11వ పే రెవిజన్ కమిటీ నివేదికను పరిశీలన చేసి త్వరలో రిపోర్ట్ ఇవ్వమని ఈ రోజు GO No.22, తేదీ.1.4.2021ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సెక్రెటరీల నివేదిక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు సబ్మిట్ చేసేందుకు స్పష్టమైన టైం లిమిట్ (కాలపరిమితి) లేకుండా వీలైనంత త్వరగా అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని AP JAC అమరావతి నేతలు బొప్పరాజు, వైవీ రావులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రక్కనే, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 11వ PRC ని ఎలాంటి సెక్రెటరీల నివేదిక లేకుండానే ప్రకటించిన విషయం గుర్తు వారు ప్రభుత్వానికి గుర్తు చేశారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 11వ PRC ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఈ ప్రకటన నిరుత్సాహాన్ని కలుగచేసిందని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
10వ PRC ని ఎలాంటి సెక్రెటరీ ల నివేదిక లేకుండానే ప్రభుత్వం గతంలో ఆమోదించిన విషయాన్ని కూడా వారు ప్రభుత్వానికి గుర్తు చేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి కమిటీలు వేయకుండా 11వPRC ప్రకటించాలని తాము కోరినా సెక్రెటరీల కమిటీని వేశారని వారు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27% IR చెల్లిస్తున్నందున, 11వ PRC ప్రకటన వల్ల ప్రభుత్వం పై పెద్దగా ఆర్ధిక భారం పడదని వారు పేర్కొన్నారు. ఈ కారణంతో ప్రభుత్వం నేటి ఉత్తర్వులను పునః పరిశీలన చేసి ఒకసారి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 11వ పే రివిజన్ ను వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.