ప్రొఫెసర్ కోదండరామ్ ‌ను ఓడించి సాధించేందేముంటుంది?

హోరా హోరీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ,తీన్మార్ మల్లన్నల మధ్య పోటి….

 

ప్రొఫెసర్  కోదండరామ్ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ నియోజవకర్గం పోటీ నుంచి కౌంటింగ్ దశలో ఎలిమినేట్ అయ్యారు. అంటే ఆయనకు వచ్చినట్లో ఆయనకు ఉపయోగపడకుండా టాప్ లో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు పంచుతారు. ఇది వేరే విషయం అసలు విషయం. ప్రొఫెసర్ ఓడిపోవడం.

తెలంగాణ పట్టభద్రులు ప్రొఫెసర్ కోదండ్ రామ్ కు బుద్ధి చెప్పారనుకోవాలా?

తెలంగాణ బాగుపడాలా, తెలంగాణలో తెలంగాణ యువకులు ఉద్యోగాలతో సంతోషంగా ఉండాల, రైతు చల్లగా ఉండాల,  తెలంగాణ మరొకరికి వలసరాజ్యం కాకూడదని పోరాడి తప్పు చేశాడా? లేక ఆయన చేసిన పోరాటాన్ని అర్థం చేసుకునే స్థితిలో తెలంగాణ పట్టభద్రులు లేరా?

తెలంగాణ కోసం జెెఎసి రూపంలో,  తెలంగాణ తర్వాత టిజెఎస్ రూపంలో ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడిన యోధుడు.

2014లో తెలంగాణ వచ్చాక, ఇక్కడి నిరుద్యోగులకు రాని ఉద్యోగాలకోసం, పేదలకు అందని భూములకోసం, అవినీతి అంతమొందించడం కోసం, కుటుంబపాలన నుంచి తెలంగాణను కాపాడటం కోసం  తెలంగాణలో రైతుల బాగుకోసం, విద్యాసంస్థల బాగుకోసం పోరాడుతూ వస్తున్నాడు. తెలంగాణ వస్తే పనిపూర్తి కాదు, తెలంగాణ పునర్నిర్మాణం అని పార్టీ ప్రారంభించాడు. రాష్ట్రమంతా తిరిగాడు, రైతులను, చేనేత వృత్తి వారిని, నిరుద్యోగులను కలుసుకున్నారు. ప్రాజక్టుల బాధితులకు అండగా నిలిచాడు. ఇదంతా ఏమయింది? ప్రొఫెసర్ కోదండ్ రామ్ ని అంత తొందరగా తెలంగాణ చదువుకున్నోళ్లు ఎలా మర్చిపోయారు?

(కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లి పోతున్న ప్రొ.కోదండరామ్)

ఆయన నోరు మూయించేందుకు, అసలు ఇంటినుంచి బయటకు రాకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసులను పంపించింది. కేసులు పెట్టించింది. ఆ మాటకొస్తే ధర్నా చౌక్ ను రద్దు చేసింది కూడా  కోదండరామ్అంటే భయం తోనే .

ఇలాంటివేవీ లెక్కే చేయకుండా ఆయన పోరాడుతూ వచ్చారు.

ఎందుకు? తెలంగాణ పట్టభద్రులకు ఉద్యోగాలు రావాలని, వాళ్లకోసం ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను పూరించాలని,  వీటికోసం రోజూ అరచి అరచి  న్యూసెన్స్ క్రియోట్ చేస్తున్నారనేనా?

అయితే, ఆయన ఏ పట్టభద్రులకోసం పోరాడాడో వాళ్లంతా కలసి ఆయన అవమానపర్చి, ఓడించి ఇంటికి పంపిస్తున్నారు. తెలంగాణ మట్టిని, తెలంగాణ మనుషుల్ని, తెలంగాణ యువకులను నమ్ముకుని ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇది ఆయన తొలి ఎన్నిక.  అయినా సరే, ఆయనకు ఓటేయలేదు.

ఉద్యోగాలివ్వలేదని, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రతినిధికి ఓటేసి గెలిపించారు.

తెలంగాణలో ఏం జరుగుతున్నది?

ప్రొఫెసర్ కొదండ్ రామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, డాక్టర్ చిన్నారెడ్డి లాంటి వాళ్లంతా ఎలిమినేట్ కావడమేమిటి?

డాక్టర్ చిన్నారెడ్డి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాలసెగ్ మెంటు నుంచి ఎమ్మెల్సీగా పోటీచేశారు. వ్యవసాయ శాస్త్రాల్లో డాక్టొరేట్ ఉన్నవాడు. విలువల కోసం రాజకీయాల్లో నిలబడినవాడు. తెలంగాణ కోసం కెసిఆర్ తో సమానంగా గళం విప్పినవాడు. ఆయనెక్కడో నాలుగో స్థానంలో కూరుకుపోయారు.  ఆయన్నూ ఇంటికి పంపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పరిస్థితీ అంతే. ఆయనా ఎలిమినేట్ అయ్యారు.

ఈ ముగ్గురితో పాటు తెలంగాణ కోసం నిజాయితీగా తెలంగాణకోసం నిలబడిన చెరకు సుధాకర్ కూడా ఏలిమినేట్ అయ్యారు. వీళ్లందరిని తిరస్కరించి తెలంగాణ ఎంతో కోల్పోయింది.

ఇలాంటి వ్యక్తులు  సభల్లో అవసరం. వాళ్లు సమాజాన్ని మార్చేంతశక్తి వంతులు కాదు. నాయకులూ కాదు. అయితే, సభలో వాళ్లుంటే ఏలినవారికి అపుడపుడు మర్చిపోయిన విషయాలను గుర్తుచేస్తుంటారు. సభ హుందాగా నడిచేందుకు సాయపడుతుంటారు. రాజకీయాల మీద ఇంకా ఆశలు కొనసాగేలాచేస్తుంటారు.  లేకపోతే, భజన,చపట్లు తప్ప చట్ట సభల్లో ఏముంటాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *