“నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తున్నారు”

(యనమల‌ రామకృష్ణుడు)
అత్యంత క్రూరుడిగా పేరొందిన గ్రీస్ రాజు డ్రాకోను మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మించిపోతున్నారు. డ్రాకోనియన్‌ పేరుతో రూపొందించిన విశృంఖల అరాచక రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తూ ప్రజల‌ను అవస్థలకు గురి చేస్తున్నారు.
సిరాతో రాసే చట్టాల‌ను రక్తంతో రాసి ప్రజల‌ను హింసించిన నేర చరిత్ర డ్రాకోది. నేడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అంతకు మించిన అరాచక పాల‌న సాగిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాల‌రాస్తూ పౌరుల ప్రాథమిక హక్కుల‌ను హరిస్తున్నారు.
2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రావాల్సిన సదుపాయాలు తన కేసుల కోసం తాకట్టు పెట్టారు. రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాతో ప్రజాస్వామ్య మనుగడకే పెను ముప్పులా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. డ్రాకో రాజ్యాంగంలోని అరాచకత్వం, రాజారెడ్డి అకృత్యాల పర్వాలను కలగలిపి నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తున్నారు.
‘‘రాజకీయ నాయకుల‌కు అధికారం రాదు.. ప్రజలు ఇస్తేనే వస్తుంది’’ అని అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ చెప్పిన వ్యాఖ్యల‌ను అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజలిచ్చిన అధికారాన్ని వారి సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. కానీ కక్ష సాధింపు చర్యల‌కు, విధ్వంసాల‌కు, వికృత చేష్టలకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చర్యలతో చరిత్రహీనులుగా మారుతారని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి.
సృష్టించడం తెలిసిన వారికే.. నాశనం చేసే అర్హత ఉంటుందనేది కనీస జ్ఞానం. కానీ.. జగన్ రెడ్డికి రాష్ట్ర ఆదాయం పెంచడం చేతకాదు. ఆస్తులు సృష్టించడం తెలియదు. కానీ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293ని ఉల్లంఘించి ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని సంక్షోభంలో పడేస్తున్నారు.
పీపీఏల‌ను రద్దు చేయొద్దని కేంద్ర విద్యుత్‌ శాఖామంత్రి లేఖలు రాసినా పట్టించుకోకుండా ఏకపక్షంగా రద్దు చేశారు. పంచాయితీ ఎన్నికల‌ నిర్వహణకు ఆర్టికల్‌ 243కె కింద రాజ్యాంగం కల్పించిన హక్కుల‌ను కాలరాశారు. ఎన్నికల‌ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పన‌ వంటి అధికారాలు ఎన్నికల‌ సంఘానికి ఉంటాయి. వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది? రాజధాని, పీపీఏల‌ వంటి అంశాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల‌ను కూడా పక్కన పెట్టి జగన్మోహన్‌రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
తమ తప్పుల‌ను కప్పిపుచ్చుకోవడానికి అర్థరాత్రి ప్రెస్‌మీట్లు పెట్టించి న్యాయస్థానాల‌ను, జడ్జిల‌ను నిందించడం వైసీపీ నేతల బరితెగింపునకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ హక్కుల‌ పరిరక్షణ కోసం ఉన్న చట్టాల‌ను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఎస్సీలపై పెట్టించి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఆర్టికల్‌ 19, 21 కింద ఉన్న ప్రజల‌ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ఆర్టికల్‌ 197 కింద ఉన్న అధికారాన్ని లెక్క చేయకుండా అధికారులతో ఇష్టానుసారంగా వ్యవహరించేలా చేస్తున్నారు. శాసన మండలి ఛైర్మన్ అధికారాలను అధికారులు ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లారు. శాంతిభద్రతల‌ను ఉల్లంఘించి కొత్తగా పోలీస్‌రాజ్‌ ను అమలుపరచడం, ప్రజల‌ తరఫున గొంతు వినిపిస్తున్న ప్రతిపక్ష పార్టీల‌ నేతల‌ను బెదిరించడం, వేధించడం, 3 రాజధానుల‌ విషయంలో పార్లమెంటులో, లెజిస్లేచర్‌ చట్టాల‌ను ఉల్లంఘించడం వంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల‌కు పాల్పడుతున్నారు. వీటిపై వెంటనే రాష్ట్ర గవర్నర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి.
(యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీ,ప్రతిపక్షనేత, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *