గుంటూరు నెంబర్ 1, చిత్తూరు నెంబర్ 2… ఆంధ్రలో నిశబ్దంగా పాకుతూన్న కోరోనా…

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పాజిటివ్ కేసులు నిశబ్దంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చిందని, ఇంకేమీ కాదని ప్రజలంతా తీసుకోవలసిన జాగ్రత్తతను గాలికి వదిలేయడంతో, దీమా గా తిరుగుతూ ఉండటంతో గత    3 నెలల నుంచి మెల్లిమెల్లిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇపుడు ఒకే రోజు నిన్న 380  కేసులు నమోదు అయ్యాయి. దాదాపు జీరోకు వచ్చిన కరోనా కేసులు ఇపుడు మూడు వందల స్థాయికి రావడం ఆందోళన కలిగించే విషయమే.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు  8,93,366కి చేరాయి. మరొక ఆందోళన కలిగించే విషయమేమిటంటే, మళ్లీ మరణాలు మొదలవుతున్నాయి. కొత్త కేసుల వల్ల నిన్న ఇద్దరు మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. చిత్రంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పాఠశాలలో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. పాఠశాలలో మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం దీనికి కారణమని కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.  గిడ్డయ్య చెప్పారు. కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు, మాల్స్, బార్లు& రెస్టరాంట్లు తదితర ప్రదేశాలలో జాగ్రత్తలు పాటించనందునే ఈ పరిస్థితి వస్తున్నదని  అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో గత రెండు రోజులో ఏకంగా 73 కేసులు కనిపించడం ప్రమాద సూచన అని డాక్టర్ గిడ్దయ్య అన్నారు.

జిల్లాల వారీగా కేసుల పెరుగుదల ఇలా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా  70 పాజిటివ్ కేసులు  గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. తర్వాతి స్థానం  60 కేసులతో చిత్తూరు జిల్లాది. కర్నూలు జిల్లా 51 కేసులతో మూడో స్థానంలో ఉంది. విశాఖపట్నం  జిల్లాలో 43 కేసులునమోదయ్యాయ. ఇక జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో 26 కేసులు, రికార్డయితే, అనంతపురం జిల్లాలో  22 కేసులు, కడప 8 కేసులు, కృష్ణా లో 44 కేసులు,
నెల్లూరు జిల్లాలో 21 కేసులు, ప్రకాశం జిల్లాలో 6 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులు, విజయనగరం జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కేసులు  నమోదు అయ్యాయి..

కోవిడ్ కారణంగా నిన్న కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,189కి చేరుకుంది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 204 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,84,094కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,083 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 30,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా… ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోవిడ్ నిర్థారణా పరీక్షల సంఖ్య 1,47,05,188కి చేరుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *