రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న శ్రీ కోదండరామ స్వామి విగ్రహ శిరచ్ఛేధన దుస్సంఘటనను ఖండిస్తూ జనసేన – బీజేపీ సంయుక్తంగా చేపట్టిన ‘రామ తీర్థ ధర్మ యాత్ర’ను ప్రభుత్వం అడ్డుకొంటున్న తీరును జనసేన ఖండించింది.
ఈ మేరకు , జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదీ ప్రకటన
సోమవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తామని బెదిరించడం చేస్తూ వచ్చారు.
ఈ రోజు తెల్లవారుజాము నుంచి నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతోపాటు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి అరెస్టులు చేశారు.
ఈ చర్యలు అప్రజాస్వామికం. రామతీర్థం క్షేత్రానికి చేరుకొన్న మా పార్టీ ప్రధాన కార్యదర్శులను, కార్యకర్తలను అక్కడ అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి చేరింది. పార్టీ మహిళ నేతలను, వీర మహిళ విభాగం సభ్యులను పోలీసులు నిర్బంధించడం గర్హనీయం. నిరసన తెలియచేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని… రామ తీర్థ ధర్మ యాత్రను శాంతియుతంగా చేపట్టిన విషయాన్ని పోలీసు శాఖ దృష్టిలో ఉంచుకోవాలి. రాష్ట్రంలో యధేచ్చగా హిందూ ఆలయాలపై దాడులు సాగుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటూ… ఈ విధ్వంసాన్ని పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.