1966లో లాగా 2021 MLA, MPలు విశాఖ ఉక్కుకోసం రాజీనామా చేయగలరా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కంపెనీలకు అమ్మేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అయితే, నిర్ణీత ఫారంమ్ లో లేనందున దానిని స్పీకర్ తమ్మినేని సీతారామ్  తిరస్కరించారు.

తర్వాత ఆయన నిర్నీత ఫారం లో  రాజీనామా చేశారు.  ఇది ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. తొందరగా రాజీనామాని ఆమోదించాలని కోరూతూ ఆయన నిన్న ఆముదాల వలసలో స్పీకర్ నివాసంలో స్పీకర్ ని కలిశారు.అనంతరం మాట్లాడుతూ గంటా శ్రీనివాస్ ఒక ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు  రాజీనామా చేయడం ఒక్కటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే మార్గం. అంటే 1966  నాటి కంటే తీవ్రంగా ప్రజాప్రతినిధులంతా స్పందించాలన్నమాట. అంటేఅసెంబ్లీలనుంచి 175 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటు నుంచి 25మంది ఎంపిలు రాజీనామా చేయాలన్నమాట. అయితే,గంటాశ్రీనివాస రావు రాజీనామా చేసినప్పటనుంచి మరొక ఎమ్మెల్యే గాని, ఎంపిగాని రాజీనామా నామమాత్రంగా కూడా సమర్పించలేదు. ఒకరిద్దరు తప్ప రాజీనామా  మాటే ఎత్తడం లేదెవరూ? సుజానా చౌదరి వంటి వాళ్లు ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారు కూడా. దీనితో గంటా రాజీనామా ప్రభావం ఏమీ లేదని చెప్పవచ్చు.

ఎంతో కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి గెల్చుకున్న సీటును విశాఖ స్టీల్ కోసం వదులుకునేంత సత్తె కాలపు మనుషులు చట్టసభల్లో ఈ రోజు ఉన్నారా? గంట ప్రతిపాదన ఎవరూ పట్టించుకోనక పోవచ్చు. మొత్తంగా కాకపోయినా,కనీసం విశాఖ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే యోచనలో లేరు. విశాఖ పట్టణం ఎంపి ఎంవివి సత్యనారాయణ మాత్రమే రాజీనామా మాట ప్రయోగించారు.అయితే, ఆయనప్రకటనలో కూడా తిరకాసు ఉంది. విశాఖఉక్కు ప్రైవీటికీరిస్తే రాజీనామా చేస్తానన్నారు తప్ప, ప్రయివేటీకరణను ఆపేందుకు ముందే రాజీనామా చేసి పోరాడాతానని అనలేదు. విశాఖ కూర్మన్న పాలెం గేటు వద్ద ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ  ఆయన తెలివిగా ఈ ప్రకటన చేశారు. ‘న్యాయకోసం పోరాడదాం. పోరాటంలో ఓడిపోతే, నేను రాజీనామా చేస్తాను,’ అని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించిందనే వార్త వెలువడాగానే ఫిబ్రవరి 5న గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. దాదాపు 50 రోజులు గడించింది.మరొక ప్రజాప్రతినిధి రాజీనామా చేయాలేదు.  2021 నాటి ప్రజాప్రతినిధులు 1966 లో నాటి ప్రజాప్రతినిధుల్లాగా పదవులను గడ్డిపోచలాగా పడేసి, విశాఖ ఉక్కకోసం పోరాడే పరిస్థితి లేదు అనేగా ఆర్థం.

1966లో ఎమ్మెల్యే పదవులను సులభంగా అలా పడేశేశారు…

1966లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు 67 మంది ఒకేసారీ రాజీనామా చేసి ఆధునిక భారత దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో వారు ఇలా పదవులను తృణ ప్రాయంగా వదిలేసుకున్నారు. ఆ వెంటనే  పార్లమెంటు నుంచి   ఏడుగురు ఎంపిలు కూడా రాజీనామా చేశారు.

1966 నవంబర్ విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని జోరుగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఈ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు.

అపుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి. వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే పడేది కాదు.

విశాఖలో ఉక్కు కర్మాగారం రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాసు ప్రభుత్వం మీద అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. విశాఖ విద్యార్థి ఉాద్యమం మీద పోలీసులు అనవసరంగా కాల్పులు జరిపి 32 మంది పొట్టను పెట్టుకున్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సమ్మతించక పోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

శాసన సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటి మీద వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పై ఉమ్మడిగా ఆవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. చర్చ అనంతరం  ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కు రాజీనామ  లేఖ అందచేశారు. మొత్తంగా 52 మంది ఉభయ కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, 15 మంది ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యలు రాజీనామా చేశారు.

1966 నవంబర్ 17న శాసన సభలో  ప్రశ్నోత్త రాల సమయం ముగియగానే అవిశ్వాసం తీర్మానం విషయం పరిశీలనకు వచ్చింది. తీర్మానానికి అనుకూలంగా 60 మంది సభ్యులు లేచి నిలబడగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు స్పీకర్ అనుమతించారు.  తీర్మానాన్ని సిపిఐ (ఎం) నాయకుడు తరిమెల నాగిరెడ్డి, సిపిఐ నాయకులు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, నేషనల్ డెమోక్రట్ల నాయకుడు తెన్నేటి విశ్వనాథం, స్వతంత్ర పార్టీ నాయకులు గౌతు లచ్చన్న, ఇండిపెండెంటు సభ్యుడు వావివాల గోపాలకృష్ణయ్య , ఎస్ ఎస్ సి సభ్యుడు టికె ఆర్ శర్మ సంయుక్తంగా ప్రతిపాదించారు.

తీర్మానం మీద తరిమెల నాగిరెడ్డి ప్రసంగం:

Tarimela Nagireddy (facebook picture)

“… కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు ఈ (కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం) ప్రభుత్వం ద్రోహం చేసింది. పైగా విశాఖపట్నం, విజయనగరం, ఆముదాల వలస,పలాస, కాకినాడ, విజయవాడ, మచిలీ పట్నం, జగిత్యాల, సీలేరు, వరంగల్, గుంటూరులలో శాంతియుతంగానూ, నిరాయుధులుగా ఉన్న ప్రజలపై నిర్హేతుకంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా   32 మంది మరణానికి, వందలాది మంది క్షతగాత్రు లయ్యేందుకు కారణమైంది. అంతేగాక, వేలాది మంది గాయపడేలా లాఠీ చార్జీలు జరిపించింది.  విస్తృతంగా అరెస్టులు సాగించి అలా నిర్బంధించిన వారిలో కొందరిపై చిత్ర హింసలు సాగించింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటాన్ని నివారిస్తూ నిషేధాజ్ఞలు విధించింది. గురిపెట్టిన తుపాకులు చేతపట్టిన సైనికులచే కవాతు చేయిస్తున్నది. కాల్పులపై అనేక పట్టణాలలో తక్షణమే న్యాయ విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలి… న్యాయవిచారణ మేం అడిగాం. మీరు నిరాకరించారు. అందుచేత రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. దానికి నిరాకరించారు.  అందుచేతనే ఈ అవిశ్వాస తీర్మానం,” అని తరిమెల నాగిరెడ్డి ప్రసంగం ముగించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత  ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమాధానం మిచ్చారు. తర్వాత ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శాసన సభలోని 67 మంది ప్రతిపక్ష  సభ్యులు రాజీనామా చేశారు.

రాజీనామా సమర్పించిన సిపిఎం సభ్యులు

తరిమెల నాగిరెడ్డి (పుట్లూరు), పుచ్చలపల్లి సుందరయ్య(గన్నవరం),గుంటూరు బాపనయ్య (నిడుమోలు), తమ్మిన పోతరాజు ( విజయవాడ ఉత్తరం), మండే పిచ్చయ్య (పాయకరావు పేట ఎస్. సి), ఎస్ ఆర్ దాట్ల (అత్తిలి), గంజి రామారావు (గుడివాడ ఎస్ సి), కొరటాల సత్యన్నారాయణ (రేపల్లె), ఈవూరి సుబ్బారావు (కూచినపూడి), కొమ్మినేని వేంకటేశ్వరరావు (బాపట్ల),  నరహరి శెట్టి వెంకటస్వామి( పర్చూరు), సూదనగుంట సింగయ్య (అమ్మనబ్రోలు), తవనం చెంచయ్య (సంత నూతలపాడు ఎస్ సి), ఎపి వజ్రవేలు శెట్టి ( కుప్పం), సికె నారాయణరెడ్డి (పీలేరు), కెఎల్ నరసింహారావు (ఎల్లెందు), పర్సా సత్యనారాయణ (పాల్వంచ), కంగల బుచ్చయ్య (బూర్గం పహాడ్), ఎ వెంకటేశ్వరరావు (నర్సంపేట), కె రాఘవులు ,  ఉప్పల మల్చూర్ (సూర్యాపేట ఎస్ సి), నంద్యాల శ్రీనివాస రెడ్డి సిపిఎం అనుబంధ సభ్యులు, (నకిరేకల్). మధ్యే వాద కమ్యూనిస్టు ఎమ్మెల్యే డి.సీతారామయ్య(మదన పల్లి).

రాజీనామా చేసిన సిపిఐ సభ్యులు

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (నందిగామ), వేములపల్లి శ్రీకృష్ణ (మంగళగిరి), కె నాగయ్య (గుంటూరు 1),  పి కోటేశ్వరరావు (పెద్దకాకాని), జెఎల్ ఎన్ చౌదరి (చీరాల), పి వి శివయ్య (వినుకొండ),   పి రంగనాయకుడు (అద్దంకి), వెల్లంకి విశ్వేశ్వరరావు ట( మైలవరం), మైనేని లక్ష్మణ స్వామి ( కంకిపాడు),  వంకా సత్యన్నారాయణ ( పెనుగొండ), ఎ సర్వేశ్వరరావు (ఏలూరు), పి శ్యామసుందరరావు (అచెంట), కె బాబూరావు ( పోలవరం),  పి పనసారామన్న (అనపర్తి), కె గోవిందరావు( అనకాపల్లి), పివి రమణ (కొండకర్ల), స్వర్ణ వేమయ్య( బుచ్చిరెడ్డి పాలెం  ఎస్ సి), కె గురుస్వామిరెడ్డి (కనిగిరి),  ఆరుట్ల రామచంద్రారెడ్డి (భువనగిరి),  ధర్మభిక్షం ( నల్గొండ), కె రామచంద్రారెడ్డి ( రామన్న పేట), కె పర్వత రెడ్డి (పెద్దవూర), వై పెద్దయ్య (దేవరకొండ), విఠల్ రెడ్డి( నర్సాపూర్), ఎన్ పివి మోహన్ రావు ( ఘన్ పూర్), ఎన్ గిరిప్రసాద్ (ఖమ్మం), మహ్మద్ తహశీల్ (భద్రాచలం), పూలసుబ్బయ్య (ఎర్రగొండపాలెం), శ్రీమితి ఆరుట్ల కమలా దేవి( ఆలేర్), శ్రీమతి కె ఆనందాదేవి (మెదక్ )

స్వతంత్ర పార్టీ అభ్యర్థులు

గౌతు లచ్చన్న ( సోంపేట),  పి. రాజగోపాల్  నాయుడు ( తవణం పల్లె), వైసి వీరభద్ర గౌడ్ ( ఎమ్మిగనూర్), ఎస్ అప్పలనాయుడు ( గొలుగొండ), పి  నారాయణ రెడ్డి ( మైదుకూరు), ఎస్ పెంచలయ్య ( కోడూరు ఎస్ సి), సిడి నాయుడు (చిత్తూరు), ముత్యాల వలస పాత్రుడు.

నేషనల్ డెమోక్రట్స్

తెన్నేటి విశ్వనాథం (మాడుగుల), ముద్రగడ వీర రాఘవరావు (ప్రత్తిపాడు)

ఎస్ ఎస్ సి

టికెఆర్ శర్మ ( కర్నూల్ )

స్వతంత్ర సభ్యులు

డాక్టర్ బివిఎల్ నారాయణ (ఒంగోలు), వావిలాల గోపాలకృష్ణయ్య (సత్తెన పల్లి)

రాజీనామా చేసిన సిపిఎం లోక్ సభ సభ్యలు

కొల్లా వెంకయ్య (తెనాలి), మాదల నారాయణ స్వామి(ఒంగోలు), పి లక్ష్మీదాస్ ( మిర్యాల గూడు (ఎస్ సి)

రాజీనామా చేసిన సిపిఐ లోక్ సభ సభ్యులు

వీరమాచనేని విమలాదేవి (ఏలూరు), గుజ్జుల యలమందారెడ్డి( మార్కాపూర్), ఎద్దుల ఈశ్వర్ రెడ్డి(కడప), రావి నారాయణరెడ్డి (నల్గొండ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *