల నుంచి, అందరికీ కనిపిస్తోంది.”

అల్వార్ తీర్తంలో మొక్కలు నాటిన శ్వేత మాజీ డైరెక్ట‌ర్‌ భూమ‌న్

అంత‌కు ముందు ఆళ్వారు లెవ‌రూ గుడి ఉన్న‌ది అని కానీ, లేద‌ని కానీ చెప్ప‌లేదు.

ఆళ్వారు తీర్థాన్ని పునరుద్ధ రించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.ఇది సహజ సిద్ధమైన నీటి చలమ.అలిపిరి దాటితే గాలి గోపురం వరకు సహజ సిద్ధమైన నీటి చలమలు ఒక్కటి కూడా లేదు.ఇలాంటి నీటి చలమలను కాపాడడం వలన అడవిలో జంతువుల దాహార్తి తీరుతుంది. ఫలితంగా నీటి కోసం అడవి జంతువులు మానవ ఆవా సాల పైన పడకుండా ఉంటాయి.

ఆళ్వారు తీర్థాన్ని పునరుద్ధరి స్తే అడవి జంతువులు అక్కడే దాహార్తి తీర్చుకుని అడవిలోకి వెళ్ళి పోతాయి.ఆ అడవి జంతువులు కాలినడక భక్తుల వద్ద కు వచ్చే అవకాశం ఉండదు. ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టాన్ని పెంపొందించ డానికి ఉపయోగ పడుతుంది.

తద్వారా వాతావరణ సమతుల్యానికి కూడా దోహద పడుతుంది.

(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *