గత వారం గుడివాడ వచ్చినపుడు జనసేన నేత పవన్ కల్యాణ్ వైసిపి నేతలు పేకాట శిబిరాలు నడపటంలో చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వం నడపటంలో లేదని అన్నారు.దీనికి మంత్రి కొడాలి నాని (గుడి వాడ ఎమ్మెల్యే) ఆగ్రహం చెంది గడివాడలో తాను పేకాట శిబిరాలను మూయిస్తున్నానని, ఈ విషయం అందరికి తెలుసని అన్నారు. అయితే నాని ప్రకటన చేసిన 48 గంటల్లో పోలీసులు ఒక పేకాట డెన్ మీద దాడి చేసి 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీని మీద కృష్ణా జిల్లా ఎస్ పి రవీంద్ర నాథ్ బాబు వివరణ ఇది.
గుడివాడ లో పేకాట శిబిరంపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడిని జిల్లా ఎస్పీ ఆయన ధ్రువీకరించారు. నిజానికి ఈ దాడి జరిగిందని అక్కడ పోలీసులు సంచుల కొద్ది డబ్బు స్వాదీనం చేసుకున్నారని మొదట వెల్లడించింది మాజీ తెలుగుదేశం మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు.
ఇది జరిగాక పోలీసుల నుంచి ఈ ప్రకటన రావడం వింతగా కనిపిస్తుంది.
పొట్లూరి మురళీ ఆధ్వర్యంలో గుడివాడ పోలీసు శిబిరం నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ రవీంద్ర నాథ్ తెలిపారు.
ఈ దాడిలో 33 మందిని అరెస్ట్ చేసి,55,39,780 రూపాయల నగదును, 28 ఫోర్ వీలర్స్,13 టూ వీలర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
పేకాట శిబిరాల నిర్వహణపై విచారణ జరుగుతుందని ఎవరి పాత్ర ఉందనే అంశంపై త్వరలో వివరణ ఇస్తామని వెల్లడించారు.