ఎన్నికల కమిషన్ యాప్ చేసింది టిడిపియే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ విడుదల చేస్తున్న నిఘా యాప్ మీద వైసిపి అనుమానం వ్యక్తం చేసింది. ఈ యాప్ ఎన్నికల కమిషన్ ది కాదని,  తెలుగుదేశం వారు తయారు చేయించిందేనని పంచాయతీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

కొద్ది సేపటి కిందట వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్టాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఒక ప్రైవేటు వ్యక్తితో ఈ యాప్‌ను తయారు చేయించినట్లు తమకు సమాచారం వుందని మంత్రి అన్నారు.

ఈ యాప్ గురించి ప్రభుత్వం దగ్గిర ఎటువంటి సమాచారం లేదు.  ఈ యాప్ విడుదలైన తరువాత దానిని పరిశీలిస్తాం. ఈ యాప్ లో పొందుపరిచే వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసే అవకాశం వుందా లేదా అనేది కూడా  పరిశీలిస్తాం,’ అని మంత్రి చెప్పారు.

చంద్రబాబు గురించి కూడా చెప్పాలి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌ చిత్తూరు జిల్లాలో పర్యటించే సందర్భంగా చంద్రబాబు గురించి కూడా మీడియాకు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి  డిమాండ్ చేశారు.

‘చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు వుందని, ఆయన వద్ద తాను సెక్రటరీగా పనిచేశానని ధైర్యంగా చెప్పగలడా?  రాజ్యాంగ పదవిలో వున్న నిమ్మగడ్డ ఏ రకంగా ఏ కపక్షంగా వ్యవహరిస్తున్నాడో ప్రజలంతా గమనిస్తున్నారు. ముందు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్  ఒక విషయం మీద మాట్లాడతారు. తరువాత దానిపై చంద్రబాబు స్పందిస్తున్నాడు. వారిద్దరి మధ్ మంచి కోఆర్డినేషన్ ఉంది,’ అని మంత్రి అన్నారు.

తమ  మనోభావాలను దెబ్బతీసేలా నిమ్మగడ్డ వ్యవహరించారని చెబుతూ
సీనియర్ ఎమ్మెల్యేలు వుంటూ, ఈ ప్రభుత్వంలో మంత్రులుగా వున్న తన పైన, మంత్రి బొత్స సత్యనారాయణ పైనా కించపరిచేలా నిమ్మగడ్డ రమేష్ గవర్నర్‌కు లేఖ రాశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చివరికి ఆ లేఖలోనూ గవర్నర్‌ను సైతం బెదిరించేలా ఆయన రాతలు వుండటం దారుణమని వ్యాఖ్యానించారు.

అందుకే మా హక్కులను కాపాడుకునేందుకు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాం.  చట్టప్రకారమే ప్రివిలేజ్ కమిటీ దానిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం ఉంది.  మహారాష్ట్రలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు సభ్యుల హక్కులను ప్రివిలేజ్ కమిటీ కాపాడింది.  బాధ్యుడైన ఎస్‌ఇసిపై చర్యలు తీసుకుంది,’ అని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *