అసలు, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రాబ్లమ్ ఏమిటి?

మాజీ చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి విలేకరుల సమావేశం విశ్లేషణ

 

హైదరాబాద్: ఆరేడేళ్లకిందట రాజకీయాల్లోకి వచ్చిన  కొండా విశ్వేశ్వరరెడ్డికి పెద్ద సమస్య వచ్చింది. కెసిఆర్ రమ్మంటేరాజకీయాల్లోకి వచ్చానని ఆయన ఈ రోజు చెప్పారు. ఆయన చేస్తే చెేవెళ్ల ఎంపి అయ్యారు. (ఈ విషయం చెప్పలేదు) అయితే, కెసిఆర్ తో లేకపోయినా, రాజకీయాల్లో చిక్కుకు పోయారు. ఒక్కటి మాత్రం నిజం. ఇక ఆయన రాజకీయాల్లో ఉండలేక , బయటకు వెళ్లలేక సతమతమవుతారు.

ఏ పార్టీలో చేరాలా, ఎవరితో ఉండాల అని తేల్చుకోవడం ఆయనకు కష్టమవుతుంది. ఎందుకంటే, ఆయన  ఈ రోజు విలేకరుల సమావేశంలో చెప్పిన చాలా విషయాలు బాగా రాజకీయ అపరిపక్వతని, అనిశ్చిత ధోరణిని ప్రదర్శిస్తాయి. ఆయన చెప్పిన మాటల్లో అతి ముఖ్యమయిదని, కాంగ్రెస్ పార్టీలో ముఠాలున్నాయని,అందుకే బయటకు వచ్చననేది.  1885లో పుట్టినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో ముఠాలు లేని రోజులు ఎన్ని ఉన్నాయి?

ఆయన రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చానన్నారు. ఏదో ఆశించకుండా ఎవరూ రాజకీయాల్లోకి రారు.ఏమి ఆశించి వచ్చారో ఎపుడూ చెప్పారు. అదే రాజకీయం. వాళ్లు దాస్తారు, జనం తొంగిచూస్తుంటారు.

కాంగ్రెస్ బలమయిన ప్రతిపక్షం కాదని అన్నారు. ఇదేమీ కొత్తవిషయం కాదు. దానిని బలమయిన ప్రతిపక్షం చేయడానికి పార్టీలో ఉన్నవాళ్లు కృషి చేయాలి. బలంగా ఉంటేనే పార్టీలో ఉండటం, అధికారంలోకి వచ్చే వీలుంటేపార్టీలో ఉండటం, ఓడిపోతానే ఉడాయించడం… అవకాశ వాదం. జంటిల్మ్ న్ పొలిటీషన్ అని అనుకున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలా రోజులు గడిచేకొద్ది ఏమేమో మాట్టాడుతున్నారు. చివరకు ఆయన మాటల్లో సీరియస్ నెస్ పోయి, బిజెపిలో చేరి ‘ప్రధాని మోదీ గొప్పగా పనిచేస్తున్నారని, ఆయనను మించిన రాజకీయ బలాఢ్యడవెరూ దేశంలోలేరని, హిందూ ధర్మ రక్షణ అవసర’మని ప్రకటన చేస్తారేమో అనిపిస్తుంది.

తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలలో కొంత పసితనం తో ఉన్నా ఒక  అద్భుతమయిన అబ్జర్వేషన్ ఉంది. కెసిఆర్ ను బయటకు విమర్శిస్తాడు, లోన కలుస్తాడని ఈటెల మీద చేసిన కామెంట్ అపరిపక్వత కనిపిస్తుంది. నేటి రాజకీయాల్లో ఇదొక ట్రెండ్. ఇక కెసిఆర్ అసాధ్యుడన్నట్లు చెబుతూ ఈటెలతో పార్టీ పెట్టించవచ్చని ఆయన వ్యక్తం చేసిన అనుమానం మాత్రం గొప్ప విషయం. రాజకీయాల్లో ఇది అసాధ్యం కాదు. కెసిఆర్ కు అంతశక్తియుక్తులున్నాయి.

ఈ మధ్య బిసిల సోషల్ జస్టిస్ రాజకీయాలు బాగా వెనకబడిపోయాయి. ఇంకొక టెర్మ్ లో కెసిఆర్ ప్రసంగాలు జనాలకు బోర్ కొడతాయి. ఆంధ్రోళ్లని శత్రువుల్లాగా చూపినంతకాలం కెసిఆర్ నాలుక బాగా పదునుగా ఉండిపోయింది. ఆంధ్రోళ్ల ని ఎల్లకాలం తిట్టడం సాధ్యం కాదు. ఆ చాప్టర్ క్లోజ్ అయింది.  కెసిఆర్ కూడా చాలా సాదాసీదా పొలిటీషన్ అని అవకాశవాది అని అన్నంతిని తన కోసం వాడుకుంటాడని మెల్లిగా తెలిసిపోతున్నది.

పంజాబ్ రైతులు పిలుపుతో జరిపిన గత డిసెంబర్  లోభారత్ బంద్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత కెసిఆర్ విజయవంతం చేయించారు. అపుడు ఆయన చేసిన ప్రసంగాలు, ప్రజలకు ఇచ్చిన పిలుపు  ఒక సారి గుర్తు తెచ్చకోండి. దుబ్బాక దెబ్బ తర్వాత హఠాత్తుగా ఢిల్లీ వెల్లివచ్చారు. ఢిల్లీ రైతులను వదిలేశారు. భారత్ బంద్ ను వదిలేశారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్లి వస్తే  ఏదో రాజీ జరిగి ఉంటుందని  ప్రజలందరికి తెలిసిపోతున్నది.

అందువల్ల  కెసిఆర్ మ్యాజిక్ తగ్గిపోతున్నపుడు, ఆదుకునేందుకు ఈటెల రాజేందర్ చేత ఒక బిసి సామాజిక న్యాయం పార్టీ పెట్టించి,  బిసిలలో రక్తం మరిగించి ఒక 25 సీట్లు తెచ్చుకుంటే కొయలిషన్ గవర్నమెంటుతో మరికొంత కాలం లాగించవచ్చు. ఈ విషయంలో కొండా అనుమానాన్ని కాదనలేం. కోండా చెబుతున్నట్లు రాష్ట్రంలో రెండో ప్రాంతీయ పార్టీ వచ్చే వీలుంది. దాన్ని కూడా కెసిఆర్ పెట్టిస్తే.

ఇలాంటి అనుమానం మనుషుల్ని బాగా పీడిస్తుంది. రెండో ప్రాంతీయపార్టీ ఏదొచ్చినా  దాని కెసిఆర్ పెట్టించారేమో, లేదా బిజెపి పెట్టించిందేమో అని అనేమానం రావచ్చు. దానితో ఆయన కొంత పార్టీలో చేరలేకపోవచ్చు.

రెండో ఆప్షన్ కొత్త పార్టీ పెట్టడమే.  ఏకాపాత్రాభినయం బాగా రక్తి కడుతుంది. అదే ఫుల్ డ్రామాలో రకరకాల సన్నివేశాలలో నటించడం కష్టమవుతుంది. మహానటులు కూడా ఫెయిలవుతారు.  అందువల్ల వ్యక్తులుగా హీరోలయినా, పార్టీ పెట్టే సరికి జీరోఅయిన సందర్భాలు తెలుగు రాజకీయాల్లో చాలా ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టేముందు కొండా విశ్వేశ్వరెడ్డి ఈ విషయం ఆలోచించాలి. జనంతో కనెక్టయేందుకు తనదగ్గిరేముందో చూసుకోవాలి. డబ్బొక్కటే చాలదు. డబ్బులేకపోయినా అలా కనెక్టయిన వ్యక్తుల పార్టీల సూపర్ హిట్టయ్యాయి. ఆమ్ అద్మీ పార్టీ  అర్వింద్ కేజ్రీవాల్ దీనికి ఉదాహరణ. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు కనెక్టుకాలేకపోయిన కేసులు. వీళ్లకి డబ్బు కొరతేం లేదు.

ఇవన్నీకూడా ముళ్లబాటలు.సురక్షితమయిన మార్గం బిజెపిలో చేరడం. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఏ పార్టీలో చేరేందుకయినా ఆలోచించాలేమో గాని, బిజెపిలో చేరేందుకు ఆలోచించాల్సిన పనిలేదు. ఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చు.  అర్థబలం చూసి  రాజ్యసభకు తీసుకోవచ్చు లేదా పార్టీలోకి తీసుకోవచ్చు. ఒక విషయంలో ఆయనలో క్లారిటీ కనిపించింది. అది షర్మిల పార్టీ గురించి. షర్మిల పార్టీలో మాత్రం చేరనన్నారు.

ఇక మరొక మార్గం ఉంది. అంది అందరూ చేయలేనిపని. అది తీన్మార్ మల్లన్న మార్గం. ఈ  మార్గంలో అంతా పయనించలేరు.  ముఖ్యంగా కొండవిశ్వేశ్వరరెడ్డి వంటి రిచ్ పొలిటీషన్స్ ఈ మార్గంలో వెళ్ల లేరు. అంత రెబెల్లస్ గా వుండాలంటే వయసు, టెంపర్ మెంట్ , అట్టడగు వర్గాల  నేపథ్యం ఉండాలి. పూర్వం మహాత్మా గాంధీయుగంలో చాలా మంది సంపన్నులు ఇలా తెగించి మార్పు కోసం పోరాడారు,అది సత్తెకాలపు త్యాగాల యుగం. ఇది అందరికి అచ్చిరాదు. మొత్తానికి విలేకరుల సమావేశం చివరకొచ్చే సరికి ఆయనకు మిగిలిని ప్రశ్నలు:

తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్‌కే లాభం కాబట్టి ఏం చేయాలి? కొత్త పార్టీ పెట్టాలా వద్దా?  ఎవరైనా కొత్త పార్టీ పెడితే అందులో చేరాలా? లేక ఇవన్నీ మానుకుని భారతీయ జనతా పార్టీలో చేరాలా?

కార్యకర్తలతో, ప్రజలతో, నాయకులతో సంప్రదించి  రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. చూద్దాం. ఏమవుతుందో?

ఆయన నిర్ణయం అభిమానులను నిరుత్సాహపర్చదని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *