చారిత్రక అద్భుతం: బనగానపల్లె బంగ్లా

(చందమూరి నరసింహారెడ్డి)
నవాబుల దర్పానికి, ఆర్భాటానికీ సాక్ష్యం బనగానపల్లె నవాబు బంగ్లా. ఈ బంగ్లా బనగానపల్లె నుంచి యాగంటి పుణ్యక్షేత్రం పోయే దారిలో ఓ చిన్న గుట్ట మీద ఉంది.
బనగానపల్లె నుంచి ప్రఖ్యాత యాగంటి క్షేత్రానికి వెళ్లే దారిలో ఇది రోడ్డుపక్కనే దిక్కుదివాణం లేకుండా అనాథలాగా కనిపిస్తుంది.
దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చెప్పుకొనే ఈ బంగ్లా బయటకు ఇప్పటికీ ఆకర్షణీయమైన కట్టడంగా కనిపిస్తోంది. వన్నెతగ్గలేదు. అయితే లోపలికి వెళ్ళి పరిశీలిస్తే పైభాగం దాదాపు శిథిలావస్థకు చేరింది. స్లాబ్ కు వేసిన ఇనప గరండాలు తుప్పుపట్టి క్షీణించడంతో స్లాబ్ సగానికి పైనే కూలిపోయింది. మిగిలిన భాగం కూడ కూలడానికి సిద్దంగా ఉంది. ఈ బంగ్లా బాగ ఎత్తున నిర్మించారు. క్రింద నేలమాలిగ నిర్మించి పైభాగంలో గదులు నిర్మించారు. పైభాగం చేరుకోవడానికి మూడు వైపులనుంచి ఒకే ఆకారంలో మెట్లు నిర్మించారు. మెట్లు కింద భాగంలో గది ని నిర్మించారు. మొత్తం కట్టడం పెద్ద సైజ్ రాళ్ల తో నిర్మించారు. దాదాపు రాళ్లన్ని ఓకే సైజ్ లో ఉన్నాయి. 28-12-2020 న ఈ బంగ్లా సందర్శించడం జరిగింది. గతంలో కూడ రెండు సార్లు చూడటం జరిగింది. 2013లో సందర్శించినప్పుడు బంగ్లా బాగుంది. నేడు శిథిలావస్థకు కు చేరుకొనే దిశకు చేరువలో ఉంది.9గదులు ఓ పెద్ద హాలు మూడు వైపులా వరండా లోపల ఓ వైపు కారిడార్ ఉంది. ఇనుప గరండాలు , టేకు తీర్లు కట్టడంలో స్లాబ్ కు వాడారు.
ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని తన ప్రియురాలికి కోసం కట్టించి ఇచ్చిన బంగ్లా గా చెబుతారు. ఇక్కడే “అరుంధతి సినిమా” షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లన దీనిని అరుంధతి కోట గా ఇక్కడి ప్రజలు పిలిచుకుంటారు. బనగానపల్లె కోట కర్నూలు జిల్లాలో ఒక అందమైన కట్టడం. ఇది 18 వ శతాబ్దంలో నవాబులచే నిర్మించబడింది.
కోవెలకుంట్ల, డోన్, నంద్యాల మధ్య గల 78 గ్రామాలతో బనగానపల్లె ఒక సంస్థానంగా ఉండేది నవాబులు బ్రిటీష్ వారికి విధేయులుగా ఉంటూ,కప్పం కడుతూ ఈ సంస్థానాన్ని పరిపాలించేవారు. 1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు కు ధారాదత్తమైంది.
ఈ సంస్థానాన్ని 1651లో ఆదిల్ షా స్వాధీనం చేసుకొని సిద్ధిం సుబుల్ అనే సేనాని జాగీరుగా చేశారు. 1687లో ఔరంగజేబు బీజాపూర్ ను ఆక్రమించుకోవడంతో ఇది మొగలుల పాలనలోకి వెళ్ళింది.ఔరంగజేబు మరణం తర్వాత ఈ సంస్థానాన్ని నిజాం రాజులు స్వాధీనం చేసుకున్నారు. సైన్య సహకార పద్దతిలో ఈ ప్రాంతాన్ని నిజాం ఆంగ్లేయులకు “దత్తమండల”గా ఇచ్చేయడంతో 1800 నుంచి నవాబులు ఆంగ్లేయులకు విధేయులుగా ఉంటూ పరిపాలన సాగించేవారు.బనగానపల్లె ఓ ప్రతేక రాష్ట్రం గా చలామణి అయింది. బనగానపల్లె సంస్థానం ను 1948 ఫిబ్రవరిలో భారతదేశంలో విలీనం చేస్తూ ప్రకటన చేశారు . ఆ విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల తరువాత బనగానపల్లె భారత్ లో భాగమైంది.
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహరెడ్డి జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *