ఆంధ్రప్రదేశ్ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (Regional Agricultural Research Statoin RARS) భూములను పట్టణంలో ప్రతిపాదించిన వైద్య కళాశాల నిర్మాణానికి తీసుకోవడం అన్యాయమని, భూములను కాపాడుకునేందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాలలో మంగళవారం రైతులు భిక్షాటన చేసారు.
పరిశోధనా కేంద్రానికి చెందిన భూములను మెడికల్ కాలేజీ లాక్కోవడమంటటే ,ఎంతో పేరున్న ఈ సంస్థను దెబ్బతీయడమేనని రాయలసీమ నేతలు విమర్శిస్తున్నారు.
అంతర్జాతీయ బహుళ జాతి (ప్రైవేటు) విత్తన సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఏర్పాటయిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
పట్టణంలో, పట్టణ సమీపంలో ప్రభుత్వ భూములు అందుబాటులో వున్నా వాటిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయకుండా అభివృద్ధి చెందిన RARS భూములను తీసుకోవడం కుట్రపూరితమేనని విమర్శించారు.
ప్రభుత్వం వైద్య కళాశాలకు భూములు కొని కేటాయించేందుకు నిధులు లేకుంటే రైతులుగా తాము జోలె పట్టి భిక్షమెత్తుకుని భూముల కొనుగోలుకు నిధుల సమీకరణ నిరసన చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగమే ప్రస్తుత భిక్షాటన అని ఆయన పేర్కొన్నారు.
తొలుత పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని వివేకానంద ఆడిటోరియంలో Y.N.రెడ్డి అద్యక్షతన రైతులు, న్యాయవాదులు, మేధావులు, విద్యార్థులు, వ్యవసాయ కార్మికులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
రాయలసీమలోని అన్ని జిల్లాలలో ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టి మార్చి1 వ తేదీన భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను రెవిన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు. నంద్యాలలో భిక్షాటనకు అన్ని వర్గాల ప్రజలు విశేషంగా స్పందించారని అన్నారు.
నంద్యాల మెడికల్ కళాశాలను స్వాగతిస్తున్నామనీ, అయితే రైతులకు, దేశాభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు తీసుకోవాలనుకోవడమే బాధాకరమని ధశరథ్ అన్నారు.
ప్రజలను చైతన్యం చేసి వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, మాజీ కౌన్సిలౌర్ లు సూరా నాగరాజారావు, బి.శంకరయ్య, A.P.రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుతోట రాజశేఖర్, BSNL విశ్రాంత ఉద్యోగి వెంకటసుబ్బయ్య, B.C.సంఘం రాష్ట్ర నాయకులు జిల్లెల్ల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్లు కృపాకర్, మహమ్మద్ గౌస్, మైనార్టీ నాయకులు పర్వేజ్, P.M.R.కళాశాల అధినేత బాలచంద్రుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఊకొట్టు వాసు, మునగాల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకులు షణ్ముఖరావు తదితరులు పాల్గొని పట్టణంలో భిక్షాటన చేసారు.