పొలిటీషన్స్ లో జెంటిల్ మన్ (Gentleman) పొలిటీషన్స బాగా అరుదు. ఒక ఇరవై ఏళ్ల కిందటి దాకా అన్ని రంగాల్లో జెంటిల్ మెన్ ఉండేవారు. వాళ్ల ను చూసి గర్వపడే వాళ్లు, దేశ భవిష్యత్తుకిక డోకా లేదనుకునే వాళ్లు. అయితే, ఆ యుగం వెళ్లిపోతా వుంది. దాంతో పాటే జెంటిల్ మెన్ పొలిటీషన్స్ కూడా మాయమవుతున్నారు. అక్కడక్కడా మాత్రమే కనిపిస్తారు. అలాంటి వాళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఒకరు.
జెంటిల్ మన్ కి ఇపుడున్న పాలిటిక్స్ కి పొత్తు కుదరుదు. ఎన్నికల్లో ఏదో ఒక సారి గెలిచినా రెండో సారి వాళ్లు గెలవడం కష్టం. 2019లో కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురయింది.
రాజకీయాల్లోకి రావడమే చాలా ఆలస్యంగా వచ్చారు. ఆయనకున్న ఉన్న కుటుంబ రాజకీయ, సాంఘిక నేపథ్యానికి, ఆయన ఎపుడో రాజకీయాల్లోకి వచ్చి ఉండాలి. రాలే. తెలంగాణ వచ్చే ముందు 2013లో తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ ఎస్) లో చేరారు. చేవెల్ల నుంచి లోక్ సభకు పోటీ చేశారు. సుమారు 75 వేల వోట్ల మెజారిటితో గెలిచారు. రాజకీయాలను గమనిస్తూ వస్తూ, టిఆర్ ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలో ఆయన చేరడమే వింత. తర్వాత ఏమయింది? ఆయన టిఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ టికెట్ మీద చెవెళ్ల నుంచి మళ్లీ పోటీ చేశారు. ఓడిపోయారు.
ఆయన టిఆర్ ఎస్ లో ఏ కారణంతో చేరినా, బయటికి రావడం వెనక బలీయమయిన కారణము ఉండి ఉంటుంది. దాన్నింకా ఆయన వెల్లడించలేదు. ఈ మధ్య ఆయన పార్టీ మారతాడని, బిజెపిలోకి పోతాడని వార్తలొచ్చాయి. ఇవన్నీ పుకార్లేనేమో. ఆయనింకా ఏ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ నేతగానే కొనసాగతున్నారు.
కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి తెలియని వాళ్లకి ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఆయన కొండా వెంకట రంగారెడ్డి మనవడు. రంగారెడ్డి జిల్లా పేరు ఆయన జ్ఞాపకార్థం పెట్టిందే. రంగారెడ్డి గురించి అందరికి తెలుసు. ఆయన తెలంగాణాలో జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాడు. నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో మంత్రి గా ఉన్నారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉప ముఖ్యమంత్రి కూడా. విశ్వేశ్వరెడ్డి తండ్రి జస్టిస్ కొండా మాధవరెడ్డి. ఎపి హైకోర్టు, బొంబాయి హైకోర్టులలో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ రోజుల్లో బాగా పేరున్న జడ్జియే కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న న్యాయమూర్తిగా ఆయనకు పేరుండేది.
2014 ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన దాని ప్రకారం విశ్వేవ్వరెడ్డి తెలంగాణలో ఒక సంపన్న అభ్యర్థి. ఆస్తిని రు. 528 కోట్లుగా చూపెట్టారు. రాజకీయాల్లోకి రాకముందుకు ఆయన పేరెపుడూ వార్తల్లో లేదు.
రాజకీయాల్లోకి గొప్ప గొప్ప ధ్యేయాల్తో వచ్చినట్లు చెప్పుకున్నా, చాలా మంది, రాజకీయాల్లో మాత్రమే దొరికే డబ్బు, అధికారం, వనరుల మీద పట్టు, దర్పం, ప్రివిలేజెస్ కోసమే వస్తారు. ఎవరో కొందరే వీటికి దూరంగా ఉంటారు. ఇలాంటి అరుదైన, అంతరించిపోతున్న జాతికి చెందిన ఎంపి కొండా.
రాజకీయాల్లో భజనకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. టిఆర్ ఎస్ లో ఉన్నపుడు ఆయన భజన సంఘంలో లేరు. వివాదాస్పదమయిన స్టేట్ మెంట్లు, చీటికి మాటికి ఏదో ఒక విషయం మీద రౌద్రంగా రియాక్టయి పోయి, నాయకుడిని అయిన దానికి, కాని దానికి దురభిమానంతో డిఫెండ్ చేస్తూ, పార్టీ బాస్ కంట పడాలనే తాపత్రయం ఎపుడూ చూపలేదు.
ఈ రెండు లేకుండా ప్రాంతీయ పార్టీలో కొనసాగడం కష్టం. ఆయనెందుకు పార్టీలో చేరారో, ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. బహుశా ఎపుడూ ఈ నిజం బయటకు రాదు.
ఏది ఏమయినా 2019 ఎన్నికల్లో కొండా ఓడిపోవడం హుందా రాజకీయాలకు తగిలిన పెద్ద దెబ్బ.
సరే ఇపుడు అసలు విషయానికి వద్దాం.
రాజకీయ నాయకు లెపుడూ రాజకీయాల్నుంచి బయటకు రాలేరు. పూర్వం రాజకీయ నాయకులకు ఇతర వ్యాపకాలుండేవి. ఉదాహరణకు, దామోదరం సంజీవయ్య కవి. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి మంచి రాజకీయ పరిశోధకుడు.మండలి వెంకట కృష్ణారావు సాహిత్యాభిమాని. ఇలాంటి అభిరుచులిపుడు ఎవరికీ ఉండవు. ఆ రోజుల్లో నేతలు ఈ అభిరుచిని వదులుకోలేదు. పుస్తకాలు రాశారు. ముందుమాటలు రాశారు. ఇపుడయితే చాలా మంది రాజకీయాలు దాటి రాలేరు.
అయితే, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇపుడు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయాలు కనిపించకుండా ఒక యుట్యూబ్ చానెల్ ప్రారంభించారు.
Konda Visweswar Reddy పేరు మీదే ఈ చానెల్ ఉంది. తాజాగా మొదలయినట్లుంది. కేవలం 86 మంది సబ్ స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఈ రోజు చైనా గ్రేట్ వాల్ మీద వీడియో కథనం విడుదల చేశారు. చిత్రం ఏంటంటే, అప్పటి చైనాలో జరిగిందంతా ఇపుడు తెలంగాణలో జరుగుతున్నట్లనిపిస్తుంది ఈ కథనం చూస్తే. కత్తితో పొడిచే వ్యంగ్యం ఇందులో కనిపిస్తుంది.
ఈ వార్త రాస్తున్నప్పటికి ఈ వీడియో చూసిన వాళ్లు కేవలం 21 మంది మాత్రమే. విశేషమేమిటంటే, చెత్త చెత్తగా యూట్యూబ్ చానెల్స్ పుడుతున్నపుడు కొండా లాంటి పెద్ద మనిషి చక్కటి చానెల్ ప్రారంభించడం, దారి తప్పి దాహం గొన్నవాడికి కొండల్లో ఎక్కడో బుగ్గ కనిపించినట్లయింది.
ఈ రోజు అంటే ఫిబ్రవరి 18 చైనా చక్రవర్తి కిన్ షి యువాంగ్ (Qin Shi Huang) జన్మదినం. చైనా తొలి చక్రవర్తి ఆయన. భారతదేశాన్ని ఏకీకృతదేశంగా చేసిన మన చకవర్తి అశోకుడిలా ఆయన విశాల చైనా గా మార్చిన చక్రవర్తి. ఈ తేదీని ఆసరా చేసుకుని ఇది గ్రేట్ వాల్ చుట్టూ, కిన్ షి చుట్టూ అల్లిన చైనా కథ యా లేక మన చుట్టూర జరుగుతున్నతెలంగాణ కథయా అనే అనుమానం వస్తుంది.
ఆ రోజుల్లో చిన్న చిన్న రాజ్యాలు కట్టుకున్న సరిహద్దు గోడల్ని కలిపి వేసి సుదీర్ఘమయిన చైనా గ్రేట్ వాల్ ను నిర్మించాడు.
ఈ కథని కొండా చాలా చక్కగా, విపులంగా, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా, నిదానంగా, సులభ తెలంగాణ యాసలో తెలంగాణ రాజకీయ పొడుపు కథలా వినిపించారు. అయితే, ఈ కథని ఆయన తేదీ (ఫిబ్రవరి 18, చక్రవర్తి జయంతి) వల్ల ఎంచుకున్నారా, దీని వెనక ఏదయినా రాజకీయ కోణం ఉందా అనేది ఆయన ఎక్కడా వెళ్లడించ లేదు.మనం పట్టుకోవలసిందే.
అయితే, ఈ కథనంలో తెలంగాణాలో ఇపుడు జరుగుతున్న రాజకీయ చిత్రాలు విచిత్రాలు కట్టడాలు, కూల్చడాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల జరిగిన రెవిన్యూ మార్పులు, జిల్లాల ఏర్పాటు, రైతులు ఏం పంట పెట్టాలి, ఏపుడు పెట్టాలనేవి, రైతుల కమతాలు ఏ షేప్ లో ఉండాలి అనేవి కూడా కనిపిస్తాయి. వాస్తు, లక్కీ నెంబర్లు, జ్యోతీషాలు కనిపిస్తాయి. ఇపుడు తెలంగాణా లో జరుగుతున్నవన్నీ ఎపుడో చైనాలో జరిగాయే అనిపిస్తుంది. చరిత్ర నాతోనే మొదలయింది, అంతకు ముందు చరిత్ర లేదనేలా చైనా చక్రవర్తి ప్రవర్తించి హెరిటేజ్ భవనాలన్నీ కూల్చేశాడు.
చైనా చక్రవర్తి ఎవరితో కలిసే వాడు కాదు. ఎవరితో సంప్రదించేవాడు కాదు. తమాషా ఏంటంటే అవసరమొచ్చినపుడు ప్రజల కాళ్ల మీద పడటం,పదవిలోకి రాగానే కాల్చుకుతినడం చైనా చక్రవర్తి చేసేవాడు. ఇవన్నీ వింటూంటే ఏదో పరిచయమున్న కథలాగా అనిపిస్తుంది.
ఈ యుట్యూబ్ చానెల్ ఉద్దేశం ఆయన ఎక్కడా చెప్పలేదు. ఎపుడైనా సమాజంలో అంతిమంగా ప్రతిదీ రాజకీయంలోనే ముగుస్తుంది. (There is nothing like apolitical). ఎవరేం చెప్పినా అందులో వ్యక్తిగతం (subjective element) ఉంటుంది. దీని కూపీ లాగాలంటే మరికొన్ని వీడియోల కోసం వేచి చూడాలి.
ఆయన ఈ చానెల్ ని ఏలా తీసుకెళ్తారో నేటి ఒక్క వీడియో తో చెప్పడం కష్టం. చరిత్ర సంఘటనల్లో కూడా రాజకీయాలుంటాయి. వాటిని తీసేసి కేవలం సినిమా కథలాగా చెబుతారా? ఈ చారిత్రక సన్నివేశాల అర్థం కూడా చెబుతారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.
మొత్తానికి రాజకీయనాయకుల దగ్గరి నుంచి వూహించని ప్రయోగం కొండా చేస్తున్నారు. ఆయన ప్రాజక్టు డీసెంట్ గా కొనసాగాలని, మంచి మంచి వీడియో కథనాలు రావాలని ఆశిద్దాం.