కేంద్ర వ్యవసాయ చట్టాలమీద ప్రముఖ జర్నలిస్టు ఏ మంటున్నారంటే…

రైతాంగ ఉద్యమం కోసం సమాజంలోని ఇతర ప్రజాతంత్ర విభాగాలన్ని నిలబడవలసిన సమయం ఆసన్నమైంది

-పౌర సంఘాల సదస్సులో ప్రముఖ పాత్రికేయుడు సాయినాథ్

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, సమాజంలోని రైతేతరులంతా   రైతులతో చేరవలసిన సమయం వచ్చిందని వ్యవసాయ నిపుణుడు-జర్నలిస్ట్  పి సాయినాథ్ అన్నారు. రైతాంగ ప్రతిఘటన ఉండదని కేంద్ర ప్రభుత్వం  కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఈ చట్టాలను తెచ్చిందని అయితే, ఆ అంచనా  తారుమారయిందని  ఆయన అన్నాడు.

రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ పౌర సంఘాలు ఏర్పాటు చేసిన వర్చువల్ విలేకరుల సమావేశంలో సాయినాథ్ మాట్లాడారు లక్షలాది మంది కార్మికులు రైతుల డిమాండ్లను ఆమోదించి  నడవాల్సిన మార్గ చూపించారని ఆయన అన్నారు.

“సమాజంలోని కార్మికేతర ప్రజాస్వామిక వర్గాలు కూడా రైతుల కోసం నిలబడవలసిన సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాం,” అని  అతను చెప్పారు.

కార్మికులు ఇప్పటికే మనకు మార్గం చూపించారు. అదే విధంగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయడానికి సంఘీభావంగా మనం అందరం కూడా నిలబడాలి” అని సాయినాథ్ అన్నాడు.

వివాదాస్పదమైన మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో  సహా వివిధ డిమాండ్లపై వేలాది రైతులు హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు.

“కనీస మద్దతు ధరల వ్యవస్థను కూల్చివేసేందుకు ఈ మూడు చట్టాలు మార్గం సుగమం చేసి, తమను పెద్ద కార్పొరేట్ ల “దయ దాక్షిణ్యాలకు” వదిలేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సాయినాథ్ పేర్కొన్నారు.

“కరోనా సమయంలో చట్టాలను అదాటుగ ప్రవేశపెడితే ఈ జనాలు- రైతులు, కార్మికులు సంఘటిత పడలేరని మరియు ప్రతిఘటించే స్థితిలో ఉండరని పాలకుల విశ్వసించారు.  ఇది నిజంగా ‘చెడ్డ లెక్క,తప్పుడు అంచన.” అని ఆయన వివరించారు.

సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (APMC, Agricultural produce marketing committee) చట్టం,  కాంట్రాక్టు వ్యవసాయ చట్టం ల్లోని 18 మరియు 19 నిబంధనల ప్రకారం రైతులు లేదా ఇతరులెవరైనా వివాదం పరిష్కారం కోసం సివిల్ న్యాయస్థానాల సహాయం తీసుకునే అవకాశం ఉంటుందని సాయినాథ్ పేర్కొన్నారు. కానీ కొత్త చట్టాలలో ఈ చట్టబద్ధమైన సహాయానికి “నమ్మశక్యం” కాని ఘోరమైన మినహాయింపులు ఉన్నాయిని అతను అన్నారు

“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ గురించి చెపుతాయి. కానీ, వ్యవసాయ చట్టాల్లోని ఈ క్లాజు ప్రభుత్వ యంత్రాంగంలోని ఏదైనా విభాగం తీసుకున్న నిర్ణయం ను చట్టపరమైన పరిశీలన నుంచి మినహాయింపు ఇస్తుంది” అని ఆయన చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలలోని ఈ క్లాజు “రైతులు కే కాదు అందరికీ వర్తిస్తుంది.” ప్రతి భవిష్యత్ చట్టంలో మీరు ఈ నిబంధనలను చూడబోతున్నారు” అని జర్నలిస్ట్ పి సాయినాథ్ హెచ్చరించారు.

జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ప్రవీణ్ జా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి “అన్నీ రాజా”, అఖిల భారత ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ నుండి కవితా కృష్ణన్ లు కూడా ఈ సదస్సులో ప్రసంగించారు.

శాంతియుత పోరాటం పై “క్రూరమైన అణచివేతను” వీరందరూ ఖండించారు, రైతులపై పెట్టిన అన్ని కేసులను వెంటనే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్య (ప్రోత్సాహం మరియు సౌలభ్యం) చట్టం లోని సెక్షన్ 13 ఏమి చెపుతుందో గమనించండి- “ఈ చట్టం, దాని నియమాలు లేదా ఆదేశాలు క్రింద సదుద్దేశంతో చేసినటువంటి లేదా చేయ ప్రయత్నించిన ఏ విషయంలో ను కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, లేదా ఆయా ప్రభుత్వం ల ఏ అధికారి లేదా మరే వ్యక్తి పై ఏ విధమైన దావా,విచారణ, చట్టపరమైన చర్యలకు దిగరాదు.”

కొత్త చట్టాలు రైతుల గురించి మాత్రమే అని మీరు అనుకున్నారా? చట్టపరమైన విధులను నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులను వారు చేసే తప్పిదాల పై విచారణను మినహాయించే ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. కాని వ్వవసాయ చట్టాలు ఈ మినహాయింపు ను చాలా విస్తృత పరిచింది- ‘మంచి విశ్వాసంతో’ వారు ఏమి చేసినా బాధితులు వారిని న్యాయ స్థానంలోకి లాగటం నిషేధం.’

ఒకవేళ మీరు 13 పాయింట్ ను చూడకపోతే – సెక్షన్ 15 దీనిని మరో పద్దతి లో స్పష్టం చేసింది: “ఈ చట్టం ఇచ్చిన అధికారంతో లేదా దాని నిబంధనల మేరకు ఏ అధికారి లేక మరే యితర వ్యక్తి అయినా స్వీకరించి తేల్చ గల్గిన ఏ దావా ను, విచారణ ను చేపట్టే అధికారం ఏ “సివిల్ కోర్టు”కు ఉండదు. చట్టబద్ధంగా సవాలు చేయలేని ‘మంచి విశ్వాసంతో’ పనులు చేసే ఆ ‘మరే యితర వ్యక్తి’ ఎవరు?

(సూచన: నిరసన తెలిపే రైతులు చెపుతున్న కార్పొరేట్ దిగ్గజాల పేర్లు వినడానికి ప్రయత్నించండి.)

“వ్యాపార సౌలభ్యం” గురించి రేయింబవళ్లు పాలకులు మాట్లాడుతన్నారు గదా! ఇది బడా కంపెనీల వ్యాపార సౌలభ్యం గురించి కాదా?ఎటువంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు…” . దావా వేయ వీలులేనిది రైతులు మాత్రమే కాదు. మరెవరూ వెయటానికి లేదు. “ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి కూడా వర్తిస్తుంది. NGO లు లేదా వ్యవసాయ సంఘాలు లేదా ఏ పౌరుడు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది, ఖచ్చితంగా పౌరుడి చట్టపరమైన సహాయం పొందే హక్కును కొల్లగొట్టటమే.

అన్ని ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసిన 1975-’77 ఎమర్జెన్సీ పరిస్థితుల కాలంలో మినహా న్యాయ స్థానాల సహాయం ను పొందే పౌరుల హక్కు ను ఇంత పెద్ద ఎత్తున ఏ ఇతర చట్టం లాగి వేయలేదు.

న్యాయస్థానంల యొక్క అధికారాన్ని చిత్తానుసారం నిరంకుశంగా వ్యవహరించే కార్యనిర్వాహక వర్షం(executive) కి అప్పగించటం వల్ల తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి.

దీని ప్రభావం ప్రతి భారతీయుడి పై ఉంటుంది.
ఆంగ్లంలో ఉన్న ఈ చట్టాల యొక్క చట్టపరమైన భాషను సాధారణ భాషలోకి తర్జుమా చేస్తే “దిగువ స్థాయి ఎగ్జిక్యూటివ్ (కార్య నిర్వాహణ వ్యవస్థ) న్యాయవ్యవస్థగా, యింకా స్పష్టంగా చెప్పాలంటే న్యాయమూర్తి, న్యాయ స్థానం (జ్యూరీ) మరియు తలారి విధులను ఎగ్జిక్యూటివ్ కైకర్యం చేసుకుని బకాసరడిగా అవతరిస్తుంది. రైతులు మరియు దిగ్గజ సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న అత్యంత అన్యాయమైన అసమతుల్యతను ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది.

దీనిపై అప్రమత్తమైన ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రధాని నరేంద్రమోడికి రాసిన లేఖలో ఇలా అడిగింది: “ఎగ్జిక్యూటివ్ అధికారులు నియంత్రించే మరియు నడుపుతున్న పరిపాలనా సంస్థలతో కూడిన నిర్మాణాలు పౌర పరిణామాలను కలిగి ఉన్న ఏదైనా వ్యాజ్యంపై తీర్పు ఇవ్వడం ఎలా భావ్యం అవుతుంది ?”; “న్యాయ అధికారాలను ఎగ్జిక్యూటివ్ కు బదిలీ చేయడం ప్రమాదకరమైనది మరియు ఘోర తప్పిదం”; “న్యాయ వృత్తిపై అది ప్రభావాన్ని చూపుతుందని, ముఖ్యంగా జిల్లా కోర్టులను గణనీయంగా దెబ్బతీస్తుంది మరియు న్యాయవాదులను తీవ్రంగా దెబ్బ తీస్తుంది”

చట్టాలు రైతుల గురించి మాత్రమే అని యిప్పటికీ అనుకుంటున్నారా?

న్యాయవ్యవస్థ అదికారాలను మరింతగ ఎగ్జిక్యూటివ్ కు బదిలీ చేస్తున్న విషయాలు కాంట్రాక్టుల గురించిన చట్టంలో – రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం 2020 లో ఉన్నాయి:
దీని లోని సెక్షన్ 18 “మంచి విశ్వాసంతో” వాదనను పునరుద్ఘాటిస్తుంది. సెక్షన్ 19 ఇలా పేర్కొంది: “ఈ చట్టం చేత లేదా ఈ చట్టం క్రింద సాధికారత పొందిన సబ్ డివిజనల్ అథారిటీ లేదా అప్పీలేట్ అథారిటీ నిర్ణయించే అధికారం ఉన్న ఏ వివాదానికి సంబంధించిన విషయం పై ఆ అధికారి తీసుకున్న. లేదా తీసుకోనున్న చర్య పై ఎటువంటి దావా లేదా విచారణ చేపట్టే అధికారం ఏ సివిల్ కోర్టుకు ఉండదు మరియు ఏ కోర్టు ఆ అధికారి (authority) తీర్పు పై నిషేధ ఉత్తర్వులు మంజూరు చేయలేరు.”

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, ఉద్యమ స్వేచ్ఛ, సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసే హక్కు గురించి చెపుతుంది.
19 యొక్క సారాంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 లో కూడా ఉంది.  ఇది రాజ్యాంగ(constitutional remedies) పరిష్కారాల (చట్టపరమైన చర్య) హక్కుకు హామీ ఇస్తుంది. సెక్షన్ 32 రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగంగా పరిగణించబడుతుంది.

కనుక ఈ కొత్త వ్యవసాయ చట్టాలు. రాజ్యాంగ ఉల్లంఘన

భారతీయ ప్రజాస్వామ్యం కు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల సంభవించే చిక్కుల గురించి 70% ‘ప్రధాన స్రవంతి ’మీడియాకు ఖచ్చితంగా తెలుసు. కానీ లాభాల సాధన ధ్యేయం ప్రజా ప్రయోజనం లేదా ప్రజాస్వామ్య సూత్రాల భావనను కూడా తోసివేస్తుంది.

ఢిల్లీ ద్వారాల వద్ద ఉన్న నిరసనకారులు బారికేడ్లు, ముళ్ల తీగలు, లాఠీలు మరియు నీటి ఫిరంగులను ఎదుర్కొన వలసి వచ్చింది. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు.

ఈ మీడియా కూడా కార్పొరేట్లదే. దేశంలోని అతిపెద్ద భారతీయ కార్పొరేట్ల యొక్క బిగ్ బాస్ (Bigboss) యే అత్యంత ధనిక మరియు అతి పెద్ద మీడియా యజమాని. ఢిల్లీ ద్వారాల వద్ద ఉన్న రైతులు తమ నినాదాలలో పిలిచే పేర్లలో ‘అంబానీ’ ఒకటి. దిగువ స్థాయిలలో, మనం సాధారణంగా ఫోర్త్ ఎస్టేట్ (,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా- అనువాదకుడు) గా పిలుస్తున్నదానికి , రియల్ ఎస్టేట్ పీఠముడి ఏర్పడి చాలాకాలమైంది. కార్పొరేట్ ప్రయోజనాల కంటే పౌరుల ప్రయోజనాలను (రైతుల సంగతి అలా ఉంచండి) ఎక్కువ ప్రధానమైన వాటీనిగా చూపించడానికి ‘ప్రధాన స్రవంతి’ మీడియా సిద్ధంగా లేదు.  రైతులను దయ్యాలు గా ఆ పత్రికలు, ఆ వార్త చానల్లు చిత్రీకరిస్తున్నాయి. వీరు, పంజాబ్ నుండి వచ్చిన ధనిక రైతులు, ఖలిస్తాన్ వాదులు, ,కపటులు, కాంగ్రెస్ కుట్రదారులు అని ఈ పత్రికలు రాస్తున్నాయి.

బిగ్ మీడియా సంపాదకీయాలు చూపించేది మొసలి కరుణ. వారు నొక్కి చెప్పేది ఏమిటంటే: “ఈ చట్టాలు ముఖ్యమైనవి మరియు అవసరమయినవి. వాటిని అమలు చేయాలి..” ఇండియన్ ఎక్స్ ప్రెస్ (Indian Express) సంపాదకీయం ఇలా చెబుతోంది: “ఈ మొత్తం ఎపిసోడ్లోని లోపం సంస్కరణల్లో లేదు. వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన విధానంలో మరియు ప్రభుత్వ సమాచార ప్రసార వ్యూహం లో లేదా అలాంటి వ్యూహం లేకపోవడం లో లోపం ఉంది.” మూడు వ్యవసాయ చట్టాలు “భారతీయ వ్యవసాయం యొక్క నిజమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సంస్కరణలు”. “ప్రస్తుత ప్రతిష్టంభన ఇతర గొప్ప ప్రణాళికలను దెబ్బతీస్తుంది” అని Indian Express ఆందోళన వ్యక్తం చేసింది.

“రాబోయే కాలంలో MSP (కనీస మద్దతు ధర ) అంతం అవుతుందని రైతులలో ఉన్న అపోహలను రద్దు చేయడం…” అన్ని ప్రభుత్వాల ముందు ఉన్న ప్రాధమిక పని అని టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India) తన సంపాదకీయంలో చెప్పింది. “కేంద్రం యొక్క సంస్కరణ ప్యాకేజీ వ్యవసాయ వాణిజ్యంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక హృదయపూర్వక ప్రయత్నం.  వ్యవసాయ ఆదాయాలు రెట్టింపు అవుతాయనే ఆశలు ఈ నూతన సంస్కరణల విజయంపై ఆధారపడి ఉన్నాయి… ” మరియు “ఇలాంటి సంస్కరణలు భారతదేశ ఆహార మార్కెట్లో హానికరమైన వక్రీకరణలను కూడా సరిచేస్తాయి.” అని కూడా ఆ సంపాదకీయం చెపుతున్నది.

అన్యాయమైన మూడు చట్టాలను రద్దు చేయడం కంటే చాలా పెద్ద కారణం కోసం ఢిల్లీ గేట్ల వద్ద ఉన్న రైతులు పోరాడుతున్నారు.  వారు మనందరి హక్కుల కోసం పోరాడుతున్నారు. ”

“ఈ చర్యకు [కొత్త చట్టాల ప్రవేశం] మంచి కారణం ఉంది” అని హిందూస్తాన్ టైమ్స్ సంపాదకీయం పేర్కొంది. “చట్టాల వాస్తవికత మారదని రైతులు గుర్తించాలి.”  అంటూ హెచ్ఛరించింది. నిరసన కారులతో చాలా సున్నితంగా ఉండవలసిన అవసరాన్ని గురించి నసుగుతోంది. ఎవరితో? తీవ్ర-గుర్తింపు సమస్యలతో చట్టాపట్టాలు వేసుకున్నారని ఏ రైతులపై అభియోగాలు మోపిందో వారి తో సున్నితంగా వ్యవహరించ మంటున్నది!

సంపాదకీయ రచయితలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై రైతులు స్పష్టత కలిగి ఉన్నారు.

ఉన్నంతలో మంచి టెలివిజన్ ఛానెళ్ళ చర్చల్లోని ప్రశ్నలు కూడా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్న వ్యవస్థ చట్రంలోనే ఉంటాయి. ఈ చర్చల్లోని నిపుణులు మరియు మేధావులు వ్యవస్థ బందీలు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు తొందరెందుకు లాంటి ప్రశ్నలపై ఒక్కసారి కూడా తీవ్రమైన దృష్టి పెట్టరు. అంతే తొందరపాటుతో తెచ్చిన కార్మిక చట్టాలు గురించి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలపై లోతైన చర్చ ఎప్పుడూ జరగదు.

గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడి భారీ మెజారిటీ సాధించారు. ఆ మెజారిటీ అతనికి కనీసం మరో 2-3 సంవత్సరాలు పాటు ఉంటుంది. మహమ్మారి సమయంలో ఈ చట్టాలను అమలు చేయడానికి మంచి సమయం అని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు భావించింది?

మహమ్మారి సమయంలో అత్యవసర శ్రద్ధ చూప వలసిన విషయాలు చాలా ఉన్నాయి కదా? కానీ, వ్యవసాయ ఆర్డినెన్స్ ను ఎందుకు జారీ చేసినట్టు? దీనికొక లెక్క ఉన్నది. అది కోవిడ్ -19 మహమ్మారితో చేత స్తంభించిపోయిన కాలం ; రైతులు మరియు కార్మికులు ఎటువంటి అర్ధవంతమైన రీతిలో సంఘటితం కాలేరు మరియు ప్రతిఘటించలేరు. కనుక, ఇది మంచి సమయం మాత్రమే కాదు, ఉత్తమ సమయం. మంచి సమయం మించిన రాదు అని పాలక మేధావులు జోరీగల రొద చేసిఉంటారు. నిరాశ, దుఖం మరియు గందరగోళ పరిస్థితి. సమూల సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి మరొక సారి “1991 లాంటి సమయం” ను దొరికిందని వారిలో కొందరు నమ్మారు.  దీనిని సమూల సంస్కరణల ముందుకు తెచ్చే సువర్ణ అవకాశంగా తీసుకున్నారు. “మంచి సంక్షోభాన్ని ఎప్పటికీ వృథా చేయవద్దు” అని పాలకులను వేడుకున్న ప్రముఖ సంపాదకులున్నారు. భారతదేశంలో “ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ” అని తాను వగస్థున్నట్లు ప్రకటించుకున్న నీతీ ఆయోగ్ చీఫ్ ప్రకటించాడు!

దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు తెలిసిన ఒక కమిటీ నివేదిక ఏదైనా ఉంటే, దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తే, అది ‘స్వామినాథన్ రిపోర్ట్ గా ప్రసిద్ధి చెందిన జాతీయ రైతుల కమిషన్. 2004 నుండి కాంగ్రెస్ మరియు 2014 నుండి బిజెపి ఆ నివేదికను పాతిపెట్టడానికి పోటీ పడుతున్నాయి.

నవంబర్ 2018 లో ఢిల్లీ లోని పార్లమెంట్ సమీపంలో 1,00,000 మంది రైతులు గుమిగూడి ఆ నివేదిక యొక్క ముఖ్య సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ, కనీస మద్దతు ధర అమలు చేయాలని కోరారు. అంతేగాక వ్యవసాయ సంక్షోభం గురించి చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశంతో సహా అనేక ఇతర డిమాండ్లను కూడా కోరారు. పంజాబ్ రైతులు మాత్రమే కాకుండా 22 రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు.

ప్రభుత్వం నుంచి కప్పు టి కూడా తీసుకోవడానికి నిరాకరించిన ఈ రైతులు, కరోనా భయం వారిని కట్టి పడవేస్తుందనే ప్రభుత్వ అంచనాలు తప్పు అని నిరూపించారు. వారు, వారి మరియు మన హక్కుల కోసం నిలబడ్డారు, నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ప్రమాదమైన కోవిడ్ పరిస్థితులలో కూడా ఈ చట్టాలను వారు ప్రతిఘటించారు.

‘ప్రధాన స్రవంతి’ మీడియా విస్మరించే విషయం కూడా వారు పదేపదే చెప్పారు- ఆహారంపై కార్పొరేట్ నియంత్రణ దేశం కు ఎంత అరిష్టదాయకమో వారు మనల్ని హెచ్చరిస్తున్నారు.  ఏ పత్రిక సంపాదకియంలలో నైనా ఈ విషయం కనిపించిందా?

తమ కోసం, లేదా పంజాబ్ కోసం లేదా మూడు చట్టాలను రద్దు చేయడం కంటే చాలా పెద్ద విషయం కోసం పోరాడుతున్నామని ఎక్కువ మంది ఉద్యమకారులకు తెలుసు. ఆ మూడు చట్టాలను రద్దు చేయడం అంటే పూర్వం ఉన్న చోటికి తిరిగి తీసుకెళ్లడం కంటే ఎక్కువ కాదు. ఆ పూర్వ స్థితి కూడా ఏ మాత్రం మంచిది కాదు. పూర్వ స్థితికి పోవడం అంటే భయంకరమైన, ఇంకా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం దరి చేరటమే.

అయితే, ఈ ఉద్యమం ఆ వ్యవసాయ సంక్షోభంను అధికం చేసే నూతక చేర్పులను అడ్డుకుంటుంది లేదా తగ్గిస్తుంది. అవును, ‘ప్రధాన స్రవంతి మీడియా’ చూడని విషయాన్ని, అంటే, ఈ మూడు వ్యవసాయ చట్టాలు పౌరులు కోర్టులకు వెళ్ళే హక్కును హరిస్తున్నాయి లేదా కుదిస్తున్నాయి అన్న విషయాన్ని రైతులు చూసారు. మరొక ముఖ్యవిషయం- రైతులు దానిని గమనించారా, దాని గురించి మాట్లాడారా లేదా అన్న దాంతో నిమిత్తం లేకుండా వారి ఉద్యమం రాజ్యాంగ మౌలిక నిర్మాణంకు, అసలు ప్రజాస్వామ్యం కే ఒక రక్షణ కుడ్యం అని చెప్పవచ్చు.

(ఇది “The wire”పత్రిక సౌజన్యంతో .  అనువాదం: చిగురుపాటి భాస్కరరావు, ఛైర్మన్, ఓపిడిఆర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *