పూతరేకులకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

(పరకాల సూర్యమోహన్)

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఎంతో విలక్షణమైన, ఎన్నో ప్రత్యేకతలు వున్న గ్రామం కవిటం మా వూరు. అది మేము పుట్టి, ‘పెరిగిన వూరు. మా చిన్నతనాలన్నీ అక్కడే గడిచాయి.
ఇప్పుడు 50, 60 ఏళ్ళు గడిచిపోయినా ఆ నాటి జ్ఞాపకాలు ఈ నాటికీ మనసులో పదిలంగా వుండి పోయాయి. అవి మధుర స్మృతులు. అందుచేతనే , వయస్సు 70 దాటుతున్నా ఆ జ్ఞాపకాల్ని తలుచుకుంటే అవి ఇప్పటికీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.ఆ రోజులే వేరు. అలాంటివి మళ్ళీ రావు.
గడచిపోయిన ఆ రోజులన్నీ ఈనాటికీ తీపి గురుతులుగా మిగిలి పోయాయి. ఆ మధుర స్మృతుల్ని నెమరు వేసుకుంటూ శేష జీవితం గడిపి వేయవచ్చు.
పూతరేకులు
 నా మనసులో ఈనాటికీ పదిలంగా వుండిపోయిన మా కవిటం అద్భుతమైన తీపి వంటకం గురించిన జ్ఞాపకాల్నిఈ రోజు మీతో పంచుకోవాలి. దాని పేరు “పూత రేకులు”.
ఇది ఈనాటికీ అందరికీ తెలిసిన స్వీట్ అయినప్పటికీ దీని తయారీ ఎంత జటిలమైందో, ఎంత సంక్లిష్ట మైనదో ప్రత్యక్షంగా చూస్తేగానీ అర్ధం కాదు.
మా ఇంట్లో మా పెద్దత్తయ్య దీని తయారీలో సిద్థహస్తురాలు. వీటిని తయారు చేస్తున్నప్పుడు మా సుశీలపిన్ని, బులిచిన్నపిన్నీ పెద్దత్తయ్యకు సహాయం చేసేవాళ్ళు.
ఆ రోజుల్లో ఇళ్ళల్లోనే అంతా పూతరేకుల్ని తయారు చేసుకునేవాళ్ళు, అయినా దీని తయారీకి ఎంతో నైపుణ్యం , ఒడుపూ, చాకచక్యం అవసరం.
ఈ పూతరేకుల తయారీకి కావల్సిన ముడి పదార్థం బియ్యం పిండి. ఎంతో నున్నగా వుండే కుండ. ముందుగా తడి బియ్యాన్ని చాలా మెత్తగా దంచి తగు మోతాదులో నీరు కలిపి పలుచగా వుండేలా చేసి సిద్థంగా వుంచేవారు. ఓ పది పన్నెండు అంగుళాల వెడల్పు , ఒకటిన్నర అడుగుల పొడవు వుండే మంచి మెత్తని సైన్ గుడ్డని తడిపి రెడీగా వుంచు
కునేవారు.
ముందుగా కుండను మండుతున్న పొయ్యి మీద బోర్లా వుంచుతారు. కుండ బాగా వేడి ఎక్కాకా , ఆ వేడి సరిపోతుందని తెలుసుకుని (ఆ విషయం బాగా అనుభవం వున్నవారికే తెలుస్తుంది) బియ్యం పిండి నీళ్ళను గరిటితో బాగా కలియబెట్టి, ముందుగా సిద్థంగా వుంచిన గుడ్డని ఆ బియ్యం పిండి నీళ్ళలో ముంచి కుండమీద ఆ పక్కనుంచి ఈ పక్కకు వేగంగా పూసి తీసేస్తారు.అంతే, చాలా అతి పలుచని ఉల్లి పొర లాంటి కాగితంలా ఒక రేకు తయారవుతుంది. దానిని, పక్కనే వున్నవారు కొబ్బరి ఈనుపుల్లతో పక్కకు తీస్తారు. వెంటనే తీయకపోతే అది గాలికి ఎగిరి పోవచ్చు. ఈ ప్రక్రియ మెరుపు వేగంతో జరిగి పోవాలి.

 


మోహన రాగాలు-8


అలా జరిగితే నిముషానికి 20, 25 రేకులు తయారవుతాయి .
బియ్యం పిండి నీళ్ళను కుండ మీద పూస్తారు కాబట్టే వీటికి “పూత రేకులు” అని పేరు వచ్చింది. ఈ రేకులతో స్వీట్ తయారు చేయడం ఏమంత సులభం కాదు.ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఇవి పొడుంపొడుంగా అయిపోతాయి.

స్వీట్ తయారీకి బెల్లం పొడి లేదా పంచదార పొడి యాలకుల పొడి కలిపి వుంచుతారు. నెయ్యిని గోరు వెచ్చగా వేడి చేసి వుంచుతారు. అరటి ఆకు వెనక కాడని కుంచెలా తయారు చేసి దానిని నెయ్యిలో ముంచి వుంచుతారు.
జీడి పప్పులు, బాదం పప్పులు దోరగా వేయించి పొడిలా వుంచుకుంటారు. ఈలోగా శుభ్రమైన తువ్వాల్ని తడిపి, బాగా నీరు పోయేలా పిండేసి కొంచం తడితడిగా వుంచాలి. అలా కాస్త తడిగా వుంటేనే పూతరేకులు చితికిపోవు.ఆ తడిగుడ్డ మీద పూతరేకుని వేయగానే అది చదునుగా అవుతుంది. అలా రెండుమూడు రేకులు ఒకదానిమీద ఒకటి వేసిన తర్వాత కుంచెతో వాటిమీద నెయ్యి రాసి సిద్థంగా వుంచుకున్న బెల్లం పొడి , మిగతా పొడులు సమానంగా జల్లుతారు.
పూతరేకుల్ని పొందికగా మడత పెట్టడానికి ఎంతో నైపుణ్యం అవసరం. అదొక సున్నితమైన కళ.పూతరేకుల పొడవాటి భాగాల్ని రెండువైపులా మడత పెడతారు.ఆ తర్వాత వెడల్పాటి భాగాల్ని రెండు వైపుల నుంచి అచ్చు చీర అంచులు లోపలికి వుండేలా మడత పెడతారు.

(Like this story? Share it with a friend!)

ఈ పూతరేకుల ప్రతి పొరలో ఘుమఘుమలూ , మధురిమలూ దాగివుంటాయి. !పూతరేకుల్ని వర్ణిస్తోంటే నా నోరు వూరిపోతోంది.
ఇది చదువుతోంటే మీకూ అలాగే అనిపిస్తే యమర్జంటుగా వీటిని కొనుక్కుని తినేయండి.
ఆ గాదెే మా బ్యాంకు కూడా
ఆ సశ్యశ్యామలమైన కవిటంలో మాది ఉమ్మడి కుటుంబం. 10,15 మంది కుటుంబ సభ్యులతో మా ఇల్లు కళకళ లాడుతూ ఎంతో సందడి సందడిగా వుండేది. మాకు దాదాపుగా 20 ఎకరాల సాగు భూమి వుండేది. రెండు పంటల దిగుబడితో మా గాదె నిండా ధాన్యం వుండేది. అవే మా తిండి గింజులు. ఆ గాదె మా బ్యాంక్ కూడా.అందులోని ధాన్యాన్ని అవసరాలని బట్టి డబ్బుగా మార్చుకునేవాళ్ళు.
అయితే పొలం నుంచి ధాన్యం, గాదుల్లోకి చేరడానికీ, రైస్ మిల్లులు కి తరలించడానికీ వెనుకఎంతో శ్రమ దాగి వుంది.అదొక జటిలమైన ప్రక్రియ.

 

కనుచూపు మేరా ఇలా పచ్చగా ఉంటుంది మా కవిటం
వానాకాలం రాకముందే వ్యవసాయ పనులు మొదలు పెట్టే వారు. తొలి ఏకాదశి నుంచి వ్యవసాయ కూలీలు పనుల్లోకి చేరేవారు. అప్పట్లో పాలేళ్ళకి ఏడాదికి ఇన్ని బస్తాల ధాన్యం వేతనంగా నిర్ణయించే వారు. పెద్ద పాలేరుకి సుమారు 24 బస్తాల ధాన్యం, బట్టలు, చెప్పుల జత, కళ్ళంలో ఓ బస్తా ధాన్యం బోనస్ గా ఇచ్చేవారు. అప్పట్లో బస్తా ధాన్యం వెల సుమారుగా వంద రూపాయలు. చిన్న పాలేళ్ళకి 20 బస్తాల ధాన్యం వేతనంగా ఇచ్చేవారు.వీళ్ళు పశువుల దగ్గర, ఇంటి వద్దా పనిచేసేవాళ్ళు. పొద్దునే పనిలోకి రాగానే వాళ్లకి  చద్దన్నం పెట్టేవారు. వీరు కాక వతను పనివారు కూడా వుండే వాళ్ళు. వీరిని ఒక విధంగా కాంట్రాక్టు కార్మికులు అని చెప్పవచ్చు.
వ్యవసాయ పనులు లేని రోజుల్లో వీరు బతకడానికి ముందుగా ధాన్యం ఇచ్చి పనులు వున్న రోజుల్లో వీరి కూలి అందులో జమ చేసుకునేవారు.
ఆ కాలంలో రైతులు, వ్యవసాయ కార్మికుల మధ్య సహకారం, అనుబంధం అలావుండేవి. డిసెంబర్లో పొలాల్లో వరి కోసి పిరమిడ్ ఆకారంలో పొలాల్లోనే కుప్పగా వేసేవారు. వాన చినుకులు వచ్చినా ధాన్యం తడిసి పోకుండా కంకులు లోపలికి వుండేలా అమర్చేవారు. ఆ తరువాత నేలను చదును చేసి నీళ్ళు చల్లి దిమిశా (చదును) చేసేవారు. అలా చేస్తే మట్టి, రాళ్ళు ధాన్యం లో కలిసిపోవు. దానినే కళ్ళం అనేవారు.
ధాన్యం బస్తాల్ని పొలం నుంచి రైస్ మిల్లు కు ట్రాక్టర్లో తరలిస్తున్న దృశ్యం. మా చిన్నతనాల్లో రెండెడ్ల బండి మీద తీసుకువెళ్ళేవారు.
ఇంక కుప్పలు నూర్చే రోజు ఎంతో హడావుడిగా వుండేది. ఎడ్లబళ్ళని సిద్ధంగా వుంచేవారు. అందరి పనివాళ్ళకీ నైట్ డ్యూటీలు పడేవి. టీలు,పులిహోర , పప్పు పులుసు అన్నాలు (సాంబారు) వండి పంపేవాళ్ళు. వీళ్ళకే కాదు, యజమానులు కూడా తమ పొలాల వద్ద నైట్ డ్యూటీలు చేసేవారు. కుప్పలు నూర్చేచోట మంచు పడకుండా కొబ్బరి మట్టలతో చిన్న గుడిసెలా తయారు చేసే వారు. ఫ్లాస్క్ నిండా టీ, తలపాగా, దళసరి బొంత, టార్చిలైట్, కప్పుకోడానికి దుప్పటీ పట్టుకుని వచ్చేవారు. ఆ పాకలో బొంత పరుచుకుని పడుకోవాలి. అవి శీతాకాలం రోజులు. బాగా చలిగా వుండేది. చుట్టూరా చిమ్మ చీకటి. ఆ చీకటి లో మిణుగురు పురుగులు ఎగురుతూవుంటే అవి నిప్పు రవ్వల్లా కనిపించేవి.
ఆ ప్రదేశం మధ్యలో ఓకర్రపాతి దానికి లాంతరు కట్టేవారు. అదే మాకు వెలుతురు. ఆగకుండా వినిపించే కీచురాళ్ళ రొద. వుండుండి రివ్వున వీచే చలిగాలి.ఇదండీ అక్కడి వాతావరణం.
మా బుల్లి అబ్బాయి బాబయ్యని బతిమాలి బామాలి మొత్తానికి ఒప్పించి రెండు మూడుసార్లు నేను కూడా బాబయ్యతో వెళ్ళి అక్కడ ఆ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించాను.
“వురేయ్ అబ్బిగా, పొలాల్లో పురుగూ పుట్రా వుంటాయి, ఎందుకు అలా ప్రతిదానికీ ఎగబడిపోతావు, అసలే తింగరి వెధవ్వి తిన్నగా వుండవు ” అని తాతయ్య కేకలేసేవాడు.
కుప్పల చుట్టూరా చేసిన కళ్ళంలో వరిగడ్డి పరిచేవారు. ఎడ్లబళ్ళు కుప్పల చుట్టూ తిరిగేవి. ఓ అరగంట తిరిగిన తరువాత వాటిని దులిపేవారు. అలా రెండు మూడు సార్లు చేసిన తరువాత ఇంక గడ్డిలో ధాన్యం లేదని రూఢీ చేసుకొని కుప్పలో వున్న వరిగడ్డిని మళ్ళీ ఇంకొంచెం పరిచేవారు. ఒక కుప్ప పూర్తి చేయడానికి సుమారుగా ఒక రోజు పట్టేది. సాయంత్రానికి గడ్డి పొట్టు వున్న ధాన్యాన్ని రాశిలా పొసి, గడ్డి కాల్చి, ఆ మసిని లక్ష్మీ ముద్రకి (కర్రతో చేసిన పరికరం)రాసి ధాన్యం గుట్ట నాలుగు వైపులా రక్షా ముద్ర వేసి గడ్డితో నాలుగు వైపులా కప్పేవారు.
ఆ తర్వాతి రోజున ముద్రలు సరి చూసుకుని చేటలతో ధాన్యాన్ని గాలిలో ఎగరబోసేవారు. ఆ తర్వాత ధాన్యం ఎండబెట్టి బస్తాలలో నింపి దబ్బనానికి పురికోసతాడు ఎక్కించికుట్టేవారు. బస్తాల్ని రెండెడ్ల బళ్ళమీద గాదికి, మిల్లుకీ తరలించేవారు.
ఇప్పుడు రెండెడ్ల బళ్ళకు బదులు ట్రాక్టర్లు వచ్చాయి. ట్రాక్టర్లలోనే ధాన్యం బస్తాల్ని అన్ని చోట్లకి తరలిస్తున్నారు
ఇంత శ్రమపడి వరి పంట వేసినా ఆ కాలంలో కూడా అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినేవి.
కవిటంలో రైతులు అప్పట్లో అక్కుళ్ళు, కృష్ణకాటుకలు పండించేవారు. రెండవ పంటగా తోక సన్నాలు పండించే వారు. అక్కుళ్ళ పంట మనిషి ఎత్తు పెరిగేది. గాలికి , వానకీ వరి మొక్కలు ఒరిగి పోయి రైతులు నష్టపోయేవారు.
మా రమణయ్య బాబయ్య దీనిగురించి బాగా ఆలోచించి ఒక వినూత్న పద్థతిని ప్రవేశపెట్టాడు.అదే మిశ్రమ పంటల (mixed crops) పద్థతి. కవిటం లో, మా పొలాల్లో ఈ పద్థతిని ప్రవేశపెట్టిన ఘనత మా రమణయ్య బాబయ్యదే.
ఈ పద్థతి ప్రకారం ఏక కాలంలో పొలంలో రెండు పంటలు పండించడం; మొదటి సారిగా పత్తి పంట, వేరుశనగ పంట వేసారు. ఒకటి భూమి మీద ,మరొకటి భూమి లోపల పండే పంట. మిగతా వాళ్ళంతా ఈ ప్రక్రియ చాలా బావుందని అభినందించారే తప్ప వాళ్ళ పొలాల్లో ఈ పద్థతి ప్రవేశ పెట్టడానికి సాహసించలేదు.
ఆ తర్వాత ఒకసారి చెరకు పంట కూడా మా వాళ్ళు వేసారు.
కానీ కవిటంలో ఈ ప్రక్రియ ని ఎవరూ అనుసరించక పోవడంతో ఇతర రైతులు ఏ పంటవేస్తే మనమూ అదే పంట వేయాలి లేకపోతే పంట అమ్ముడవడం కష్టం అని తాతయ్య సలహా ఇచ్చాడు.ఆ కష్టనష్టాలేమిటో మాకు తెలియదుకానీ మా పిల్ల గ్యాంగ్ దృష్టి అంతా అమ్మకానికి ముందు
మా వీధి అరుగుల మీద పేర్చిన వేరుశనగ కాయల బస్తాల మీదే వుండేది.
ఎవరూ చూడకుండా బస్తాలకి ఎలకల్లా కన్నం పెట్టి జేబుల్నిండా వేరుశనగకాయలు పోసుకుని దూరంగా పోయి వలుచుకు తినేవాళ్ళం. ఆనక మా పెద్దవాళ్ళు బస్తాలకి చిల్లులు చూసి నిజంగానే ఎలకలు తినేస్తున్నాయని అనుకుని వెధవ ఎలకలు చంపేస్తున్నాయని తిట్టుకుంటూ ఆ చిల్లుల్ని కుట్టేవారు.
మా తిండిరంధి అలాంటిది మరి.
కరోనా తగ్గగానే మా ఊరు కవిటం సందర్శించడానికి చాలామంది పాఠకులు ప్లాన్లు వేస్తున్నారు. నన్ను గైడ్ గా రమ్మని అడుగుతున్నారు. మాతో మీరూ రండి మా ఊరు కవిటం!

(పరకాల సూర్యమోహన్, సీనియర్ జర్నలిస్టు, సొంతవూరు కవిటం, స్థిరపడింది చెన్నైలో)

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/kavitam-village-taravani-rural-summer-drink/

10 thoughts on “పూతరేకులకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

  1. An impressive nostalgic piece. The simple language and hearty description touches the heart. A sweet and joyous journey back to the childhood. Well done Mr Surya Mohan.

  2. మోహనరాగాలు – వినడానికే అద్భతమైన సమ్మోహన రాగం. .
    అలాగే శ్రీ సూర్యమోహన్ గారు వదులుతున్న కవిటం రాగాల కధనాలు ప్రత్యక్షంగా చూసినట్టు కళ్ళకు కట్టినట్టున్నాయి.
    పూతరేకులు -మంచి నెయ్యితో చేసినవని ఎగబడి తినడం మాకు తెలుసు తప్ప తయారీవిధానం ,మెళుకువలు , కష్టాలు తెలియవు.వాటిని ఎంతో చక్కగా వివరించినతీరు అద్భుతం. అన్నింటికన్నా మించి నిముషానికి 25 రేకులు పూసి తీయడమంటే ఎంతో నైపుణ్యం కావాలి. తయారీదారులకు వందనములు.
    అప్పుడే మిశ్రమపంటల విధానాన్ని ప్రవేశపెట్టడం, ధాన్యంగాదెలు ,పంట నూర్పిడి విధానం ,వేరుశెనగకాయలు దొంగిలించడం…చాలా చమత్కారంగా విపులంగా ,వివరంగా పలపదొడ్డి ఖబుర్లు చూసినట్టే ఉండేవిధంగా విశదీకరించారు. తరవాణి అంటే ఏమిటో ,దాని గొప్పదనం ,ఆరోగ్యకర విషయాలు తెలియనివారికి కూడా తెలిసే విధంగా చెప్పారు. తరవాణి తయారు , ధాన్యం బస్తాలు ,వరినాట్లు వగైరాలు అన్నీ అనుభవిస్తే ఎంత ఆనందమో…పూతరేకులు తింటూ గుర్తుతెచ్చుకోండి అందరూ. చక్కటి శీతాకాలంలో పల్లె వాతావరణం ఎంత ఆహ్లాదమో .ఇంకా అనేక రాగాలను శ్రీ సూర్యమోహన్ గారు ఆలపిస్తారని మనల్ని సుమధురగతాలకు తీసుకెళ్ళి అలరిస్తూ ఉంటారనీ ఆశిస్తున్నాము. ఇంత మధురంగా వదలకుండా చదివేట్టు చేసినకమనీయ రాగాల గాధలు ఇంకా ఇంకా ఎన్నో రావాలని ఆశిస్తూ అభినందలతో…

  3. It’s a wonderful read. For people like me who were brought up away from all this, it’s no less than a wonderland. If you become the guide, me and my friends are ready to visit.

  4. వారం వారం మీ అద్భుతమైన వర్ణనలతో మోహన రాగాలు అందంగా సాగుతున్నాయి. ఈవారం పూతరేకుల తో నోరూరించే రు. వారి పంట విశేషాలతో మా వూరు అన్నం పల్లి జ్ఞాపకం వచ్చింది. మా అమ్మమ్మ కూడా పూతరేకులు, దంపుడు బియ్యం అన్నీ చేసేవారు. మరిన్ని విశేషాల కోసం ఎదురు చూస్తున్నాం.

  5. చిన్న తనంలో పూతరేకుల తయారీ ఏమోగానీ…. అవి బెల్లం వగైరాలు వేసి చేసి ఒక డబ్బాలో ఉంచి దానిని కావిడి పెట్టె లో పెట్టి మూతపెట్టేవవారు. ఎందుకంటే అప్పట్లో ఎలుకలు డబ్బాల మూతలు కూడా తీసేసేవి. కావిడి పెట్టె మూత కూడా చాలా బరువుగా ఉండి చిన్నపిల్లలు తీసేవీలుగా ఉండేది కాదు.
    కానీ పిల్లలం నేతి వాసన తట్టుకోలేక (పంచతంత్రం లోని ఐకమత్యమే బలం కధలోలా) అందరం కలిసి మూత తీసి…..
    తర్వాత పెద్దవాళ్ళకి తెలియకుండా ఉంటుందా….వీపు….ఇప్పటి పిల్లలకు ఆ ఆనందాలు ఏవి…. పాపం పంజరం లో చిలుకలు
    ఏది ఏమైనా అంత కష్టపడి నున్న గా కుండ తయారు చేసి ఇచ్చిన అతని దగ్గర నుంచి అత్యంత సున్నితంగా ఉండే పూతరేకుల్ని అంతే సున్నితంగా చుట్టి, స్వీట్ గా తయారు చేసే ఆ సున్నితమైన చేతులకు వందనం.
    రధాంగపాణి పరకాల

  6. పూతరేకు అనే తీపి వంటకానికి మరో పూతరేకు అనే ముడి పదార్థం ఉంటుందని ఈ రోజు పిల్లలకు తెలియదు. చాల చక్కగ వర్ణించారు.
    అలాగే, వరి పంట కొయ్యటం, పంట కుప్పలు వెయ్యడం, కుప్పలు నూర్చడం లాంటి విషయాలు చాల నిశిత మైనవి. సిద్ధాంత పరంగ తెలిసినా , అందులో ఉండే సాధక బాధకాలు అర్ధమైయేటట్టు చాల బాగ వ్రాసారు

  7. మీ వెనుక ఇంథ గ్రామీణ అనుభవం , అనుభూతి ఉన్నవని నేనెప్పుడూ ఊహించలేదు మోహన్ గారు. వ్యవసాయం తో పెనవేసుకుపోయిన నాకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలియచేసారు. చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *