(రాఘశ శర్మ)
తిరుపతిలో తప్పిపోయిన ఐదేళ్ళ పిల్లవాడు ఏడేళ్ళ తరువాత మళ్ళీ అమ్మ ఒడి చేరాడు. కేరళలో ఇంతకాలం ఎలా బతికాడు? ఎవరు చేరదీశారు?
దేశంలో ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడ చూసినా మతకల్లోలాలు! బాంబు పేలుళ్లు! ఈ స్థితిలో జనార్ధన్ అనే ఆ అయిదేళ్ళ బాలుడిని కేరళలో ఒక ముస్లిం కుటుంబం చేరదీసింది. ఆ పిల్ల వాడి తల్లిదండ్రుల కోసం అన్వేషించింది.
ఏ ప్రభుత్వమూ పట్టించుకో లేదు.కేరళలలో ‘ మాతృ భూమి ‘, తెలుగు నాట ‘ వార్త ‘ దినపత్రికలు ఒక వారధిని నిర్మించి, తల్లీ బిడ్డలను ఏకం చేశాయి.
ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. జనార్ధన్ ఇప్పుడెలా ఉన్నాడు?
ఏం చేస్తున్నాడు? ఆ తల్లి ఎలా ఉంది? అసలేం జరిగింది? ఎలా జరిగింది?
ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒక్క సారి పలకరిస్తే గుండె బరువెక్కుతుంది. తిరుపతిలో రిక్షా కార్మికుడు నాగులు, పూలమ్మే నాగరత్నమ్మ భార్యాభర్తలు. తిరుపతి కోర్టు సమీపాన, వేశాలమ్మ గుడివీధిలో, ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కోర్టు సమీపాన రిక్షాలాగుతూ నాగులు బతుకును ఈడుస్తున్నాడు. నాగరత్నమ్మ పూలమ్ముతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది.
అది 1994 నాటి మాట.
వాళ్ళింటి వెనుక, రైలు కట్ట దగ్గర ఒక బాతుల గుంపువచ్చింది. వారి చివరి సంతానం ఐదేళ్ళ జనార్ధన్ బాతులను చూసి ముచ్చటపడ్డాడు. ఆ బాతులు వెళ్ళిపోతుంటే, వాటి వెంటపడి అలా వెళ్ళిపోయాడు. సంచార జీవనం గడిపే బాతుల యజమానులు ఈ పిల్లవాడు తమకు పనికొస్తాడనుకున్నారు.
వాడికి కాస్త తిండి పడేస్తే బాతులను కాపలా కాస్తూ తమతో ఉండి పోతా డనుకున్నారు. పాపం బాతుల మోజులోపడిన పసివాడికి ఆమ్మానాన్న గుర్తుకు రాలేదు.
ఓ రోజు ఆటల్లో పడిన జనార్ధన్ బాతులను పట్టించుకోలేదు. అవి ఎటో వెళ్ళిపోయాయి. బాతులతోనే బతుకు సాగిస్తున్న వారు, చిన్న పిల్లవాడని కూడా చూడకుండా జనార్ధన్‌ను పట్టుకుని చావబాదారు.
ఆ దెబ్బలకు బాతులపై మోజు కాస్తా ఆ బుడ్డోడికి ఒదిలిపోయింది. అమ్మానాన్నలు గుర్తుకొచ్చారు. వెక్కి వెక్కి ఏడ్చాడు.ఎంత ఏడ్చి ఏం ప్రయోజనం!? ఇంటికి ఎట్లా వెళ్ళాలో తెలియదు! ఎలాగోలా బాతుల వాళ్ళను తప్పించుకుని రోడ్లోకొచ్చాడు.
ఆగిన లారీ దగ్గరకెళ్ళాడు. లారీ వాళ్ళు తమిళంలో మాట్లాడుతున్నారు.
పసివాణ్ణి చూసి జాలి పడ్డారు. లారీ ఎక్కమని సైగ చేస్తే, ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడి కెళ్ళాలో తెలియదు.ఎక్కడ దిగాలో తెలియదు.
ఆ లారీ అలా ప్రయాణం చేసి చేసి కేరళలోని ఓ గ్రామానికి చేరింది.ఆ గ్రామం పేరు ఓట్టయపాళెం. పాలక్కడ్ జిల్లా. అక్కడ లారీ దిగేసి, ఓ ఇంటి తలుపు తట్టాడు. భాష రాదు.
ఆ ఇంటి వాళ్ళు పసివాడి సైగలతోనే వాడి ఆకలి గమనించి , ఆ పూటకు కడుపునిండా భోజనం పెట్టారు. అక్కడే పడుకుంటానని సైగలు చేసాడు.
‘ మన కెందుకులే ఈ భారం’ అని వెళ్ళిపొమ్మన్నారు. ఊరి మధ్య మైదానంలో జనార్ధ న్ కూర్చున్నాడు.ఊరి జనమంతా వచ్చి చూసిపోతున్నారు.
ఎవరీ పిల్లాడు! ఎక్కడి నుంచి వచ్చాడు! భాష తెలియదు!ఎప్పుడూ తాగుతూ, తూలుతూ ఉండే ఓ వ్యక్తి అక్కడికొచ్చి గమనించాడు.
అబ్దుల్ రెహమాన్ అనే ముఠామేస్త్రిని తీసుకొచ్చాడు.రెహమాన్ ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. భార్య సుబేదాను, తన కొడుకులు రియాజ్, హకీం, హుస్సేన్‌లను పిలిచాడు.
ఈ రోజు నుంచి వీడు నాకు నాల్గవ కొడుకు అని చెప్పేశాడు. ఆ ముస్లిం కుటుంబానికి భాషా భేదాలు లేవు, కులమతాల తేడాలు లేవు. జనార్ధన్‌ను సుబేదా తల్లిలా అక్కున చేర్చుకుంది.
రియాజ్, హుసేన్, హకీంలు కూడా జనార్ధన్‌ను తమలో కలుపుకున్నారు. ముఠామేస్త్రిగా చేసే రెహమాన్, మరో పిల్లవాడి పోషణ ఏనాడూ భారంగా భావించలేదు. రెహమాన్ తల్లి కూడా జనార్ధన్‌ను మనవడిగానే స్వీకరించింది.
నెలరోజులు గడిచిపోయాయి. బాతుల వెంటపడి తనెలా వచ్చిందో చెప్పగలుగుతున్నాడు.కానీ, తనఊరు పేరేమిటో చెప్పలేకపోతున్నాడు. వాళ్ళింటి ముందు ఒక గుడి ఉందని మాత్రం చెప్పగలుగుతున్నాడు.
జనార్ధన్‌కు సురేష్ అని పేరు పెట్టి తమ పిల్లలతో పాటు స్కూల్లో చేర్పించారు. రెహమాన్ తన కొడుకులతో పాటు జనార్ధన్‌కు కూడా బట్టలు కుట్టించాడు. పుస్తకాలు కొనిచ్చాడు.
పరాయి పిల్లవాడన్న భావనే రాకుండా, ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. రెహమాన్ కుటుంబం చూపే ప్రేమతో, తల్లిదండ్రులకు దూరమయ్యానన్న బాధ క్రమంగా పోతోంది.
రోజులు గడుస్తున్న కొద్దీ వారికి జనార్ధన్‌పై పుత్రవాత్సల్యం పెరుగుతోంది. రెహమాన్, సుబేదాలే జనార్ధన్‌కు తల్లిదండ్రులయ్యారు.
వారెంత ప్రేమగా పెంచుకున్నా, జనార్ధన్ తల్లిదండ్రుల కడుపు శోకం కాదనలేని సత్యం. ఏళ్ళు గడుస్తున్నాయి. జనార్ధన్ పెద్దవాడవుతున్నాడు. ఎలాగైనా జనార్ధన్ తల్లిదండ్రులను కనుక్కోవాలనుకున్నారు.
కేరళలో ప్రసిద్ధమైన ‘ మాతృభూమి ‘ దిన పత్రిక విలేకరి సి.శివదాస్ మాస్టర్ ను కలిశారు. అతని సహకారంతో స్థానిక ఎమ్మెల్యే వి.సి.కబాల్‌ను కలిసి జనార్ధన్ గురించి చెప్పారు.
జనార్ధన్ తల్లి దండ్రలగురించి తెలపమని ఆంధ్ర్రపదేశ్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లకు లేఖలు రాశారు. వారెవరూ స్పందిందచలేదు.
జనార్ధన్ దీన గాథ ను మళయాళం మాతృభూమి పత్రికలో శివదాస్ మాస్టర్ 2001 జూన్‌లో రాశారు. శివదాస్ మాస్టర్ విశాఖపట్నంలో ఉన్న తన బావమరిది కెకె సేతుకు ఆ ప్రతిక ప్రతిని పంపి విచారించమన్నారు. విశాఖపట్నం వార్తలో పనిచేస్తున్న రాజశేఖర్‌కు సేతు ఆ వార్తను చూపించాడు. అలా ఆ సమాచారం వార్త మోఫిసిల్ ఎడిటర్ లక్ష్మణ్ రావు దృష్టికి వెళ్ళింది.
‘ అయిదేళ్ళ ప్రాయంలో అయినవాళ్ళకు దూరమై..!’ అన్న శీర్షికతో అదే ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వార్తలో జనార్ధన్ గురించిన కథనం వచ్చింది. తిరుపతిలో ఉన్న జనార్ధన్ తల్లి నాగరత్నమ్మకు వార్తలో వచ్చిన ఆ ఫొటో చూపించారు. కొడుకు పోలికలను ఆ ఫొటోతో పోల్చుకుంది.
తన కొడుకు బతికే ఉన్నాడన్న ఆనందం పట్టలేకపోయింది. ‘కేరళ ఎలా వెళ్ళడం!? చేతిలో డబ్బులు లేవు! భాష తెలియదు! ‘
ఏళ్ళ తరబడి తాను పూలు కొనే హోల్ సేల్ వ్యాపారి నాగరాజును సంప్రదించింది. ఎట్టకేలకు నాగరాజును, తన రెండవ కుమార్తెను, తిరుపతిలో ఉంటున్న మలయాళం తెలిసిన ముంతాజ్‌ను తీసుకుని నాగరత్నమ్మ ఓట్టయపాళయం లకిడి ఓ రోజు బయలుదేరింది.
ఓట్టయపాళయంలోని కె.యం.ఎస్.బీ స్కూల్లో చదువుతున్న జనార్ధన్ అదే రోజు స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, అతని బంతి కాస్తా వెళ్ళి హెడ్మాస్టర్ గదిలో పడింది.
హెడ్మాస్టర్ ఏమంటారోనని భయపడుతూ, భయపడుతూ జనార్ధన్ చేతులు కట్టుకుని ఆ గదిలోకి వెళ్ళాడు.
‘నీకు పనిష్మెంట్ ఇవ్వాలి రేపు రా ‘ అని హెడ్మాస్టర్ జనార్ధన్‌ను పంపించేశాడు. జనార్ధన్ తల్లి వస్తోందని అంతకు ముందే హెడ్మాస్టర్‌కు తెలిసింది.
ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 17వ తేదీ జనార్ధన్ యధావిధిగా స్కూలుకు వెళ్ళాడు. ఆ సమయంలో నాగరత్నమ్మ వాళ్ళు రెహమాన్ ఇంటికి వెళ్ళారు.
రెహమాన్ కుటుంబంతో మాటా మంతీ అయ్యాక, అంతా కలిసి స్కూల్‌కు బయలుదేరారు.హెడ్మాస్టర్‌ను కలిశారు.
నాగరత్నమ్మకు ఆయన ఒక అగ్నిపరీక్ష పెట్టారు.
‘నాగరత్నమ్మ కానీ, ఆమె వెంట వచ్చిన వారు కానీ ఎవరూ మాట్లాడకూడదు.
ఏ ఒక్కరు మాట్లాడినా జనార్ధన్‌ను అప్పగించను ‘ అనేశాడు.
హెడ్మాస్టర్ గదిలో వెనుక వేపు వీరంతా నిలుచున్నారు. జనార్ధన్‌ను పిలిపించారు. ‘ నీకు పనిష్మెంట్ ఇస్తానన్నాను కదా వెనక్కి తిరిగి చూడు’ అన్నారు హెడ్మాస్టర్.
జనార్ధన్ వెనక్కి తిరిగి చూసేసరికి అంతా కొత్త వాళ్ళు.
ఆ గదిలో అంతమంది ఉన్నా, ఉచ్ఛ్వాస, నిశ్వాస లే తప్ప అంతా నిశ్శబ్దం.
నాగరత్మమ్మ కళ్ళు మేఘాలై వర్షిస్తున్నాయి. ఆమె పెదాలు వణుకుతున్నాయి. దుఃఖ్ఖం కట్టలు తెలంచుకోడానికి సిద్ధంగా ఉంది.
‘ఏడేళ్ళ క్రితం తప్పిపోయినా నా జనార్ధన్ ఎంత పెద్దవాడయ్యాడు..!
ఎంత మారిపోయాడు..! కానీ, అదే ముఖం..! అదే ముక్కు..! అవే కళ్ళు..!’
ఆ ఉద్విగ్నక్షణాలను నాగరత్నమ్మ తట్టుకోలేకపోతోంది.ఆ కళ్ళకు తన కొడుకు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. కన్నీరు కారుస్తున్న ఆ మాతృమూర్తిని జనార్ధన్ చూశాడు.
‘అంతా నా పళ్ళే..!’
మనసులో ముద్రపడిపోయిన తల్లి ముఖం ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యింది.
‘అనుమానం లేదు ఆమె మా అమ్మే!’ అనుకున్నాడు.’అమ్మా ..’ అంటూ ఒక్క అరుపు అరిచాడు. ఒక్క ఉదుటన ఎగిరి ఆమె మెడను వాటేసుకున్నాడు.
ఏడేళ్ళ తరువాత ఉద్విగ్న క్షణాలమధ్య తల్లి నాగరత్నమ్మతో…అంతే ఆ గదిలోని వారందరి గుండెలకు గడియపడినట్టయింది.ఏ ఒక్కరికీ నోటంట మాటలేదు. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.నాగరత్నమ్మ హెడ్మాస్టర్ పెట్టిన ఆగ్నిపరీక్షలో నెగ్గింది.
హెడ్మాస్టరిస్తానన్న పనిష్మెంట్ ఏమిటో జనార్ధన్‌కు అప్పుడు అర్థమైపోయింది. ఆ రోజంతా పెంచిన తల్లి సుబేదాతో, పెంచిన తండ్రి రెమహాన్‌తో, ఈ ఏడేళ్ళూ పెరిగిన వారి పిల్లలతో గడిపాడు.
మర్నాడు జనార్ధన్ ఓట్టయపాళయం రైల్వే స్టేషన్‌లో తల్లితో కలిసి తిరపతి రైలెక్కాడు. తోటి విద్యార్థులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు.
రైలిస్టేషన్‌కు ఆటోలో బయలు దేరుతుంటే రెహమాన్ తల్లి తడబడుతున్న అడుగులతో తానూ ఆటో ఎక్కి జనార్ధన్‌ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.
‘తల నిమురుతూ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉండు ‘ అని గోముగా చెప్పింది. మూడు నెలల కొకసారైనా వచ్చిపొమ్మంది.
రైలు కూతపెట్టింది. ఏడేళ్ళు పెంచిన తల్లి దండ్రుల గుండెలు బరువెక్కాయి. నలుగురు కొడుకుల్లో ఒకడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చూస్తామో, లేదో? అని అనుకుంటుండగానే రైలు కదిలింది.
‘మళ్ళీ మీ దగ్గరకే వచ్చేస్తా’ అంటూ జనార్ధన్ మళయాళంలో ఒక్క అరుపు అరిచాడు. వాళ్ళు దూరమయ్యేంత వరకు జనార్ధన్ వారిని చూస్తూనే ఉన్నాడు.
జనార్ధన్ తల్లితో కలిసి సెప్టెంబర్(2001)లో తిరుపతి చేరాడు.ఈ ఏడేళ్ళలో ఎంత మార్పు! తప్పిపోయిన చిన్న కొడుకును చూడకుండానే తండ్రి నాగులు రెందేళ్ళ క్రితమే మరణించాడు. అన్న రాజేష్‌ను కానీ, నలుగురు అక్కలను కానీ జనార్ధన్ గుర్తుపట్టలేకపోతున్నాడు.
పెద్దక్క మునికుమారి పెళ్ళై భర్తతో కాపురం చేస్తోంది. రెండవ అక్క అనసూయ పెళ్ళి అయినా పూలవ్యాపారం చేస్తూ అమ్మతోనే ఉంటోంది.
పజ్జెనిమిదేళ్ళ వయసున్న మూడవ అక్క మంజుల పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగురాలు. అంతా అమ్మే చూడాలి. నాలుగవ అక్కకూడా పూల వ్యాపారం.
తిరుపతిలోని కోలా వీధిలో ఒక చిన్న గదిలోనే అంతా కలిసి ఉంటున్నారు.ముందు టెంకాయి కీతులతో (కొబ్బరి ఆకులతో) వేసిన వరండా. ఆ గదిలో గోడకు వేలాడుతున్న నాగులు ఫొటో.
ఇనుప మంచం, తప్పు పట్టిన ఇనుప కుర్చీ, ఆ పక్కనే రెండు పూలగంపలు. జనార్ధన్‌కు ఒక పక్క అమ్మ దొరికిందన్న ఆనందం. మరో పక్క అంతా అయోమయం. నాగరత్నమ్మకు మాత్రం చెప్పనలవి కాని ఆనందం.
కళ్ళార్పకుండా కొడుకునే చూస్తోంది. ఉబ్బితబ్బిబ్బై పోతూనే ఉంది. ఇంటికి వచ్చిపోయే వారందరికీ కొడుకును చూపిస్తోంది.
‘మాతృభూమి ‘లో జనార్ధన్ గురించి వచ్చిన కథనం వార్త మఫిసిల్ ఎడిటర్ లక్ష్మణ రావు దృష్టికి వెళ్ళింది.
సెప్టెంబర్ (2001) 7 వతేదీన ‘అయిదేళ్ళ ప్రాయంలో అయినవాళ్ళకు దూరమై ‘ అన్న శీర్షికన వార్తలో కథనం రాయించారు.
సెప్టెంబర్ 17 వ తేదీన జనార్ధన్ తల్లి చెంతకు చేరాడన్న సమాచారం మాతృభూమి ద్వారా తెలిసింది .
కానీ, వారిది ఏ ఊరన్న విషయం వెల్లడి కాలేదు.లక్ష్మణరావు నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని జల్లెడ బట్టారు.పెద్ద కసరత్తే జరిగింది.
వారిది తిరుప తే నని వార్త తిరుపతి బ్యూరో ఇన్‌చార్జి నాగరాజు వల్ల తెలుసుకోగలిగారు. ఆ మొత్తం కథనాన్ని లక్ష్మణరావు నా చేత రాయించారు.
‘అమ్మ ఒడి చేరినా..అక్షరానికి దూరమై..! ‘ అన్న శీర్షికతో 2001అక్టోబర్ 27వ తేదీ వార్తలో కథనం ప్రచురితమైంది.
ఇరవై ఏళ్ళతరువాత జనార్ధన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? తిరుపతిలో మళ్ళీ అతని ఆచూకీ కోసం ప్రయత్నించాను.గాంధీ రోడ్డులో ఉన్న హోల్ సేల్ పూల అంగడికి వెళ్ళి నాగరాజు గురించి విచారించాను.
నాగరాజు మూడేళ్ళ క్రితం పోయాడని చెప్పారు.అతని కొడుకు ద్వారా జనార్ధన్ రెండవ అక్క అనుసూయ ఇంటిని మసీదు పక్క సందులో ఉన్నట్టు కనుక్కున్నాను.
అనుసూయ ద్వారా జనార్ధన్‌ను, వాళ్ళమ్మ నాగరత్నమ్మను కలిశాను.కేరళ నుంచి తిరిగి వచ్చాక జనార్ధన్ పరిస్థితి అయోమయంగా తయారైంది.మళయాళం యాసతో తెలుగు మాట్లాడుతున్నాడే తప్ప తెలుగు అక్షరం రాదు.చివరికి ఒకస్కూల్లో 4,5 తరగతులు చదివాడు.మళయాళానికి అలవాటుపడి తెలుగులో చదువుకోలేకపోతున్నాడు.చదువు మానేసి కొన్నాళ్ళు దేవుడి ఫటాలు కట్టాడు.
పన్నెండేళ్ళ వయసులో కేరళ నుంచి వచ్చినప్పుడు చూశాను.ఇప్పుడతనికి ముప్ఫై రెండేళ్ళు.ఆటో డ్రైవర్‌గా చేస్తున్నాడు. పెళ్ళైంది. ఎనిమిదేళ్ళ కొడుకు కూడా.భార్య మిషన్ కుడుతుంది.
ఏడాది కి ఒకసారి కేరళ లోని ఓట్టయ పాళ యం వెళ్ళి వస్తుంటాడు.
రెహమాన్ కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడూ జనార్ధన్ కోసం తిరుపతి వచ్చి వెళుతుంటారు.ఇరవై ఏళ్ళక్రితం నాగరత్నమ్మ కూతుళ్ళు, కొడుకులు అంతా కలసి ఒకే ఇంట్లో జీవించేవారు.
ఇప్పడు ఎవరి బతుకులు వారివి! ఎవరి ఇళ్ళు వారివి! లాక్‌డౌన్ కాలంలో పూల వ్యాపారం దెబ్బ తింది.దాంతో నాగరత్నమ్మ పూలమ్మడం మానేసింది.
జనార్ధన్ రెండవ అక్క, నాలుగో అక్క మాత్రం ఇప్పటికీ పూలమ్ముతునే ఉన్నారు.వికలాంగురాలైన మూడవ అక్క మంజుల మరణించింది.అతని అన్న రాజేష్ ఆటో డ్రైవర్, నాలుగేళ్ళ క్రితం మరణించాడు.
ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ రెండు వేల రూపాయలతో నాగరత్నమ్మ వంటరిగా జీవిస్తోంది. నాగరత్నమ్మ ప్రాణమంతా ఇప్పటికీ కొడుకు జనార్ధన్‌పైనే.పూలమ్మినా పూటగడవని బతుకు నాగరత్నమ్మది.
భర్త నాగులు పోతే ఇంత మంది పిల్లల్ని ఎలా సాకిసంతరించిందో! కొడుకు కనపడకుండా పోయినప్పుడు కనిపించిన మనిషినల్లా అడిగింది.దిక్కులన్నీ చూసింది.
ఊళ్ళకు ఊళ్ళే గాలించింది.కనిపించకపోయేసరికి దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది, ఏడ్చింది. ఏళ్ళు గడిచిపోతుంటే ఇక కనపడడనుకుంది.గుండె రాయి చేసుకొని,కొడుకు రూపాన్ని గెండెల్లో దాచుకుంది.
ఏడేళ్లు ఆమెకు ఒక యుగంలా గడిచిపోయింది.ఓ ట్టయ పాళయంలో ఆరోజు ఆమెకు జీవితంలోనే తొలి వసంతం.తప్పిపోయిన కొడుకు ఇన్నేళ్ళకు కనిపించాడు.’అమ్మా ..’ అంటూ ఎగిరి గంతేసి మెడను వాటేసుకున్నప్పుడు..చెక్కిలిపైనుంచి జాలువారుతున్న వెచ్చనికన్నీటితో ఆ ముఖాన్ని తడిపినప్పుడు.. ముద్దులతో ముంచెత్తిన ఆ మధుర క్షణాలు ఆ తల్లికి ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)