రైతుల ఆందోళ‌న‌కు అమెరికా హ‌క్కుల సంఘాల మ‌ద్ద‌తు

(రాఘవ శర్మ)

భార‌త దేశంలో వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రెండున్నర నెలల పైగా చేస్తున్న రైతుల ఆందోళ‌న‌కు అమెరికాలోని 70 హ‌క్కుల సంఘాలు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

న్యూయార్క్ టైమ్స్‌లో బుధ‌వారం ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల అయ్యింది.

సంయుక్తంగా ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంఘాల‌లో అమెరికా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మాన‌వ హ‌క్కుల సంఘాలతో పాటు మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు కూడా ఉన్నారు.

మాన‌వ హ‌క్కుల‌ను కాల‌రాయ‌డాన్ని ఆపాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.

శాంతి యుతంగా నిర‌స‌న తెలియ‌చేస్తున్న వారిపై భాష్ప‌వాయుగోళాలు, వాట‌ర్ కెనాన్స్‌ను ప్ర‌యోగించ‌డం, అరెస్టులు చేయ‌డం, నిర్బంధించ‌డం వంటి రాజ్య హింస‌కు భార‌త ప్ర‌భుత్వ మే బాధ్యత వహించాలని ఆరోపించాయి.

” ఈ ఆందోళ‌న చాలా మంది రైతుల‌కు జీవ‌న్మ‌ర‌ణ పోరాటం. ఈ వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాలు పెద్ద ఎత్తున ఉన్న కార్పోరేట్ శ‌క్తుల స‌మ్మేళ‌నానికి ల‌భ్ది చేకూర్చ‌డానికి రైతుల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని ఆరోపిస్తూ, ఈ చ‌ట్టాల వ‌ల్ల ల‌క్ష‌లాది మంది రైతులు త‌మ పొలాల‌ను పోగొట్టుకుంటా”ర‌ని పేర్నాన్నాయి.

“రైలుతు దేశం న‌లుమూల‌లా నెల‌ల త‌ర‌బ‌డి శాంతియుతంగా త‌మ నిర‌స‌న‌ను తెలియ‌చేస్తున్నారు. ఫ‌లితంగా వారు ప్ర‌భుత్వం నుంచి హింస‌ను, ప్ర‌తీకారాన్ని ఎదుర్కొంటున్నారు. నిర‌స‌న తెలుపుతున్న ప్రాంతాల‌లో నీటి , విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను, ఇత‌ర స‌హా యాన్ని ప్ర‌భుత్వం అంద‌కుండా చేయ‌డం వల్ల వారు చాలా ఇబ్బందిప‌డుతున్నారు. చాప‌కింద నీరులా ఇంట‌ర్‌నెట్ సేవ‌ల‌ను కూడా నిలుపుద‌ల‌చేశారు. ప‌త్రిక‌లు, ఛానెళ్ళ‌ను కూడా సెన్సార్ చేసి బెదిరిస్తున్నారు. నిర‌స‌న కారుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను, జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేస్తూ, వారిపై దాడులు చేస్తూ, నిర‌వ‌ధికంగా నిర్బంధిస్తున్నారు ” అని ఆ ప‌త్రిక‌లో ఇచ్చిన ప్ర‌క‌ట‌న తెలియ‌చేస్తోంది.

అన్ని ప్ర‌జాస్వామిక జాతులు ఏర్పాటు చేసుకున్న హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌పంచ పౌరుల‌కు పిలుపు నిస్తూ ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది.

” భార‌త దేశంలో కార్మికుల‌ను, క‌ర్ష‌కుల‌ను, నిర‌స‌న తెలుపుతున్న వారిని నిందించ‌డాన్ని ఖండించ‌డానికి మాతో చేతులు క‌ల‌పాల‌ని అమెరికాలో, ప్ర‌పంచం యావ‌త్తు ఉన్న మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌క వీరుల‌కు పిలుపునిస్తున్నాం ” అని ఉంది.

అ ప్ర‌క‌ట‌న‌లో సంత‌కాలు చేసిన అనేక మాన‌వ హ‌క్కుల సంఘాలతో పాటు హిందూస్ ఫ‌ర్ హ్యూమ‌న్ రైట్స్‌, గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ అగైనెస్ట్ హేట్ అండ్ ఎ క్స్ట్రిమిజ‌మ్‌, న్యూయార్స్ ట్రేడ్ ఫెయిర్ ట్రేడ్ కొలీష‌న్‌, ద రెవ‌ల్యూష‌న‌రీ ల‌వ్ ప్రాజెక్ట్ అండ్ విన్ విథౌట్ వార్ వంటి సంస్థ‌లు ఉన్నాయి.

రైతుల నిర‌స‌న ద్వారా న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌తీయ‌డానికి అంత‌ర్జాతీయంగా కుట్ర జ‌రుగుతోంద‌ని భార‌త ప్ర‌భుత్వం ఆరోపిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో రావ‌డం విశేషం,

టూల్‌కిట్ డాక్యుమెంట్ల ద్వారా జ‌న‌వ‌రి 26న ఢిల్లీలో హింస‌కు ప‌థ‌క‌ర‌చ‌న చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై దిశార‌వి, నికితా జాకోబ్‌, శంత‌నూ ములుక్ లు కోర్టులో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు.

పాప్‌స్టార్ రెహ‌న్న‌, వాతావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రేటాతుంబ‌ర్గ్ వంటి వారు మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని ఆరోపించ‌డం, అమెరికా, బ్రిట‌న్‌ల‌లో చాలా మంది ఈ వాద‌న‌ను బ‌ల‌ప‌ర‌చ‌డంతో భార‌త దేశంలో రైతుల ఆందోళ‌న ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *