వైజాగ్ స్టీల్ అమ్మకానికి జగనే మధ్యవర్తి: బోండా తీవ్ర ఆరోపణ

విశాఖ ఉక్కుఫ్యాక్టరీని రూ.5వేలకోట్లకు  అమ్మేసేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందే ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్రమయిన ఆరోపణచేశారు.

ఇది ఒకటి రెండు రోజులుగా రాజకీయ చర్చల్లో  వినవస్తున్న ఆరోపణ.ఈ మధ్య జగన్ పదే పదే ఢిల్లీ పర్యటనలు చేసింది కూడా ఈ ప్రతిపాదన మీదేనని ఆరోపణ వస్తున్నది.  మొదట రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి జగన్  మీద ఈ ఆరోపణ చేశారు. దానిని మరింత ముందుకు తీసుకుపోతూ ఈ రోజు బోండా బహిరంగంగా విశాఖ స్టీలు అమ్మకానికి మధ్యర్తి జగననే నొక్కి చెప్పారు.

దక్షిణ కొరియా కంపెనీతో ఈ అమ్మకానికి సంబంధించి సంప్రదింపులు జరిపిన జగన్, ప్రజలను నమ్మించడానికి తూతూమంత్రంగా ప్రధాని మోదీకి  లేఖలు రాస్తున్నాడని బోండా ఆరోపించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగిన ప్రాణ త్యాగాలను లెక్క చేయకుండా తమ స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలకోసం పాలకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాకట్టుపెడుతున్నారని  బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 2019 అక్టోబర్ 29న  తన ఇంటిలో ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్న ఫొటోలను బొండా ఉమా మీడియాకు చూపించారు

బోండా ఆరోపణల వివరాలు

దక్షిణ కొరియాకు చెందని పోస్కో కంపెనీతో కుమ్మక్కై 2లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను, రూ.5వేల కోట్లకు కొట్టేయాలని వైసీపీ ప్రభుత్వం పథకరచన చేసింది.

2019 అక్టోబర్ 29న దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో, కంపెనీ ప్రతినిధులతో జగన్ తన నివాసంలోనే ఈ వ్యవహారంపై మంతనాలు జరిపాడు.

దానికోసమే ఢిల్లీ కేంద్రంగా జగన్ పావులు కదిపాడు.  దానివల్లే కేంద్రపెద్దలు పార్లమెంట్ లో ప్రకటనం చేయడం జరి గింది.

కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందించాక కూడా వైసీపీకి చెందిన 28 మంది ఎంపీలు ఢిల్లీలో ఎందుకు నోరెత్తడం లేదు?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి తామంతా సిద్ధమనే మాట వారి నోటి నుంచి ఎందుకు రావడం లేదు?

పార్లమెంట్ సమావేశాలు జరుగతున్న సమయంలో, వాటిని బహిష్కరించి, రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్ధతుగా అధికార పార్టీ ఎంపీలు ఎందుకు నిరసన తెలియచేయలేదు.

కంటితుడుపు చర్యగా జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు, కానీ అంతకుముందే, చాపకింద నీరులా నీకింత, ‘నాకింత, నీకింత’ అనే ఒప్పందం ప్రకారమే ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి అంగీకరించడం జరిగింది.

ఢిల్లీ కేంద్రంగా దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధులతో జగన్ జరిపిన చర్చలు కూడా ఫలప్రదమయ్యాయి.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం జగన్ కు నిజంగా ఇష్టంలేకపోతే, ఆయన తనఎంపీలతో పార్లమెంట్ కేంద్రంగా పోరాడమని వారికి ఎందుకు సూచించలేక పోయాడు.

కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే, తమ పార్టీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేస్తారనే మాట జగన్ నోటినుంచి ఎందుకు రావడం లేదు.

దక్షిణకొరియా కంపెనీతో ఒప్పందం చేసుకొని, రూ.5వేలకోట్లకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొట్టేయడం కోసం జగన్ సిద్ధమయ్యాడు కాబట్టే, ఇప్పుడు తూతూమంత్రంగా లేఖలు రాసి ఊరుకుంటున్నాడు.

విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి కార్మికులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ముఖ్యమంత్రి ఒక్కరోజైనా ఎందుకు వారివద్దకు వెళ్లి మాట్లాడలేకపోయాడు.

ఇప్పటికే విశాఖలోని భూములు, పెద్దపెద్ద ఆస్తులు, క్లబ్బులు, భవనాలను ఏ2 నేత్రత్వంలో ఆక్రమించేశారు, వాటి రక్షణ కోసమే విజయసాయిని విశాఖపట్నానికి జగన్ సామంతరాజుగా నియమించాడు.

వైసీపీకి చెందిన 28మంది ఎంపీలు జగన్ ఆర్థిక వ్యవహారాలు చక్క బెట్టడానికి, ఆయనపై ఉన్న కేసులను తొలగించడానికి పనిచేస్తు న్నారు తప్ప, వారు ఏనాడూ రాష్ట్రంకోసం గొంతెత్తిన దాఖలాలు లేవు.

1998- మే23వ తేదీన టీడీపీఎంపీగా ఉన్న ఃఎర్రన్నాయుడు, ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉక్కుశాఖా మంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ను కలిసి, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని నష్టాలనుంచి గట్టేక్కేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రం సహాయం చేయాలని, ఫ్యాక్టరీకి ఇచ్చిన రుణాలను ఈక్వీటీలుగా మార్చాలని, ఫ్యాక్టరీపై రుణభారం పడకుండా చూడాలని కోరడం జరిగింది.

2000 సంవత్సరంలో ఆనాటి టీడీపీఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, ఎర్రన్నాయుడితో కలిసి మరోసారి కేంద్రంవద్ద విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రస్తావన చేయడం జరిగింది.

14-03-2006న మరోసారి ఎర్రన్నాయుడు గారు పార్లమెంట్ కేంద్రంగా విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత ఐరన్ గనులు కేటాయించాలని ఆనాడు ఆయన డిమాండ్ చేయడం జరిగింది.

టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఏఏ సందర్భాల్లో ఎవరెవరితో మాట్లాడారనే వివరాలను అవసరమై తే తాడేపల్లికి పంపడానికి తాముసిద్ధంగా ఉన్నాము.

ఇప్పుడున్న ముఖ్యమంత్రి దక్షిణకొరియా కంపెనీతో ఒప్పందం చేసుకున్నరు.

ఒకపక్క కార్మికుల ఉద్యమం చేస్తుంటే, మరోపక్క ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడిచేస్తుంటే, ఇవేవీ ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బే ముఖ్యమన్నట్లుగా విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు ముందుకు వెళుతున్నాడు.

జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తక్షణమే తనపార్టీ ఎంపీలతో రాజీనామాలుచేయించాలి.

నిత్యం జగన్ ను సమర్థించే పొలిటికల్ కామెంటేటర్ తెలకపల్లి రవి, విశాఖ ఉక్కు అమ్మకపు సూత్రధారి జగనే అని చెప్పారన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *