కార్పొరేట్ విద్య, ఫీజు రు. 2.5 లక్షలు, రూంకు 18 మంది, ఒకటే బాత్ రూం

ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ కాలేజీలు ఎలా నడుస్తున్నాయో తెలిస్తే కళ్లు తిరుగుతాయి.  ఈ కాలేజీలు  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అనేక రెట్లు అధిక ఫీజు తీసుకుంటూ ఏ మాత్రం వసతులు లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నట్లు కళాశాల విద్యా కమిషన్ జరిపిన అకస్మిక తనిఖీలో బయటపడింది.

కార్పొరేట్ కళాశాలల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేందుకు  తల్లితండ్రుల బాధ్యత కూడా ఉందని  ఈ దాడుల వల్ల తెలుస్తుంది. కార్పొరేట్ విద్యకు అధిక ఫీజులు చెల్లిస్తూ తమ పిల్లలు ఎలాంటి హాస్టళ్లలో ఉంటున్నారా, ఇంత ఫీజులు చెల్లించడ న్యాయమా అనే వాళ్లు పట్టించుకోవడం లేదు. దానిని గురించి అధికారులకు ఫిర్యాదు చేయడం లేదు.  పలు కాలేజీల మీద అకస్మిక దాడులు జరిపిన పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ బృందం  ఫిర్యాదులుచేసి సహకరించాలని పేరెంట్స్ ని కోరింది.

ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ బృందం వివరాలందించింది.

పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ  వైస్ చైర్మన్ డాక్టర్ విజయ శారదా రెడ్డి ఏంచెప్పారంటే…

మాకు వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా గత మూడు రోజులగా పలు కాలేజ్ లు తనిఖీలు చేస్తున్నాం.  30 శాతం ట్యూషన్ ఫీజు తగ్గించి వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా చాలా కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. మా తనిఖీలలో కొన్ని‌కాలేజ్ లలో ఏడాదికి 2.55 లక్షలు వసూలు చేస్తున్నారు.  రెండు సంవత్సరాలకి సంబంధించిన 5 లక్షల ఫీజుని కూడా ఒకేసారి కళాశాల యాజమాన్యం వసూలు చేస్తోంది. హాస్టల్ రూమ్ లో 18 మందిని ఉంచారు.అందరికీ ఒకటే బాత్ రూమ్ ఉంటోంది. హాస్టల్ లో సౌకర్యాలు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.

కమీషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు 

గత మూడు రోజులగా విజయవాడ నగరంలో కార్పోరేట్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. మా తనిఖీలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.   గత ఏడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.  ప్రభుత్వ ఆదేశాలని కొన్ని‌కళాశాలలు పట్టించుకోవడమే లేదు.

రకరకాల ‌పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. విద్యార్ధుల తల్లితండ్రులు భయపడకుండా ముందుకు రావాలి. తల్లితండ్రులపై కార్పోరేట్ కళాశాలలు ఒత్తిడి తెస్తున్నాయి

ప్రభుత్వ ఫీజుని మాత్రమే కడతామని తల్లితండ్రులంతా కలిసి నిర్ణయించుకుంటే యాజమాన్యాలు ఏమీ చేయలేవు. అధిక ఫీజులు వసూలు చేసిన కళాశాల యాజమాన్యాలు తిరిగి విద్యార్ధులకి ఆ మొత్తాన్ని చెల్లించేస్తే చర్యలు తీసుకోవడం గురించి ఆలోచిస్తాం.  కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు

కమీషన్ సభ్యుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి

నాలుగు బృందాలగా కమీషన్ సభ్యులు విజయవాడలోని‌ కార్పోరేట్ కళాశాలలని తనిఖీ చేశాం.  శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కళాశాలలను తనిఖీ చేశాం.  గూడవల్లి శ్రీచైతన్య హాస్టల్ చాలా అద్వాన్నంగా ఉంది. విద్యార్ధులకి కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. బాత్ రూమ్ లు ఏమాత్రం పరిశుభ్రం చేయడంలేదు.

మా కమీషన్ గ్రీవెన్స్ సెల్ నంబర్ 9150281111 కి ఫోన్ చేసి ఫిర్యాదులు చేసి పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని వారు కోరారు.

 

అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *