(పిళ్ళా కుమారస్వామి)
అంబేడ్కర్ మధ్యప్రదేశ్‌లోని మౌ (Mhow) అనే గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తండ్రి రామ్ జీ మలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి షెడ్యూల్డు కులమైన మహర్ కులానికి చెందిన వారు. ఆయన ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామం వీరి తండ్రిగారి పూర్వీకులది.
జీవితంలో ఎదురైన ఎన్నో అవరోధాల మధ్య ఆయన విద్యాభ్యాసం సాగింది. అవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పడ్డాయి. పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, ముంబైలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబై లోను పూర్తిచేసిన అంబేడ్కర్1913లోను మరియు 1917లో కొద్దికాలంపాటు బరోడా మహారాజుగారి దగ్గర సేవలుకూడా అందించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొలంబియా విశ్వ విద్యాలయంలో, గ్రేస్ ఇన్ బాక్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు.
1920లలోనే అంబేడ్కర్ ఎమ్.ఎ, పి.హెచ్.డి. ఎమ్.ఎస్.సి (అర్థశాస్త్రం), డి.ఎస్.సి (అర్థశాస్త్రం) మరియు బారిస్టర్ ఎట్ లా పూర్తిచేశాడు. ప్రముఖ విద్యావేత్తలు, అధ్యయనకారులు తమ జీవితకాలంలో సాధించలేనన్ని అనుభవాలను, జ్ఞానాన్ని తనకు 30 సంవత్సరాలు వచ్చే నాటికే అంబేద్కర్ సంపాదించుకున్నారు.
దేశానికి తిరిగి వచ్చాక ‘మూక్ నాయక్’ (నిశ్శబ్ద వీరుడు) అనే పత్రిక స్థాపించి భారతీయ సమాజంలో ఉన్న కులవ్యవస్థపై ధ్వజమెత్తాడు.
‘బహిష్కత హితకారిణి’ అనే సంక్షేమ సంస్థను స్థాపించి దళితుల పిల్లలకోసం పాఠశాలలను, వసతి గహాలను నడిపేవారు. మహద్‌లోని చెరువు నీళ్ళను దళితులు వాడుకునేందుకు పోరాటం నడిపాడు. అగ్రవర్ణాలు ఆ సందర్భంలో ఆయనపై దాడిచేశారు. దాంతో అక్కడి దళితుల్లో మరింత చైతన్యం పెరిగింది. పైగా ఐక్యత పెరిగింది.
జాషువా ‘కసరి బుసకొట్టు నాతని గాలిసోక/ నాల్గుపడగల హైందవ నాగరాజు’ అంటూ హిందూ వర్ణవ్యవస్థపై తన కవితా ఖడ్గంతో ధ్వజమెత్తినట్లు, అంబేడ్కర్ వర్ణవ్యవస్థకు ఇప్పటికీ ఆధారభూతంగా ఉన్న ‘మనుస్మృతి’ని బహిరంగంగా దళితులందరితో కలసి దహనం చేశాడు. వర్ణ వ్యవస్థను కీర్తిస్తుంది మను ధర్మం. జాషువా అంబేడ్కర్‌కు సమకాలికుడు.
నాసిక్ లోని ‘కాలారాం’ ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలని ఉద్యమం చేపట్టారు. దీనివల్ల దళితుల్లో సాంఘిక సమానత్వం కావాలన్న చైతన్యం పెరిగింది.
సమాజంలో దళితుల పరిస్థితిని జాషువా తన కవిత్వంలో ఇలా చెపుతాడు.”వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు /భోజనము పెట్టు వానికి భుక్తి లేదు” అంటూ ఆనాటి దళితుల వ్యధార్థ జీవితాన్ని జాషువా వర్ణించాడు.
ఇలాంటి పరిస్థితిని స్వయంగా అనుభవించిన అంబేడ్కర్ ఒకడుగు ముందుకు వేసి దళితుల అభివృద్ధికి రాజకీయాలకూ గల సంబంధాన్ని త్వరగా గుర్తించాడు. అందువల్లనే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేయాలని ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
‘మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు’ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ గాంధీజీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేశాడు. ఆయన మరణాన్ని ఆపడానికి తన డిమాండును కూడా ఒదులుకున్న మానవతావాది అంబేడ్కర్.
దళితుల పక్షాన, దళితుల ఆకాంక్షను వ్యక్తీకరించే పార్టీ గా ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ ని స్థాపించాడు. ప్రజాస్వామ్యం పౌరహక్కులు, కనీస వేతన చట్టాల అమలు, భూసంస్కరణలు అనే అంశాలను పార్టీ ప్రధాన అజెండాగా ప్రకటించాడు.
సైన్యంలో దళితులకు ప్రవేశం కల్పించాలని పోరాడారు. దాంతో ”మహర్ రెజిమెంట్’ ఏర్పడింది. దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని పోరాడారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు 1942లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ను నెలకొల్పారు. ఈ ఫెడరేషన్ ఎన్నికలు కొన్ని స్థానాల్లో గెలిచింది.
అంబేడ్కర్ పోరాటం భూస్వామ్య అగ్రవర్ణాల సమిష్టి ఆధిపత్యాన్ని సవాలుచేసే దళిత ఆత్మగౌరవ పోరాటం. పూలే పెరియార్, అంబేడ్కర్ నడిపిన ఈ తరహా పోరాటాలు దేశంలో విస్తృత ప్రభావం కలిగించాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ”మా చేతుల్లోకి రాజకీయాధికారం వచ్చినప్పుడే స్వాతంత్య్రం ఉపయోగంగా ఉంటుంది. మా కష్టాలను మేమే పరిష్కరించుకుంటాం” అని చెప్పారు. ”మీ ప్రభుత్వం అధికారంలో వున్నా దళితుల బ్రతుకుల్లో మార్పువచ్చిందా” అని ప్రశ్నించాడు. అయినప్పటికీ దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని సమర్థించాడు.
కాంగ్రెస్ లోని ప్రముఖ నాయకులు అనేకమంది హిందూ అనుకూల దక్పథం కలవారు. వీళ్ళు హిందువులు గనుక ఆర్ఎస్ఎస్ తో కలిసి హిందూ రాజ్యంగా మారుస్తారని భావించాడు అంబేడ్కర్. అంటే తిరిగి వర్ణవ్యవస్థను కీర్తించే మనువాద సంస్థలను తెస్తారని భయపడ్డాడు.
ప్రజాస్వామ్యం, సమభావం, సామాజిక న్యాయంకు అవసరమైన ఉద్యమాలకు ఆయన సారథ్యం వహించాడు. స్వాతంత్య్రం వస్తే తరువాత సామాజిక న్యాయం సాధించు కోవచ్చన్న కాంగ్రెస్ వాదనతో ఆయన ఏకీభవించ లేదు. అందువల్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనను బ్రిటీష్ వారితో కుమ్మక్కయ్యారని దుష్ప్రచారం చేశారు.
అంబేడ్కర్ బెంగాల్ ప్రావిన్స్ నుండి ముస్లింలీగ్ మద్దతుతో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు. పాకిస్తాన్ విభజన తరువాత ముస్లింలీగ్ తన సభ్యులను రాజీనామా చేయించింది. అయినప్పటికీ బొంబాయి లెజిస్టేటివ్ కౌన్సిల్ నుండి కాంగ్రెస్ మద్దతుతో అంబేద్కర్ తిరిగి ఎన్నికయ్యాడు.
భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగసభ, ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా అంబేడ్కర్ చేరాడు.
ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. స్వతహాగా ఎంతో అవగాహన ఉండటం చేత, బౌద్ధంలో బుద్ధుని ధర్మాల ప్రభావం వల్ల ఆ భావాల్ని రాజ్యాంగంలో అంతర్లీనం చేస్తూ దేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా, రాజ్యాంగాన్ని కులాల, మతాల, లింగవివక్షలకు అతీతంగా సమాన హక్కులు కల్పిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా రచించాడు.
రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్ తో సహా ఏడుగురుంటే వారిలో ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వుండి, రచనలో పాల్గొనలేదు. మరొకతను విదేశాల్లో వుండటం వల్ల ఈ బాధ్యతలో పాలుపంచుకోలేదు. మిగిలిన వాళ్లు దీనిపట్ల ఆసక్తి చూపలేక పోయారు. దీంతో అంబేడ్కర్ ఒక్కడే ఈ బాధ్యతను తీసుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధించి దేశానికి అనువైన రాజ్యాంగ ప్రణాళికను తయారుచేసి ఇచ్చారు. అందుకే నెహ్రూ ‘రాజ్యాంగ రూపశిల్పి’ గా అంబేద్కర్ ను వర్ణించారు. భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.
అంబేడ్కర్ భారతదేశంలో ఏర్పడిన కులం, శ్రమ విభజన మీద ఆధారపడలేదని, అది శ్రామికుల విభజన అని స్పష్టంగా చెప్పాడు. సామాజిక ఐకమత్యానికి అడ్డుగా నిలుస్తున్న కులాలనుంచి ప్రజాస్వామ్య సూత్రానికి అనువుగాఉండేలాగా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి సిద్ధాంతాలపై ఆధారపడే నూతన సమాజాన్ని నిర్మించాలని ఆయన భావించారు.
దేశప్రజలందరికీ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయపరమైన హక్కులను, స్త్రీలకు, దళితులకూ, మైనారిటీలకు రక్షణగా ప్రత్యేక సదుపాయాలను కల్పించటానికి తీవ్రమైన కషిచేశారు.అంబేడ్కర్ కషి మూలంగానే నేడు దళితులు, మైనారిటీలు రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నారు.
స్వాతంత్య్రానంతరం 1952లో నిర్వహించిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యేక రిజర్వుడు స్థానాలు లేకపోవడంతో ఆ ఎన్నికల్లో అంబేడ్కర్పార్టీ గెలవలేకపోయింది. అంబేడ్కర్ రిపబ్లికన్ పార్టీ నెలకొల్పి దళితుల కోసం పోరాటం సాగించారు. నెహ్రూ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని గుర్తించి తన మంత్రివర్గంలో చేర్చుకుంది. హిందూ కోడ్ బిల్లు రూపొందించారు. దళితులు, స్త్రీలపై జరుగుతున్న వివక్షనూ, అణచివేతనూ నిరోధించే చట్టం ఇది. కానీ కాంగ్రెస్ లోని ఛాందస వర్ణాలు ఈ బిల్లును ఓడించాయి. దాంతో నిరసనగా అంబేద్కర్ రాజీనామా చేశారు.
తాను చేస్తున్న ఉద్యమానికి నెహ్రూతో సహా జాతీయోద్యమనాయకులు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. పైగా ఆయన పెట్టిన హిందూ కోడ్ బిల్లును తిరస్కరించారు. దాంతో ‘నేను హిందువుగా పుట్టినా హిందువుగా మరణించటానికి ఎంతమాత్రమూ అంగీకరించను’ అని అంబేడ్కర్ ఒక బహిరంగసభలో ప్రకటించారు. క్రైస్తవ, సిక్కుమతాల గురువులు ఆయనను కలిశారు. ఇస్లాంలోకి వస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపినారు. కానీ, దుఃఖాన్ని నివారించడానికి, పీడనలకు తావులేని తాత్విక దక్పథం కలిగివున్న బౌద్దాన్ని ఆయన స్వీకరించారు. దానిలో వున్న సమానత్వం, సౌభ్రాతత్వం ఆయనను ఆకర్షించాయి. మానవుడు కేంద్రంగా ఉన్న బౌద్ధం ఆయనకు నచ్చింది.
హిందూమతంలో వుండి దాన్ని సంస్కరించడం సాధ్యంకాదని గుర్తించి, తాను హిందువుగా పుట్టినా హిందువుగా మరణించనని ఆయన భావాలకు తగినదిగా బౌద్ధాన్ని గుర్తించారు. ఆయన 1956లో అక్టోబర్ 14న నాగపూర్‌లో బౌద్ధమతం స్వీకరించారు. ఆయన తన మార్గాన్ని ‘నవయాన బౌద్ధం’ గా పిలిచారు.
రాజ్యాంగం ద్వారా దళితులకు చట్టబద్ధతను తీసుకొచ్చారు. దాంతో దళితులకు హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి అవగాహన ఏర్పడింది. ఆయన కేవలం రిజర్వేషన్లు సాధించడం మాత్రమే చేశారని, ఆర్.ఎస్. ఎస్ భావాలు కలిగిన అరుణ్ శౌరి ‘వర్ షిపింగ్ ఫాల్స్ గాడ్స్’ పుస్తకంలో అంబేడ్కర్ కషిని తక్కువ చేసి అవమానించడానికి ప్రయత్నం చేయడం సరైంది కాదు.
అంబేడ్కర్ ను కేవలం దళిత నాయకుడిగా చూడటం అంటే ఆయన విశాల దక్పథంతో చేసిన కషిని విమర్శించడమే. ఆయన స్ఫూర్తి, దళిత చైతన్యాన్ని వికసింపచేయాలన్నది వాస్తవమే అయినా ఆయన దక్పథం, సేవ, దళితులకే పరిమితమైనవి కావు.
ప్రాచీన భారతదేశంలో విప్లవం- ప్రతీఘాత విప్లవం, బుద్ధుడు – మానవతా మూర్తి, బుద్ధుడు – విప్లవం, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ,పుస్తకాలలో ఆయన బౌద్ధాన్ని వాస్తవిక దక్పథంతో వివరించారు.
అంబేడ్కర్ కాంగ్రెస్ సిద్ధాంతాలను, గాంధీయిజాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. ”మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు” అన్నారు.
అంబేడ్కర్ ఇలా అన్నది గాంధీని ఉద్దేశించే. కాని కొన్ని సామాజిక అంశాలలో జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలతో ఏకీభవించేవాడు. గాంధీ ”డాక్టర్ అంబేద్కర్ హిందూ మతానికి ఓ సవాలు” అని ప్రకటించాడంటే అందులో ఆశ్చర్య మేమీలేదు. ఆయన ఈనాటికీ ఒక సవాలుగానే నిలిచి ఉన్నారు.
కులవ్యవస్థపైనా, చాతుర్వర్ణ, సనాతన ధర్మాలపైనా, అంటరానితనాన్ని మార్పులేకుండా యథాతథంగా నిలిపి ఉంచే సామాజిక దొంతరలపైనా, హిందూ ధర్మశాస్త్రాల అధిపత్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, వీటిపై రాజీకి తావులేకుండా సాగే ఆయన విశ్లేషణలను హిందూ మత రహస్యాలు, భారతదేశంలో కులం పుట్టుక, కుల నిర్మూలన, హిందూ తాత్విక దక్పథం, అస్పశ్యత, శూద్రులెవరు? మొదలైన గ్రంథాలలో వివరించారు. వీటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాలి. పదేపదే అధ్యయనం చేయాలి. దేశవ్యాప్త వాదోపవాదాలలో అంతర్భాగం చేయాలి.
ఇవేగాకఅంబేడ్కర్ అనేక రచనలు చేశారు. అందులో ముఖ్యమైనవి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’,ప్రధానమైనవి. ఆయన పరిశ్రమ లు, బ్యాంకులు, బీమా సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉండాలన్నారు. ఆర్థిక విధానాలలో ఆయన సోషలిజంతో ఏకీభవించారు.
అంబేడ్కర్ దూరదష్టితో వెలిబుచ్చిన రాజకీయ భావాలలో రెండు నేటి కాలానికీ వర్తిస్తాయి. ”రాజకీయ స్వేచ్ఛలను ఒక గొప్పవ్యక్తి పాదాల క్రింద ఉండనివ్వకండి”, ”రాజకీయాలలో భక్తి లేదా వీరారాధన అథోపతనానికి దారి తీస్తుంది”
రాజ్యాంగ నిర్మాతగా, మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, రాజకీయవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు. ఆయనను ఆధునిక బుద్ధునిగా చాలా మంది బౌద్ధులు భావిస్తున్నారు. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం1990లో ప్రధానంచేసి తన్ను తాను గౌరవించుకుంది.
(పిళ్ళా కుమారస్వామి,రచయిత, విమర్శకుడు)