తిరుమల యాత్ర హడావిడిలో అంతా విస్మరించే వింత ఇదే (తిరుమ‌ల జ్ఞాప‌కాలు-27)

(రాఘ‌శ శ‌ర్మ‌)

తిరుమ‌ల ఘాట్ రోడ్డు ప్ర‌యాణం చాలా ఆహ్లాదక‌రం. చుట్టూ ప‌చ్చ‌ని చెట్లు, అక్క‌డ‌క్క‌డా లోతైన లోయ‌లు, ఎదురుగా ఎత్తైన కొండ‌. ఆ కొండ అంచుల‌ను చెక్కుకుంటూ నిర్మించిన‌ ఘాట్ రోడ్లో వెళ్ళ‌డం గొప్ప అనుభూతిని, ఆనందాన్ని క‌లిగిస్తుంది.

తెల‌తెల‌వారు తుండ‌గా చెట్ల‌పైనుంచి రెక్క‌ల‌ల్లారుస్తూ ఎగిరే ప‌క్షులు, వాటి కిచ‌కిచలు, కిల‌కిల రావాలు. స్కూట‌ర్లోనో, మోటారు సైకిల్ లోనో వెళుతుంటే, ప‌క్షిలాగా రెక్క‌లు చాచిన‌ట్టు మ‌నం కూడా ముందుకు సాగిపోతాం. ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తాం.

ఒక్కో కాలంలో ఈ కొండ ఒక్కో అందాన్ని సంత‌రించుకుంటుంది.మండు వేస‌విలో మోడువారిన చెట్ల‌తో , ఎండిపోయిన ఆకుల‌తో గ‌ల‌గ‌లా మంటుంది.నాలుగు చినుకులు ప‌డితే చాలు, మ‌ళ్ళీ ప‌చ్చ‌గా చివురిస్తుంది. శ‌ర‌త్కాలంలో వెళుతుంటే ఆ అనుభూతేవేరు. మ‌న‌కు అంద‌నంత ఎత్తున ఆకాశంలో మేఘాలు క‌దిలిపోతుంటాయి. కానీ, ఇక్క‌డ మేఘాలు మ‌న క‌ళ్ళ‌ముందే, మ‌న మ‌ధ్య నుంచే సాగిపోతుంటాయి.ఆ వెండి మ‌బ్బుల్లోంచి మ‌నం దూసుకుపోతున్న‌ట్టే ఉంటుంది.

Moksha Gundam/MVIRDC

కొండ పైనుంచి లోయ‌లోకి చూస్తుంటే మేఘాలు ఎంత కింద‌గా క‌దిలిపోతుంటాయో! తిరుమ‌ల ఘాట్ రోడ్లో అందాల‌ను న‌ల‌భై ఎనిమిదేళ్ళుగా చూస్తూనే ఉన్నాను. ఎన‌భై ఆరేళ్ళ క్రితం వ‌ర‌కు తిరుమ‌ల‌కు న‌డ‌క‌దారే దిక్కు.

ఆ రోజుల్లో న‌డ‌వ‌లేని వృద్ధులను, డ‌బ్బున్న మ‌హ‌రాజులను డోలీల్లో మోసుకు వెళ్లేవారు. తిరుమ‌ల‌కు ఘాట్‌రోడ్డు నిర్మించాల‌ని 1940లో నిర్ణ‌యించారు. ఆ సర్వే బాధ్య‌త‌ను ప్ర‌ముఖ ఇంజీనీరు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌కు అప్ప‌గించారు. తిరుమ‌ల కొండంతా స‌ర్వే చేసి మూడు ఘాట్ రోడ్ల నిర్మాణానికి ఆయన ప‌థ‌క ర‌చ‌న చేశారు.

ఆ ప‌థ‌కం ప్ర‌కారమే ఇప్పుడుండే మొద‌టి ఘాట్ రోడ్డును నిర్మించి, 1944లో ప్రారంభించారు. ఆ రోజుల్లో ఈ రోడ్డు ఇంత సౌక‌ర్య‌వంతంగా లేదు. ఎద్దుల బండ్లు వెళ్ళ‌డానికి , సామాగ్రిని స‌ర‌ఫ‌రా చేయ‌డానికి మాత్రమే ప‌నికొచ్చేది.క్ర‌మంగా బ‌స్సుల రాక‌పోక‌లు మొద‌ల‌య్యాయి.

ద‌శాబ్దాల త‌రువాత అనేక స‌దుపాయాల‌తో ఈ ఘాట్ రోడ్డు ఇప్ప‌టి ఆకారాన్ని సంత‌రించుకుంది.

తిరుమల కొండ సుందర దృశ్యం

మొద‌టి ఘాట్ రోడ్లో రాక‌పోక‌లు సాగే రోజుల్లో కూడా బ‌స్సులో తిరుమ‌ల‌కు వెళ్ళి వ‌చ్చాను. ఇర‌వై నాలుగేళ్ళుగా అప్పుడప్పుడూ స్కూట‌ర్‌లోనే తిరుమ‌ల‌కు వెళ్ళి వ‌స్తున్నాను.

తిరుమ‌ల కొండ‌ను మ‌నం స‌మీపిస్తున్న కొద్దీ, అది వెన‌క్కి వెన‌క్కి జ‌రుగుతున్నట్టుంటుంది. అలిపిరి టోల్గేట్ దాట‌గానే, ఎదురుగా ఒక గొప్ప ప్ర‌కృతి దృశ్యం మన కళ్లముందు ఆవిష్కృత‌మ‌వుతుంది.త‌లెత్తి చూస్తే, ఎదురుగా ఎత్తైన తిరుమ‌ల కొండ .

ఆ కొండ అంచుల (పేటు)ను చూస్తుంటే ఎప్పుడో చూసిన మెక్నాస్ గోల్డ్ గుర్తుకొస్తుంది. ఆ వెంట‌నే అక్క‌డ జ‌రిగిన మ‌రొక చారిత్ర‌క సంఘటన మెదులుతుంది. ప‌జ్జెనిమిదేళ్ళ‌నాడు, 2003 అక్టోబ‌ర్ 1వ తేదీన‌ పీపుల్స్‌వార్ తొమ్మిది (క్లెమోర్ మైన్స్‌) మందు పాత‌ర‌లను పేల్చింది ఇక్క‌డే. చంద్ర‌బాబు ధ్యేయంగా ఆ విఫ‌ల య‌త్నం చేసింది ఇదిగో ఈ ప్రాంతంలోనే. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన తొలిరోజుల్లో చాలామందికి అదొక సంద‌ర్శ‌నా స్థ‌లంగా త‌యారైంది.

తిరుమ‌ల‌కు వెళ్ళే యాత్రికులు కూడా ఈ ప్రాంతాన్ని చూసి ఆ విష‌యాల‌ను ముచ్చ‌టించుకునే వారు. ద్విచ‌క్ర‌వాహ‌నాల‌లో వెళ్ళే వాళ్ళ‌యితే ఇక్క‌డ ఆగిమ‌రీ ప‌రిశీలించేవారు. రెండ‌వ ఘాట్ రోడ్డులో తిరుమ‌ల కొండెక్క‌డం చాలా తేలిక‌.మామూలుగా హైవేలో వెళ్ళిన‌ట్టే ఉంటుంది. వేగంగా వెళ్ళ‌వ‌చ్చు. చుట్టూ ద‌ట్టంగా పెరిగిన అడ‌వి. అడ‌వి మ‌ధ్య‌లోంచి న‌ల్ల‌ని తాచులా మెలికలు మెలిక‌లుగా తిరుగుతున్న‌ట్టు ప‌రుచుకున్న తారు రోడ్డు.పైకి ఎక్కుతున్న కొద్దీ కొండ‌కు ఎడ‌మ వైపున తిరుప‌తి న‌గ‌రం క‌నిపిస్తుంది.దూరంగా ఎస్వీయూనివ‌ర్సిటీ భ‌వ‌నాలు, జూపార్క్ షెడ్లు అగుపిస్తుంటాయి. అంతా ప‌చ్చ‌ద‌నం. మ‌ధ్య‌లో చిన్న చిన్న గుట్ట‌లు.

ఈ అందాల‌ను వీక్షించ‌డానికి అక్క‌డ‌క్క‌డా వ్యూ పాయింట్లు.ఎడ‌మ‌వైపు ప‌చ్చ‌ని అడ‌వి, దూరంగా ఇళ్ళు. కుడివైపున‌ ఎత్తైన కొండ అంచులు. పైకి ఎక్కుతున్న కొద్దీ చ‌ల్ల‌ని గాలి శ‌రీరాన్ని స్పృశిస్తుంది.

రెండు కొండల నడుమ చలి చంపే ప్రాంతం

ప‌జ్జెనిమిది కిలోమీట‌ర్లున్న ఈ ఘాట్ రోడ్డులో స‌గం దూరం వెళ్ళే స‌రికి కొండ అంచు లోప‌లికి చొచ్చుకునిపోయిన‌ట్టు ఉంటుంది.

కుడివైపున లోతైన లోయ‌. ఎడ‌మ వైపున ఎత్తైన కొండ‌. ఇది రెండు కొండ‌లు క‌లిసిన‌ ప్రాంతం. రెండు కొండలు మ‌న‌ల్నిక‌మ్మేసిన ప్రాంతం. ఎక్క‌డాలేని విధంగా విప‌రీత‌మైన చ‌లి. వేస‌విలో కూడా ఇక్క‌డ చ‌లిగానే ఉంటుంది. చ‌లికాలంలో అయితే ఇక్క‌డికొచ్చేస‌రికి ఒణికిపోతాం. ఇక్క‌డినుంచి పైకి ఎక్కుతున్న కొద్దీ నిలువు పెరుగుతుంది.

విప‌రీత‌మైన మ‌లుపులూ పెరుగుతాయి.అక్క‌డ‌క్క‌డా వ్యువ్‌ పాయింట్లు. అదిగో అడ‌వి త‌ల్లి నెత్తిన స‌న్న‌ని పాపిటిలాగా శ్రీ‌నివాస‌మంగాపురం నుంచి శ్రీ‌వారి మెట్టుకు వెళ్ళే దారి.

శ్రీ‌వారి మెట్టునుంచి తిరుమ‌ల‌కు న‌డ‌క‌దారి. ఇక మ‌లుపులే మ‌లుపులు!

ముందుకు వెళితే కుడివైపున న‌డ‌క‌దారిలో క‌నిపించే మోకాలిమిట్ట‌, మొద‌టి ఘాట్ రోడ్డుతో నిర్మించిన లింకు రోడ్డు, దూరంగా అవ్వాచారి కోన‌, కొండ‌లు, లోయ‌లు, ప్ర‌కృతి సోయ‌గాలు.

మ‌రికొన్ని మ‌లుపులు తిరిగితే మైకులో వేద‌మంత్రాలు, అన్న‌మ‌య్య కీర్త‌న‌లు. కుడివైపున దివ్యారామం.మొద‌లైన ప‌చ్చ‌ని ఉద్యాన వ‌నాలు.

ఈ రెండ‌వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్ర‌ముఖ ఇంజ‌నీరు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్యే ప‌థ‌క ర‌చ‌న చేశారు. ముప్ఫై నాలుగేళ్ళ‌కు కానీ ఈ ఘాట్ రోడ్డుకు మోక్షం క‌ల‌గ‌లేదు.ఇది 1974లో పూర్త‌య్యింది.ఇక్క‌డ నుంచి తిరుమ‌ల‌కు వాహ‌నాలు వెళ్ళ‌డం మొద‌ల‌య్యాయి.

మొదటి ఘాట్ రోడ్లో నుంచి కనిపించే తిరుపతి నగరం

తిరుమ‌ల నుంచి తిరుపతికి వ‌చ్చే మొద‌టి ఘాట్ రోడ్డును కొండ‌కు తూర్పు వైపు నుంచి నిర్మించారు.రెండ‌వ ఘాట్ రోడ్డు లాగానే ఈ మొద‌టి ఘాట్ రోడ్డు కూడా 18 కిలోమీట‌ర్లు.

కొండ దిగే మొద‌టి ఘాట్ రోడ్డులో అడుగ‌డుగునా మెలిక‌లే. ఈ రెండు ఘాట్ రోడ్లు దేని రూపం దానిది. దేని అందం దానిది.ఒక దానితో ఒక‌టి పోటీ ప‌డుతున్న‌ట్టే ఉంటాయి. కొండ దిగేట‌ప్పుడు నిదానంగా, జాగ్ర‌త్త‌గా దిగాలి.

ఎప్ప‌డూ బ్రేకులు సిద్ధంగా ఉండాలి; ముఖ్యంగా మ‌లుపుల ద‌గ్గ‌ర‌. దిగుతున్న‌ప్పుడు రోడ్డుకు ఇరువైపులా మ‌ళ్ళీ అదే ప‌చ్చ‌ద‌నం.

కాస్త దూరం వెళ్ళ‌గానే జింక‌ల‌పార్కు. కొన్ని మ‌లుపుల త‌ర్వాత మొద‌టి కొండ దిగ‌గానే మోకాళ్ళ మిట్ట మెట్లు మొద‌ల‌వుతాయి.రెండు ఘాట్ రోడ్ల‌ను క‌లిపే లింకు రోడ్డు ఇక్క‌డే క‌లుస్తుంది.

అవ్వాచారి కోన‌ ప్రారంభంలో రెండు కొండ‌ల‌ను క‌లుపుతూ లోయ‌ను పూడ్చేసి నిర్మించిన రోడ్డు. ఈ రోడ్డు దాట‌గానే ఘాట్ రోడ్డు వేయ‌క‌ముందు కుడివైపున ఒక‌ నాటి కాలిన‌డ‌క మార్గం. ఆ న‌డ‌క మార్గాన్ని పున‌రుద్ధ‌రించి, అన్న‌మ‌య్య మార్గం అని నామ‌క‌ర‌ణం చేసినా, ఎవ‌రూ ఆ దారిలో వెళ్ళ‌డం లేదు. బ‌స్సులు వెళ్ళే ఈ రోడ్డులోంచే మెట్ల మార్గం వైపు యాత్రికులు న‌డుచుకుంటూ వెళుతున్నారు.

ఎడ‌మ వైపున అవ్వాచారి కోన ; ఒక పెద్ద లోతైన లోయ‌. అక్క‌డే అక్క‌గార్ల గుడి. కుడివైపున ఎత్తైన కొండ‌. వేస‌విలో త‌ప్ప ఎప్పుడూ ఆ ఎత్తైన కొండ నుంచి జ‌ల‌ధార జాలువారుతూనే ఉంటుంది.

ఆ లోయంతా పెద్ద పెద్ద వృక్షాలు. లోయ ప‌క్క నుంచి కాస్త ముందుకు వెళితే న‌డ‌క దారి క‌నిపిస్తుంది.

కాస్త ముందుకెళ్ళి ఆర్చి నుంచి వెన‌క్కి చూశామా, మ‌నం వ‌చ్చిన మెలిక‌లు తిరిగిన ఘాట్ రోడ్డు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టే ఉంటుంది. మ‌ధ్య‌లో ఆంజ‌నేయ విగ్ర‌హం ఉన్న కూడ‌లి. దాని ముందు మ‌ళ్ళీ జింక‌ల పార్కు.

ఇక్క‌డి వ‌ర‌కు వాతావ‌ర‌ణం కాస్త‌ చ‌ల్ల‌గానే ఉంటుంది. అలా ముందుకు సాగితే, స‌గం దూరం వ‌చ్చాక‌, తొమ్మిద‌వ కిలోమీట‌రు ద‌గ్గ‌ర కుడివైపున దూరంగా గాలిగోపురం క‌నిపిస్తుంది.తిరుప‌తిలో క‌నిపించే గాలిగోపురం ఇదే.

అక్క‌డి నుంచి కాస్త న‌డిస్తే గాలిగోపురానికి చేరుకోవ‌చ్చు. అలిపిరి మెట్ల మార్గంలో న‌డ‌వ‌లేని వారు, ఇలా గాలిగోపురం చేర‌వ‌చ్చు.

మొదటి ఘాట్ రోడ్లో నుంచి కనిపించే తిరుపతి నగరం
ఇక్క‌డ నుంచి కొండ ఏట‌వాలుగా ఉంటుంది. వాహ‌నం తేలిగ్గా పోతోంది క‌దా అని చాలా మంది ఇంజ‌ను ఆపేసి వెళ‌తారు. అలా వెళ్ళ‌డం ప్ర‌మాద‌కరం. ఇంజ‌ను కూడా దెబ్బ‌తింటుంది. ఇంజెను ఆపేసి వేగంగా వెళ్ళ‌డంతో బ్రేకులు ప‌డ‌క‌పోవ‌చ్చు.

ప‌ద‌మూడు కిలోమీట‌ర్లు వ‌చ్చాక చ‌ల్ల‌ద‌నం త‌గ్గి, తిరుప‌తి సెగ త‌గులుతుంది.ఇదిగో ఇక్క‌డి నుంచే తిరుప‌తి న‌గ‌రం క‌నిపించ‌డం మొద‌ల‌వుతుంది. తూర్పు నుంచి ప‌శ్చిమం దాకా క‌నుచూపు మేర వ‌ర‌కు తిరుప‌తి న‌గ‌రం ఎలా విస్త‌రించిందో !ఘాట్ రోడ్డు మెలిక‌లు కూడా ఇక్క‌డే ఎక్కువ‌. దిగుతుంటే బండి కూడా దొర్లుకుంటూ వెళ్ళిపోతోందా అనిపిస్తుంది.

క‌పిల తీర్థం నుంచి న‌గ‌రంలోకి వెళ్ళే రోడ్డు.బ‌స్టాండుకు వెళ్లే బైపాస్ రోడ్డు కూడా క‌నిపిస్తోంది.

 

మొదటి ఘాట్ రోడ్డులో గరుత్మంతుడి ఆకారాన్ని పోలి ఉన్న కొండ అంచులు

కొండ‌పైనుంచి జాలువారి, క‌పిల తీర్థంలో ప‌డే జలపాతం దాట‌టానికి క‌ట్టిన వంతెన‌ ఇది. ఆ అందాల‌ను, ఈ వంతెన ప్రాంతాన్ని వ‌ర్షాకాలం చూడాల్సిందే. కొండ పైనుంచి ప‌డే అనేక స‌న్న‌ని జ‌ల‌పాతాలూ క‌నిపిస్తుంటాయి. అలిపిరి స‌మీపిస్తున్న కొద్దీ తిరుప‌తి దృశ్యం మ‌రింత సుస్పష్టం.

ఘాట్ రోడ్డు దిగుతున్న కొద్దీ ఎడ‌మ వైపు న‌గ‌రం, కుడి వైపున కొండ రూపాలు. గ‌రుత్మంతుడి ముఖంలా క‌నిపిస్తున్న కొండ అంచులు. ఆ కొండ అంచుల‌లోనే వినాయ‌కుడి ఆల‌యం.

సూర్యాస్త‌మ‌యాన‌ తిరుమ‌ల నుంచి దిగ‌డం మొద‌లుపెడితే ఆ ఆహ్లాద‌మే వేరు.ప‌ద‌మూడ‌వ కిలోమీట‌రు ద‌గ్గ‌ర నుంచి మిణుకు మిణుకు మ‌నే దీప‌కాంతితో తిరుప‌తి వింత అందాల‌ను సంత‌రించుకుంటుంది.

వీస్తున్న చ‌ల్ల‌ని గాలికితోడు, ఆకాశంలో చుక్క‌లు నేల‌పై రాలిన‌ట్టుంటాయి. చుక్క‌ల ఆకాశాన్ని చుట్ట చుట్టి నేల‌పైన చాప‌లా ప‌రిచిన‌ట్టుంటుంది.అలిపిరి స‌మీపిస్తున్న కొద్దీమ‌నం ఆస్వాదించిన ప్ర‌కృతి మ‌ధురానుభూతి క‌రిగిపోతోంద‌న్న దిగులు.

ప్ర‌తిరోజూ వేలాది మంది భ‌క్తులు తిరుమ‌లకు వెళ్ళి వ‌స్తున్నారంటే, ఈ ప్ర‌కృతి అందాలే వారిని ఆక‌ర్షిస్తున్నాయి, ర‌ప్పిస్తున్నాయి.తిరుమ‌ల కొండ‌కు మూడు ఘాట్ రోడ్ల నిర్మాణానికి 1940లోనే మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య ప‌థ‌క ర‌చ‌న చేశారు.

మొద‌టి ఘాట్ రోడ్డు 1944లో పూర్త‌వ‌గా, రెండ‌వ ఘాట్ రోడ్డు 1974లో పూర్త‌యింది.తిరుమ‌ల‌కు వెళ్ళ‌డానికి రెండ‌వ ఘాట్ రోడ్డు, తిరుమ‌ల నుంచి దిగ‌డానికి మొద‌టి ఘాట్ రోడ్డు.

రెండ‌వ ఘాట్ రోడ్డులో మొద‌టి దానంత‌ మ‌లుపులు లేవు.వ‌ర్షాకాలంలో రెండ‌వ ఘాట్ రోడ్లోనే కొండ చ‌రియ‌లు ఎక్కువ‌గా విరిగి ప‌డుతుంటాయి.

క‌డ‌ప జిల్లా మామండూరునుంచి మూడ‌వ ఘాట్ రోడ్డును నిర్మించాల‌ని మోక్ష‌గుండం ఆరోజే ప‌థ‌క ర‌చ‌న చేశారు.ఆకేప‌ల్లి చెంగ‌ల్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న రోజుల్లో మూడ‌వ ఘాట్ రోడ్డు కోసం ప్ర‌య‌త్నించారు. ఇది క‌డ‌ప జిల్లా నుంచి వ‌చ్చే వారికి అనుకూలంగా ఉంటుంద‌ని వారి ఆలోచ‌న‌. ఇది పూర్త‌యితే తిరుప‌తి ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌ని, ఇక్క‌డి వ్యాపారాలపై దెబ్బ‌ప‌డుతుంద‌ని టీటీడీ స‌భ్యుడొక‌రు ఆదిలోనే అభ్య‌త‌రం చెప్పారు. అట‌వీ భూసేక‌ర‌ణ పెద్ద స‌మ‌స్య‌గా త‌యార‌వుతుంద‌ని వారి వాద‌న‌. చివ‌రికి మూడ‌వ ఘాట్ రోడ్డు నిర్మాణ ఆలోచ‌న‌ను మూల‌న ప‌డేశారు.

తెల‌తెల‌వారు తుండ‌గా ఈ ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణం ఎంత ఆహ్లాదక‌రంగా ఉంటుందో! తూర్పున దూరంగా కొండ‌ల మాటునుంచి ఉద‌యిస్తున్న సూర్యుడు.

ఆ లేత కిర‌ణాల అందాల‌లో తిరుప‌తి అందం మ‌రింత ఇనుమ‌డిస్తుంది. సూర్యాస్త‌మ‌యాన అయితే, మిణుకు మిణుకు మంటూ దీప‌కాంతుల‌తో తిరుప‌తి వెలిగిపోతుంటుంది.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *