భారత ఉపఖండపు హీరో భగతసింగ్ 90వ వర్ధంతి! ప్రత్యేకత ఏంటో తెలుసా?

గత 89 వర్ధంతుల కంటే గొప్ప చారిత్రక, రాజకీయ ప్రాసంగీకత గలది రేపటి 90వ వర్దంతి!

రైతాంగ ప్రతిఘటనోద్యమ స్ఫూర్తితో లాహోర్ విప్లవ యోధుల్ని స్మరించుకుందాం.

 

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఆ విప్లవ వీర యోధుడి ఉరి (మార్చి 23, 1931) కి మరో పది రోజుల్లో  90 ఏళ్ళు. మరో పదేళ్లలో నూరేళ్లు! ఐనా అది నిత్యం చెదరని రూపం, సదా చెరగని ముద్ర. ఓ మరపురాని సజీవ అనుభూతి. మరిచిపోలేని ఓ నిరంతర జ్ఞాపకం. ఆయన స్మృతే ఒక విప్లవ సందేశం. ఆయన నామ స్మరణే భావ విద్యుత్ ప్రసరణ! తన అమరత్వపు స్మరణే మన గుండెల్ని కవోష్ణ రక్తంతో మండిస్తాయి. భూమండలం పై దనికస్వామ్య వ్యవస్థ ఉన్నంత కాలం అతడు దాని దగ్ధ ప్రతీక గా వర్ధిల్లుతూనే ఉంటాడు. అతడే భగత్ సింగ్!

భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురూ ముగ్గురే. విప్లవ యోధాగ్రేసరులే! విప్లవ కదన రంగం నుండి మడమ తిప్పని మహాయోధులే! ఉరి కంబాన్ని ఓ క్రీడాస్థలిగా ఎంచి, విప్లవ ఒయ్యారపు సోయగపు కసరత్తులను ప్రదర్శించిన సాటి లేని మేటి క్రీడాకారులే! లాహోర్ కేంద్ర కారాగారంలో విప్లవ పులకాంకితులై సయ్యటాలు ఆడినవాళ్లే! ఉరి కంభం నుండి వేలాడుతోన్న ఉరిత్రాడును తమ చేతితో మెడచుట్టూ బిగించుకుంటూ “ఇంక్విలాబ్ జిందాబాద్” అని గొంతెత్తి ప్రతిధ్వనిoచిన వాళ్లే. గొంతులో ఆఖరి శ్వాస విడిచేంత వరకూ “సామ్రాజ్యవాదం నశించాలి” అని కసికొద్దీ నినదించిన వాళ్లే! ప్రపంచ పెట్టుబడిదారీ దుష్ట వ్యవస్థ పై ఎగరేసిన సిద్ధాంత, రాజకీయ బావుటాకు ప్రతీకగా “ప్రపంచ శ్రామికులారా ఏకం కండు” అని గొంతెత్తి గర్జిస్తూ భౌతికంగా ఆఖరి శ్వాస విడిచే వరకూ నినదించిన మహోన్నత త్యాగ ధనులు ఆ వీర, ధీర, విప్లవ యోధులు!

వాళ్ళు చావుకు వెరవలేదు. మృత్యువును ముద్దాడారు. మరణాన్ని జయించారు. ఈ భూమి మీద ధనిక స్వామ్య వ్యవస్థ జీవించినంత కాలం వాళ్ళు దానిపై యుద్ధదగ్ధ ప్రతీకలై వర్ధిల్లుతారు. అది దగ్ధమయ్యాక, వాళ్ళు అమర ప్రతీకలై విరాజిల్లుతారు. శ్రమ దోపిడీ వ్యవస్థ మనుగడలో ఉన్నంత కాలం వాళ్ళు అమర సందేశాలై వర్ధిల్లుతారు. దోపిడీ, పీడన, అణచివేత, కష్టాలు, కన్నీళ్లు లేని సమసమాజం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు అమర సంకేతాలై వెలుగొందుతారు.

భగత్ సింగ్ ను ఉరి తీసినట్లు రిపోర్టు

చరిత్ర గమనంలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ క్రమంలో ఒకానొక రోజు ‘కాలం’ కడుపైనది. అది ధరించిన గర్భం ఒకానొకరోజు పురిటికి అసన్నమై నొప్పులకు గురైనది. అదో సుముహూర్తాన పురుడు పోసుకుంది. ఆరోజు పుట్టిన చారిత్రిక విప్లవ పసికందే భగతసింగ్!

ఉయ్యాలలోనే మాతృమూర్తి విద్యావతి పెట్టిన విప్లవ గోరు ముద్దలు తిని.. ఏడాది నిండక ముందే బుడిబుడి అడుగుల సవ్వళ్లు చేసి.. మూడేళ్లకే కిషన్ సింగ్ స్ఫూర్తి, అజిత్ సింగ్ ప్రేరణ.. ఏడేళ్లకే గోధుమ పంట పొలంలో తుపాకుల సాగు మాట మాట్లాడి… 12వ ఏట జలియన్ వాలా బాగ్ గ్రౌండ్ లో నెత్తుటితో తడిసిన మట్టి ముద్ద ని విత్తనంగా మార్చి… విప్లవ అమర మూర్తి కర్తర్ సింగ్ శరభ అమర స్మృతిలో విప్లవ దీక్షా కంకణ బద్ధుడై… నవ జవాన్ నేతగా మారి… ఆజాద్ సేనాని నేతృత్వంలో సాయుధ సమర సేనకు రాజకీయ అధినేతగా మారి… శ్రామికవర్గ విప్లవానికి సరైన సైద్ధాంతిక నిర్వచనం ఇచ్చి, లెనిన్ నుండి రాజకీయ, సిద్ధాంత ఉద్దీపన పొంది, ఉరి కంభం పై అమరత్వం పొంది, భారత ఉపఖండపు విప్లవ హీరోగా జగతివిఖ్యాత ఘన చరిత్ర కెక్కిన భగతసింగ్ నేడు రాజకీయ పునర్జన్మ పొందే చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది.

గత చరిత్ర మట్టిపొరల క్రింద వర్తమాన చరిత్రకి ఊపిర్లు పొసే అధ్యాయాలు దాగి ఉన్నాయి. రేపటి భావి చరిత్ర నిర్మాణానికి ఉపకరించే గొప్ప సముజ్వల, సమున్నత చారిత్రిక ఘట్టాలను వర్తమాన చరిత్ర గర్భం నుండి నేడు ఆయాచితంగా పెల్లుబికి వెలికి వస్తోన్నాయి. అందులో భగతసింగ్, రాజగురు, సుఖ దేవ్ వంటి అమర వీరుల చరిత్రలు కూడా దాగి ఉన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నేతలు భగతసింగ్ బాబాయ్ సర్దార్ అజిత్ సింగ్ నాడు బ్రిటీష్ వలస పాలనలో రైతాంగ వ్యతిరేక చట్టాలపై నిర్మించిన రైతాంగ ప్రతిఘటన ను ఈమధ్యే స్మరించింది. నేటి రైతాంగ పోరుకు అది విప్లవ స్ఫూర్తి ఇస్తోంది. ఔను, గత చరిత్ర వర్తమాన చరిత్రకు ఉద్యమ ఉద్దీపన కలిగిస్తే, భవిష్యత్తు చరిత్ర నిర్మాణానికి వర్తమాన చరిత్ర వెలుగులు వెదజల్లే దారిదీపాల్ని అందిస్తుంది. అట్టి దారి దీపాల్ని గత చరిత్ర మట్టి పోరాల్ని త్రవ్వి వెలికితీసి, వెలుగులోకి తెచ్చి రాజకీయ పదును పెట్టుకుందాం.

ఇప్పుడు భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ లకు మనం రాజకీయ పునర్జన్మ (political reborn) కలిగిద్దాం. అట్టి సమయం సమీపించింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు. నేడు మరో ఎత్తు! నాటి పంజాబ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన నిలిచింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో పంజాబ్ యువత ఉరికంబాలపై ఉయ్యాలలు ఊగింది. చెరసాలలలో సయ్యటాలు ఆడింది. వళ్ళు జలదరించే గద్దర్ వీరుల దుస్సాహసిక త్యాగాలు వెలకట్టలేనివి. కామగటామార్ నగర్ నౌకా విప్లవ యానం గుండెల్ని పిండి చేస్తాయి. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) చేపట్టిన అసమాన అకుంఠిత, దుర్బేధ్య, దుర్లభ, సాహసోపేత విప్లవ కృత్యాల్లో సింహభాగం పంజాబ్ యూత్ పోషించింది. తుదకు ఆంధ్రతో సహా దక్షిణాది జైళ్లని రాజకీయ పాఠశాలగా మార్చి, ఎందరినో కమ్యూనిస్టు విప్లవ కారులు గా మార్చిన, మలిచిన ఘన చరిత్ర కూడా లాహోర్ విప్లవకారులకు దక్కింది. ఓ భగత్ సింగ్, ఓ రాజగురు, ఓ సుఖ్ దేవ్, ఓ కర్తార్ సింగ్ శరభ, ఓ ఉద్దాం సింగ్, ఎందరో ఎందరెందరో..

నాడు ఓడయ్యర్, డయ్యర్ వంటి కర్కోటక నియంతల్ని ధిక్కార చైతన్యంతో ఎదిరించి జబ్బచరిచి నిలబడ్డ ధీశాలి ఘన చరిత్ర పంజాబ్ యువతకి దక్కింది. ఇప్పుడు ఢిల్లీ ప్రభువులు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తొలి తిరుగుబాటు బావుటా ఎగర వేసిన ఘనత కూడా నేడు పంజాబీ రైతాంగానికి దక్కింది. ముఖ్యంగా అందులో యువత నేడు కదం తొక్కుతోంది. అట్టి యువతకు పిడికిలెత్తి విప్లవ ఘన స్వాగతం పలుకుదాం.

భగతసింగ్ ఓ వ్యక్తి కాదు. ఓ విప్లవ శక్తి. ఓ ఉద్యమ స్రవంతికి ప్రతీక! ఓ విప్లవ ప్రవాహానికి సంకేతం. ఇప్పటికి చరిత్రలో మొత్తం 89 సార్లు భగతసింగ్ వర్ధంతుల జరిగాయి. ప్రగతిశీల విద్యార్థి, యువజన సంఘాలు (PDSU & PYL) ఉమ్మడి AP రాష్ట్ర కమిటీలు 15 ఏళ్ల క్రితం ఒక వినూత్న స్మారక ప్రోగ్రాం చేపట్టాయి. భగతసింగ్ నూరేళ్ళ జయంతి 2007 లో తటష్టించింది. అదే సమయం లో 75వ వర్ధంతి కూడా తటష్టించింది. ఆ సందర్భంగా పై రెండు సంస్థలు భగతసింగ్ స్మృతిపథంలో “బారసాలకు నూరేళ్లు- ఉరికొయ్యకు 75 ఏళ్లు” శీర్షికతో పుస్తకాన్ని కూడా ప్రచురించాయి. నాడు విస్తృత ప్రచారాన్ని చేపట్టాయి. అట్టి కొన్ని సన్నివేశాలని చరిత్ర సృష్టించి కొత్త అవకాశాల్ని కల్పిస్తుంది. నేడు 90వ వర్దంతి సందర్భం కూడా అలాంటి ఓ అపూర్వమైనదే. వర్తమాన భారతదేశ రైతాంగ ప్రతిఘటన ఓ గొప్ప చరిత్ర. అట్టి చరిత్ర సంస్మరణ పధంలో గత 89 వర్ధంతుల కంటే సాపేక్షికంగా ఎంతో ఎక్కువ రాజకీయ, చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాసంగీకతలు గల ఈ 90వ వర్ధంతికి ఉన్నాయి. అందుకే ఈసారి ఘనంగా నిర్వహించుకునే ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. అందుకు సిద్ధమవుదాం.

ఫాసిజం బుసలు కొడుతోన్న వేళ.. అణిచివేత వ్యవస్తీకృత రూపం దరిస్తున్న వేళ.. రాజ్యం ప్రజలపై విరుచుకుపడుతోన్న వేళ.. రైతాంగ ప్రతిఘటన ఓ దారిదీపంగా మారింది. ఈ దృష్టి కోణంతో భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ల 90 వ వర్ధంతిని భారీ ఎత్తున నిర్వహిద్దాం.

ముఖ్యంగా విద్యార్థి, యువజన సంస్థలకు ఇదో రాజకీయ సువర్ణావకాశం. ఈసారి మార్చి 17 నుండి 23 వరకు గానీ, లేదంటే మార్చి 23 నుండి మార్చి 29 వరకు గానీ స్మారక వారంగా జరిపే రాజకీయ సందర్భమిది. ఇటీవల కాలంలో దేశంలోని 20కి పైగా విశ్వవిద్యాలయాల లో విద్యార్థిసంఘ ఎన్నికలలో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ప్యానెళ్ళు గెలవడం జరిగింది. ఈ వెలుగులో భగతసింగ్ స్మారక స్మృతి పధంలో విప్లవ దీక్షా కంకనబద్ధులమై విద్యార్థి, యువజన వర్గాలు ప్రత్యేక దీక్షతో నిర్వహించి ముందుకు సాగుతాయని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *