చిత్రం! ఫ్రిజ్ లో పళ్ళూ కూరల కంటే డబ్బాలే ఎక్కువయ్యాయి

(భమిడిపాటి ఫణిబాబు)

రోడ్డుమీద ఓ బండిలో, ఓ పాలిథిన్ బ్యాగ్ లో  ఎన్నో పువ్వులమొక్కలు పెట్టుకుని అమ్ముతూ వెళ్తూంటారు, ప్రతీ రోజూ చూస్తూంటాము. చూడ్డానికి చాలా బాగుంటాయి.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎపార్టుమెంట్లవడం తో, ఇదివరకటి రోజుల్లోలాగ, గార్డెన్లూ అవీ ఉండడం లేదు.

అందుకోసమని, ఇదిగో ఇలా రోడ్లమీదొచ్చేవాళ్ళ దగ్గరే కొనుక్కోవాల్సివస్తోంది. ఏదో ఒక మొక్క సెలెక్ట్ చేసికుని,బేరం ఆడి,కొనుక్కుంటాము. ఇంట్లో అప్పటికే కుండీలు ఉన్నాయా సరే, లేకపోతే ఎక్కడికో వెళ్ళి వాటిని కొనుక్కోవడంతో ప్రారంభం అవుతుంది, మన ప్రాజెక్టు!

ఆ తరువాత వాటిలోకి కావలిసిన మట్టి. ఈ రోజుల్లో మట్టెక్కడ కనిపిస్తుందీ? ఎక్కడ చూసినా కాంక్రీటే కదా! మళ్ళీ ఆ మొక్కలమ్మినవాడినే కాళ్ళట్టుకుని, ఓ సిమెంటు బస్తాడు మట్టిని కూడా తెమ్మంటాము. వాడు ఊరికే ఏమీ ఇవ్వడు, దానికీ ఓ రేటు. ఏదో మొత్తానికి తిప్పలు పడి ఆ కొనుక్కున్న మొక్కని కుండీలో వేస్తాము.

ఇంట్లో వాళ్ళందరికీ ఆర్డరు పడుతుంది-ప్రతీ రోజూ దాంట్లో, మర్చిపోకుండా నీళ్ళు పోయాలని. మనం కొన్నప్పుడే ఉన్న మొగ్గలు ఓ రెండుమూడు రోజుల్లో, ఎలాగైతేనేం ముక్కుతూ మూలుగుతూ పువ్వులు పూస్తాయి.ఆ తరువాతనుండి మొదలౌతాయి మన పాట్లు.

ప్రతీ రోజూ నీళ్ళు పోసినా సరే, మళ్ళీ మొగ్గేయదు, పైగా ఆకులకి ఏదో పురుగు కూడా పడుతుంది.పురుగు పట్టినంత చోటా, కత్తిరించేయడం, చివరకి అలా కత్తిరించుకుంటూ పోయాక మిగిలేది, మనమూ,ఆ మట్టీ, కుండీనూ! ఏమిట్రా ఇలా అయిందని, ఆ అమ్మినవాడిని అడిగితే, ఏదో వచ్చిందీ,దానికి మందుంటుందీ, కావలిసిస్తే ఇస్తానూ అంటాడు… సరే ఆ ముచ్చటా తీర్చేసుకుంటే సరీ అనుకుని అది కూడా కొనుక్కోవడం..

నాకో విషయం చిత్రంగా అనిపిస్తుంది- మనం కిరాణా షాపులో రవ్వా, మైదా, శనగపిండీ కొనుక్కుంటామా, కొన్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని రోజులకి పురుగుపట్టేస్తుందెందుకో? అప్పటికీ, అవేవో ఎయిర్ టైట్ సీసాల్లోనో, డబ్బాల్లోనే పెడుతూంటాము. ఆ కొట్టువాడెమో ఎలా పెట్టినా, ఓ పురుగూ పట్టదూ పుట్రా పట్టదూ అదేమిటో? మా ఇంటావిడ ఫ్రిజ్ లోపెట్టడంమొదలెట్టినప్పటినుంచీ పరవా లేదు. చివరకి తేలిందేమిటంటే, ఫ్రిజ్ లో పళ్ళూ కూరగాయలకంటె, ఈ డబ్బాల సంఖ్య పెరిగిపోయింది!

చిన్న పట్టణాల్లో చూస్తూంటాము, రోడ్ సైడున కొట్లు పెట్టుకుని, పెన్నులూ, పిల్లల ఆటవస్తువులూ అమ్ముతూంటారు. ఆ కొట్టువాడు ఓ పెన్ను చేతిలో పెట్టుకుని అటు తిప్పీ ఇటుతిప్పీ గట్టిగా నొక్కేసీ వ్రాసేసి, ‘చూడండి మా పెన్ను ఎంత స్ట్రాంగో, స్టర్డీయో’ అంటాడు. తీరా మనం ఇంటికి వెళ్ళి అలా చేస్తే, అదికాస్తా పుటుక్కున విరిగూరుకుంటుంది! అలాగే వాళ్ళమ్మిన ఏరో ప్లేన్లూ, హెలికాప్టర్లూనూ, అక్కడ బాగానే ఎగురుతాయి. ఇంటికి వెళ్ళి పిల్లలచేతిలో పెట్టి ఎగరేద్దామని చూస్తే

అది చచ్చినా కదల్దు! తీర్థాల్లోనూ, ఇప్పుడొచ్చే జాత్రాల్లోనూ అమ్మే వస్తువులన్నీ చాలా భాగం అలాటివే. డిజిటల్ వాచీల హవా ఉంది కొన్నాళ్ళు, ఏ ఫుట్ పాత్ మీద చూసినా, పదిహేను రూపాయలకీ, పాతిక రూపాయలకీ వాచీలొచ్చేసేవి. అలాగే రోడ్డు మీద ఓ బుట్టలో పెట్టుకుని, ఓ ‘ఏక్ తారా” “ ఫ్లూట్” లాటివాటిమీద  హిందీ, పాటలు వాయిస్తూ వస్తాడోడు .. సొసైటీ గేటులోకి రానిచ్చి, పిల్లా, పెద్దా అందరూ వాడి చుట్టూ చేరి, తను వాయించే మధుర సంగీతం లో లీనమైపోయి, పోనీ సరదాగా ఎప్పుడైనా వాయించుకోవచ్చని వాడడిగిన రేటుకి, ఓ రూపాయి తక్కువకి బేరం ఆడి కొంటారు..అదేం కర్మమో, ఆ అమ్మేవాడు బయటకు వెళ్ళడమేమిటీ, ఆ వాయిద్యాలు మూగబోతాయి.. ఛస్తే శబ్దం మాత్రం రాదు..పైగా ఆ ఏక్ తారా తో వేలు కూడా కోసుకునే అవకాశం ఉంది.. అదే ఏ పిల్లలైనా కొనుంటే, వాళ్ళకి చివాట్లు పెట్టే అవకాశమైనా ఉండేది.. కానీ కొన్నది ఇంటి పెద్దాయే…

ఇప్పుడు ప్రతీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్టూ, సగానికంటె తక్కువ రేట్లలో దొరికేస్తుంది. వాళ్ళెలా అమ్ముతారో, జనం ఎలా కొనుక్కుంటున్నారో ఆ బ్రహ్మ కే తెలియాలి.

మధ్యతరగతి వాళ్ళేమో, బ్రాండూ, దిబ్బా అంటూ వేలకివేలు పోసి కొంటారు.అలాగని అవేమీ ఉధ్ధరించేయడం లేదు.మొన్నెపుడో నా సెల్ ( మామూలు బేసిక్ దే,హైఫై కాదు)అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన నెంబర్లు గాయబ్ అయిపోయాయి. కొని రెండేళ్లు కాలేదు. ఎల్.జీ. వాడి కొట్టుకి వెళ్తే, అక్కడ ఓ యాభై మందిదాకా చూశాను. అంటే హైఫై సెట్లు కూడా అలాగే తగలడ్డాయన్నమాట! తేలిందేమిటంటే,మనరాత బాగుంటే, ఫుట్ పాత్ మీద కొన్నదైనా మన్నుతుంది,బ్రాండెడ్డే కానఖ్ఖర్లేదు అని!వచ్చిన గొడవేమిటంటే ఫుట్ పాత్ మీద కొనడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ! ఎవరైనా చూస్తే…. అలాగే ఫైవ్ స్టార్ హొటల్లో కంటే, టప్రీ ల్లో ఇచ్చే చాయ్ చాలా రుచిగా ఉంటుంది.కానీ ఎవరైనా చూస్తే బాగోదేమో… అదే ఎవడో ఓ కారు రోడ్డుకి అటువైపు ఆపి, ఈ  టప్రీలో చాయ్ తాగితే, మర్నాటినుండీ పేద్ద క్యూలు..

పేద్ద పేద్ద హొటళ్ళలో చెఫ్ఫో స్టువార్డో వచ్చి ఓ పుస్తకంలో మనం ఇచ్చే ఆర్డరు వ్రాసుకుని, ఓ గంటపోయిన తరువాత తీసుకొచ్చినా నొరుమూసుక్కూర్చుంటాము.అయిదు రూపాయల కాఫీకి పాతిక రూపాయలు వసూలు చేసినా పరవాలేదు!ఏమైనా అంటే స్టేటస్సూ, డిగ్నిటీ వగైరా వగైరా…. ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం….

(భమిడిపాటి ఫణిబాబు, సొంతవూరు అమలాపురం, ఉద్యోగరీత్యా మహరాష్ట్ర పుణే వెళ్లి పోయి, అక్కడే స్థిరపడ్డారు.)

 

4 thoughts on “చిత్రం! ఫ్రిజ్ లో పళ్ళూ కూరల కంటే డబ్బాలే ఎక్కువయ్యాయి

  1. భమిడిపాటివారు తమ తాజా వ్యాసంలో ఫ్రిజ్ లో పళ్ళూ కూరలకన్నా డబ్బాల సంఖ్యే ఎక్కువగా వుంటున్నాయని వ్యక్తం చేసిన ఆవేదనని నేను ఎంతో సహానుభూతితో అర్థం చేసుకోగలను. అందుకు నిలువెత్తు నిదర్శనం మా ఇంట్లో ఫ్రిజ్ . ఆయన కేవలం డబ్బాలకే అంత హడావుడి చేస్తోంటే మా ఫ్రిజ్ తెరిస్తే పదనాలు భువన భాండముల మాదిరిగా డబ్బాలతో బాటు జాడీలకుజాడీలే కనిపిస్తాయి . మనం చేష్టలుడిగి అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ వుండిపోవాల్సిందే.
    ఫ్రిజ్ లో వుంచిన వూరగాయలు ఏటికేడాదీ అప్పుడే పెట్టినంత తాజాగా వుంటాయని వాళ్ళ అక్కగారు ఏ ముహుర్తంలో గీతోపదేశం చేసారో గాని నాకు మాత్రం భలే అవస్తగా వుంటుంది. ఆవకాయ, మెంతికాయ, పెసరావకాయ, బెల్లం ఆవకాయ, ఒకటేమిటి అన్నిరకాల వూరగాయలున్న జాడీలు మా ఫ్రిజ్ లో కనిపిస్తాయి .”మీ ఆవిడ ఇంచక్కా వేడివేడి అన్నంలో ఫ్రెష్ వూరగాయలు వేసి పెడుతాంటే సంతోషించక ఆ సణుగుడు ఎందుకు అని మీరు అనొచ్చు. కానీ పీత కష్టాలు పీతవి. మార్కెట్ కు వెళ్ళి కూరలు తీసుకు వచ్చిన ప్రతిసారీ మొహం వాచేలా చివాట్లు తినాల్సి వస్తోంది. వెళ్ళేముందు మా ఆవిడ ఏమి కూరలు పట్టుకురావాలో లిస్టు రాసి ఇస్తుంది. అందులో రాసినవి
    మాత్రమే పట్టుకురావాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది, ఫ్రిజ్ లో అస్సలే చోటు లేదు. సర్దలేక చస్తున్నాను. సొంతబుర్ర వుపయోగించి ఎక్కువ పట్టుకు వచ్చి నా చేత చివాట్లు తినొద్దు అని చెప్పి పంపిస్తుంది. అదేమి కర్మో అక్కడకు వెళ్ళాకా నవనవలాడుతూ నాలుగు రకాల కూరలు కనపడగానే నా ఒళ్ళు విడిపోతుంది. లిస్టులో లేనివి కూడా పట్టుకొని ఇంటికి వస్తాను.వాటిని చూడగానే మా ఆవిడ పూనకం వచ్చినదానిలా వూగిపోతుంది. “మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించానా . మరి మీరు చేసుకు వచ్చిన నిర్వాకం ఇలా తగలడలింది నా కర్మ” .అని గొణిగింది.
    లేదా ఇంకో ఫ్రిజ్ కొని నా మొహాన తగలేయండి. అప్పుడు మీకు ఈ చివాట్లు చెప్పుదెబ్బలు తప్పు తాయి”.అని మాఆవిడ నాకు గీతోపదేశం చేసింది.

  2. సూర్య మోహన్ గారూ ,

    అదేదో కూసేగాడిద ..సామెతలోలాగ మన ఇళ్ళల్లో ఉండే చుట్టాలకి ఉచిత సలహాలు చిట్కాలు గీతోపదేశం చేయడం ఓ వ్రతంలాచేస్తారు ..వాటికి ఆజ్ఞాబధ్ధులైన మొగుళ్ళు బలైపోవడం యుగయుగాలనుండీ చూస్తున్నదే .. మీ అదృష్టం బాగోపోతే మీ ఫ్లాట్ లో ఒకరూమ్ముని కోల్డ్ స్టోరేజ్ గా మారకుండా చూసుకోండి చాలు ..జిహ్వచాపల్యం తగ్గించుకుని ఆవిడ చెప్పిన కూరలు మాత్రమే తీసుకోవడమొకటే వైద్యం …

  3. ఫణిబాబు గారూ, భలే కెలికారండీ బాబూ. చూడండి మన సూర్యమోహనుడు బాధంతా ఎలా వెళ్లగక్కాడో. అయినా ఈ భూప్రపంచమ్మీద ఫ్రిజ్జు బాధలు పడని మగమహారాజెవరైనా మిగిలాడంటారా? మా బంధువుల్లో ఒకాయన ఫ్రిజ్జుకు `ముసర పెట్టె’ అని ముద్దుపేరు పెట్టేడు. అప్పట్లో ఒకానొక కాలంలో ఇంకో మిత్రుడేమో, పదివేల రూపాయలు పెట్టి ఇంత పెద్ద ఫ్రిజ్జు కొంటే అందులో అర్ధరూపాయి కొత్తిమీర కట్ట దాచుకుంటూ దాని మానం తీస్తున్నది సోదరా, నన్ను ముద్దుగా ఓ బీరు బాటిలైనా పెట్టుకోనివ్వదని తన భార్య గురించి ఆవిడెదురుగానే నాకు ఫిర్యాదు చేసే వాడు. అయినా ఈ ఆడవాళ్ల రాతి గుండెలు కరుగుతాయి గనకనా? నా ఫ్రిజ్జు బాధలు మాత్రం తక్కువ్వా? చెప్పుకుంటూ పోతే పద్ధెనిమిది పర్వాల భారతమైపోదూ.
    మీ కబుర్లలో అమలాపురం భాష, యాస చక్కగా పలుకుతున్నది. అమలాపురం స్వస్థలమైన నా సన్నిహిత మిత్రుడొకాయన ఉండేవారు. వాళ్లింట్లో విన్న ఆ వినసొంపైన భాష మళ్లీ ఇన్నాళ్లకు మీ రాతల్లో వింటున్నాను. అయిపోయిందండీ బాబూ. నేను చెబుతున్నాను కదా, భాషలోనే కాదు రచనలోనూ మీకు బోల్డు ఈజూ, ఊపూ రెండూ వచ్చేశాయి. ఇక మిమ్మల్ని ఆపడం బ్రహ్మక్కూడా తరం కాదు. కుమ్మెయ్యండంతే!

  4. వెంకటేశ్వర మూర్తి గారూ
    ” ముసరపెట్టె ” పేరు బావుంది ..ఇంక కోనసీమ భాషంటారా , ఎంతైనా పుట్టి పెరిగిన ప్రాంతం కదా నరనరాల పాకిపోయింది ..
    మీ అందరి ప్రోత్సాహం తో ప్రతీ వారం ,వ్యాసాలు పోస్టైతే చేయాలనే ఉంది ..
    మీ అభిమానానికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *