వరంగల్ లో పచ్చటి చెట్ల ఊచకోత… దీనికి శిక్ష ఉండదా?

హరితహార పథకాన్ని హాస్యాస్పదం చేస్తున్న అటవీ రక్షణ శాఖ. ఇక్కడ కంచె చెట్టును  నరికేస్తున్నది.

(నల్లెల రాజయ్య)

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, వన సంరక్షణ మన సంరక్షణ, హరిత హారం తెలంగాణకు మణిహారం అని పాలకులిచ్చే నినాదాలు వినసొంపుగానే ఉంటున్నాయే తప్ప ఆచరణలో విఫలం కావడం నేడు రివాజుగా మారింది.

కాని వరంగల్ లో నిర్దాక్షిణ్యం నరికి చంపేస్తున్నారు.పట్టపగలు సాగుతున్న హత్యలివి. ఒక చిన్న మొక్క పెరిగి పెద్దదయ్యేందుకు దశాబ్దాలు పడుతుంది. అయితే, ఇదే గమనించకుండా అకారణంగా నగరంలోని మాన్లన్నింటిని నరికి చంపేస్తున్నారు. కొన్ని చోట్ల ఆనవాళ్లు కూడా లేకుండా బోదెలను కూల్చి బూడిద చేేస్తున్నారు. హృదయమున్న ఎవరికై చివుక్కున గుచ్చుకునే ఈ దశ్యాలెన్నో వరంగల్ లో కనబడతాయి. దీనికి చట్ట పరంగా శిక్ష లేదా?

ఈ పచ్చ హత్య చేస్తున్నదెవరో స్మగ్లర్లు కాదు.అటవీ రక్షణ శాఖ అనే ప్రభుత్వ విభాగంమే.

చెట్లను పెంచి అడవులుగా తీర్చిదిద్దాల్సిన ఈ శాఖ అటవీ భక్షణ శాఖగా మారిపోతుండటం తెలంగాణలో విషాదకర పరిణామం.

దీనికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న మొన్న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జరిగిన భారీ వృక్షాల నరికివేతలాంటి వికృత విధ్వంస కృత్యాలే సాక్ష్యంగా నిలుస్తాయి.

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ములుగు రోడ్డు సమీపాన గల లాల్ బహదూర్ కళాశాల ఆవరణలో ఎలాంటి అడ్డంకులుగా లేని చల్లని నీడనిచ్చే భారీ వృక్షాలుండెటివి. ఈ వృక్షాలను 20 సంవత్సరాల క్రిందట ఆ కళాశాలలో చదివిన ఆనాటి విద్యార్థులు నాటి పెంచి పోషించిన సుమారు 20 భారీ వృక్షాలను సహేతుక కారణాలు చూపకుండా సమూలంగా నరికించేయటం దారుణంగా జరిగిపోయింది. కాలేజీ యాజమాన్యం తాము చేసిన వికృత కృత్యాలకు ఆనవాళ్ళు లేకుండా చేయటానికి చెట్ల మొదళ్లను కాల్చిబూడిద చేస్తుండటం గమనార్హం.

ఈ నరికివేతలు,కాల్చివేతలపై పూర్వ విద్యార్థులు, పర్యావరణ,ప్రకృతి ప్రేమికులు కాలేజీ యాజమాన్యంను నిలదీసి ప్రశ్నించగా వారు చెప్పే కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

 


ఆ భారీ వృక్షాలపైన వానరమూకలు ఆటలాడుకోవటం,ఆకులు రాలిపడటం,కొమ్మలు విరిగి కార్లమీద పడటం మరియు తరగతి గదుల్లోకి వెలుతురు రాకపోవటం లాంటి అసంబద్ధ కారణాల వల్ల పదిపదకొండు వృక్షాలను మాత్రమే నరికేయించామని బుకాయిస్తున్నారు . ఇదంతా చూస్తుంటే” ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టున్నది.”

నరికివేతలకై వరంగల్ అర్బన్ జిల్లా అటవీ శాఖాధికారుల అనుమతులు తీసుకున్న తర్వాతనే నరికేయించామని బాహాటంగా చెపుతున్నారు.

వాస్తవంగా అటవీ రక్షణ శాఖాధికారులను కాలేజీ యాజమాన్యం నరికివేత అనుమతి కోరినప్పుడు అటవీ శాఖ ప్రాథమికంగా చేయవలసిన క్షేత్ర సందర్శన చేయకుండానే అనుమతులు మంజూరు చేయడం మూలంగానే ఈ భారీ వృక్షాలు నేలమట్టమైనట్లుగా వెల్లడవుతున్నది.కార్యాలయంనుండి అడుగు బైట పెట్టకుండానే ఎకాఎకిన అనుమతులిచ్చిన పర్యవసానంగానే ఇది జరిగిపోయినట్లుగా భావించవలసి వస్తున్నది.

అటవీ రక్షణ చట్టాలు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఘనాతి ఘనమైన హరితహార పథకాన్ని అటవీ శాఖాధికారులు హాస్యాస్పదం చేయడమే ధ్యేయంగా మారిందనుటలో అతిశయోక్తి లేదు.దీన్ని అటవీ శాఖ చేసిన అతి పెద్ద నేరంగా భావించవలసి వస్తున్నది.

హరిత హార కార్యక్రమంలో నాటిన మొక్కలను మేకలు లేదా పశువులు మేస్తే అరెస్టులు ,పోలీస్ కేసులు,జరిమానాలు విధిస్తున్నసంబంధిత అధికారులు 20 సంవత్సరాల వయస్సుగల ,ఇరవై దనుక భారీ వృక్షాలను నిర్ధాక్షిణ్యంగా ( సమూలంగా )నరికేందుకు అనుమతించిన అర్బన్ జిల్లా అటవీ శాఖ అధికారులు భారీ మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన చేస్తూ జిల్లాలో ఏ ఒక్క మొక్క చచ్చినా మీ జీతాలనుండి రికవరీ చేస్తామని హెచ్చరిస్తుండగా ,వరంగల్ అర్బన్ జిల్లా అటవీ శాఖాధికారులకు మరియు లాల్ బహదూర్ కళాశాల యాజమాన్యానికి జరిగిన వికృతపరిణామాలపై ఇంతకంటే భారీ శిక్షలు వేసినప్పుడు మాత్రమే ఇలాంటి నరికివేత విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయనీ పర్యావరణ మరియు ప్రకృతి ప్రేమికులు అభిలసిస్తున్నారు.

జిల్లా ఉన్నతాధికారియైన జిల్లా కలెక్టర్ గారు ఆ దిశగా చేపట్టే చర్యల్లో భాగంగా సమగ్ర దర్యాప్తు జరిపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేద్దాం.

(నల్లెల్ల రాజయ్య, పర్యావరణ మరియు ప్రకృతి ప్రేమికుడు.
వరంగల్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *