కాల్లు మొక్కుతా, ఉద్యోగం నుంచి తీసేయొద్దు….

ఒక మహిళాఫీల్డ్ అసిస్టెంటు ఆవేదన ఇది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే బతుకు ఆగమైతది, ఉద్యోగాన్ని తీసేయద్దు అని ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు సమన్వయ సమితి ఛెయిర్మన్  పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఫోటో ఇది.

‘పొట్టలు కొట్టొద్దు సారూ, పాదాలు పట్టుకుంటా. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం. ఉన్న కొలువులు ఊడిపోతాయని ఉహించలే. మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా పర్వాలేదు.  ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయండి. తెలంగాణ ఉద్యమం లో పోరాడినం. కేసీఆర్ బిడ్డకు కొలువు పోతే ఏడాది గడవక ముందే కొలువు ను ఇచ్చారు.
కేసీఆర్ బిడ్డ లాగానే మేము అనుకోని మా ఉన్న కొలువులు మాకివ్వండి. కొంగు పట్టి అడుగుతున్న మీ బిడ్డ లాంటిదాన్ని సారు.
ఫిల్డ్ అసిస్టెంట్ లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి ముందు కొంగు సాపి కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని అడుక్కుంటున్న ఖమ్మం జిల్లా మహిళా ఫీల్డ్ అసిస్టెంట్.’ అని ఆమె ప్రాధేయపడ్తున్నది.ఫోటో చాలా స్పష్టంగా ఆవేదనన వ్యక్తీకరిస్తున్నది. దయనీయమయిన తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితిని చూపెడుతుంది.  ఇది వైరలవుతున్న ఫోటో…

ఈ ఫీల్డ్ అసిస్టెంటులంతా జాతీయ ఉపాధి హామీ (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme) పథకంలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల రిక్రూట్ మెంట్ లేకపోయే సరికి ఇదే మహా ప్రసాదమనుకుని ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా ఈ ఉద్యోగాల్లో చేరారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. అయినా సరే, వారికి ఈ ఉద్యోగం కొంత ఉపశమనం కల్గించింది.

ఇలా 7700 మంది ఉద్యోగులున్నారు. వీరందరిని గత ఏడాది మార్చిలో తొలగించేశారు. వీళ్లలో చాలామంది ఈ పథకం మొదలయినప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. వీళ్లకి వయసు పైబడింది. మరొక ఉద్యోగంలోకి తీసుకోవడం చాలా కష్టం. ఈ ఉద్యోగాలు పోవడం తో వీరి బతుకులు సంక్షోభంలో పడిపోయాయి.చాల మంది పిల్లలున్న తల్లితండ్రులు. ఈ ఉద్యోగాలు పోయాక సుమారు 14 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు వీరు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *