జగన్ లేఖ ఎఫెక్ట్: జస్టిస్ రమణ వివరణ కోరిన ప్రధాన న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ మీద చేసిన  ఫిర్యాదుకు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు.
ముఖ్యమంత్రి రాసిన లేఖలో పేర్కొన్న విషయాలకు సమాధానం చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే జస్టిస్ రమణ ను ఆదేశించారు.
జస్టిస్ రమణ మీద  తీవ్రమయిన ఆరోపణలు చేస్తూ తగిన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నవంబర్ ఆరో తేదీన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
జగన్ లేఖ ద్వారా తెలియచేసిన అంశాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ మేరకు జగన్ అఫిడవిట్ కూ ఫైల్ చేశారు.
ఈ అఫిడవిట్ ఫైల్ చేశాకే జస్టిస్ రమణకు ప్రధాన న్యాయమూర్తి నోటీసు పంపుతూ అఫిడ్ విట్ లోని అంశాలమీద స్పిందించాలని కోరారనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
అయితే, జస్టిస్ స్పందించారా లేదా అనేది ఇంకా తెలియలేదని ఈ పత్రిక పేర్కొంది.
జస్టిస్ రమణ ఒక వేళ స్పందించి వుంటే,  ఆయన చెప్పిన వివరణ కు సంతృప్తి చెందితే, జగన్ ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తి కొట్టి వేస్తారు.
అలా కాకుండా జస్టిస్ రమణ సమాధానం సంతృప్తిగా లేకపోతే, ఫిర్యాదులో పేర్కొన్న విషయాల మీద లోతైన విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించవచ్చని  సుప్రీంకోర్టు వర్గాలను ఉటంకిస్తూ ఈ పత్రిక రాసింది.
మొత్తానికి జగన్ లేఖ సంచలనం సృష్టించింది.
న్యాయనిపుణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు జగన్ మీద కోర్టు ధిక్కారం విచారణ జరగాలన్నారు. మరికొందరు   జగన్ కు ఫిర్యాదు చేసే అర్హత ఉందని గతంలో కూడా  ఇలాంటి సందర్భాలున్నాయని పేర్కొంటూ  1960 దశకంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య  నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి మీద చేసిన ఫిర్యాదును బయటకు తీసుకువచ్చారు.
దామోదరం సంజీవయ్య చేసిన ఫిర్యాదుతో  అప్పటి ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్  జస్టిస్ చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టు కు బదిలీ చేశారు.
జగన్ ఫిర్యాదు తర్వాత దాదాపు ఇదే జరిగింది.ఫిర్యాదులో ప్రధానంగా నొక్కి చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గురించే. గత వారంలో జరిగిన బదిలీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిక్కిం కు బదిలీ చేశారు.
జగన్ ఫిర్యాదు నేపథ్యం
జగన్ ఫిర్యాదు వెనక కొన్ని కీలకమయిన పరిమాణాలున్నాయి. ఇవన్నీ విచారణలో ఉన్న కేసులే. ఇందులో ఒకటి ముఖ్యమంత్రి జగన్ మీద ఉన్న కేసులయితే, రెండోది అమరావతిలో జరిగిందని చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ లో జస్టిస్ రమణ కూతుర్లు భూములుకొన్ని లబ్ది పొందారన్న ఆరోపణ. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ జరిపిస్తున్నది.
జస్టిస్ రమణ  ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అదుపులో పెట్టుకున్నారని, న్యాయమూర్తుల ఉత్తర్వులను ప్రభావితం చేస్తున్నారని, జస్టిస్ రమణ ప్రోద్బలంతోనే ఇక్కడి న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారని జగన్ తనలేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను  తర్వాత మీడియాకు విడుదల చేశారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రమణ కూతుర్లు అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో లబ్దిపొందారని, దాని మీద సిఐడి విచారణ ప్రారంభించింది.
లబ్ది పొందిన వారిలో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన  వ్యక్తి  కూడా ఉన్నారు. ఈ మొత్తం విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలిపి వేసింది. అంతేకాదు, దీనికి సంబంధించిన వార్తలు కూడా రాయవద్దని పత్రికల మీద ఆంక్షలు విధించింది.
ఇక జగన్ కేసులకుసంబంధించిన కోణం
అక్రమాస్తుల ఆర్జనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మీద ఒక డజన్ కేసులున్నాయి. ఇవన్నీ  సిబిఐ, ఇడి కోర్టులలో ఉన్నాయి. దేశవ్యాపితంగా రాజకీయ నాయకుల మీద బుక్ అయిన కేసుల విచారణ నత్తనడక సాగుతున్నదని దీనిని వేగిరపర్చాలని ఆ మధ్య జస్టిస్ రమణ ఉత్తర్వులిచ్చారు.
అంతేకాదు,  ఈ కేసులను పరిష్కారానికి ఆయన గడువు కూడా పెట్టారు. దీనితో జగన్ ఆందోళన చెందారని, ఈ కోర్టులలో తనకి శిక్ష పడేలా చేసేందుకే  ఈ ఉత్తర్వులిచ్చారని జగన్ వర్గంలో అనుమానాలు మొదలయ్యాయి. ఇపుడు నడిచే  స్పీడుతో జగన్ కేసుల విచారణ సాగితే, అదిప్పట్లో పూర్తికాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ జస్టిస్ రమణ ద్వారా ఈ పనులు చేయిస్తున్నదని జగన్ ఆరోపణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *