వైసిపి విజయం వెనక జగన్ కృషి, సంక్షేమ పథకాలు ఉన్నాయి: సజ్జల

( సజ్జల రామకృష్ణారెడ్డి )

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వైయస్సార్సీపికి అనుకూలంగా వచ్చాయి. గత ఏడాది మొదలై కోవిడ్‌ కారణంగా అర్ధాంతరంగా ఎన్నికలు నిలిచిపోయాయి. వాయిదా వేసిన ఎన్నికలు ఇప్పుడు ఏడాది తరువాత జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏడాది కిందటకు, నేటికీ ప్రభుత్వం పట్ల ప్రజలకు మరింత సానుకూలత పెరిగిందని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఇటువంటి మంచి ఫలితాలు వస్తాయని ముందు నుంచే మేం చెబుతున్నాం. తొలిసారిగా చాలా అరుదుగా.. ఒక స్పష్టమైన ఎజెండాతో వున్న పార్టీ నడిపే ప్రభుత్వానికి ఏకపక్షంగా.. ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు.

ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఫలితాలను స్వీప్‌ చేస్తూ వైయస్‌ఆర్‌సిపి ముందుకు దూసుకు పోతున్నది. ఇంతటి భారీ విజయం అదృష్టవశాత్తు వచ్చింది కాదు. గత ఇరవై నెలలుగా వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అవిరళకృషితో.. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్లో కనిపించిన మెరుగుదల కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. ఓటర్లు ఒక కృతనిశ్చయంతో శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించాలి. ఇది ప్రజల విజయం.

ప్రజలు, వారి సమస్యలే ఎజెండాగా.. ప్రజలే ప్రస్థానంగా.. ప్రజల నుంచి వచ్చిన ఒక జన నేత, ఒక ప్రజానేతకు దక్కిన విజయం ఇది. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. అందుకే ముందుగా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు, రాష్ట్ర ప్రజలకు వైయస్‌ఆర్‌సిపి వినమ్రంగా నమస్కరిస్తోంది. కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలే ప్రాణంగా.. ప్రజలే ఎజెండాగా, వారి సమస్యల పరిష్కారం తప్ప వేరేది లేకుండా పని చేస్తే.. వారు ఎలా ఆదరిస్తారో అందరూ గమనించాలి.

ఇవి 2019 సాధారణ ఎన్నికల తరువాత వచ్చిన తొలి ఎన్నికలు. ఆనాడు ఎన్నికల ద్వారా అప్పటికే అయిదేళ్ళపాటు పాలించిన టిడిపి, అప్పటి సీఎం చంద్రబాబు పైన ఇక మాకు ఎలాంటి నమ్మకం లేదని ప్రజలు తీర్పు చెప్పారు. అప్పటికే సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమై, వారి సమస్యలు పరిష్కరించే విధంగా మేనిఫేస్టో తయారు చేసుకుని స్పష్టంగా ముందుకు వచ్చిన జగన్‌ గారిపై తమకు నమ్మకం వుందని, అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో ప్రజలు వైయస్‌ఆర్‌సిపికి అధికారం కట్టబెట్టారు. ఈ యువనాయకుడిపై ప్రజలు తమకు నమ్మకం వుంది, ఆశలు వున్నాయి, ఈయన నెరవేరుస్తాడనే ఆనాడు ఓటు వేశారు. చంద్రబాబుపై నమ్మకం కోల్పోయాం, మిమ్మల్ని మేం రిజెక్ట్‌ చేస్తున్నామని 23 సీట్లతో సరిపెట్టారు. ప్రజాస్వామ్యంలో యాబై శాతం ఓటింగ్‌ దాటింది అంటే సానుకూల ఓటు. అది అరుదుగా జరుగుతుంది. ఆనాడు అలాంటి తీర్పు ఇచ్చారు. అధికారంలో వుండి జగన్‌ గారిపై ఆశలు, ప్రతిపక్షంగా వుంటూ టిడిపి ఎలా చేస్తుందో చూస్తామని తీర్పు ఇచ్చారు.

ఇరవై నెలలు గడిచాయి. ఈ సమయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తాను చెప్పినవన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో వందకు వందశాతం పూర్తి చేశారు. కొన్ని హామీలు ప్రాసెస్‌ వల్ల జాప్యం జరిగి వుండవచ్చు. హామీ ఇవ్వనివి కూడా చాలా చేశారు. ఇదంతా ప్రజలకు తెలుసు. అర్హతలే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో ప్రారంభమైన సంక్షేమ పాలనను పూర్తి స్థాయిలో శ్రీ వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఆ యజ్ఞంను కొనసాగిస్తున్నారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని, పేదల జీవితాల్లో వెలుగు, వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు.

అధికార వికేంద్రీకరణ చేస్తామంటే.. అమరావతిని రాష్ట్ర ప్రజలు అందరూ కోరుతున్నారనే భ్రమను చంద్రబాబు సృష్టించారు. అమరావతిపై జగన్‌ గారు ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. అమరావతి పేరుతో ఈ ప్రాంత ప్రజలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చంద్రబాబు చేసింది మోసం కాదా? పచ్చని పంటలు పండే పొలాలను లాక్కున్నారు. వేల కోట్ల భూములను బినామీల పేరుతో కాజేసే ప్రయత్నం చేశారు. సీఎం జగన్‌ గారి నిర్ణయం వల్ల తాను, తన బినామీలు నష్టపోతున్నారనే చంద్రబాబు కడుపుమంట. అందుకే ఉద్యమం అని చెప్పుకుంటూ, దానికి బాకా ఊదే రెండు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. అయినా కూడా దానిని ప్రజలు పట్టించుకోలేదు.…

( ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పాయింట్స్ ఇవి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *