దూసుకుపోతున్న నిమ్మగడ్డ వైసిపికి చిక్కుతాడా?

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కళ్లెం వేసేందుకు అధికారంలో ఉన్న వైసిపి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఒక వైపు నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్ మోషన్ తీసుకువచ్చి ఆయనను ప్రివిలేజెస్ కమిటీ ముందుకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన హాజరుకాక అరెస్టు చేయిస్తామనే సంకేతాలు వెళ్లుతున్నాయి. నిన్న మాజీ ఆర్టీ ఎకమిషనర్  టివిజయబాబు వైసిపి నేతలకు వీనులవిందైన విషయాలు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలాగే దూసుకుపోతుంటే, ఆయన అక్కడి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ  కళ్లెం వేసిందని, జైలు శిక్ష దాకా వ్యవహారం వెళ్లిందని చెప్పారు.

ఈ రోజు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమయి రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చే విషయం చర్చించిందని కమిటీ ఛెయిర్మన్ కాకాణి గోవర్దన్ వెల్లడించారు. తొందర్లోనే కమిటీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. రమేష్ కుమార్ ను కమిటీ ముందుకు రప్పించే ఆలోచన ఉందని,దానిని పరిశీలిస్తున్నామని చెబుతూ ఆయన మహారాష్ట్ర కమిషనర్ వ్యవహారం ప్రస్తావించారు.

మరొక వైపు ఆయన మీద  అన్ని వైపుల నుంచి వాగ్దాడులు సాగుతున్నాయి. ప్రభుత్వ అడ్వయిజర్ సజ్జల రామకృష్ణారెడ్డి  మొదలుకుని, శాసన సభ్యులు,మంత్రులు ఇతర నేతలు పదునైనా బాణాలు విసురుతున్నారు.

ఈ బాణాలను, ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదనలను ఖాతరు చేయకుండా రమేష్ కుమార్ రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో పర్యటిస్తున్నారు. చిత్రమేమిటంటే జిల్లా యంత్రాంగాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రశంసిస్తున్నారు.  దీనితో పాటు, తాను ఎవరికీ భయపడనని కూడా మొన్న కడపలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

ఆయన స్థానంలో మరొక అధికారి పరిస్థితి ఎలా ఉండేదో కాని, రమేష్ కుమార్  ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. గుళ్లుగోపురాలు తిరిగి దేవత ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఆయన కు టిడిపి అండ ఉందని, టిడిపి ఎజండా ప్రకారమే ఆయని చేస్తున్నారని వైసిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ రోజు ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరొక బాణం వేశారు.

గోదావరి జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఎలక్షన్ కమిషనర్ పరామర్శించటం ఏంటిఅని ప్రశ్నిస్తూ  ఇలాంటి పరామర్శలు చేయడానికి పోలీసులు ఉన్నారుగా..మీరు వెళ్లటమేంటి? అని ప్రశ్నించారు.

నిమ్మగడ్డ ప్రచారానికి బాగా అలవాటు పడ్డారు. టీవీల్లో కనిపించటానికి తాపత్రయ పడుతున్నారు.రమేష్ కుమార్ గారికి పిచ్చి బాగా
ముదిరిపోయింది అని అంటూనే, ‘ కుక్క పని కుక్క చేయాలి,
గాడిద పని గాడిద పని చేయాలి,ఎన్నికల అధికారి తమ విధులు నిర్వహించాలి అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. ఇది సరైన విధానం కాదు,’ చరక వేస్తూ సలహా ఇచ్చారు.

బహుశా పట్టాభిని పరామర్శించటానికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్తారేమో అనిమరొక వ్యంగ్యాస్త్రం కూడా సంధించారు.

నిమ్మగడ్డ తెలుగుదేశం ప్రోత్సాహంతో పని చేస్తున్నాడని ఆరోపించారు.

నేటి నుండి సత్తెనపల్లి నియోజకవర్గ నకిరికల్లు మండలంలో పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కావటంతో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
సాధ్యమైనంత మేర గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైతే రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని కూడా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *