ఢిల్లీ సిఎం ని మేయర్ స్థాయికి కుదించవద్దు: పార్లమెంటులో వైసిపి

ఢిల్లీ రాజధాని ప్రాంత బిల్లుకు నో చెప్పి
రాజ్యసభ నుంచి వాకౌట్  చేసిన వైఎస్సార్సీపీ

న్యూ ఢిల్లీ, మార్చి 24: ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు (Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2021) రాజ్యాంగ స్పూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు శ్ర వి.విజయసాయి రెడ్డి అన్నారు.

రాజ్యసభలో బుధవారం ఈ బిల్లుపై ఆయన మాట్లాడారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలకు మాత్రమే సర్వాధికారాలు ఉండాలి తప్ప గవర్నర్‌కు కాదన్నది తమ పార్టీ నిశ్చితాభిప్రాయమని ఆయన చెప్పారు. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సర్వాధికారాలు అప్పగించడానికి ఉద్దేశించినట్టు ఉన్న ఈ బిల్లు ఎట్టి పరిస్థితులలోను న్యాయ సమీక్షకు నిలబడదని అన్నారు.

రాజ్యాంగంలో పొందుపరచిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని సూచించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అంతకుముందు ఈ బిల్లుపై ప్రసంగించిన  వి.విజయసాయి రెడ్డి బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. మంత్రిమండలి విధానంలో సాగే పాలనలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలకుడు కాదన్న సూత్రాన్ని తాను నమ్ముతానని అన్నారు. ఈ బిల్లుపై న్యాయపరంగా మరింత లోతైన పరిశీలన జరగాలి. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ, యూకేలోని లండన్‌లో పాలన విధానాలను పోల్చిచూసే అధ్యయనం జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఆదరాబాదరాగా బిల్లును ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని అన్నారు.

మంత్రిమండలి శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239 ఎఎ, సెక్షన్‌ 6 స్పష్టంగా చెబుతోంది. ఈ బిల్లులో పేర్కొన్నట్లుగా లెఫ్టినెంట్‌ గవర్నరే ప్రభుత్వం అయితే అది కచ్చితంగా ఆర్టికల్‌ 239 ఉల్లంఘనే అవుతుంది. ఎగ్జిక్యూటివ్‌ను హద్దులో పెట్టలేని నిస్సహాయ స్థితిలో లెజిస్లేచర్‌ ఉండి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌. ఆయనను శాసనసభ నుంచి ఎన్నికైన వాడు కాబట్టి శాసనసభకు బాధ్యత వహించడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ఎగ్జిక్యూటివ్‌ శాసనసభకు బాధ్యుడై ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానమైన ఆకాంక్ష అని అన్నారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మంత్రిమండలి సలహాలు, సహకారాల మేరకు మాత్రమే పని చేయాల్సి ఉంటుందని ఆర్టికల్‌ 239 స్పష్టంగా చెబుతుంటే ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం లేదా మంత్రిమండలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్దమని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఆర్టికల్‌ 239ఎఎకి అనుగుణంగా ఢిల్లీ ప్రాంతంలో పాలన నిర్వహించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్రపతి పాలన విధించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239 ఏబీ అవకాశం కల్పిస్తోంది.

అయితే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివేదిక మేరకే రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ఈ బిల్లు చట్టంగా రూపొందే పక్షంలో ఎన్నికైన ప్రభుత్వం స్థానంలో 365 రోజులూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేవలం ఒక మేయర్‌గా మాత్రమే మిగిలిపోతారని అంటూ ఆయన ప్రసంగం ముగించి సహచర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులతో కలసి సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *