సంఘసేవకుడికి సర్పంచుగా పట్టం కట్టిన గ్రామం

(జువ్వాల బాబ్జీ)

ఆంధ్ర ప్రదేశ్లో  నిన్న జరిగిన స్ధానిక ఎన్నికల మూడవ విడత ఫలితాల లో, పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలేం మండలం, బోగోలు గ్రామ సర్పంచ్ గా సంఘసేవకుడు తాడేపల్లి శాంతారావును గ్రామస్థులు గెలిపించుకున్నారు.

ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా, నువ్వా నేనా అన్నట్లుగా జరిగాయి. ప్రజలు సోషల్ వర్కర్ అయినా శాంతరావు వైపు నిలబడ్డారు.

శాంతారావు  వ్యక్తి గత సేవా కార్యక్రమాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఈ గెలుపు తర్వాత  గ్రామ ప్రజలు విజయ గర్వంతో  ఊరేగింపు జరిపారు.

వివరాలు:

తాడేపల్లి శాంతా రావు(35)  బిఎ దాకా చదివారు. భార్య  ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. రాజకీయ ప్రస్థానం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో ప్రారంభం అయింది. గ్రామ ప్రజలు విద్యావంతులైనప్పటికీ ,2010 దాకా గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ గారి విగ్రహం లేకపోవడం లోటుగా భావించారు.  యువతను విగ్రహ ఏర్పాటుకు ప్రోత్సహించాడు. దీనితో 2014 ఏప్రిల్ 14న విగ్రహ ప్రతిష్ట చేశారు.

అక్కడితో ఆయన కార్యక్రమాలు ఆగిపోలేదు. ఆయన సేవా కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించారు.  అందరికీ, అనుకూలంగా ఉంటూ, యువత ను సేవా కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేయించాడు. ఈ క్రమంలో, స్కూల్ లో చదివే పేద విద్యార్థులకు, పుస్తకాలు, భోజన పథకం అమలులో, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. పేదలు జబ్బు పడి వైద్యానికి డబ్బులు లేని పరిస్థితుల్లో, ఏలూరు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్సను అందించడం కోసం కృషి చేశారు.

శాంతారావు సర్పంచుగా ప్రమాణం

తను చిన్న కిరాణా షాపు యజమానే అయినా ఎవరైనా అడిగితే లేదు అనకుండా పేదలకు అరువుగా సరుకులు ఇచ్చేవాడు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఫించన్లు రాక పోతే అతనిని సంప్రదిస్తే వెంట పడి బాధితుల కోసం నిలబడి, సమస్య పరిష్కారం చేసే వాడు.

అందుకే గత ఎన్నికలలో వార్డు మెంబర్ గా గెలిచాడు. చిన్న ప్రయత్నంగా, సి.సి. రోడ్లు వేయించాడు. అందర్నీ కలుపుకొని పోయేవాడు. అతని కోసం గ్రామం లో బలమైన యువత, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో, శాంతా రావు సర్పంచు అయితే బాగుంటుందనే ఆలోచన యువతలో వచ్చింది.   మొత్తం పట్టు బట్టి ఎన్నికల బరిలోకి దింపారు. వైసిపి మద్దతు కూడా లభించింది. అనుకోకుండా దొరికిన ఈ రాజకీయ మద్దతుతో పోటీ తీవ్రమయింది. అవతలి పక్షానికి తెలుగుదేశం మద్దతునిచ్చింది.

నామినేషన్ దాఖలు చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్న సమయాన అనుకోకుండా ఆరోగ్య సమస్య తలెత్తింది. ఇక్కడ ఊరు ఊరంతా శాంతారావుకు అండగా నిలబడింది.  వెంటనే ఏలూరు హాస్పిటల్ లో చేర్పించారు.

ఆదివారం ఊరంతా ఆందోళన. అభిమానులు పూజలు చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదంతా ఆయనకు గ్రామం చూపిన సంఘీభావానికి తార్కాణం.

శాంతారావుకు మంచి చికిత్స సకాలంలో అందించారు. ఆయన కోలుకున్నారు.  సాయంత్రం 3.30గంటకు  సుమారు వెయ్యి మంది అభిమానులతో కోలాహాలంగా వెళ్ళి నామినేషన్ వేశారు. ఆ రోజే విజయం ఖరారు చేశారు.

అంతే స్థాయిలో తను మద్దతు తెలిపిన అభ్యర్థి కోసం తెలుగుదేశం పోరాడింది.  చివరికి 136 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొసమెరుపు ఏమిటంటే, అన్ని కులాల వారు, ముఖ్యంగా ఆధిపత్య గ్రామ రాజకీయాలలో, ప్రత్యర్థులుగా ఉండే, కమ్మ, వెలమ, కాపు, గౌడ, మాల, మాదిగ, అందరూ కలిసి శాంతా రావు  విజయానికి కృషి చేశారు.

“నిజంగా గొప్ప విజయం… మా గ్రామం పరువు కాపాడాడు.. ఇతను తప్ప మరోకరైతే మేము గ్రామం లో తలెత్తుకోక, పోయే వారం”ఇదీ బోగోలు గ్రామ ప్రజలు విజయ గర్వంతో ఇస్తున్నా నినాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *