భద్రాద్రి శ్రీరామ నవమికి భక్తులకు అనుమతి లేదు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెద్ద ఎత్తున  పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా  భద్రాద్రిలో నిర్వహించే ఏ ఏడాది శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 21న ఈ ఏడాది శ్రీరామ నవమి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు దాకా అన్ని పండుగలను, ర్యాలీలను, సభలను నిషేధించింది. ఇందులో భాగంగానే భద్రాద్రి రాముడి కల్యాణ వేడుకలు కూడా ఆలయానికి మాత్రమే అవుతాయి. భక్తులను అనుమతించడం లేదు. కేవలం ప్రత్యేకాహ్వానితులు మాత్రమే ఉంటారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా భద్రాద్రి రాములవారి కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. గతఏడాది లాగే పరిమిత సంఖ్యలో భక్తులతో వేడుకలు జరపుతారు.

ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమికి భక్తులు భద్రాద్రికి రావొద్దని  విజ్ఞప్తి చేశారు.

రాములోరి కల్యాణానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాల్లోనూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామని అన్నారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, ఆలయాలను శానిటైజ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులు సహకరించాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *