ఆదివారం నాడు భారత దేశం కోవిడ్ నివారణకు రెండు వ్యాక్సిన్ లకు అనుమతి నిచ్చింది. ఏస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ (Covishield), భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ (Covaxin) కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి లభించింది.
భారతదేశంలో వ్యాక్సిన్ ఇనాక్యులేషన్ డ్రైరన్ విజయవంతంగా పూర్తయిన 24 గంటల లోపే డిసిడిఐ నుంచి అనుమతి రావడం విశేషం. అంటే భారతదేశంలో వ్యాక్సినేషన్ ఇక మొదలుపెట్టవచ్చని అర్థం. ఇండియాలో మొదటి దశ వ్యాక్సినేషన్ నాటికి రెండు వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంటాయి.
ఇంతకీ కోవిషీల్డ్ కు మేడ్ ఇన్ ఇండియా కోవ్యాక్సిన్ కు తేడా ఏమిటి?
కోవిషీల్డ్ ను రూపొందించింది ఆక్స్ పోర్డు యూనివర్శిటీ. ఇందులో ఆక్స్ పోర్డ్ కు ఏస్ట్రా జెనెకా (Astrazeneca) అనే మందుల తయారీ కంపెనీ సహకరించింది. ఈ వ్యాక్సిన్ ని ఇండియాలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేస్తుంది.అక్స్ ఫోర్డ్-ఏస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామి ఎస్ ఐఐ.
కోవ్యాగ్జిన్ (Covaxin) అనేది పూర్తిగా భారతదేశంలో తయారయిన వ్యాక్సిన్. హైదరాబాద్ లో ఉంటున్న తెలుగువాళ్ల కంపెనీ భారత్ బయోటెక్ , కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (CCMB),నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాజీలు (NIV) లు కలసి రూపొందించిన వ్యాక్సిన్. భారతదేశం గర్వించదగ్గ వ్యాక్సిన్. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్.
వీటిని ఎలా తయారు చేశారు?
కోవాగ్జిన్ గురించి…
కోవగ్జిన్ అనేది అనేది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. అంటే కోవిడ్-19 జబ్బును కలిగించే కరోనా వైరస్ ను చంపగా నిర్వీర్యమయిన వైరస్ పదార్ధం. దీనికి జబ్బు వ్యాపించే శక్తి ఉండదు. సంతతి పెంచుకునే పునరుత్పత్తి శక్తి ఉండదు. అయితే, దీని వైరస్ స్వరూపం మాత్రం మారదు. అందుకే ఈ మృత వైరస్ (Inactivated virus)ని శరీరంలోకి ఎక్కిస్తే మనిషి కణం దీనిని నిజమయిన వైరస్ భ్రమపడి, కోవిడ్ ని నిరోధించేందుకు అవసరమయిన నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వ్యాక్సిన్ లు మొదట తయాయింది ఈ పద్ధతిలోనే. ఉదాహరణకు హెపటైటిస్ ఎ, ఇన్ఫ్లుఎంజా, పోలియే, ర్యాబీస్ లు ఈ తరహా వ్యాక్సిన్ లే. ఇదే పద్ధతిలో తయారయిన కోవ్యాగ్జిన్ కూడా ఇలాగా కోవిడ్ నుంచి రక్షణ కల్గిస్తుందని భారత్ బయోటెక్ పరీక్షల్లో తేలింది.
ఇక కోవిషీల్డ్ గురించి…
కోవిషీల్డ్ లో చింపాంజీలలో జలుబు కలిగించే వైరస్ ను వాడుతున్నారు. ఇది ఎడినో వైరస్ (Adenovirus) జాతి వైరస్. కాకపోతే, ఇందులో కరోనా వైరస్ ముల్లులలోని ప్రొటీన్ (Spike protein) తయారు చేసే జన్యుపదార్థాన్ని ఎక్కిస్తారు. ఈవ్యాక్సిన్ ని AZD1222 అంటారు. కరోనా వైరస్ (SARS-CoV2 virus) ఈ ముళ్ళుల ద్వారా శరీర కణానికి గుచ్చుకుని మనిషి శరీర కణంలోకి దూరుతుంది. అందుకే వ్యాక్సిన్ ల పరిశోధనలు ఎక్కువగా ఈ ముల్లుని మొద్దుబారించడమెలా అనే దాని మీద దృష్టిపెట్టాయి.
ఎస్ట్రా జెనెకా కూడా ఈ ముల్లు ప్రొటీన్ ను తయారుచేసే వైరస్ జెనెటిక్ ఇన్ ఫర్మేషన్ మీద ఎక్కు పెట్టింది.
ఈ జన్య పదార్ధాన్ని వైరస్ నుంచి విడదీసి చింపాంజీలో జలుబు చేసే వైరస్ కు ఎక్కించారు. ఈ వైరస్ ను నిర్వీర్యం చేసి వ్యాక్సిన్ లాగా మనిషిలోకి ఎక్కించడమే ఎస్ట్రా జెనెకా వ్యాక్సినేషన్.
ఇలా నిర్వర్యం చేసిన చింపాంజీ వైరస్+ స్పైక్ ప్రొటీన్ జెనెటిక్ మెటీరియల్ ను వ్యాక్సిన్ రూపంలో ఎక్కించాక ఏంజరుగుతుందంటే.. ఎడెనో వైరస్ నిర్వీర్యమయింది కాబట్టి పునరుత్పత్తి కాలేదు. అయితే, స్పైక్ ప్రొటీన్ డిఎన్ ఎ ను కణంలోకి విడుదల చేస్తుంది. దీనిని మనిషి కణంలోని న్యూక్లి యస్ గుర్తిస్తుంది. వాటికి నకళ్లు తయారు చేసి కణం బయటకు పంపిస్తుంది. ఇవి కణ పొర మీద అతుక్కుంటాయి. వీటిని శత్రుసమూహంగా భావించి మనిషి శరీరంలోని రోగ నిరోధక్తి దీనిని ఎదుర్కొనేందుకు అవసరమయిన శక్తి సమకూర్చుకుంటుంది.
పరీక్షలు, ఫలితాలు
సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో విదేశాలలో జరిపిన ఫేజ్ 1 ట్రయల్స్ ని 23,745 మంది మీద జరిపింది. అపుడు దీని సామర్థ్యం 70.42 అని ప్రకటించారు. ఇక ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ని ఇండియాలో చేశారు. 1600 మందికి వ్యాక్సిన్ ఎక్కించారు. అపుడు దాదాపు ఇదే ఫలితం కనిపించింది.
భారత్ బయోటెక్ 800 మంది రెండు సార్లు ప్రయోగించి పరీక్షించింది. మూడో విడత 22,500 మంది పరీక్షిస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉంది.ఫలితంగా కూడా బాగా ఉంటుందని అనుకుంటున్నారు.
ధర ఎంత?
ఎస్ట్రాజెనెకా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రు. 400 ఉంటుందని చెబుతున్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధర రు. 100 లోపే ఉంటుంది. అయితే, దీనిమీద స్పష్టతవచ్చేందుకు మరింత సమయం పడుతుంది.