(డాక్టర్ . యస్ . జతిన్ కుమార్)
2020 సంవత్సరం లో కరొన ఒక అసాధారణ స్థితిని సృష్టించింది. అనేక ఆర్ధిక విపరిణామాలకు దారి తీసింది. అయితే ఆర్ధిక వ్యవస్థలలో తలఎత్తిన ఆన్ని సమస్యలకూ కరోనాయే కారణం అని చెప్పి ప్రభుత్వాలు తమ బాధ్యతను తప్పించుకో జూస్తున్నాయి.
2021 మార్చి 18 వ తేదీన PEW రీసెర్చ్ సెంటర్ వారు ఒక నివేదిక విడుదల చేశారు. వీరు అమెరికాలోని వాషింగ్టన్ నగరం నుండి పనిచేస్తారు. వారి మదింపు ప్రకారం 2020 లో భారత దేశం లో ఆదాయాలు తగ్గిపోయి మధ్య తరగతి దాదాపు మూడవ వంతు కుంచించుకు పోయింది. పేదల సంఖ్య రెట్టింపు అయ్యింది. లాక్డౌన్ తదితర కారణాలవల్ల తీవ్రమైన ఆర్ధిక మందగమనం నెలకొని కోట్ల మంది మధ్య తరగతి వారు చితికిపోయి పేదల స్థాయికి దిగజారి పోయారు. దిగువ ఆదాయం గలవారిలో పేదరికం మరింతగా విజృంభించి, నిరుపేదల సంఖ్య 7.5 కోట్లు పెరిగింది. గత 14 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఎక్కువ మంది గ్రామీణ ఉపాధి పధకం మీద ఆధార పడుతున్నారు.
రోజువారీ తలసరి ఆదాయం 150 రూపాయలకు తక్కువ వుంటే వారిని పేదలు అంటున్నారు. 150 నుండి 700 రూపాయల ఆదాయం గలవారిని అల్పఆదాయ వర్గమనీ అంటున్నారు. 700 నుండి 1500 వరకు ఆదాయం గలవారిని మధ్య తరగతి లేక ఉన్నత మధ్య తరగతి అంటున్నారు . ఈ శ్రేణి లో ఉన్నవారు పాండమిక్ కు ముందు 119.7 కోట్లమంది వుంటే ప్రస్తుతం వారి సంఖ్య 116.2 గా అంచనా వేయబడింది. అంటే 3.5 కోట్ల మంది ఆదాయం తగ్గిపోయి పేదవర్గం లో కలిసి పోయారు. 10 కోట్ల మంది మధ్య తరగతి వారు 6.6 కోట్లకు తగ్గిపోయారు. ఉన్నత మధ్య తరగతివారి లో 30% తమ ఆదాయా లు కోల్పోయి ప్రస్తుతం 1.8 కోట్ల మంది మాత్రమే తమ పూర్వ స్థానంలో ఉన్నారు.
చైనాలో కూడా కరోనా తీవ్రమైన నష్టం కలిగించింది. కానీ అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రజల జీవన ప్రమాణం ఇంతగా పడిపోలేదు. అక్కడ ఆదాయాలు తగ్గి పోవటం వల్ల కేవలం మూడు కోట్ల మంది దిగువ మధ్య తరగతి వారు అల్ప ఆదాయ వర్గంగా మారారు. ఒక కోటి మంది ఉన్నత మధ్య తరగతి నుండి దిగువ మధ్య తర గతికి తిరోగమించారు. అక్కడి పేదల సంఖ్య దాదాపుగా ఏమీ పెరగలేదు.
జనవరి 2020 లో ఇండియా 5.8%, చైనా 5.9% జిడిపి వృద్ధి రేటు ను సాధించ గలవని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అయితే జనవరి 2021కి ఈ స్థితి మారి పోయింది చైనా 2% వృద్ధిని నమోదు చేస్తుందని, ఇండియా తిరో గమనం లో ఉందనీ , -9.6 ఋణాత్మక వృద్ధి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు చెబుతోంది. అంటే భారత దేశం కరోనా వల్ల వచ్చిందంటున్న ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోగా, చైనా ఈ తిరోగమనాన్ని ఎదుర్కొని, ఆరికట్టి తన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోగలిగింది.
ప్రపంచము లోని అల్పా దాయ వర్గంలో 30% భారతీయులు కాగా, మధ్య ఆదాయ వర్గంలో చైనీయులు 37% ఉన్నారు. దీనర్ధం జీవన ప్రమాణాలలో మనకంటే చైనా ప్రజలు మెరుగైన దశ లో ఉన్నారు. అక్కడ నిరుపేదతనాన్ని పూర్తిగా నిర్మూలించారు. ఆక్కడ 1050 మంది బిలియనీర్లు ఉన్నారు కానీ వారి సంపద మొత్తం ఉత్పత్తి వ్యాపారాలలో పెట్టుబడిగా మారి ఆ సమాజాన్ని సంపద్వంతం చేయటం లో ఉపయోగ పడుతోంది.
మన దగ్గర ఒక్క కరోనా కాలంలోనే 40 మంది బిలియనీర్లుగా మారారు. ముకేష్ అంబానీ లాక్ డౌన్ కాలంలో గంటకు 90 కోట్లు సంపాదించాడు. ఇప్పుడా యన ప్రపంచంలోనే 4 వ అతి పెద్ద ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 8300 కోట్ల డాలర్లు( రూ. 6 లక్షల కోట్ల కు) పైన ఉన్నది. దేశంలో రెండవ అతి పెద్ద ధనవంతుడు గౌతం ఆడాని ఆదాయం కరోనా కాలంలో రోజుకి 449 కోట్ల చొప్పున పెరిగింది. ఈనాడది 3200 కోట్ల డాలర్లు (రూ. 2 లక్షల 35 వేల కోట్లకు ) పైబడి ఉంది. ఇదే కరోనా కారణంగా ఏప్రియల్ 2020, ఒక్క నెలలో గంటకి 1.7 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. 84% కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. ఆ ఏడాది లో 18%నిరుద్యోగం పెరిగింది, 12.5 కోట్ల అసంఘటిత వర్గం, కోట్లాది వలస కార్మికులు చెప్పలేని బాధలకు గురి అయ్యారు. అదే సమయంలో కోటీశ్వరుల ఆదాయం 12.5 లక్షల కోట్లకు మించి పెరిగింది. దీనర్ధం ఏమిటి?
ఈ ఆర్ధిక సంక్షోభం లో కూడా చైనా తన సోషలిస్టు అభివృద్ధి పధం లో ప్రజలను పేదరికం బారిన పడకుండా రక్షించి, వారి జీవన ప్రమాణాలు కాపాడు తుంటే ,మన దగ్గర పెట్టుబడిదారీ అభివృద్ధి పధంలో ఆదానీ, అంబానీల వంటి సంపన్నుల ఆదాయాలు ఊహించలేని స్థాయిలో పెంచుతూ కోట్లాది ప్రజలను బీదరికం కోరలకు ఎర చేస్తోంది భారత పాలకవర్గం. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటం లో మనం ప్రపంచానికే మార్గదర్శకులుగా నిలిచామని ఉత్త గొప్పలు ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వం. మరి ఈ దురన్యాయ, దోపిడిని సహించి ఊరుకుంటుందా భారత ప్రజానీకం?
(డాక్టర్ జతిన్ కుమార్, హైదరాబాద్ )