మాగ్నెట్ లాగా ఆలోచనలకు ఆకర్షణ ఉందా?

మనకు ఇంతవరకు అయస్కాంతానికి మాత్రమే ఆకర్షణశక్తి ఉందని విన్నాం. తర్వాత భూమికి, ఇతర గ్రహాలకు ఆకర్షణ శక్తి ఉందని విన్నాం. అయితే, భౌతిక పదార్థాలకు ఉన్న ఆకర్షణ గురించి మాత్రమే విన్నాం, చదివాం. కానీ, ఈ మధ్య ఆలోచనలకు ఆకర్షణ శక్తి ఉందనే వాదన మొదలయింది. చాలా మంది మేధావులు దీని గురించి రాస్తున్నారు. నిజానికి ఇది కొత్తగా కనిపెట్టింది కాదని, మన  పూర్వీకులు ఎపుడో గుర్తించారని చెబుతున్నారు. ఇపుడు బాగా ప్రచారం లోకి వస్తున్న ఆకర్షణ సిద్దాంతం గురించిన చర్చ మీద కుమార స్వామి వ్యాసం.

(పిళ్లా కుమారస్వామి)

ఆకర్షణ  గురించి ఎపుడైనా ఆలోచించారా?  ఆయస్కాంతానికి ఆకర్షణ ఉన్నట్లే ఆలోచలనకు భావాలకు ఆకర్షణ ఉందని ఈ మధ్య  మేధావులు చెబుతున్నారు.  ఈ సిద్ధాంతం గురించి  బాగా సూత్రీకరించిన వ్యక్తి రోండా బార్న్ (Rhonda Byrne).

ఆమె ఈ ఆకర్షణ సిద్ధాంతం  (The Law of Attraction) గురించి  రహస్యం (The Secret) అనే పుస్తకం రాస్తూ అందులో  దీనిని బాగా వివరించారు. రోండా ప్రకారం ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నిటి కన్నా శక్తివంతమైన సిద్ధాంతం.

ఏమిటి ఈ ఆకర్షణ సిద్ధాంతం:

ఈ సిద్ధాంతం ప్రకారం మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నింటిని మీరు ఆకర్షిస్తుంటా. జీవితాన్ని మీరు ఒక అయస్కాంతంలాగా భావించవచ్చు.  మీకు కావలసిన దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే, దాన్ని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించగలరని ఈ సిద్ధాంతం చెబుతుంది.

అదెలా జరుగుతుంది?

ఆలోచనలకు ఒక ప్రీక్వెన్సీ ఉంటుంది. వాటిని మనం కొలవవచ్చు. ఒక కొత్త కారు మీకు కావాలని కోరుకుంటుంటే మీకు కొంత డబ్బు కావాలని అనుకుంటూ వుంటే, మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటుంటే, ఆ ఆలోచనలను మీరు నిరంతరం వెలువరిస్తుంటారు.ఈ ఆలోచనలు అయస్కాంతం లాంటివి. అవి విశ్వంలో వ్యాపించి వాటిని ఆకర్షిస్తాయి. బైటికి వెళ్లి మళ్లీ మీ దగ్గరకే వస్తాయి.

Rhonda Byrne (credits: rhongbyrne website)

ఆకర్షణ సిద్ధాంతానికి మంచి, చెడులు అనే విచక్షణ లేదు. మీరు ఒక విషయంపై దృష్టి కేంద్రీకరిస్తే, మీరు దానికి ఒకఅస్థిత్వాన్నిస్తు న్నట్లు అర్థం. ఈ సిద్ధాంతం విశ్వంలో ఉన్న ఒక నియమం. నిద్రలోకి జారిపోయే ముందు దేన్ని గురించైతే ఆలోచిస్తూ వుంటామో దాని మీద ఈ సిద్ధాంతం ప్రభావం ఉంటుంది. అందువల్ల నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేటట్లు చూసుకోవాలి.

మనకు రోజుకు అరవై వేల ఆలోచనలు వస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. వీటిపై మీరు అదువు ఉంచాలంటే ఒక సులభమార్గం ఉంది. అవే మన భావాలు. మన భావాలు మనం ఏమాలోచిస్తున్నాయో మనకు తెలియజేస్తాయి. మీ భావాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటూ వుంటారు. ఆ భావాలు రెండు రకాలుగా వుంటాయి. అవి మంచి, చెడు భావాలు. ఉల్లాసం, కృతజ్ఞత,ప్రేమ లాంటివి మంచి భావాలైతే, నిరాశ, నిస్పృహ, ద్వేషం, కపటం, కృతజ్ఞత, చెడుభావాలు.

క్రీ.పూ.3000 లోనే ఈ సిద్ధాంతం గురించి ఆనాటి ప్రజలకు తెలుసునని, ఈ సిద్ధాంతం మన జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్నిస్తుందని రోండా చెబుతారు.

షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ వంటి కవులు తమ కవితల్లో, బీథోవెన్ తన సంగీతం ద్వారా లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులు తమ చిత్రకళతో, సోక్రటీస్, ప్లేటో, రాల్స్ వాల్డో ఎమర్సన్, పైథాగరస్, బేకన్, న్యూటన్, గేథే, విక్టర్ హ్యూగో వంటి గొప్పతత్వవేత్తలు తమ రచనల ద్వారా, బోధనల ద్వారా ఈ సిద్దాంతాన్ని పలు రకాలుగా వ్యక్తం చేసినారని చెప్పింది రచయిత్రి.

మీరు సంతోషంగా వుంటూ మంచి ఆలోచనలు చేస్తూంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారని అర్థం. అది విశ్వం నుంచి వస్తున్న సందేశం. మీరు బాధపడుతున్నట్లయితే మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని అది కూడా విశ్వం నుంచి అందే సందేశమే. అందుకే మీ భావాలను మీ అదుపులో వుంచుకోవాలి. గురుత్వాకర్షణ సిద్దాంతం ఎంత కచ్చితంగా పనిచేస్తుందో ఆకర్షణ సిద్ధాంతం కూడా అదే విధంగా పని చేస్తుంది.

విశ్వంలో ప్రేమకన్నాశక్తివంతమైనది ఏదీ లేదు. ప్రేమభావం అన్ని ప్రకంపనలన్నిటికి పై స్థాయికే చెందినది. మీ ప్రతి ఆలోచనను ప్రేమలో ముంచెత్త గలిగితే , ప్రతి దాన్ని ప్రతి ఒక్కర్ని ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అందువల్లనే ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతంగా పిలిచారు.

విశ్వం ప్రేమతో నిండి వుందా అని ఎవరైనా ప్రశ్న వేసుకుంటే వచ్చే ఒకే ఒక్క సమాధానం ‘అవును’ అని చెవుతాడు మార్చి షిమోవ్ అనే తత్తవేత్త. మీరు ఆకర్షించే వాటిని మొదటగా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఒక తెల్లకాగితం, ఒక పెన్ను తీసుకొని రాయడం మొదలుపెట్టాలి. దాన్ని వర్తమాన కాలంలో రాయాలి. అంటే మీకు కావాల్సిన దాన్ని పొందినట్లుగా ఇప్పుడు అనుభవంలో ఉన్నట్లుగా రాయాలి.

బైబిల్ లో ఒక సూక్తి ఉంది. అది ‘అడుగు ఇవ్వబడును’ అని. దీని ప్రకారం మీకేమి కావాలో అడగటం నేర్చుకోవాలి. అడిగిన తరువాత ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అవి మీకు సమకూరడం మొదలుపెడతాయని రచయిత్రి రొండా బర్న్ చెవుతుంది. అయితే అలా అవి సమకూరుతాయనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అవి ఎలా వస్తాయో మీరు హేతుబద్దంగా ఆలోచించాల్సిన పనిలేదు. దీనికి నమ్మకం ఉండాలి. చిన్న పిల్లాడికి తన తల్లిదండ్రుల నడిగి ఏదైనా సాధించుకోవచ్చని ఎలా నమ్ముతాడో అలా నమ్మమని రచయిత్రి చెవుతుంది. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం విశ్వం మీకు తప్పకుండా అందిస్తుందని ఆమె ఘంటాపథంగా ఈ గ్రంథంలో చెబుతుంది.

మీకు కావాల్సిన దాన్ని కోరుకుని అది అందినట్లుగా అనుభూతి చెందాలి. అలా అనుభూతిని మంచిగా భావిస్తున్నప్పుడు మీకవి సంభవిస్తున్న ఫ్రీక్వెన్సీలో ఉంటారు.

భావాలు భౌతిక రూపం ధరిస్తాయి. అందువల్ల మీరు కోరుకునే ప్రతిదీ ఆకర్షింపబడి అది మీ దగ్గరకు చేరుతుంది మీకు డబ్బు అవసరమైతే మీరు దాన్ని ఆకర్షిస్తారు. మీకు జనం అవసరమైతే మీరు జనాన్ని ఆకర్షిస్తారు. మీకు పుస్తకం అవసరమైతే మీరు పుస్తకాన్ని ఆకర్షిస్తారని రచయిత్రి చెపుతుంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (1929-1968) చెప్పిన మాటల్నిమనం గుర్తుంచుకోవాలి. అవేమంటే ‘విశ్వాసంతో ఒక అడుగు ముందుకెయ్యండి, మీరు మేడ మెట్లన్ని చూడనవనరం లేదు ముందుగా ఒక అడుగు వెయ్యండి చాలు.’

ఈ ఆకర్షణ ఎంతకాలం ఉంటుంది?

ఎంత కాలం లోపల మీరు మీకు కావాల్సిన దాన్ని ఆకర్షించగలరన్నది మీకు విశ్వంతో ఏర్పరచుకొనే అనుబంధాన్ని బట్టి ఉంటుంది. మీ కోరిక ఫ్రీక్వెన్సీని బట్టి మీ ఆకర్షణ ఆధారపడి ఉంటుంది.

ప్రతి రోజును కృతజ్ఞతతో ప్రారంభిస్తే మంచిది. ‘ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్’  (The Science of Getting Rich) లో వాల్లస్  వాటిల్స్  ( Wallace D Wattles,1910) కృతజ్ఞత గురించి రాసినాడు. అదేమంటే దినాన్ని కృతజ్ఞతతో ప్రారంభించమని. అలాగే బుద్దుడు ప్రతి దినాన్ని కృతజ్ఞతతో ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించమన్నాడు.

భావనా శక్తికి మించినదేదీ లేదు. అన్నిట్లోనూ అది ఉంటుంది. జీవితంలో రాబోయే ఆకర్షణలకు అది ప్రివ్యూఅని అన్నాడు ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955). ‘మనసు ఏది ఊహించుకోగలదో దాన్ని సాధించగలడు’ అని క్లైమెంట్ స్టోన్ (Clement Stone) అన్నాడు. డబ్బును ఆకర్షించాలంటే ముందు మనసు సంపద మీద కేంద్రీకరించాలి. మీదగ్గర డబ్బు అవసరమైనంత లేదనే విషయం గురించి ఆలోచించినంత కాలం, ఎక్కువ డబ్బు సాధించలేరు. డబ్బు లేనప్పుడు డబ్బు గురించి మంచిగా ఆలోచించలేరు. అందువల్ల డబ్బు గురించి మంచి భావాలు కలిగి ఉండాలి. అంటే ‘ బోలెడంత డబ్బు ఉంది. అది నా దగ్గరకి వస్తోంది’ నాకు రోజూ డబ్బు అందుతోంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు’ అని మనసులో అనుకోవాలి.

ప్రేమను పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని మీలో పూర్తిగా నింపుకో మంటాడు ఛార్ట్స్ హావెల్. దీనికి మొట్టమొదటి విషయం మీరు మిమ్మల్ని ప్రేమించుకోవాలి. మీపై మీకు ప్రేమ లేకపోతే విశ్వం అందించే ప్రేమను మీరు అడ్డుకున్నట్లే.

మీకు అక్కర్లేని విషయాల నుంచి దృష్టి మరల్చి దాని చుట్టూ ఉండే భావోద్వేగాలను పదిలేసి శాంతంగా వుండటం నేర్చుకోవాలి. మీరు దేన్ని ఆశిస్తున్నారో దానిపై ధ్యాసపెట్టాలి. విశ్వంలో ప్రేమ, సంతోషం, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ వున్నాయి. వాటిని మీరు పొందాలంటే వాటి కోసం తహతహలాడాలి.

ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, సంతోషం, నవ్వు పొందటానికి మీరేం చేస్తే అవి లభిస్తాయో వాటిని మీరు చేయాలి. ధ్యానం చేస్తే దొరుకుతుంటే ధ్యానం చేయాలి. సాండ్విచ్ తింటే దోరుకుతుందంటే దానిని తినాలి. మీలో ఉన్న అంతర్గత శక్తిని ఎక్కడ ఉపయోగిస్తే అంత ఎక్కువ సేవు మీ వైపు ఆకర్షించుకుంటారు. దానిని అభ్యసించాల్సిన అవసరం లేని స్థితికి చేరుకోగలరు మీరే ప్రేమ స్వరూపులవుతారు.

ఆకర్షణ సిద్ధాంతం గురించి వివరించడమే ‘రహస్యం’ గ్రంధంలోని రహస్యం. ఈ సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని మనసా, వాచా నమ్ముతూ మనకు కావలసినదానిని సానుకూల దృక్పథంతో ఆకర్షిస్తూ వుంటే మెదడు దానిని సాధించడానికి తగిన మార్గాలను తనే మనకు అందిస్తుందన్న రహస్యాన్ని బట్టబయలు చేసింది ‘రోండా’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *