ఏకగ్రీవాలు వైకాపాకు బలుపా? వాపా?

(వి.శంకరయ్య)

తొలి నుండి కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి వుంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తనకు కేవలం భావోద్వేగాలతో అనూహ్యమైన విజయం చేకూర్చారా ? లేక సుస్థిర మైన అభిప్రాయంతో విజయం లభించిందా అనే కీలక మైన ముఖ చిత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లభించి వుండేది. పైగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే నేపథ్యంలో ఈ తీర్పు ఎంతో ప్రాధాన్యత కలిగి వుండేది.

అంతేకాదు. అభివృద్ధి పథకాలకు స్వస్తి చెప్పి తను అమలు చేస్తున్న ఉచితాల పంపకం విధానం యెడల ప్రజల మనోగతం తెలుసుకొనే అవకాశం వుండేది.

అదే సమయంలో రాష్ట్రంలో తన పార్టీ ఎమ్మెల్యేలు నేతలపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణల గురించి సరైన ఫీడ్ బ్యాక్ లభించి వుండేది.వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని మూకుమ్మడిగా ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రజాభిప్రాయం తెలిసొచ్చేది.

అయితే తన దూకుడు విధానాల వలన ఏకగ్రీవాల పేరుతో సాగుతున్న రొచ్చు రాజకీయాలతో ఇప్పుడు అన్నీ చేజారి పోయాయి. ఎన్టీఆర్ తర్వాత వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికే రాష్ట్ర ప్రజలు అనూహ్యమైన విధంగా పట్టం గట్టారు. భావోద్వేగాలతో ఎన్నికలకు వెళ్లిన టిఆర్ఎస్ నేత కెసిఆర్ కు ఈ అరుదైన అవకాశం లభించ లేదు.
.
అయితే ఏ పార్టీ అధికారంలో వున్నా దాని ప్రాధాన్యతలు దాని కుంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 20 నెలల కాలంలో తను అనుసరిస్తున్న విధానాలు తప్పని భావించి వుంటే ఎంతో కొంత మేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టే వుండే వారు.

కాని ఆలాంటి పోకడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కన్పించడం లేదు. సరికదా మరిన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతి పక్షాల విమర్శలు పక్కన బెట్టినా పరిషత్ ఎన్నికల సమయంలో వైకాపా నేతలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన తీరు రాజ్యాంగ బద్ద సంస్థ యస్ఇసి యెడల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెకొన్న వైఖరి రాష్ట్రంలో ఏ పార్టీకి చెందని తటస్తులు మేధావులు అంగీకరించ లేక పోయారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అపకీర్తి మూట గట్టుకొన్నారు .

తుదకు సర్వోన్నత న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటికి ముఖ్యమంత్రి తన పాత విధానం నుండి వెనక్కి తగ్గ లేదు. ఏకగ్రీవాల అస్త్రం తెరమీదకు తెచ్చి వాస్తవంలో రెండు మూడు విధాలుగా నష్ట పోయారు. నయానో భయానో నేడు ఎక్కువ పంచాయతీలు తన ఖాతాలో వేసుకోవచ్చు గాని పాతికేళ్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వుండాలని భావించే నేతకు దీర్ఘకాలంగా నష్టం తప్పదు.

ఆంధ్ర ప్రదేశ్ లో కాదు. ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మరీ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి స్థానిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి పక్షాలు మద్దతుతో గెలిచిన వారు కూడా ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీ చేతిలో వుండటం నిధులు మంజూరులో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా గెలుపొందిన వెను వెంటనే అధికార పార్టీ చెంత చేరడం సహజం.

గతంలో వివిధ సందర్భాల్లో జరిగిన పంచాయతిలతో పాటు సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి పక్షాల అభ్యర్థులు నెల తిరగక మునుపే అధికార పార్టీ గొడుగు కింద చేరిన సందర్భాలు అనేకం. కాని ప్రస్తుతం వైకాపా అధిష్టాన వర్గానికి గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాని అంత ఓపిక లేకుండా పోయింది. కేవలం పంతాలకు పోయి మరో రెండు విధాలుగా నష్ట పోయారు.

కరోనాకు ముందు పరిషత్ ఎన్నికల్లో సాగిన దమన కాండ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా చూచింది. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అప్పటికే చతికిల పడిన ప్రతి పక్షాలు ఈ దమనకాండతో పూర్తిగా నైరాశ్యంలో పడ్డాయి. అయితే కారణం ఏదైనా కావచ్చు.

యస్ఇసి ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెచ్చి పోకుండా సంయమనం పాటించి ఓపిక పట్టి తదుపరి రాద్ధాంతం సృష్టించకుండా వుంటే యస్ఇసి రమేష్ కుమార్ పెద్ద హీరోగా ప్రొజెక్ట్ అయ్యవారు కాదు. తదుపరి ఎన్నికలు జరిగినా యస్ఈసి తమకు ఛత్రం పడతాయనే నమ్మకం రాష్ట్రంలోని ప్రతి పక్షాలకు కలిగేది కాదు. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలతోనే ప్రతి పక్షాలకు ఊపిరి పోశారు. నిరాశ నిస్పృహలతో వుండిన ప్రతి పక్షాలను తట్టిలేపి వీధుల్లోనికి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి యస్ఇసితో సాగించిన పోరాటం ప్రతి పక్షాలకు ఊతం ఇచ్చింది.

జిల్లా కలెక్టర్లు యస్ పి లు బదలీ కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లు వేసే ధైర్యం లేకుండా మరోవైపు వీధుల్లోనికి వచ్చిన తమను వైకాపా శ్రేణులు నిలువరించే పరిస్థితి కొంత మేర ప్రతి పక్షాలకు తప్పింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించిన ఏకగ్రీవాల విధానానికి ఒక మేర గండి పడింది. గమనార్హమైన అంశమేమంటే ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలు అడ్డదిడ్డ మైన పద్దతిలో అధికారులు ప్రతి పక్షాలు నామినేషన్లు తిరస్కరించడంతోనే సాగు తున్నాయి. మరీ చోద్యమేమంటే అధికార పార్టీ నేతలు ఏ తప్పులు లేకుండా నామినేషన్లు వేయడం ప్రతి పక్షాలు అభ్యర్థులు మాత్రమే తప్పులతో నామినేషన్లు వేయడమే. అంతేకాదు. ప్రతి పక్షాల అభ్యర్థి గెలుపొందినా ఓడి పోయినట్లు సంతకం పెట్టమని వైకాపా నేతల బెదిరింపులకు అధికారులు వంత పాడటమే.

మున్ముందు ఎవరైనా పరిశోధక విద్యార్థి దీనిపై రిసెర్చ్ చేస్తే సులభంగా డాక్టరేట్ పొంద వచ్చు. జిల్లా స్థాయి అధికారులు కొంత బాలెన్స్ గా వున్నా కింది స్థాయి అధికారులు మరీ బరి తెగించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి

ప్రతిపక్ష అభ్యర్థి తన ఓటు సీరియల్ నెంబరు 33 గా వుండి సరిగానే నామినేషన్ పత్రంలో నమోదు చేసినా ఒక 3 ను అధికారే 8 గా దిద్ది నామినేషన్ చెల్లదని ప్రకటించిన సందర్భాలున్నాయని చెబుతున్నారు.పైగా నామినేషన్లు ఎందుకు తిరస్కరిస్తున్నారో అభ్యర్థికి ఇచ్చే ఫారం ఇవ్వకనే దొడ్డి దారిన వెళుతున్నారని ఎందుకు తిరస్కరణ అయిందో ఫారం లేదు కాబట్టి అప్పీలు అధికారి సులభంగా అప్పీలు కొట్టేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యస్ఇసిని మరో శేషన్ లాగా హీరో చేసిన ఫలితంగా వైకాపా నేతలు భయ పెట్టి ఏకగ్రీవాలు చేసుకొనే దశ బోయి అధికారుల అండతో అడ్డ దారులతో ఏకగ్రీవాలు చేసుకోవలసి వచ్చింది. పలు సందర్భాల్లో యస్ఇసి కూడా ఏమీ చేయ లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ దురాగతాలకు ప్రాతిపదిక లేక పోలేదు. యస్ఇసికి గాని కేంద్ర ఎన్నికల కమిషన్ గాని ఎన్నికల నిర్వహణకు సిబ్బంది లేదు. ఏ ఎన్నికలైనా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిపై ఆధారపడాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ప్రభుత్వం సిబ్బంది మొత్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల పాటించ వలసినా అధికార పార్టీని కాదని వ్యవహరించితే ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకరగిరి మాన్యాలు పట్టించుతానే భయం ప్రభుత్వ సిబ్బందిలో వుంటున్నది.

ఆ మాట కోస్తే ఐఎయస్ లు ఐపియస్ లే విధులు సరిగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఇక జిల్లా మండల స్థాయి సిబ్బంది స్థానిక ఎమ్మెల్యేలపై ఆధారపడి పోస్టింగ్ లు పొందుతున్న దశలో ఎన్నికల కమిషన్ ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా అన్నీ డొల్లగా మిగిలి పోతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఈ పరిస్థితి తప్పదు. మరీ వైకాపా ప్రభుత్వంలో చెప్ప పని లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యస్ఇసితో అనవసరమైన రగడ పెట్టుకొని రమేష్ కుమార్ ను హీరో చేశారు కాబట్టి సరి పోయింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిల బట్టి రాష్ట్రంలో ఈ మేరకైనా ప్రతి పక్షాలు పంచాయతీల్లో ఉనికి చాటు కొన్నాయి. తమాషా ఏమంటే జనరల్ ఎన్నికలు వచ్చే సరికి ఇన్నాళ్లూ అధికార పార్టీ కొమ్ము కాచిన అధికారులు ప్రజల నాడి పసి గట్టి బై బై చెప్పడం కద్దు.

గతంలో ఏ ముఖ్యమంత్రి గైకొనని వివాదాస్పద నిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొంటున్నారనే ఆరోపణలు వున్నాయి. అయితే రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు విభేదించ వచ్చు. కాని తాను అనుసరించిన వివాదాస్పద నిర్ణయాలకు రాష్ట్ర ప్రజల ఆమోద ముద్ర వుందా? లేదా? అని ఖచ్చితంగా తేల్చుకోవాడానికి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగి వుంటే ముఖ్యమంత్రికి ఎంతో ఉపయోగ పడేవి.

న్యాయం స్థానాల యెడల వైఖరి కావచ్చు. మూడు రాజధానుల ప్రతిపాదన కావచ్చు. ప్రధానంగా ఇతర అభివృద్ధి పథకాలను ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించి నవ రత్నాల పేర అమలు జరుగుతున్న ఉచిత పథకాలు అమలు తీరుపై ప్రస్పుటమైన అంచనా ముఖ్యమంత్రికి లభ్యమయ్యేది. ప్రస్తుతం అది చేజారి పోయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్దీ ఎవరికి వారు తమ గెలుపు గురించి చెప్పుకొంటున్నారు. ఇవన్నీ అటుంచి ఇప్పుడు జరుగుతున్నవి ప్రజాస్వామ్య పద్దతి ఎన్నికలు కాదు కాబట్టి ముఖ్యమంత్రి వేసుకొనే బేరీజు ఎండ మావుల్లో నీటిని వెతకడమే.

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *