భారతదేశపు ‘మెట్రోమన్’ ఇ. శ్రీధరన్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇండియాలో మెట్రో మైలుమార్గ నిర్మాణానికి ఆధ్యుడని పేరున్న ఆయన 89 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వస్తున్నారు. అదీ విశేషం.
ఆయన కేరళకు చెందిన వ్యక్తి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని తాను పార్టీకి వదిలేశానని అన్నారు.
అయితే, బిజెపి లో 75 సంవత్సరాలు దాటిన వారికి టికెట్ ఇవ్వరాదనే నియమం ఉంది. దీని ప్రకారమే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు.
అందువల్ల ఈ నియమాన్ని శ్రీధరన్ విషయంలో సడలిస్తారా అనే ది ప్రశ్న.
కేరళలో తాను, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలను చూశానని చెబుతూ ఈ రెండు ప్రభుత్వాధినేతలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదాని కంటే తాము పైకి రావాలనే తపన ఎక్కువ గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తాను భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నానని ఆయన మీడియాకు తెలిపారు.
ఫిబ్రవరి 21 న కేరళలో జరిగే ఒక ర్యాలీ సందర్భంగా ఆయన బిజెపిలో చేరతారు. ఈ ర్యాలీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ జండా వూపి ప్రారంభిస్తారు. శ్రీధర్ బిజెపిలో చేరుతున్న విషయాన్ని ఈ రోజు మొదట కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ కేరళలో ప్రకటించారు.
శ్రీధరన్ రిటైరయినప్పటి నుంచి మల్లాపురంలో నివసిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వాల తీరు చూశాక తాను బిజెపి లో చేరాని నిర్ణయించకున్నానని, లాంఛనంగా సభ్యత్వం తీసుకోవడమే మిగిలి ఉందని ఆయన అన్నారు.
140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో ప్రస్తుతం బిజెపి ఒకే ఒక్క సభ్యుడున్నారు. శ్రీధరన్ వంటి వారు చేరడం వల్ల పార్టీ హిందూత్వ స్వభావం కొంత పలచబారి పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడవచ్చు.
1990లో రైల్వే లో సీనియర్ ఇంజనీర్ గా రిటైరయ్యాక ఆయన కొంకణ్ రైల్వే ప్రాజక్టు చీఫ్ గా చేరారు. తర్వాత 1995లో ఢిల్లీ మెట్రో రైలు ప్రాజక్టు లోకి వచ్చారు. ఆయన నాయకత్వంలో ఈ ప్రాజక్టు సకాలంలో పూర్తి కావడంతో ఆయన అంతర్జాతీయ కీర్తి నార్జించారు. దీని తోనే భారతదేశంలో మెట్రో రైలు యుగం ప్రారంభమయింది.
శ్రీధరన్ ఢిల్లీ మెట్రో నుంచి 2011 లో రిటైరయ్యారు. 2001 లో ఆయన పద్మశ్రీ, 2008లో పద్మవిభూషణ్ గైరవం దక్కాాయి.