ఉగాది నుంచి రోజూ నీళ్లు… వరంగల్ కు ఓట్ల వరాలు మొదలు

వరంగల్, జనవరి 1: ఫిబ్రవరి నెల నుంచి ట్రాయల్ రన్ నిర్వహించి, ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి రోజూ, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన మంచినీటిని సరఫరా చేస్తారు.
మరో రెండు నెలల్లోనే, నగరంలో రోడ్లు, మురుగునీటి కాలువలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ని అభివృద్ధి పరచి మొత్తం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతారు.
నగరంలోని న్యూ శాయంపేట లో రూ.6.79 కోట్ల వ్యయంతో, 4300 పోల్స్ తో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టం ఈ శుక్రవారం సాయంత్రం ప్రారంభమయింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ వోట్ల వరాలు ప్రకటించారు.
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు తొందర్లో ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. దీనితో వరంగల్  కెసిఆర్ గవర్నమెంట్ ఎజండాలో టాప్ ప్రయారిటీ ఐటెం అయింది. దీని ఫలితమే ఈ ప్రకటన.
దయాకర్ రావు ఇంకా ఏమన్నారంటే…
ఒక్క మిషన్ భగీరథ ద్వారానే రూ.1200 కోట్లతో ఒక్క వరంగల్ నగరంలోనే మంచినీటిని సరఫరా చేస్తున్నాం.
 అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.196 కోట్లు మాత్రమే ఇస్తున్నది. . ఇక ప్రతి ఏటా వరంగల్ కార్పొరేషన్ కి తెలంగాణ ప్రభుత్వం రూ.300 కోట్లు  ఇస్తున్నాది.
మొన్న కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులకు రూ.25 కోట్లు తక్షణ సాయంగా అందించాము.
సీఎం కేసిఆర్ హామీల కింద, రకరకాలుగా పలు అభివృద్ధి పథకాలు చేపడుతున్నాము.  ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి అన్ని విధాలుగా నిధులు విడుదల చేస్తున్నాము.
విస్తరిస్తున్న నగరానికి సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడం, నగరాన్ని ప్రణాళిక బద్దంగా నిర్మించడం, భవిష్యత్తులో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాము.
ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం లో భాగస్వాములు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *