ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై సాగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ, జనసేనలు సంయుక్తంగా రామతీర్థానికి ‘ధర్మ యాత్ర’ నిర్వహిస్తున్నాయి.
5 వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన నాయకులు, శ్రేణులు బి.జె.పి. నేతలతో కలసి యాత్రగా తరలి వెళ్ళి ఆలయాన్ని సందర్శిస్తారని ఒక ప్రకటన విడదల చేశారు.
ఒక పరంపరగా సాగుతున్న దాడులకు పరాకాష్ట రామతీర్థం క్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామి విగ్రహం శిరస్సును నరికివేయడం అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రకటన వివరాలు:
ఈ (రామతీర్థ కోదండ రాముడి శిరచ్ఛేదం) దుస్సంఘటన తరువాత కూడా వరుస ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ ఘటనలను ఖండిస్తున్నాయి. ఇరు పార్టీలు ఈ నెల 5వ తేదీన రామతీర్థ ధర్మ యాత్ర చేపట్టాలని నిర్ణయించాయి.
శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థంలో బాధాకరమైన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత ఉదాసీనంగా ఉంది. ఎంతో సున్నితమైన ఈ విషయంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. దేవాదాయ శాఖ, ఆ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో వున్నట్టా? లేనట్టా? అంతుబట్టడం లేదు. ఏ ఒక్క మంత్రి బాధ్యతతో వ్యవహరించడం లేదు. అందరూ కలసికట్టుగా వినోదం చూస్తున్నారు. పోలీస్, దేవాదాయ శాఖలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. బాధ్యత కలిగిన మంత్రులు ఆలయాలపై జరుగుతున్న దాడులపై చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి.
రామతీర్థం ఘటనకు ముందు నుంచి పలు ఆలయాల్లో విగ్రహాలను పగలగొట్టారు… రథాలను దగ్ధం చేశారు. ఈ దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబించకపోవడాన్ని నిరసిస్తూ రామతీర్థ ధర్మ యాత్రను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.