వైఎస్ ఆర్ కాంగ్రెస్ ని ఓటమి భయం పట్టి పీడిస్తున్నదని, ఆ భయంతోనే దాడులకు తెగబడుతున్న వైసీపీ మూక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై దాడులు చేసున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శంచారు. ఇది చాలా హేయం అని అన్నారు.
ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ఇదే…
మున్సిపల్ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగితే గెలవలేమన్న భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను, ఓటర్లను భయపెడుతున్నారు.
విశాఖపట్నంలోని ఏయూ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పరిశీలనకు వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం.
మచిలీపట్నం 13వ డివిజన్ లో టీడీపీ సానుభూతిపరుడు దినకర్ మీద వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. విజయవాడలో టీడీపీ అభ్యర్ధులను బెదిరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూస్తుంటే.
అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక వైసీపీ నేతల ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ కార్యకర్త పసుపు చొక్కా వేసుకున్నందుకే అతణ్ణి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించని పోలీసులు….వైసీపీ కార్యర్తలు పేట్రేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చోవడం హేయం.
వైసీపీ నేతలు కత్తులు, కర్రలతో పేట్రేగిపోతుంటే.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండడం సరికాదు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి.