కృష్ణా నది పరీవాహక ప్రాంతం కాకుండా ఎక్కడో వున్న విశాఖపట్నంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ, కర్నూలులోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేసారు.
ఈ మేరకు శనివారం నాడు నంద్యాల గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలలోని కృష్ణా నది మీద ఆధారపడిన చట్టబద్ద హక్కులు, మిగులు జలాల ప్రాజెక్టులకు నీటి సరఫరాకు శ్రీశైలం ప్రాజెక్టు కీలకమని, అందువలన తాగు, సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీ పై ప్రతి సంవత్సరం నీటి లభ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు, నీటి పంపకాల వివాదాలను పరిష్కరించేందుకు కర్నూలు లో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు అత్యంత అవసరం వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని వుందని గుర్తు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం శ్రీ భాగ్ ఒడంబడిక అమలులో భాగంగా న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటుకు చట్టం చేసారని, కృష్ణా నది నీటి వివాదాల పరిష్కారం కూడా న్యాయ పరిధిలోకి వస్తుందని అందువల్ల కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటుతో ప్రభుత్వం శాసనసభలో స్పృశించిన శ్రీబాగ్ ఒడంబడికకు గౌరవించిన వారౌతారని అని అన్నారు.
ఈ నెల 6 వ తేదీన విజయవాడ నగరంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు, అన్ని రైతు సంఘాల ప్రతినిధులు, అన్ని ప్రజా సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో కర్నూలులోనే కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి విశాఖపట్నం లో ఏర్పాటు చేయడాన్ని ముఖ్తకంఠంతో వ్యతిరేకించారని గుర్తుచేసారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించి విశాఖలో కాకుండా కర్నూలులో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమలోని నీటి పరిష్కారానికి కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో వుండటం వలన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు రాయలసీమ ప్రజా ప్రతినిధులు మౌనం వీడి, గళం విప్పాలని డిమాండ్ చేసారు. ఇది ప్రజా ప్రతినిధుల కనీస బాధ్యత అని గుర్తు చేసారు.
మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి అందించిన వారిలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు Y.N.రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, మహమ్మద్ గౌస్, సౌదాగర్ ఖాసీం మియా, M.V.రమణారెడ్డి, లక్ష్మయ్య, మహేశ్వరరెడ్డి,కొమ్మా శ్రీహరి,మనోజ్ కుమార్ రెడ్డి,గంగన్న, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.